YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 21 July 2012

YSRCP Bajireddy Goverdhan press meet

నెల్లూరు పార్లమెంట్ పరిధిలో రూ.2కే 20లీటర్ల మంచినీరు

నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని దాదాపు 100 గ్రామాల్లో ఫ్లోరైడ్ రహిత మంచినీరు అందించనున్నట్లు ఆ నియోజకవర్గ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రకటించారు. రూ.2 కే 20 లీటర్ల మంచినీటిని ప్రజలకు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు రూ.10 కోట్ల ఖర్చుతో ప్లాంట్లను నెలకొల్పేందుకు టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఆయన తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్లాంట్లకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో నీటిలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉంటోంది. దీంతో 20 సంవత్సరాల వయస్సు కలిగిన వారు 60 ఏళ్ల వారిలా మారుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీరు అందిస్తామని 2009 ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ మహానేత హామీని నెరవేర్చేందుకు ఉడత సాయంగా నా వంతుగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మంచినీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని చెప్పారు. ప్లాంట్లను 2014 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఆర్మూరు, పరకాల,సంగారెడ్డిలలో సభలు నిర్వహించినప్పుడు లేని అభ్యం తరం ఇప్పుడెందుకని ?

23న సిరిసిల్ల బంద్‌కు టీఆర్‌ఎస్ పిలుపు 
సిరిసిల్లలో పోలీసు బలగాల కవాతు 
తెలంగాణపై మాకే చిత్తశుద్ధి: కేకే మహేందర్‌రెడ్డి 
వైఖరి స్పష్టం చేశాకే రావాలె: కోదండరాం 
రాజకీయ ప్రాబల్యం కోసమే : విజయశాంతి
విజయమ్మకు భద్రత కల్పించండి: గోనె ప్రకాష్

సిరిసిల్ల (కరీంనగర్)/మెదక్/ఖమ్మం/వరంగల్/హైదరాబాద్ న్యూస్‌లైన్:వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు ైవె ఎస్ విజయమ్మ సోమవారం సిరిసిల్లలో ‘నేతన్నధర్నా’ చే పట్టేందుకు పోలీసులు అనుమతించారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ధర్నా నిర్వహిస్తారని ఏఎస్పీ రమారాజేశ్వరి తెలిపారు. శనివారం సాయంత్రం సిరిసిల్లలో శాంతిభద్రతల సమస్యపై సమీక్షించిన ఆమె.. ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు రోడ్లపైకి రావొద్దని, అనుమతి లేకుండా ఎలాంటి సభలు నిర్వహించరాదని చెప్పారు. 

కాగా, విజయమ్మ ధర్నాను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్, జేఏసీలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్లలో మోహరించిన బలగాలు.. శనివారం కవాతు నిర్వహించాయి. ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు 113 ఎఎస్‌ఐలు, వందమందికి పైగా హెడ్‌కానిస్టేబుళ్లు, 465 మంది కానిస్టేబుళ్లు, 12 మంది మహిళా కానిస్టేబుళ్లు, 460 మంది హోంగార్డులు, 91 మంది మహిళా హోంగార్డులతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీకి చిత్తశుద్ధి ఉందని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెబుతుంటే.. వైఖరిచెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్మూరు, పరకాల,సంగారెడ్డిలలో సభలు నిర్వహించినప్పుడు లేని అభ్యం తరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. సిరిసిల్ల అభివృద్ధిని పట్టించుకోని కేటీఆర్.. ఇక తనకు స్థానం ఉండదని భావించి విజయమ్మ ధర్నాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాగా, విజయమ్మ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు ఆదిశ్రీనివాస్, రాజ్‌ఠాకూర్, పుట్టమధు తదితరులు సిరిసిల్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. నేతన్న విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 

ఇదిలావుండగా.. ఈ నెల 23న సిరిసిల్ల బంద్ చేయాలని టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. విజయమ్మ పర్యటనను ఆరునూరైనా అడ్డుకుని తీరుతామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు చెప్పారు. మెదక్ జిల్లా చిన్నకోడూరులో, అలాగే విజయమ్మ రావద్దంటూ సిరిసిల్లలో జరిగిన టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో వారు మాట్లాడారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన 800 మంది యువకుల త్యాగాలను గుర్తించని సీమాంధ్రనేతలు.. నేతన్న సమస్యల పేరిట దీక్షలు చేపట్టే హక్కు ఎక్కడిదన్నారు. వచ్చిన తెలంగాణను చంద్రబాబు, వైఎస్ జగన్‌లే అడ్డుకున్నారని వారు ఆరోపించారు. సిరిసిల్లలో ఎంతోమంది నేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే విజయమ్మ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తెలంగాణపై చిదంబరానికి లేఖ రాశాక ఆమె పర్యటిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కాగా విజయమ్మ ధర్నాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, సిరిసిల్లలలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. చందుర్తి మండలం మర్రిగడ్డలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా పార్టీ నేత ఆదిశ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. 

ఎవరైనా సరే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే ఈ ప్రాంతంలో పర్యటించాలని జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం చెప్పారు. ఖమ్మం, వరంగల్‌లలో ఆయన వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, పోలవరం నిర్మాణం, వనరుల దోపిడీపై ఏ పార్టీవారైన వైఖరి ప్రకటిస్తే స్వాగతం పలికి వేములవాడ రాజన్న దగ్గర కోడెను కడుతామన్నారు. లేని పక్షంలో అడ్డుకుంటామని కోదండరాం హెచ్చరించారు ప్రస్తుతం నోట్ ఫర్ బెయిల్ పద్ధతి కొనసాగుతోందని, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓట్ ఫర్ బెయిల్ పద్ధతికి మారిందని ఎద్దేవాచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిపి వేయాలని కోర్టు ఆదేశాలున్నా టెండర్లను పిలిచి కాంట్రాక్ట్ అప్పగించేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో రాజకీయ ప్రాబల్యం కోసం వైఎస్ విజయమ్మ నేతన్న దీక్ష పేరుతో ప్రచారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గొడవలు సృష్టించి రాజకీయంగా ప్రయోజనం పొందడానికే ప్రయత్నిస్తున్నారని, సిరిసిల్లలో ఎలాంటి పరిణామాలు జరిగినా వైఎస్సార్సీపీ, ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుపై తనకేమీ సిగ్నల్స్ లేవన్నారు. 

వైఎస్ విజయమ్మ పర్యటన సజావుగా జరిగేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో వున్న ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ, విజయమ్మ రాకను ప్రతిఘటిస్తామని శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసే వారిని నియంత్రించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలపై ఉందని చెప్పారు.

‘సూ’కి టెండరు దక్కితే నాడు యాగీ చేసిన టీడీపీ ఇప్పుడు మాట్లాడదేం? రూ.477 కోట్లు వ్యయం పెరిగినా చప్పుడు చేయడం లేదేం?

‘సూ’కి టెండరు దక్కితే నాడు యాగీ చేసిన టీడీపీ ఇప్పుడు మాట్లాడదేం?
రూ.477 కోట్లు వ్యయం పెరిగినా చప్పుడు చేయడం లేదేం?
ఈ పెరిగిన మొత్తాన్ని టీడీపీ-కాంగ్రెస్ నేతలు పంచుకుంటున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఖరారు చేసుకోవడంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద గోల్‌మాల్ జరిగినట్టు చెప్పారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏడాది కాలంలో పోలవరంపై రెండు సార్లు టెండర్లు తెరిస్తే తొలిసారి టెండరు చేజిక్కించుకున్న ‘సూ-పటేల్’ జాయింట్ వెంచర్ కంపెనీ రూ. 4,122 కోట్ల అంచనా వ్యయాన్ని కోట్ చేసిందన్నారు. ‘ఎల్-1’ గా నిలిచిన ఈ కంపెనీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడైన రాజంకు చెందింది కనుక అప్పుడు టీడీపీ నాయకులు .. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారని, ఇప్పుడేమో తమకు వాటా ముడుతోంది కాబట్టి రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతున్నా నోరుమెదపడం లేదని బాజిరెడ్డి విమర్శించారు. అప్పట్లో ‘ఎల్-2’ సోమా కంపెనీ 4,147 కోట్ల రూపాయలతో నిలిచిందన్నారు. టీడీపీ నేతలు కొందరు ఈ అంశాన్ని కోర్టులో వేయిస్తే ఆ టెండరును రద్దు చేసిందన్నారు. అపుడు ‘ఎల్-2’గా ఉన్న సోమా కంపెనీ ఇపుడు ‘ఎల్-1’ స్థానానికి, తొలిసారి ‘ఎల్-1 స్థానంలో ఉన్న‘సూ-పటేల్’ కంపెనీ ఇపుడు ‘ఎల్-2’ స్థానానికి వచ్చాయన్నారు. అప్పట్లో రూ.4,122 కోట్ల వ్యయంతోనే ‘సూ-పటేల్’ కంపెనీ పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి సిద్ధపడితే ఇపుడు ‘సోమా’ కంపెనీ రూ.4,599.99 కోట్ల వ్యయంతో టెండర్లు చేజిక్కించుకుందని బాజిరెడ్డి వివరించారు.

