YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 20 July 2012

సోమా సంస్థకే పోలవరం!

రెండో స్థానంలో ‘సూ’
సాంకేతిక అర్హత సాధించలేకపోయిన నాలుగు సంస్థలు

హైదరాబాద్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ టెండర్లను సోమా - సీజీజీసీ కన్సార్షియం దక్కించుకుంది. గతంలో ఈ టెండర్ల కోసం పోటీపడి మొదటి స్థానంలో నిలిచిన సూ సంస్థ ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది. ఈ టెండర్‌లో మొత్తం ఆరు సంస్థలు పోటీ పడగా నాలుగు సాంకేతిక అర్హతను సాధించలేదు. మిగిలిన రెండు సంస్థల ఫైనాన్షియల్ బిడ్‌లను అధికారులు శుక్రవారం తెరిచారు. ఇందులో మైనస్ 2.48 శాతానికే కోట్ చేసిన సోమా కన్సార్షియం ఎల్-1గా నిలిచింది. మైనస్ 1.33 శాతాన్ని కోట్ చేసిన సూ - పటేల్ కన్సార్షియం ఎల్-2గా నిలిచింది. ఎల్-1గా ఉన్న సోమ సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో త్వరలో జరిగే హై పవర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

పోలవరం రాక్‌ఫిల్ డ్యాం, స్పిల్‌వే నిర్మాణానికి రూ.4,717 కోట్ల అంచనా వ్యయంతో మే 16న టెండర్లు పిలిచారు. ఈనెల 5న సాంకేతిక బిడ్‌ను తెరిచారు. ఇందులో గామన్ ఇండియా - చిర్కే గెస్ట్రాయ్ - ఏఎమ్మార్, మధుకాన్ - సినో హైడ్రో కార్పొరేషన్, ఐవీఆర్‌సీఎల్ - ఫరబ్ ఇన్‌ఫ్రా, సూ - పటేల్, సోమ - సీజీజీసీ, ట్రాన్స్‌ట్రాయ్ - జేఎస్‌సీ కన్సార్షియంలు పొల్గొన్నాయి. వీటిలో సోమ, సూ కన్సార్షియంలే సాంకేతికంగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు సంస్థలు అనర్హతకు గురయ్యాయి. దాంతో సూ, సోమ సంస్థలకు చెందిన ఫైనాన్షియల్ బిడ్‌లను మాత్రమే శుక్రవారం తెరిచారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.4,599.99 కోట్లతోనే (-2.48%) పూర్తి చేయడానికి సోమ సంస్థ ముందుకు వచ్చింది. సూ సంస్థ మాత్రం రూ.4653.99 కోట్లతో (-1.33%) చేయడానికి సిద్ధపడింది. ఈ రెండు సంస్థల ప్రతిపాదనల మధ్య వ్యత్యాసం రూ.54 కోట్లు ఉంది. ఎల్-1గా నిలిచిన సోమ సంస్థకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని శుక్రవారం జరిగిన ఇంజనీర్-ఇన్-చీఫ్ కమిటీ సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని హై పవర్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

ఖజానాపై రూ.477 కోట్ల భారం!: తాజా టెండర్ కారణంగా ప్రభుత్వం ఖజానాపై అదనంగా రూ.477 కోట్ల భారం పడనుంది. గత ఏడాది ఇదే అంచనా వ్యయం (రూ.4,717కోట్లు)తో పిలిచిన టెండర్లలో రూ.4,122 కోట్లకే (-12.61%) ప్రాజెక్టును నిర్మించడానికి సూ సంస్థ ముందుకు వచ్చింది. అంటే అప్పటి టెండర్‌తో పోలిస్తే ప్రస్తుతం ఎల్-1గా నిలిచిన సోమ సంస్థ రూ.477 కోట్లకు అదనంగా టెండర్‌ను దాఖలు చేసింది. గతంలో రెండో స్థానంలో నిలిచిన సోమ సంస్థ ఈసారి కోట్ చేసిన దానికంటే తక్కువకే.. మైనస్ 12.08 శాతానికి ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చింది. అయితే.. సోమ, సూ సంస్థల మధ్య వివాదం కారణంగా ఆ టెండర్లు రద్దయ్యాయి. దీంతో మళ్లీ మే నెలలో ప్రభుత్వం తాజాగా టెండర్లు పిలిచింది. అయితే, ఇప్పుడు ఈ రెండు సంస్థలూ గతసారి అవి కోట్ చేసిన ధరకంటే దాదాపు 10 శాతం ఎక్కువకు కోట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో వేచి చూడాలి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!