YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 21 July 2012

రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మానసిక స్థితి సరిగాలేదని సూచిస్తున్నాయి

టీడీపీ విమర్శలపై వైఎస్సార్ సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి ధ్వజం 
‘జగన్‌కు బెయిల్ ఖరీదు.. ప్రణబ్‌కు ఓటు’ అనటం.. చట్టం, రాజ్యాంగం, న్యాయస్థానాలపై లెక్కలేని తనమే
అత్యున్నత రాజ్యాంగ పీఠానికి జరుగుతున్న ఎన్నికలను కూడా పచ్చకామెర్ల దృష్టితో చూస్తున్నారు 
సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు కూడా ప్రణబ్‌ముఖర్జీకి ఓటు వేశాయి కదా? 
మీలా మేనేజ్ చేసుకోవాలనుకుంటే అసలు కేసులు, దర్యాప్తు, అరెస్టులే లేకుండా చేసుకునే వాళ్లం కదా? 
ఎవరు కుమ్మక్కయ్యారో తేల్చుకుందాం... అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతారా?

రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని ప్రజా స్వామ్యవాదులు ఎవరైనా అర్థం చేసుకుంటారు. టీడీపీలోని భూకబ్జాల ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మానసిక స్థితి సరిగాలేదని సూచిస్తున్నాయి. ‘‘జగన్ బెయిలు ఖరీదు ప్రణబ్ ముఖర్జీకి ఓటు’’గా మారిందంటూ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించటం ఆ పార్టీకి చట్టం, రాజ్యాంగం, న్యాయస్థానాల పట్ల లెక్కలేనితనాన్ని వెల్లడిస్తున్నాయి. 

సీబీఐ మీదగానీ, కాంగ్రెస్ మీదగానీ, టీడీపీ మీదగానీ మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పూలేదు. మేం ఇంతకు ముందు చెప్పినట్టుగానే సీబీఐని కాంగ్రెస్ ఆడిస్తోందన్న మాటకే కట్టుబడి ఉన్నాం. టీడీపీ-సీబీఐల మధ్య కూడా అవినా భావ సంబంధాలున్నాయని మరోసారి స్పష్టం చేస్తున్నాం. కుమ్మక్కు రాజ కీయాలు, కుట్రలు, వెన్నుపోట్లు వంటివి టీడీపీ పేటెంట్లు. 
కాంగ్రెస్‌తో ఈ రాష్ట్రంలో ఎవరు కలిసిపోయారో చెప్పడానికి ఒకటి కాదు... రెండుకాదు, అనేక ఉదాహరణలున్నాయి. రైట్ టూ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకంలో కుమ్మక్కు అయింది ఎవరు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే విషయం నుంచి ఓట్ల ట్రాన్స్‌ఫర్ వరకు కలిసి చేయిం చుకున్నది ఎవరు? కలసికట్టుగా జగన్‌మోహన్‌రెడ్డి మీద కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది ఎవరు? ఉప ఎన్నికల్లో అల్లుకుపోయింది ఎవరు? వీటన్నింటికీ రాష్ట్ర ప్రజలంతా ఒకే సమాధానం చెబుతారు... టీడీపీ, కాంగ్రెస్ అని! 

అలాగే, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ నాయకుడు జి.ఎన్.నాయుడుకు హైదరాబాద్ అమీర్ పేటలోని అత్యంత ఖరీదైన భూములను పంచిపెట్టటానికి పాలూనీళ్లలా కలిసి పోయింది కూడా ఈ రెండు పార్టీలే. కుమ్మక్కు అంటే ఇదిగాక ఇంకేమిటి? అదీగాకపోయినా ఎవరి చరిత్ర ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆరోపణలు చేసినంత మాత్రాన టీడీపీ ఒంటినిండా ఉన్న బురద గంధంగా మారిపోదు.
అలాగే, సీబీఐతో టీడీపీ, కాంగ్రెస్ సంయుక్తంగా కుమ్మక్కు అయ్యాయన్నది కూడా ముమ్మాటికీ నిజం. 