ఇప్పుడు నోరు మెదపరే?

అప్పట్లో రూ.4,122 కోట్ల వ్యయానికే కాంట్రాక్టు ఇస్తే.. అందులో వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని నానా యాగీ చేసిన టీడీపీ నాయకులు ఇపుడు అంతకంటే 477 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగినా నోరు మెదపక పోవడానికి కారణమేమిటి? అని బాజిరెడ్డి ప్రశ్నించారు. ఇటీవలఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పరస్పరం ఓట్లేసుకున్న కాంగ్రెస్, టీడీపీలు పోలవరం టెండర్లలో కూడా అదే మాదిరి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. అధికంగా కోట్ చేసిన మొత్తాన్ని కాంగ్రెస్, టీడీపీ నేతలు సగం సగం పంచుకుంటున్నారని ఆరోపించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును అప్పట్లో రూ.4,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి సంకల్పించారని, పైగా అందులో విద్యుత్ ప్రాజెక్టు కూడా ఇమిడి ఉందని బాజిరెడ్డి వివరించారు. 

ఇపుడు విద్యుత్ ప్రాజెక్టును మినహాయించి (దాని వ్యయం సుమారు రూ.2,500 కోట్లు) సాగునీటి ప్రాజెక్టుకే రూ.4,599.99 కోట్ల వ్యయం కోట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ ప్రాజెక్టు అదనంగా నిర్మించాలంటే మరో మూడు వేల కోట్లు ఖర్చవుతాయన్నారు. ఇంత మొత్తం అదనంగా ఖర్చు చేయడానికి అధికార పక్షం సిద్ధపడితే టీడీపీ మౌనం వహించి చూస్తోందని బాజిరెడ్డి విమర్శించారు. సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా లాంటి పార్టీలు ఈ టెండర్లను లోతుగా పరిశీలించి ఇందులో జరిగిన అవినీతిని ప్రశ్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతిపై పోరాటం చేస్తున్నామని చెప్పే టీడీపీ వైఖరి ‘చెప్పేది శ్రీరంగ నీతులు....’ అన్న చందంగా ఉందని ఆయన అన్నారు.

విజయమ్మ వస్తే టీఆర్‌ఎస్‌కు బాధ ఎందుకు?

వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణకు వస్తే టీఆర్‌ఎస్‌కు బాధ ఎందుకని బాజిరెడ్డి ప్రశ్నించారు. దుర్భర పరిస్థితుల్లో ఉన్న చేనేత కార్మికులను పరామర్శించి వారి కోసం ఒక రోజు సిరిసిల్లలో ధర్నా చేసి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు విజయమ్మ ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిఘటించాలని టీఆర్‌ఎస్ నాయకులు చూడటం సమర్థనీయం కాదన్నారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని కేసీఆర్ పరకాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించారని, విజయమ్మ తెలంగాణలో అడుగు పెడితే తెలంగాణ ఏమైనా రాకుండా పోతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఇతర పార్టీల కన్నా చాలా స్పష్టతతో ఉందని, ఒక ఆడపడుచుగా పరామర్శకు విజయమ్మ వస్తూ ఉంటే కేటీఆర్ స్థానిక శాసనసభ్యుడుగా స్వాగతం పలికితే ఆయన ప్రతిష్ట హిమాలయం అంత ఎత్తుకు పెరుగుతుందని, లేకుంటే అధః పాతాళానికి దిగజారుతుందన్నారు. 

రాజధానిలో వరద బీభత్సం.. తొమ్మిది మంది దుర్మరణం

* 20 గంటలపాటు కుండపోత.. 18 సెంటీమీటర్ల వర్షపాతం
* గత 12 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షం.. జలదిగ్బంధంలో 78 కాలనీలు.. 
* పొంగి పొర్లిన నాలాలు, డ్రైనేజీలు.. బిక్కుబిక్కుమన్న బస్తీలు
* గోడ కూలి హఫీజ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
* బాలానగర్‌లో మరో ఐదుగురి కన్నుమూత.. 
* చెరువులను తలపించిన రహదారులు.. స్తంభించిపోయిన రవాణా
* మరో 24 గంటలు రాష్ట్రమంతటా వర్షాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: చినుకు వణుకు పుట్టించింది. వరద హడలెత్తించింది. శుక్రవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలై శనివారం తెల్లవారుజాము వరకూ హోరెత్తిన వర్ష బీభత్సానికి రాష్ట్ర రాజధాని చిగురుటాకులా వణికిపోయింది. గత పన్నెండేళ్లుగా ఎన్నడూ లేనంతగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి హఫీజ్‌పేటలో ఇళ్లు కూలి నలుగురు, బాలానగర్ సమీపంలో గోడ కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దాదాపు 20 గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని మూడోవంతు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 78 ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని విలవిల్లాడిపోయాయి. 

లంగర్‌హౌస్ పరిధిలోని థాన్‌కోట, మెహిదీపట్నం సమీపంలోని నదీంకాలనీ, ముషీరాబాద్‌లోని నాగమయ్యకుంట, పద్మాకాలనీ, అంబర్‌పేట బతుకమ్మకుంట, ప్రేమ్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ కాలనీ, తపోవన్ కాలనీ, లెనిన్‌నగర్‌లలోని వీధులన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షంతో జనం అతలాకుతలమైనా.. కాలనీలు, బస్తీల్లో వరద ఉధృతిని మళ్లించేందుకు జీహెచ్‌ఎంసీ సహాయక చర్యలేవీ చేపట్టలేదు. శనివారం మధ్యాహ్నం వరకు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూశారు. ఇక రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అడుగుతీసి అడుగు పెట్టాలంటే కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. 

టోలీచౌకీ, షేక్‌పేట్, బీఎస్‌మక్తా, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు హడలిపోయారు. సామాన్లు నీటిలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు రాత్రంతా జాగరణ చేశారు. ఎల్బీనగర్ ప్రాంతంలోని వికలాంగుల హాస్టల్‌లోకి నీళ్లు చేరడంతో పిల్లలు కిటికీలు, సజ్జలపై కూర్చొని ప్రాణాలు రక్షించుకొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 1 గంట నుంచి శనివారం తెల్లవారుజాము 5 గంటల వరకు కుండపోతగా వర్షం కురవడంతో అనేక నాలాలు పొంగిపొర్లాయి. 2000 ఆగస్టులో 24.3 సెం.మీ వర్షం కురిసింది. అప్పట్నుంచి ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి.

ఉసురు తీసిన వరద
గుడిసెలో ఆదమరచి నిద్రపోతున్న బడుగు జీవులను వరద కబళించింది. మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఏడుగురు, మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు.. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బాలానగర్‌లోని ఓ పెయింట్ కంపెనీ వద్ద ప్రహరీ గోడను ఆనుకొని గుడిసె వేసుకుని జీవిస్తున్న రెండు కుటుంబాలపై గోడ కూలడంతో మృతి చెందారు. వీరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన గరేష శాంతీలాల్ (19), కాలూఖాన్ (19), గోపాల్ (18) ఉన్నారు. అలాగే ఇదే ప్రమాదంలో మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన పోచమ్మ అలియాస్ లక్ష్మి (42), జక్కల బాబు (24) కన్నుమూశారు. ఆటో డ్రైవర్ బాబు గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదలగా మిగిలిన వారు శిథిలాల కిందే ప్రాణాలు వదిలారు. 

