ఇది అసమర్థ ప్రభుత్వం అని తిడుతూనే అవిశ్వాసం పెట్టకుండా కాపాడుతున్నారు
అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు చీకట్లో చిదంబరాన్ని కలుస్తారు
ప్రజాభిమానమే జగనన్నకు అండ.. వర్షంలోనే తడుస్తూ షర్మిల కోసం ఎదురు చూసిన జనం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 68, కిలోమీటర్లు: 978.6

మధ్యాహ్నం 12.30 గంటలకు వర్షం తెరిపినివ్వడంతో షర్మిల ముకుందాపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. త్రిపురారం గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తుంగపాడు చేరుకొని అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే వేదిక మీద నుంచి ప్రసంగించారు. ఇంతటి వర్షంలోనూ తనతోపాటు కలిసి నడిచేందుకు వచ్చినవారందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, మీ అభిమానమే జగనన్నకు అండ అని అన్నారు. తుంగపాడు నుంచి తిరిగి నడక మొదలుపెట్టిన కాసేపటికే మళ్లీ ఆకాశం మేఘావృతమైంది. దీంతో పార్టీ నేతలు పాదయాత్రను కుదించుకోవాలని షర్మిలకు సూచించారు. దీంతో శ్రీనివాసనగర్‌లోని ఓ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. శనివారం మొత్తం 6.2 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 978.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, బాలమణెమ్మ, బండారు మోహన్‌రెడ్డి, స్థానిక నాయకులు శ్రీకళారెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ సూరపల్లి సత్యకుమారి, విరిగినేని అంజయ్య, ఇరిగి సునీల్‌కుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, బోయపల్లి అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రపై కలెక్టర్‌తో చర్చ
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించనుండటంతో జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌తో ఆ పార్టీ నాయకులు చర్చించారు. శనివారం పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకటరమణ, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నేతలు కావటి మనోహరనాయుడు, బండారు సురేష్ తదితరులు కలెక్టర్‌ను కలిశారు. షర్మిల పాదయాత్ర వివరాలు వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 18న షర్మిల గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనున్నారని, 13 నియోజకవర్గాల్లో 280 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో షర్మిల జిల్లాలో ఉండకూడదని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల కోడ్ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు అమల్లో ఉంటుందని వివరించారు. షర్మిల 18న జిల్లాలో ప్రవేశించినా.. ఆ మర్నాడే జిల్లాను వదిలి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పాదయాత్ర ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని సూచించారు. దీంతో మరోసారి సమావేశమై పాదయాత్ర షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోవాలని నేతలు నిర్ణయించారు.
నిన్ను చూసి పోదామని ఎదురుచూస్తున్న బిడ్డా..
‘‘అమ్మా.. వర్షం అదను మీద పడలేదు.. బత్తాయి పూత, పిందె మీద వానపడుతోంది. మూడెకరాలుంటే బత్తాయి పెట్టిన.. ఈ వానకు పూత రాలింది.. తోటకు పోయి సూద్దామనుకున్నా.. చెప్పులేసుకొని బయటికెళ్లిన. కానీ షర్మిలమ్మ టెంటు కూలిందని ఊళ్లోళ్లు చెప్పుకుంటుంటే తోటకు పోబుద్ది కాలేదు బిడ్డా.. పాణం గుంజింది. నిన్నుజూసి పోదామని ఎదురుచూస్తున్న..’’ అని తుంగపాడుకు చెందిన రైతు మచ్చ పోషన్న షర్మిలతో అన్నారు. శనివారం హోరున వర్షం కురిసినా షర్మిల కోసం పెద్ద ఎత్తున జనం ఎదురుచూశారు.
No comments:
Post a Comment