లేని పక్షంలో ఎకరా నాలుగు కోట్లు విలువ చేసే భూముల్ని ఎమ్మార్ సంస్థకు కట్టబెట్టడమేమిటని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడును సీబీఐ ఎందుకు ప్రశ్నించటం లేదు? అదీగాక, చంద్రబాబుకు సంబంధం లేదని సీబీఐ వెనువెం టనే క్లీన్‌చిట్ ఇచ్చి ఆయనకు లేని పరువూ ప్రతిష్టల్ని కాపాడే బాధ్యత తన భుజస్కంధాల మీద ఎందుకు వేసుకున్నట్టు? అదే సీబీఐ, చంద్రబాబు నాయుడు తనయుడైన లోకేశ్‌కు సత్యం రామలింగరాజు ఫీజు కట్టారన్న విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నట్టు? ఆ కేసులో కూడా చంద్రబాబు మీద విచారణే లేదు... ఎందుకని? ఇవి చాలవా... సీబీఐ, టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యారనటానికి?
ఈ రోజు పత్రికలనే చూడండి. అందులో ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని చూడండి. బెయిల్‌కు వంద కోట్లు! అంటూ ఈ రెండు పత్రికలూ ఒకే లైన్‌లో కథనాన్ని ప్రచురించాయి. ఎవరో చెప్పిన మాటను పత్రికలు ప్రచురించరాదని, పార్టీగా మేం భావించటం లేదు. కాకపోతే, కిందిస్థాయి కోర్టులో బెయిల్‌కు రూ.100 కోట్లు ఇస్తామని ఎవరైనా అనే అవకాశం ఉందా? అన్న ఆలోచన పత్రికా ప్రమాణాల రీత్యా అయినా ఉండదా అన్నదే మా ప్రశ్న. 

ఇలాంటి చెత్త కథనాలను ఏరుకుని ఎల్లో మీడియా పత్రికలు టీడీపీకి అనుకూలంగా రోజూ గంగవైలెత్తుతుంటే... మరోవంక, టీడీపీ ఏకంగా బెయిలును ‘ఖరీదు’ కట్టారంటూ రేవంత్‌రెడ్డితోనో, మరొకరితోనో మాట్లాడిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నదని తెలిసీ ఇలా ‘ఖరీదు’ అంటూ మాట తూలటం ఆ పార్టీ మానసిక స్థితితోపాటు, రాజకీయ స్థాయిని కూడా సూచిస్తోంది. మేం టీడీపీని అడుగుతున్నాం... మీ నాయకుడి మాదిరిగా మేనేజ్ చేసుకునే వ్యక్తులమే అయితే, హైకోర్టులో పిటిషన్ పడకముందే మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? ఆ తరవాత, ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు ముందే మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? అలాంటిదేమీ లేనప్పుడు, అలాంటి అలవాట్లు మా రక్తంలోనే లేనప్పుడు మీరు ఎన్ని విమర్శలు చేసినా ఏం లాభం? 

ప్రస్తుత లోక్‌సభలోనే కాకుండా, మొత్తంగా దేశ చరిత్రలోనే ప్రజాతీర్పులో అత్యధిక మెజారిటీ సంపాదించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రేపటి రోజున న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే అది తప్పు అవుతుందా? అసలు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? తప్పు చేశారన్న ఆధారాలతో కాదు. ఆయన ఒక ఎంపీ. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటూ అరెస్టు చేశారు. నిజానిజాలను బేరీజు వేసి, ఈ అరెస్టు సబబు కాదంటే, రేపు సుప్రీం కోర్టు జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు ఇస్తే దాన్ని మీ పార్టీ ‘ఖరీదు’గా భావిస్తుందా? ఆవిర్భవించి 30 ఏళ్లయినా మీ పార్టీకి ఏది అనొచ్చో, ఏది అనకూడదో అన్న జ్ఞానం కూడా లేదే!