న్యూహఫీజ్‌పేటలో కూడా ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా బెల్లాడకు చెందిన ఎండీ అహ్మద్ హఫీజ్‌పేటకు వలస వచ్చి చిన్న ఇళ్లు నిర్మించుకొన్నారు. కుటుంబ సభ్యులంతా నిద్రపోతుండగా ఇంటి గోడ కూలడంతో మహ్మద్ భార్య ఫరీదాబేగం (30), కుమార్తెలు సమ్రీన్ బేగం (4), ముస్కాన్ బేగం (2), కుమారుడు ఎండీ సమీర్(6) మృతి చెందారు. ఈ సమయంలో ఎండీ అహ్మద్ కాలకృత్యాల కోసం బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం కుటుంబ సభ్యులను కోల్పోయిన అహ్మద్ గుండెలవిసేలా విలపించారు. మృతుల కుటుంబాలకు జీహెచ్‌ఎంసీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

వారికి అది కాలరాత్రి
వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపారు. బట్టలు, నిత్యావసర వస్తువులు, వండుకొన్న ఆహార పదార్థాలు సైతం నీట మునిగాయి. గోల్కొండ సమీపంలోని థాన్‌కోట, నాగమయ్యకుంట, నదీంకాలనీ, అంబర్‌పేటలోని ప్రేంనగర్, బతుకమ్మకుంట, వైభవ్‌నగర్, శాంతినగర్, తిలక్‌నగర్, కుద్బీగూడ, రత్నానగర్, పాతబస్తీలోని ఉప్పుగూడ, బండ్లగూడ, అరుంధతి కాలనీ, యాకుత్‌పురా, బహదూర్‌పురా, రాజన్నబావి, హైటెక్‌సిటీలోని జనప్రియకాలనీ, దీప్తిశ్రీనగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతంలోని గాంధీ ఆస్పత్రి, బాపూజీనగర్, ముషీరాబాద్ జాంబవీనగర్, పార్శీగుట్ట, పద్మారావునగర్, ఉప్పల్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ వరద పోటెత్తింది. 

వరదకు తోడు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం అష్టకష్టాలు పడ్డారు. వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ ఎలాంటి నష్టపరిహారం ప్రకటించకపోవటంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. థాన్‌కోట నీటి ముంపుపై జీహెచ్‌ఎంసీ యంత్రాంగం రోజంతా స్పందించలేదని ఎంఎల్‌ఏ అప్సర్‌ఖాన్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా శనివారం ఒక్క రోజే మూడు వందల డయేరియా కేసులు నమోదయ్యాయి. 

ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్...
ప్రధాన మార్గాల్లో రోడ్లపై నీళ్లు ప్రవహించడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపించాయి. చాదర్‌ఘాట్ వద్ద వరద నీరు పొంగటంతో దిల్‌సుఖ్‌నగర్-మలక్‌పేట మధ్య రవాణా నిలిచిపోయింది. సికింద్రాబాద్ ఒలిఫెంటా, పంజాగుట్టలోని మోడల్ హౌస్, నిమ్స్ వద్ద కూడా వరద పోటెత్తింది. హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే మార్గంలో రోడ్డుపై నడుంలోతు నీళ్లు ప్రవహించడంతో ఓ కారు, రెండు బైక్‌లు నీళ్లలో కొట్టుకు పోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. ఉప్పల్-చిలకానగర్ మార్గంలో నాలా పొంగిపొర్లడంతో శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఆ మార్గంలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షం కారణంగా సిటీ బస్సులు మొరాయించాయి. పలుచోట్ల రోడ్లపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ ముందుకు కదల్లేదు. 

రైళ్ల రాకపోకలు కూడా ఆలస్యంగా సాగాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరింది. శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు కూడా రద్దయ్యాయి. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విశాఖపట్నం, ఢిల్లీ, రాజమండ్రి, తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్, కింగ్‌ఫిషర్, ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావల్సిన విమానం కూడా రద్దుకావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఎయిర్‌లైన్స్ సంస్థలు వేరే విమానాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద..
తాజా వర్షాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో జలమట్టం పెరిగింది. ఉస్మాన్‌సాగర్‌లో నీటి మట్టం నాలుగు అడుగులు (1769 నుంచి 1773.15) పెరిగింది. హిమాయత్‌సాగర్‌లో 1.26 (1747.64 నుంచి 1749.00) అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. మూసీనది పోటెత్తింది.

ఇంకా కురవొచ్చు..: జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్‌లో ఇంకా వర్షం కురిసే అవకాశముందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. వర్షాలతో తొమ్మిది మంది మృతి చెందారని, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని చెప్పారు. వరదలతో నష్టపోయిన 2 వేల మందికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు. కూలిపోయిన 23 ఇళ్లకు రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2,500 అందజేశామన్నారు. పాత భవనాల్లో ఉన్నవారు తక్షణమే వాటిని ఖాళీ చేయాలని, లేదంటే అలాంటి భవనాలను జీహెచ్‌ఎంసీ కూల్చివేస్తుందని చెప్పారు.

పోలవరానికి కొత్త చిక్కులు

న్యాయం చేయకుంటే కోర్టుకు వెళతాం
గతంలో ఓ సంస్థ కోర్టుకెళ్లడంతో టెండర్లు రద్దు
రూ.477 కోట్ల అదనపు భారంపై విమర్శలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలవరం టెండర్ల ప్రక్రియలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ టెండర్లలో అనర్హతకు గురైన రెండు సంస్థలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. టెండర్ నిబంధనల ప్రకారమే తాము డాక్యుమెంట్లను పొందుపరిచామని, అయినప్పటికీ తమపై అనర్హత వేటును వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలవరం ర్యాక్‌ఫిల్ డ్యాం, స్పిల్‌వే నిర్మాణాలకు సంబంధించి ఆహ్వానించిన టెండర్లలో ఎల్-1గా సోమా సంస్థ నిలిచిన విషయం తెలిసిందే. మొత్తం ఆరు సంస్థలు ఈ టెండర్‌లో పాల్గొనగా సోమా, సూ సంస్థలే అర్హతలను సాధించినట్టు ఇంజనీర్ల రాష్ర్ట స్థాయి కమిటీ నిర్ణయించింది. అనర్హతకు గురైన సంస్థల్లో మధుకాన్, ట్రాన్స్‌ట్రాయ్‌లు కూడా ఉన్నాయి. 

దాంతో ఈ రెండు సంస్థలు తమ అనర్హతపై శనివారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. తమకు సాంకేతికంగా అన్ని అర్హతలు ఉన్నాయని ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీకి ఆ సంస్థల ప్రతినిధులు ఫిర్యాదు లేఖలను అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు ముఖ్యకార్యదర్శి సూచించారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని సదరు సంస్థలు చెబుతుండడంతో సమస్య మరింత ముదరనుంది. గతంలో కూడా ఇలాగే ఒక సంస్థ కోర్టుకు వెళ్లడంతో టెండర్లను రద్దు చేయాల్సి వచ్చింది. మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతుందా? అనే ఆందోళనను అధికారులు వెలిబుచ్చుతున్నారు.

ఆర్థిక శాఖ ఏమంటుందో?

ఈ టెండర్‌కు ఆర్థిక శాఖ అనుమతి కూడా కీలకం. గత టెండర్ రద్దు కావడానికి కోర్టు కేసులు, సంస్థల మధ్య విభేదాలతో పాటు ఆర్థిక శాఖ విముఖత కూడా ఒక కారణం. రద్దయిన టెండర్‌లో 12.61 శాతం తక్కువకే పనుల్ని చేయడానికి సూ సంస్థ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్పుడు ఆర్థిక శాఖ కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని ఎక్కువగా వేయడం వల్లనే 12.61 శాతం తక్కువకు పనుల్ని చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని పేర్కొంది. అంచనా వ్యయాన్ని మరో సారి సరిచూడాలని కూడా అభిప్రాయపడింది. అయితే ప్రస్తుత టెండర్‌లో పాత అంచనా వ్యయమే (రూ.4717 కోట్లు) కొనసాగుతోంది. పైగా ఈ సారి మైనస్ 2.48 శాతం బిడ్ చేసిన సంస్థ ఎల్-1గా వచ్చింది. పాత టెండర్‌తో పోలిస్తే ప్రస్తుత టెండర్ సుమారు రూ.477 కోట్లు అధికం. అంటే ఈ మేర ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. దీనికి ఆర్థిక శాఖ అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఆర్థిక శాఖ ఏమైనా కొర్రీలను వేస్తే.. హై పవర్ కమిటీ తీసుకోబోయే నిర్ణయం కీలకమవుతుంది. మరోపక్క ఈ టెండర్‌పై వివిధ రాజకీయ పక్షాలు స్పందించాయి. లోపాయికారిగా ఒప్పందం కుదరబట్టే.. గతంలో కంటే ఎక్కువ మొత్తానికి టెండర్‌ను దక్కించుకునే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రభుత్వంపై పడే రూ.477 కోట్ల అదనపు భారాన్ని ఆర్థిక శాఖ ఆమోదిస్తుందా? లేదా అనే విషయంపై ఈ టెండర్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

రెక్కాడినా..డొక్కాడదు

వంద శాతం వరకూ పెరిగిన నూలు, రంగుల ధరలు 
పెరిగిన కరెంటు చార్జీలతో నేతన్నలపై మరింత భారం 
ముడిసరుకుల ధరలు పెరిగాయి.. వస్త్రాల ధర పెరగలేదు 
ఆప్కోకు రూ. 10 కోట్ల మేరకు బకాయిపడ్డ సర్కారు 
కార్మికులు నేసిన వస్త్రాలకు నిధులివ్వలేకపోతున్న ఆప్కో 
80 శాతానికి పైగా మూలనపడ్డ చేనేత, మర మగ్గాలు 
వలసలు, ఆత్మహత్యల దిశగా నేతన్నల పయనం
చేనేత సమస్యలపై రేపు సిరిసిల్లలో విజయమ్మ దీక్ష

నేతన్నలకు నూలుపోగే ఉరితాడుగా మారుతోంది. నూలు, రంగుల ధరలు భారీగా పెరిగిపోవటంతో పాటు.. కరెంటు బిల్లుల భారం కూడా వాటికి తోడయింది. అయితే.. నేసిన వస్త్రాల ధరలు మాత్రం ఇందుకు అనుగుణంగా పెరగలేదు. ఫలితంగా యజమానులు మగ్గాలను మూలకుపడేశారు. ప్రభుత్వ ఆధీనంలోని సహకార సంఘాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ సంఘాలకు ముడి సరుకులకు ఆప్కో సరఫరా చేయటం లేదు. దీంతో చేనేత కార్మికులకు పనిలేకుండా పోయింది. సరఫరా చేసిన వస్త్రాలకు ఆప్కో డబ్బులు చెల్లించటం లేదు. ఇదేమిటని అడిగితే.. వస్త్రాలను కొనుగోలు చేసిన ప్రభుత్వశాఖలు బకాయిపడి ఉన్నాయుని ఆప్కో చెప్తోంది. ఫలితంగా కార్మికులు పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. రేయింబవళ్లు కష్టపడినా పూటగడవకపోవటంతో కూలిరేట్లు పెంచాలని ఇటీవలే సిరిసిల్ల నేతకార్మికులు నిరవధికసమ్మెకు దిగారు. ఒక్క సిరిసిల్లే కాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నేత కార్మికులది ఇదే దుస్థితి.

హైదరాబాద్, న్యూస్‌లైన్: సిరిసిల్ల మృత్యుఘోషకు తల్లడిల్లిన దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రత్యేక ప్యాకేజీతో నేత కార్మికులను ఆదుకున్నారు. రుణమాఫీ సహా అనేక సహాయ కార్యక్రమాలు అమలు చేశారు. నేతన్నల దీనస్థితిని గుర్తించి సిరిసిల్ల ప్యాకేజీని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని భావించారు. బడ్జెట్‌లో నేత కార్మికులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. కానీ.. ఆయన మరణంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వైఎస్ ఇచ్చిన హామీలను పాలకులు తుంగలో తొక్కారు. ఆదుకోవటానికి బదులు భారాలు మోపుతుండటంతో నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. మళ్లీ ఆత్మహత్యల బాట పడుతున్నారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్ల కేంద్రంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఈ నెల 23న దీక్షకు సన్నద్ధమవుతున్నారు. 

పెరిగిన ముడి సరుకు ధరలు: చేనేత పనికి ఉపయోగించే ముడి సరుకు ధరలు ఒక్క ఏడాది కాలంలోనే భారీగా పెరిగాయి. గత ఏడాది 40వ నంబరు కాటన్ నూలు ధర 4.5 కేజీలకు రూ. 590 నుంచి రూ. వెయ్యికి, 60వ నెంబరువి రూ. 889 నుంచి రూ. 1,185కు, 80వ నెంబర్‌వి రూ. 1,200 నుంచి రూ. 1,680కి, 100 నెంబర్‌వి రూ. 1,700 నుంచి 2,100కు పెరిగాయి. రంగుల ధరలు కూడా ఇదే బాట పట్టాయి. కాస్టిక్ కెమికల్ కిలో ఏడాది కిందట రూ. 50 ఉంటే ఇప్పుడు రూ. 100కిపెరిగింది. బట్టి రంగులు కేజీ రూ. 1,800 నుంచి రూ. 2,200కు పెరిగింది. మొత్తం మీద సిల్క్ నూలు ధరలు 100 శాతం పెరగగా, రంగుల ధరలు 60 శాతం పెరిగాయి. అయితే, ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ ఆప్కోమాత్రం వస్త్రాల ధరలను పెంచటం లేదు. ఫలితంగా నేత పని కార్మికులకు గిట్టుబాటు కావటం లేదు.

మూలన పడ్డ మగ్గాలు: రాష్ట్రవ్యాప్తంగా పట్టు నూలుతో వస్త్రాలు చేసే మగ్గాలు రెండున్నర లక్షల మేరకు ఉన్నాయి. వీటి మీద ఆధారపడి 7, 8 లక్షల మంది చేనేత కార్మికులు జీవిస్తున్నారు. పట్టు వస్త్రాలు విపరీతంగా పెరగటంతో మగ్గాల యజమానులు పనులను నిలిపివేశారు. సుమారు 80 శాతం మగ్గాలు మూలకు పడ్డాయని ఒక అంచనా. వాస్తవానికి రాష్ట్రంలో వివిధ సహకార చేనేత సంఘాలకు అవసరమైన నూలును (యార్న్) ఆప్కో సరఫరా చేస్తుంది. ఈ యార్న్‌ను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) నుంచి ఆప్కో కొనుగోలు చేస్తుంది. 

ఎన్‌హెచ్‌డీసీ నుంచి కొనుగోలు చేసిన నూలుకు ఆప్కో రూ. 10 కోట్ల మేరకు బకాయి పడి ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవటంతో ఎన్‌హెచ్‌డీసీకి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆప్కో చెల్లించలేకపోయింది. ఫలితంగా కొత్తగా నూలు సరఫరాను ఎన్‌హెచ్‌డీసీ నిలిపివేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు అవసరమైన నూలును ఆప్కో సరఫరా చేయటం లేదు. మార్కెట్లో కూడా ముడిసరుకు ఎక్కువగా లభించటం లేదు. ఫలితంగా మగ్గాలు మూలనపడుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ మగ్గం యజమానులు కూడా పెరిగిన ధరలతో గిట్టుబాటు కాక మగ్గాలను మూలకుపడేశారు. దీంతో పాటు గత ఏడు నెలల నుంచి చేనేత కార్మికులకు ఆప్కో వేతనాలు చెల్లించటం లేదు. చేనేత కార్మికులు ఆకలితో అలమటించాల్సి వస్తోందని చేనేత ఐక్య వేదిక (డబ్ల్యూయూఎఫ్) కన్వీనర్ గడ్డం జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆప్కోకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

సబ్సిడీలు విడుదల చేయని సర్కారు: చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. 10 శాతం యూర్న్ సబ్సిడీతో పాటు పావలా వడ్డీకే రుణాలు అందించారు. పవర్‌లూంల విద్యుత్ చార్జీలు పెంచలేదు. విద్యుత్ బిల్లులో 50 శాతం సబ్సిడీ భరించారు. అయితే, ఈ పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయటం లేదు. ఇప్పటికే విద్యుత్ సబ్సిడీ మొత్తం 40 కోట్ల మేరకు గత మూడేళ్లుగా ప్రభుత్వం బకాయి పడి ఉంది. అదేవిధంగా యూర్న్ సబ్సిడీ కూడా దిక్కులేకుండా పోయింది. పావలా వడ్డీ బకాయిల పరిస్థితీ అంతే. దీంతో సబ్సిడీలు అందక కార్మికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రుణ మాఫీలకూ కొర్రీలు: నేతన్నలు, చేనేత సహకార సంఘాల రుణాలు మాఫీ చేస్తామంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ 2009-10 బడ్జెట్‌లో రూ. 312 కోట్లు కేటాయించారు. దీనిని కాస్తా విజిలెన్స్ కేసుల పేరుతో ఆ తర్వాతి ప్రభుత్వం రూ. 200 కోట్లకు తగ్గించింది. ఇందులోనూ కేవలం రూ. 150 కోట్లను మాత్రమే విడుదల చేశారు. మరో రూ. 21.25 కోట్ల వ్యక్తిగత రుణాలు ఇప్పటికీ మాఫీ కాలేదు. దీంతో రుణాలు కట్టాల్సిందేనంటూ బ్యాంకర్ల వేధింపులు పెరిగాయి. మరోవైపు బతుకు బండి లాగటం కోసం తీసుకున్న రుణాలు కట్టాల్సిందేనంటూ వడ్డీ వ్యాపారులు, మైక్రో సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఊరికి దూరంగా పారిపోతున్న వారు కొందరైతే.. ఏకంగా ఈ లోకాన్నే విడిచిపెట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు మరికొందరు. ముడిసరుకులను తక్కువ ధరకు చేయాలనే ఆలోచన ప్రభుత్వం నుంచి కరువైంది. ఉపాధి కోల్పోతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవటం లేదు.

సిరిసిల్లది అంతర్జాతీయ సిరి...