ఇక ప్రణబ్ ముఖర్జీకి మా పార్టీ మద్దతు ఇవ్వటాన్ని మీరు తప్పు పడుతున్నారు. ఏదో ఆశించే ఆయనకు మేం మద్దతు ఇచ్చాం అంటున్నారు. చివరికి దేశంలో అత్యున్నత రాజ్యాంగ పీఠానికి పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలను కూడా మీ పసుపురంగు పార్టీ పచ్చకామెర్ల దృష్టితోనే చూస్తోంది. మీ వాదనే నిజం అనుకుంటే, మరి లోక్‌సత్తా, సీపీఎం లాంటి పార్టీలు ఏం ఆశించి ప్రణబ్‌కు ఓటు వేశాయి? మీరెందుకు వారిని విమర్శించలేకపోతున్నారు? మీ రాజకీయ అవసరాల దృష్ట్యా వారి విషయంలో మీరు నోరెత్తటం లేదు. అవునా? 
అదీగాక, దేశ రాష్ట్రపతి ఎన్నిక టీ-20 మ్యాచ్ లాంటిదా? గెలుపు ఎవరిదో నామినేషన్ల పర్వానికి ముందే తెలిసిపోయింది. కాబట్టే చంద్రబాబు నాయుడు ఓటు వేయకుండా వెనక్కు తగ్గారు. ‘తటస్థం’ అన్నది కేవలం ప్రజలను మభ్యపెట్టాలన్న కుట్రతో టీడీపీ పన్నిన పన్నాగంలో భాగం మాత్రమే. 

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారన్న వార్త వినగానే ఆయనను చంద్రబాబు సమర్థించిన మాట వాస్తవం కాదా? ఆయనకు మద్దతుగా నిలబడాలని కొన్ని పార్టీల నాయకులతో సాక్షాత్తు చంద్రబాబు చాటుమాటు మంతనాలు జరపడం నిజం కాదా? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకుండా ఎలా ఉంటామని చంద్రబాబు అనటం నిజం కాదా? సంగ్మాకు మద్దతు మతతత్వానికి మద్దతు అని చంద్రబాబు పేర్కొనటం నిజం కాదా? ఇవన్నీ నిజాలే అయినా అంతకు మించిన నిజం ఏమిటంటే... బాబు బుకాయించగలరు. ఒకప్పుడు ఓటు వినియోగించు కొనకపోవటం, తటస్థంగా ఉండటం తప్పు అన్న బాబు ఇప్పుడు కొత్త రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ నాయకులుగా మనమంతా ఎన్నికలు వచ్చేసరికి ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటాం. అలాంటిది, బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీలో ఉంటూ దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకునే ప్రక్రియలో వెనకడుగు వేయటం అంటే, భావి తరాలకు ఎలాంటి సందేశం పంపుతున్నట్టు? ఇలాంటి కనీస ఆలోచనలు కూడా టీడీపీ వారికి రావెందుకని?

న్యాయ వ్యవస్థకు సంబంధించి చెలగాటం ఆడటం టీడీపీకి బహుశా వెన్నతోపెట్టిన విద్య అయి ఉండవచ్చు. పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుందన్నట్టు, పచ్చ పార్టీ వారికి కూడా ఇలా కుమ్మక్కు కావటం, మేనేజ్ చేసుకోవటం వారి స్వభావ సిద్ధమైన గుణాలు అయినందున వాటిని మిగతా పార్టీలకు అంటగడుతున్నట్టుగా కనిపిస్తోంది. మాది మేనేజ్ చేసుకునే పార్టీ కాదు కాబట్టే న్యాయస్థానాల్లో పోరాటాన్ని కొనసాగిస్తోంది. అదీగాక, మేం ఈ ఎన్నికల్లో ఓటు వేయం అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఉంటే, ఇది రాజకీయాల్లో ఒక చెడ్డ సంప్రదాయం అని టీడీపీ విమర్శించి ఉండేది. సంగ్మాకు అనుకూలంగా ఓటు వేస్తే అది ముస్లింలకు వ్యతిరేక ఓటు అని యాగీ చేయటానికి తెగించేది. ప్రణబ్‌కు ఓటు వేయటాన్ని కుమ్మక్కుగా పేర్కొంటోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ‘మేనేజ్‌మెంట్’ అనే పదం మాత్రమే టీడీపీ వారి నోటి నుంచి వస్తుంది. 