అగ్గిపెట్టెలో ఇమిడే చీరలతో సిరిసిల్ల చేనేత ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఇక్కడి నేతన్నలది. ఇక్కడ చేనేత మగ్గాలపై చీరలు, ధోవతులు నేసేవారు. 1968కి ముందు పూర్తిస్థాయిలో చేనేత మగ్గాలపైనే వస్త్రోత్పత్తి జరిగేది. సిరిసిల్ల నేతన్నలు కొందరు మహారాష్ట్రలోని భీవండి, ముంబై వెళ్లి అక్కడ మరమగ్గాలపై వస్త్రోత్పత్తి జరిగే తీరును అవగాహన చేసుకుని సిరిసిల్లలోనూ ఆ మగ్గాలను స్థాపించారు. దాంతో చేనేత కనుమరుగైపోయి మరమగ్గాలు (పవర్‌లూమ్స్) వచ్చాయి. ప్రస్తుతం యంత్రాల సాయంతో వస్త్రోత్పత్తి సాగుతోంది. ఒక్క చీర నేయటానికి చేనేత మగ్గంపై నేత కార్మికుడు కాళ్లుచేతులు ఆడిస్తూ రెండు రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే మర మగ్గంపై ఒక్క రోజులోనే 80 మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. మరమగ్గం చేనేత మగ్గాన్ని మింగేసింది. సిరిసిల్లలో కేవలం ఓ వంద చేనేత మగ్గాలు ఉండగా 34 వేల మర మగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మర మగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అవుతుండగా.. మరో 7 వేల మగ్గాలపై కాటన్ వస్త్రం తయారవుతోంది. వీటికి తోడు 30 సైజింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో కోముల నుంచి దారాన్ని బీములుగా మార్చి ఆసాములకు అందిస్తారు. ఇక్కడ తయారైన కాటన్ వస్త్రాన్ని డైయింగ్ (అద్దకం) యూనిట్లలో రంగులుగా అద్ది ఆరబెట్టి పెట్టీకోట్స్ (లంగా గుడ్డ)గా విక్రయిస్తారు. నేత, చేనేతకు పెద్ద తేడా లేకపోగా.. ఒకప్పుడు నాగలి పట్టి పొలం దున్నే రైతు ఇప్పుడు ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తున్న చందంగా మార్పువచ్చింది. 

మూడంచెల విధానం... 

సిరిసిల్లలో మూడంచెల విధానం అమలవుతోంది. నూలు మిల్లుల ద్వారా సిరిసిల్లలోని యజమానులు (మాస్టర్ వీవర్స్) నూలును దిగుమతి చేసి సైజింగుల్లో భీములను నింపి ఆసాముల (వీవర్స్)కు ఇస్తారు. ఆ భీములను తమ సాంచాలపై (మరమగ్గాలు) బిగించి వస్త్రం తయారు చేసి యజమానులకు అప్పగిస్తారు. ఇలా చేసినందుకు ప్రతి మీటర్‌కు రూ. 2.84 చొప్పున యజమానులు ఆసాములకు కూలిగా ఇస్తారు. ఆసాములు కొందరు తాము పని చేసుకుంటూనే తమ వద్ద కొంతమంది కార్మికులకు పని కల్పిస్తారు. అంటే ఆసాములు మగ్గాలు నడుపుతూనే మరో ఒకరిద్దరు కార్మికులతో రేయింబవళ్లు (24 గంటలు) మగ్గాలపై వస్త్రాన్ని తయారు చేస్తారు. తయారు చేసిన గుడ్డకు వచ్చే కూలిలో సగం సొమ్మును కార్మికుడికి ఆసాములు ఇస్తారు. అంటే ప్రతి మీటర్‌పై రూ. 1.42 పైసలు కార్మికుడికి లభిస్తుంది. మగ్గాల యజమాని ఆసామే కావటంతో కరెంటు బిల్లులను భరిస్తూ యజమాని వద్ద నూలు తెచ్చుకుని వస్త్రాన్ని తయారు చేసి అప్పగించటం ఆసామి డ్యూటీ. ఇక్కడ యజమాని, ఆసామి, కార్మికుడు అనే మూడంచెల విధానం అమలవుతోంది. సిరిసిల్లలో 50 మంది వరకు యజమానులు ఉండగా.. ఐదు వేల మంది ఆసాములు ఉన్నారు. అందరూ కలిసి 25 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. 

రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మానసిక స్థితి సరిగాలేదని సూచిస్తున్నాయి

టీడీపీ విమర్శలపై వైఎస్సార్ సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి ధ్వజం 
‘జగన్‌కు బెయిల్ ఖరీదు.. ప్రణబ్‌కు ఓటు’ అనటం.. చట్టం, రాజ్యాంగం, న్యాయస్థానాలపై లెక్కలేని తనమే
అత్యున్నత రాజ్యాంగ పీఠానికి జరుగుతున్న ఎన్నికలను కూడా పచ్చకామెర్ల దృష్టితో చూస్తున్నారు 
సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు కూడా ప్రణబ్‌ముఖర్జీకి ఓటు వేశాయి కదా? 
మీలా మేనేజ్ చేసుకోవాలనుకుంటే అసలు కేసులు, దర్యాప్తు, అరెస్టులే లేకుండా చేసుకునే వాళ్లం కదా? 
ఎవరు కుమ్మక్కయ్యారో తేల్చుకుందాం... అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతారా?

రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని ప్రజా స్వామ్యవాదులు ఎవరైనా అర్థం చేసుకుంటారు. టీడీపీలోని భూకబ్జాల ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మానసిక స్థితి సరిగాలేదని సూచిస్తున్నాయి. ‘‘జగన్ బెయిలు ఖరీదు ప్రణబ్ ముఖర్జీకి ఓటు’’గా మారిందంటూ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించటం ఆ పార్టీకి చట్టం, రాజ్యాంగం, న్యాయస్థానాల పట్ల లెక్కలేనితనాన్ని వెల్లడిస్తున్నాయి. 

సీబీఐ మీదగానీ, కాంగ్రెస్ మీదగానీ, టీడీపీ మీదగానీ మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పూలేదు. మేం ఇంతకు ముందు చెప్పినట్టుగానే సీబీఐని కాంగ్రెస్ ఆడిస్తోందన్న మాటకే కట్టుబడి ఉన్నాం. టీడీపీ-సీబీఐల మధ్య కూడా అవినా భావ సంబంధాలున్నాయని మరోసారి స్పష్టం చేస్తున్నాం. కుమ్మక్కు రాజ కీయాలు, కుట్రలు, వెన్నుపోట్లు వంటివి టీడీపీ పేటెంట్లు. 
కాంగ్రెస్‌తో ఈ రాష్ట్రంలో ఎవరు కలిసిపోయారో చెప్పడానికి ఒకటి కాదు... రెండుకాదు, అనేక ఉదాహరణలున్నాయి. రైట్ టూ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకంలో కుమ్మక్కు అయింది ఎవరు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే విషయం నుంచి ఓట్ల ట్రాన్స్‌ఫర్ వరకు కలిసి చేయిం చుకున్నది ఎవరు? కలసికట్టుగా జగన్‌మోహన్‌రెడ్డి మీద కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది ఎవరు? ఉప ఎన్నికల్లో అల్లుకుపోయింది ఎవరు? వీటన్నింటికీ రాష్ట్ర ప్రజలంతా ఒకే సమాధానం చెబుతారు... టీడీపీ, కాంగ్రెస్ అని! 

అలాగే, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ నాయకుడు జి.ఎన్.నాయుడుకు హైదరాబాద్ అమీర్ పేటలోని అత్యంత ఖరీదైన భూములను పంచిపెట్టటానికి పాలూనీళ్లలా కలిసి పోయింది కూడా ఈ రెండు పార్టీలే. కుమ్మక్కు అంటే ఇదిగాక ఇంకేమిటి? అదీగాకపోయినా ఎవరి చరిత్ర ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆరోపణలు చేసినంత మాత్రాన టీడీపీ ఒంటినిండా ఉన్న బురద గంధంగా మారిపోదు.
అలాగే, సీబీఐతో టీడీపీ, కాంగ్రెస్ సంయుక్తంగా కుమ్మక్కు అయ్యాయన్నది కూడా ముమ్మాటికీ నిజం. 

లేని పక్షంలో ఎకరా నాలుగు కోట్లు విలువ చేసే భూముల్ని ఎమ్మార్ సంస్థకు కట్టబెట్టడమేమిటని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడును సీబీఐ ఎందుకు ప్రశ్నించటం లేదు? అదీగాక, చంద్రబాబుకు సంబంధం లేదని సీబీఐ వెనువెం టనే క్లీన్‌చిట్ ఇచ్చి ఆయనకు లేని పరువూ ప్రతిష్టల్ని కాపాడే బాధ్యత తన భుజస్కంధాల మీద ఎందుకు వేసుకున్నట్టు? అదే సీబీఐ, చంద్రబాబు నాయుడు తనయుడైన లోకేశ్‌కు సత్యం రామలింగరాజు ఫీజు కట్టారన్న విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నట్టు? ఆ కేసులో కూడా చంద్రబాబు మీద విచారణే లేదు... ఎందుకని? ఇవి చాలవా... సీబీఐ, టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యారనటానికి?
ఈ రోజు పత్రికలనే చూడండి. అందులో ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని చూడండి. బెయిల్‌కు వంద కోట్లు! అంటూ ఈ రెండు పత్రికలూ ఒకే లైన్‌లో కథనాన్ని ప్రచురించాయి. ఎవరో చెప్పిన మాటను పత్రికలు ప్రచురించరాదని, పార్టీగా మేం భావించటం లేదు. కాకపోతే, కిందిస్థాయి కోర్టులో బెయిల్‌కు రూ.100 కోట్లు ఇస్తామని ఎవరైనా అనే అవకాశం ఉందా? అన్న ఆలోచన పత్రికా ప్రమాణాల రీత్యా అయినా ఉండదా అన్నదే మా ప్రశ్న. 

ఇలాంటి చెత్త కథనాలను ఏరుకుని ఎల్లో మీడియా పత్రికలు టీడీపీకి అనుకూలంగా రోజూ గంగవైలెత్తుతుంటే... మరోవంక, టీడీపీ ఏకంగా బెయిలును ‘ఖరీదు’ కట్టారంటూ రేవంత్‌రెడ్డితోనో, మరొకరితోనో మాట్లాడిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నదని తెలిసీ ఇలా ‘ఖరీదు’ అంటూ మాట తూలటం ఆ పార్టీ మానసిక స్థితితోపాటు, రాజకీయ స్థాయిని కూడా సూచిస్తోంది. మేం టీడీపీని అడుగుతున్నాం... మీ నాయకుడి మాదిరిగా మేనేజ్ చేసుకునే వ్యక్తులమే అయితే, హైకోర్టులో పిటిషన్ పడకముందే మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? ఆ తరవాత, ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు ముందే మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? అలాంటిదేమీ లేనప్పుడు, అలాంటి అలవాట్లు మా రక్తంలోనే లేనప్పుడు మీరు ఎన్ని విమర్శలు చేసినా ఏం లాభం? 

ప్రస్తుత లోక్‌సభలోనే కాకుండా, మొత్తంగా దేశ చరిత్రలోనే ప్రజాతీర్పులో అత్యధిక మెజారిటీ సంపాదించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రేపటి రోజున న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే అది తప్పు అవుతుందా? అసలు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? తప్పు చేశారన్న ఆధారాలతో కాదు. ఆయన ఒక ఎంపీ. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటూ అరెస్టు చేశారు. నిజానిజాలను బేరీజు వేసి, ఈ అరెస్టు సబబు కాదంటే, రేపు సుప్రీం కోర్టు జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు ఇస్తే దాన్ని మీ పార్టీ ‘ఖరీదు’గా భావిస్తుందా? ఆవిర్భవించి 30 ఏళ్లయినా మీ పార్టీకి ఏది అనొచ్చో, ఏది అనకూడదో అన్న జ్ఞానం కూడా లేదే!

ఇక ప్రణబ్ ముఖర్జీకి మా పార్టీ మద్దతు ఇవ్వటాన్ని మీరు తప్పు పడుతున్నారు. ఏదో ఆశించే ఆయనకు మేం మద్దతు ఇచ్చాం అంటున్నారు. చివరికి దేశంలో అత్యున్నత రాజ్యాంగ పీఠానికి పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలను కూడా మీ పసుపురంగు పార్టీ పచ్చకామెర్ల దృష్టితోనే చూస్తోంది. మీ వాదనే నిజం అనుకుంటే, మరి లోక్‌సత్తా, సీపీఎం లాంటి పార్టీలు ఏం ఆశించి ప్రణబ్‌కు ఓటు వేశాయి? మీరెందుకు వారిని విమర్శించలేకపోతున్నారు? మీ రాజకీయ అవసరాల దృష్ట్యా వారి విషయంలో మీరు నోరెత్తటం లేదు. అవునా? 
అదీగాక, దేశ రాష్ట్రపతి ఎన్నిక టీ-20 మ్యాచ్ లాంటిదా? గెలుపు ఎవరిదో నామినేషన్ల పర్వానికి ముందే తెలిసిపోయింది. కాబట్టే చంద్రబాబు నాయుడు ఓటు వేయకుండా వెనక్కు తగ్గారు. ‘తటస్థం’ అన్నది కేవలం ప్రజలను మభ్యపెట్టాలన్న కుట్రతో టీడీపీ పన్నిన పన్నాగంలో భాగం మాత్రమే. 

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారన్న వార్త వినగానే ఆయనను చంద్రబాబు సమర్థించిన మాట వాస్తవం కాదా? ఆయనకు మద్దతుగా నిలబడాలని కొన్ని పార్టీల నాయకులతో సాక్షాత్తు చంద్రబాబు చాటుమాటు మంతనాలు జరపడం నిజం కాదా? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకుండా ఎలా ఉంటామని చంద్రబాబు అనటం నిజం కాదా? సంగ్మాకు మద్దతు మతతత్వానికి మద్దతు అని చంద్రబాబు పేర్కొనటం నిజం కాదా? ఇవన్నీ నిజాలే అయినా అంతకు మించిన నిజం ఏమిటంటే... బాబు బుకాయించగలరు. ఒకప్పుడు ఓటు వినియోగించు కొనకపోవటం, తటస్థంగా ఉండటం తప్పు అన్న బాబు ఇప్పుడు కొత్త రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ నాయకులుగా మనమంతా ఎన్నికలు వచ్చేసరికి ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటాం. అలాంటిది, బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీలో ఉంటూ దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకునే ప్రక్రియలో వెనకడుగు వేయటం అంటే, భావి తరాలకు ఎలాంటి సందేశం పంపుతున్నట్టు? ఇలాంటి కనీస ఆలోచనలు కూడా టీడీపీ వారికి రావెందుకని?

న్యాయ వ్యవస్థకు సంబంధించి చెలగాటం ఆడటం టీడీపీకి బహుశా వెన్నతోపెట్టిన విద్య అయి ఉండవచ్చు. పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుందన్నట్టు, పచ్చ పార్టీ వారికి కూడా ఇలా కుమ్మక్కు కావటం, మేనేజ్ చేసుకోవటం వారి స్వభావ సిద్ధమైన గుణాలు అయినందున వాటిని మిగతా పార్టీలకు అంటగడుతున్నట్టుగా కనిపిస్తోంది. మాది మేనేజ్ చేసుకునే పార్టీ కాదు కాబట్టే న్యాయస్థానాల్లో పోరాటాన్ని కొనసాగిస్తోంది. అదీగాక, మేం ఈ ఎన్నికల్లో ఓటు వేయం అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఉంటే, ఇది రాజకీయాల్లో ఒక చెడ్డ సంప్రదాయం అని టీడీపీ విమర్శించి ఉండేది. సంగ్మాకు అనుకూలంగా ఓటు వేస్తే అది ముస్లింలకు వ్యతిరేక ఓటు అని యాగీ చేయటానికి తెగించేది. ప్రణబ్‌కు ఓటు వేయటాన్ని కుమ్మక్కుగా పేర్కొంటోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ‘మేనేజ్‌మెంట్’ అనే పదం మాత్రమే టీడీపీ వారి నోటి నుంచి వస్తుంది. 

మేం టీడీపీని సూటిగా ప్రశ్నిస్తున్నాం... మేం మీకు మాదిరిగా గొప్ప మేనేజర్లమే అయి ఉంటే, తన మీద కేసులు ఎలా విచారణకు రాకుండా అడ్డుకోవాలో, ఆపుకోవాలో చంద్రబాబు ఎన్నో ఏళ్ళుగా ప్రదర్శిస్తున్న విద్యల్ని మేం ప్రదర్శించి ఉండేవాళ్ళం కదా? మేం ఏనాడూ అలా నీచ స్థాయికి దిగజారలేదే! ఎమ్మార్ కేసులో చంద్రబాబును సీబీఐ కనీసం ప్రశ్నించటానికి కూడా పిలవకుండా మేనేజ్ చేసుకున్నట్టుగానే మేం కూడా మేనేజ్ చేసుకుని ఉండేవాళ్ళం కదా? అలాంటి అలవాట్లే ఉంటే, కేసే లేకుండా... సీబీఐ దర్యాప్తే లేకుండా... అరెస్టే లేకుండా... ఇలా అన్నింటినీ మీకు మాదిరిగానే మేం కూడా మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? వీటన్నింటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు దూరంగా ఉండబట్టే... ఆయన నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే జన నేత కాబట్టే... ఎన్నాళ్ళు బతికాం అన్నది కాకుండా ఎలా బతికాం అన్నది మాత్రమే ముఖ్యం అనే భావజాలం ఉన్న నాయకుడు కాబట్టే టీడీపీ మాదిరిగా ఆయన ఎవరితోనూ కుమ్మక్కు కాలేదు. 