మేం టీడీపీని సూటిగా ప్రశ్నిస్తున్నాం... మేం మీకు మాదిరిగా గొప్ప మేనేజర్లమే అయి ఉంటే, తన మీద కేసులు ఎలా విచారణకు రాకుండా అడ్డుకోవాలో, ఆపుకోవాలో చంద్రబాబు ఎన్నో ఏళ్ళుగా ప్రదర్శిస్తున్న విద్యల్ని మేం ప్రదర్శించి ఉండేవాళ్ళం కదా? మేం ఏనాడూ అలా నీచ స్థాయికి దిగజారలేదే! ఎమ్మార్ కేసులో చంద్రబాబును సీబీఐ కనీసం ప్రశ్నించటానికి కూడా పిలవకుండా మేనేజ్ చేసుకున్నట్టుగానే మేం కూడా మేనేజ్ చేసుకుని ఉండేవాళ్ళం కదా? అలాంటి అలవాట్లే ఉంటే, కేసే లేకుండా... సీబీఐ దర్యాప్తే లేకుండా... అరెస్టే లేకుండా... ఇలా అన్నింటినీ మీకు మాదిరిగానే మేం కూడా మేనేజ్ చేసి ఉండేవాళ్ళం కదా? వీటన్నింటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు దూరంగా ఉండబట్టే... ఆయన నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే జన నేత కాబట్టే... ఎన్నాళ్ళు బతికాం అన్నది కాకుండా ఎలా బతికాం అన్నది మాత్రమే ముఖ్యం అనే భావజాలం ఉన్న నాయకుడు కాబట్టే టీడీపీ మాదిరిగా ఆయన ఎవరితోనూ కుమ్మక్కు కాలేదు. 

ఏ వ్యవస్థల్నీ మేనేజ్ చేయలేదు. ప్రజల గుండెల్లో ఉండటం ప్రధానం అనుకున్నారు కాబట్టే, జైళ్ళలో ఉన్నా లక్ష్య పెట్టకుండా పోరాటాలు చేస్తున్నారు. 

వీటన్నింటికీ మించి, మా పార్టీ తరఫున స్పష్టమైన విజ్ఞప్తి చేశాం-ఎవరిది కుమ్మక్కు రాజకీయమో తేల్చుకుందామని. సంఖ్యాపరంగా ప్రధాన ప్రతిపక్షం అనిపించుకుంటున్న టీడీపీ పార్టీ ఈ సవాలును స్వీకరిస్తే, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సవాలు విసిరాం. 

టీడీపీకి ఇంకా ఏ కొంచెమైనా చిత్తశుద్ధి మిగిలి ఉంటే మా సవాలును స్వీకరించాలి. మా పార్టీ నాయకుడిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినా, ప్రజలు ఎవరిని నమ్ముతున్నారన్నది మొన్నటి ఉప ఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. ఆ రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఒక్కటిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు శాతం ఓట్లు ఎక్కువగా దక్కాయి. అలాంటప్పుడు మాకేం ఖర్మ, అంపశయ్య మీద ఉన్న రాజకీయ పార్టీలతో కుమ్మక్కు కావటానికి? అదీగాక, ఈ క్షణంలో ఎన్నికలు పెట్టినా, 2014లో ఎన్నికలు జరిగినా... ఇప్పటికే మృతప్రాయంగా మారిన ఈ రెండు పార్టీలకు మరెంతటి పరాభవం ఎదురుకాబోతోందో అందరికీ తెలుసు. అలాంటప్పుడు కుమ్మక్కు కావాల్సిన అవసరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? లేక టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉందా అన్నది సుస్పష్టం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!