ఏ వ్యవస్థల్నీ మేనేజ్ చేయలేదు. ప్రజల గుండెల్లో ఉండటం ప్రధానం అనుకున్నారు కాబట్టే, జైళ్ళలో ఉన్నా లక్ష్య పెట్టకుండా పోరాటాలు చేస్తున్నారు. 

వీటన్నింటికీ మించి, మా పార్టీ తరఫున స్పష్టమైన విజ్ఞప్తి చేశాం-ఎవరిది కుమ్మక్కు రాజకీయమో తేల్చుకుందామని. సంఖ్యాపరంగా ప్రధాన ప్రతిపక్షం అనిపించుకుంటున్న టీడీపీ పార్టీ ఈ సవాలును స్వీకరిస్తే, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సవాలు విసిరాం. 

టీడీపీకి ఇంకా ఏ కొంచెమైనా చిత్తశుద్ధి మిగిలి ఉంటే మా సవాలును స్వీకరించాలి. మా పార్టీ నాయకుడిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినా, ప్రజలు ఎవరిని నమ్ముతున్నారన్నది మొన్నటి ఉప ఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. ఆ రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఒక్కటిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు శాతం ఓట్లు ఎక్కువగా దక్కాయి. అలాంటప్పుడు మాకేం ఖర్మ, అంపశయ్య మీద ఉన్న రాజకీయ పార్టీలతో కుమ్మక్కు కావటానికి? అదీగాక, ఈ క్షణంలో ఎన్నికలు పెట్టినా, 2014లో ఎన్నికలు జరిగినా... ఇప్పటికే మృతప్రాయంగా మారిన ఈ రెండు పార్టీలకు మరెంతటి పరాభవం ఎదురుకాబోతోందో అందరికీ తెలుసు. అలాంటప్పుడు కుమ్మక్కు కావాల్సిన అవసరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? లేక టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉందా అన్నది సుస్పష్టం.

మన ప్రాజెక్టులు ఖాళీయే!

* ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడమే కారణం
* కృష్ణా, గోదావరి బేసిన్‌లోకి రాని వరద నీరు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నా ప్రాజెక్టుల్లోకి నీరు రావడం లేదు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇటు కృష్ణా బేసిన్ , అటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడం లేదు. మన ప్రాజెక్టుల్లోకి వరద నీరు రావాలంటే మహారాష్ర్ట, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షాలు లేవు. గత ఏడాది ఈ సమయంలో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం నుంచి 1.55 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం మన రాష్ట్రంలోకి వచ్చింది. 

ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ వంటి ప్రాజెక్టులు నిండాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎగువ, దిగువ ప్రాజెక్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటికి శ్రీశైలంలోకి ఎలాంటి వరద రావడం లేదు. సాగర్‌లోకి మాత్రం 2 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గోదావరి దిగువ ధవళేశ్వరం ప్రాంతంలో 12 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి అనుసరించిన వైఖరి సరైనదే

రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి అనుసరించిన వైఖరి సరైనదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చెప్పారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అర్ధం చేసుకుంటారనిన్నారు. జగన్ బెయిల్‌తో ప్రణబ్ ఓటుకు ముడిపెట్టడం తగదని ఆమె తెలిపారు. ఆ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మానసిక పరిస్థితి సరిగాలేదని తెలుస్తోందనిన్నారు. చట్టం, రాజ్యాంగం, న్యాయస్థానాల పట్ల లెక్కలేని తనాన్ని వెల్లడిస్తోందని శోభా తెలిపారు. సీబీఐ, కాంగ్రెస్ మీద మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీబీఐతో కాంగ్రెస్సే కాదు టీడీపీ కూడా కుట్రకు పాల్పడిందని చెప్పారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని శోభానాగిరెడ్డి చెప్పారు.

వైఎస్ఆర్ సీపీ ప్రొటోకాల్ కమిటీ

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రొటోకాల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా శోభానాగి రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాంలను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ నియమించారు. పార్టీ అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షురాలి పర్యటనల కోసం ఆ ప్రాంత నాయకులతో సమన్వయం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు

టీఆర్‌ఎస్‌కు కలిగే బాధేమిటి?: బాజిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల ధర్నాలో పాల్గొంటే టీఆర్‌ఎస్‌కు కలిగే బాధేమిటో అర్ధం కావడం లేదని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా చేనేత కార్మికుల కోసం విజయమ్మ పోరాడటంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే చేనేత కార్మికుల సంక్షేమం మీద టీఆర్‌ఎస్‌కు ఉన్న చిత్తశుద్దేమిటో అర్దమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజా పోరాటాలను రాజకీయాల కోసం బలిచేయవద్దని బాజిరెడ్డి టీఆర్‌ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

చేనేత దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఖమ్మం: చేనేత కార్మికుల సమస్యలపై ఈ నెల 23న సిరిసిల్లలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేపట్టనున్న దీక్ష పోస్టర్‌ను ఖమ్మం జిల్లా నాయకులు శనివారం ఆవిష్కరించారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొబ్బిలి భరత్‌ చంద్ర, కరీంనగర్ పట్టణ యువజన కన్వీనర్‌ కిషోర్‌ బాబు, లీగల్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌ పాపారావు, తదితర పార్టీ నాయకులు దీక్ష పోస్టర్‌ను విడుదల చేశారు. చేనేత ధర్నాపై టీఆర్ఎస్‌ చేస్తున్న రాజకీయాలను పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.

Friday, 20 July 2012

తెలుగుదేశంను మేమే సస్పెండ్ చేశాం

2009లో ఎన్నికైంది 92 మందిఆరుగురు రాజీనామా..
అయిదుగురి సస్పెన్షన్ ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం 81

హైదరాబాద్, న్యూస్‌లైన్: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న నలుగురు శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం అందుబాటులో ఉన్న నేతలు దాడి వీరభద్రరరావు, వీవీవీ చౌదరి తదితరులతో సమావేశమై నలుగురిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. రాష్ర్టపతి పదవికి జరిగే ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి (కర్నూలు జిల్లా మంత్రాలయం), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా పరిగి), డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి (ఆదిలాబాద్ జిల్లా ముథోల్), చిన్నం రామకోటయ్య (కృష్ణా జిల్లా నూజివీడు) శుక్రవారం రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలని పార్టీ భావించింది. అయితే ఎప్పటినుంచో పార్టీకి దూరంగా ఉంటున్న వీరికి నోటీసులు ఇవ్వటం, ఆ తరువాత సస్పెండ్ చేయటం వంటి చర్యలవల్ల అనవసరంగా ప్రాధాన్యతనిచ్చినట్లు అవుతుందని మొదట భావించారు. 

అలాగని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్య తీసుకోకపోతే మిగిలిన వారు కూడా ఇదే తీరుగా వ్యవహరించటంతోపాటు, అధినేతకు పట్టులేదని ప్రజలకు, ముఖ్యంగా క్యాడర్‌కు త ప్పుడు సంకేతాలు వెళతాయనే భయంతో నలుగురినీ సస్పెండ్ చేయాలని హడావుడిగా నిర్ణయించారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎమ్మెల్యేలుగా ఎంపికకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 81కి చేరింది. గతంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జోగు రామన్న, గంపా గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, నాగం జనార్దన్‌రెడ్డి పార్టీని వీడి, మళ్లీ పోటీచేసి గెలుపొందారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఓటు హక్కును కాదనే అధికారం బాబుకు లేదు: బాలనాగిరెడ్డి
ఎన్నికల్లో ఓటు వేయటమనేది పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని కాదనే అధికారం చంద్రబాబుకు లేదు. పార్టీ నుంచి నన్ను వారు సస్పెండ్ చేసేదేమిటి? మూడేళ్లుగా నేనే పార్టీకి దూరంగా ఉంటున్నాను. ఎన్‌టీఆర్ కుటుంబసభ్యులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేసినపుడు స్పందించకుండా రాష్ర్టపతి ఎన్నికల్లో ఓటు వేసినందుకు సస్పెండ్ చేయటం బాధాకరం. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాలాంటివారికి దేశ అత్యున్నత పదవికి జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలనే ఆశ ఉంటుంది. వద్దని చెప్పటం ఎంతవరకు సమంజసం? పార్టీ వైఖరి సరికాదనే భావనతో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి భవిష్యత్ లేదు. అధినేత వ్యవహారశైలి ఛండాలంగా ఉంది. 

ఊహించని పరిణామం: చిన్నం
పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఊహించని పరిణామం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటం అనేది శాసనసభ్యుడిగా నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. సస్పెన్షన్ ఉత్తర్వులు అందిన తరువాత పూర్తిస్థాయిలో స్పందిస్తా. 

పార్టీని మేమే సస్పెండ్ చేశాం: కొప్పుల 
తెలుగుదేశంను మేమే సస్పెండ్ చేశాం. మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం పార్టీకి లేదు. ఏడాదిన్నర క్రితమే పార్టీకి 
రాజీనామా చేశాం. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి తెలంగాణ తెలుగుదేశం ఫోరం బయట పడాలి. 

అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే: వేణుగోపాలచారి
పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారు. తెలంగాణ కోసం ఐక్యతా దీక్ష చేపట్టిన రోజునే మేం పార్టీకి రాజీనామా చేశాం. అపుడు స్పందించని పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశామనే కారణంతో సస్పెండ్ చేయటం సరికాదు. ఓటు వేయాలా లేదా అనేది మా విచక్షణాధికారం... ఓటింగ్‌లో పాల్గొనమని అందరికీ చెప్పిన పార్టీనే ఓటు వేయకూడదని నిర్ణయం తీసుకోవటం సరికాదు.

అంతర్జాతీయ పశుపరిశోధన కేంద్రంపై సీఎంకు వైఎస్ విజయమ్మ లేఖ


రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తలపెట్టిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రాన్ని(ఐజీకార్ల్) రాష్ట్రప్రభుత్వం విస్మరిస్తోందని... వెంటనే దాని వినియోగానికి చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి శుక్రవారం నాలుగు పేజీల లేఖ రాశారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ ఆమెరికా దేశాల రైతాంగానికి అవసరమైన మేలు జాతి పశువులను అందించేందుకు పులివెందులలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వైఎస్ శ్రీకారం చుట్టిన సంగతిని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2007-08 నుంచి 2009-10 ఆర్థిక సంవత్సరాలకు గాను ఈ ప్రాజెక్టు స్థాపన, నిర్వహణ కోసం రూ.386 కోట్ల నిధులను మంజూరు చేసి ప్రధాన నిర్మాణాలను పూర్తి చేయగా 2009 జనవరి 25వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభోత్సవం చేశారన్నారు. 

ఆ తర్వాత పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పరిశోధన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయని, అయితే, గత రెండేళ్ళుగా ప్రభుత్వ నిరాసక్తత కారణంగా మంజూరైన రూ.వంద కోట్ల నిధులు కూడా వెనక్కు వెళ్ళినట్లు చెప్పారు. పరిశోధనలు కూడా నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి, కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వహణాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వైఎస్‌ఆర్ కలగన్న అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజయమ్మ లేఖలో కోరారు.

సిరిసిల్లలో నేతన్నల ఉపాధి కోసం కేటాయించిన భూమిని మింగేసిన అధికారపార్టీ నేతలు

టెక్స్‌టైల్ పార్కులోని స్థలంపై కాంగ్రెస్ నాయకుల కన్ను
చక్రం తిప్పిన జిల్లా మంత్రి!

స్థలం పొందిన కాంగ్రెస్ కార్యకర్తలు వీరే...
1. నాగుల సత్యనారాయణ - 2.55 ఎకరాలు (ఈయన స్థానిక కాంగ్రెస్ కార్యకర్త. మంత్రి అనుచరుడు.)
2. కల్యాడపు కిరణ్ - 1.37 ఎకరాలు (ఈయన కాంగ్రెస్ కార్యకర్త కల్యాడపు సుభాష్ కొడుకు. సుభాష్ డీఎల్‌సీ సభ్యుడు కూడా)
3. ఎల్లా హేమలత -1.05 ఎకరాలు (ఈమె కాంగ్రెస్ కౌన్సిలర్ ఎల్లా లక్ష్మీనారాయణ భార్య)
4. ఎల్లా దేవదాసు - 1.05 ఎకరాలు (ఎల్లా లక్ష్మీనారాయణ సంబంధీకులు)

హైదరాబాద్, న్యూస్‌లైన్: సిరిసిల్ల నేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించేందుకు వీలుగా టెక్స్‌టైల్ పార్కులో కామన్ ఫెసిలిటీ కేంద్రం (సీఎఫ్‌సీ) ఏర్పాటుకు కేటాయించిన భూమిపై అధికార పార్టీ నేతలు వాలిపోయారు. నేతన్నల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన స్థలాన్ని కార్యకర్తలకు పంచేశారు. ఈ అడ్డగోలు బాగోతంలో జిల్లా మంత్రి చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి అతి విలువైన స్థలాన్ని కార్యకర్తలకు దక్కేలా చేశారు. అనుకున్నదే తడవుగా సీఎఫ్‌సీలో యూనిట్ల ఏర్పాటుకు స్థలం కేటాయించాలంటూ కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడం.. అనంతరం వారికి స్థలం దక్కడం చకచకా జరిగిపోయింది. ఈ నెల 4న జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) సమావేశంలో సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు భూమిని కేటాయిస్తూ నిర్ణయం జరిగింది. భూములు పొందిన వారిలో కాంగ్రెస్ కౌన్సిలర్ భార్యతో పాటు వుంత్రి అనుచరులు, కార్యకర్తలు ఉండటం గమనార్హం. దీంతో సీఎఫ్‌సీలో రంగుల అద్దకం, ప్రాసెసింగ్, టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు కేటాయించిన స్థలం కాస్తా కాంగ్రెస్ కార్యకర్తల పరమైంది. ఫలితంగా సిరిసిల్లలో నేతన్నల కష్టాలు మళ్లీ మొదటికొచ్చినట్టయింది!

ఇదీ వైఎస్ విజన్..

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వరుసగా జరుగుతున్న కార్మికుల ఆత్మహత్యలు నివారించాలన్న లక్ష్యంతో నాడు వైఎస్ నష్టపరిహారం, బ్యాంకు రుణాలతో పాటు ఏడాదంతా ఉపాధి దొరికేందుకు వీలుగా ప్రత్యేక కార్యచరణ ప్రకటించారు. ఇందుకు ప్రత్యేకంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌ఎఫ్‌ఎస్) సంస్థతో అధ్యయనం చేయించారు. ఈ సంస్థ అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులో ప్రధానంగా... సిరిసిల్ల కార్మికులు తయారుచేసే వస్త్రాలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేవని నివేదిక తేల్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు టెక్స్‌టైల్ పార్కులో సీఎఫ్‌సీ ఏర్పాటు చేయాలని నివేదిక పేర్కొంది. ఇందుకు వైఎస్ వెంటనే స్పందించారు. సీఎఫ్‌సీ ఏర్పాటుకు టెక్స్‌టైల్ పార్కులో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఆయన మరణానంతరం సీఎఫ్‌సీ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా అధికార పార్టీ నేతలు ఈ స్థలంపై కన్నేశారు. ఈ స్థలం సీఎఫ్‌సీ కోసం కేటాయించారని అధికారులు మొత్తుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో.. ఇప్పటికే పార్కులో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 200కి పైగా ప్రతిపాదనలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ కార్యకర్తలకు స్థలం కేటాయించారు.

సీఎఫ్‌సీతో కార్మికులకు ఉపయోగం ఇదీ..
సిరిసిల్ల నేత కార్మికులు ఒకే తరహా వస్త్రాలను తయూరుచేస్తారు. ఫలితంగా మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నల బాధలను తీర్చేందుకు సీఎఫ్‌సీ ఏర్పాటును వైఎస్ సంకల్పించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అయ్యే వ్యయం రూ.16.80 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు గ్రాంటు కింద ఇస్తుంది. మరో రూ.2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుందని వైఎస్ హామీనిచ్చారు. మిగిలిన రూ.4.80 కోట్లను పార్కులో యూనిట్లు ఏర్పాటు చేసే యాజమాన్యాలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కేంద్రంలో ప్రాసెసింగ్, రంగుల అద్దకం, కాటన్ సైజింగ్ బీంలు, యార్న్ ట్విస్టింగ్, టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. తక్కువ ధరకే ఈ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా పార్కులో తయారైన వస్త్రాలను ప్రాసెసింగ్ చేసి, రంగులు అద్ది.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారుచేసే వీలు ఏర్పడుతుంది. దీంతో మార్కెట్లో వస్త్రాలకు డిమాండ్ కూడా ఉంటుంది. ఏడాది మొత్తం కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!