YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 18 July 2012

రాష్ట్రంలో 69 శాతం ప్రాంతాల్లో ఇంకా వర్షాభావమే


కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తాజా వర్షాలు
రాష్ట్రంలో 69 శాతం ప్రాంతాల్లో ఇంకా వర్షాభావమే
ఇప్పటికీ అసలు వానలకే నోచని నేలలు 35 శాతం
సగటు కంటే ఇప్పటికే ఏకంగా 17 శాతం తగ్గిన సాగు
కరువు బాధించిన గతేడాది కన్నా 5 లక్షల ఎకరాలు తక్కువ!
సగానికి సగం తగ్గిపోయిన వరి, నూనెగింజల విస్తీర్ణం

హైదరాబాద్, న్యూస్‌లైన్:అసలే అరకొర వర్షాలు. తాజాగా కురిశాయనుకున్న పెద్ద వానలు కూడా అక్కడక్కడా మాత్రమే మురిపించి అంతటితో సరిపెట్టాయి. నైరుతీ రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర గడుస్తున్నా రాష్ట్రంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో వర్షాలే కురవలేదు. కృష్ణా, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం మినహా దాదాపుగా మిగతా రాష్ట్రమంతటా వర్షపాతం ఇప్పటికీ సగటు కంటే తక్కువే నమోదైంది. మొత్తంమీద రాష్ట్రంలో దాదాపుగా 69 శాతం ప్రాంతాలు ఇంకా మంచి వర్షానికే నోచుకోలేదు. పైగా వీటిలో ఏకంగా 35 శాతం చోట్ల ఇప్పటికీ వాన చినుకన్నదే పడలేదు! అదనులో విత్తనాలు, ఎరువులు అందించలేని సర్కారీ అలసత్వమూ దీనికి తోడైంది. ఫలితంగా రాష్ట్రంలో సాగు కుదేలైంది. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా సాగైన పంటల విస్తీర్ణం సగటు కంటే 17 శాతం మేరకు తగ్గిపోయింది. ఒక్క పత్తి తప్ప అన్నింటి సాగూ తగ్గుముఖం పట్టింది. ప్రధానమైన వరి, నూనెగింజల సాగైతే సగానికి సగం పడిపోయింది! పరిస్థితి గతేడాది తరహా కరువును తలపిస్తూ భయపెడుతోంది. వాస్తవానికి ప్రస్తుత ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాగైన పంట విస్తీర్ణం.. దుర్భర కరువు నెలకొన్న గతేడాది కంటే కూడా 5 లక్షల ఎకరాలు తగ్గిందని వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించిన తాజా నివేదికే తేల్చిచెప్పింది.

ఎల్‌నినో ప్రభావంతోనో, మారిన వాతావరణ పరిస్థితుల వల్లో గానీ.. రాష్ట్రంలో ఐదు రోజులగా వర్షాలు కురుస్తున్నా.. అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి.

కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో కుంభవృష్టితో వాగులు పొంగుతుంటే.. విశాఖపట్నం, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోనేమో అతి స్వల్ప వర్షాలతో అసలు సాగే సాగని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ ఆరంభం నుంచి రాష్ట్రంలో ఇప్పటిదాకా భారీ వర్షాలన్నవే లేవు. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్నవే పెద్ద వర్షాలని వాతవరణ శాఖ చెబుతోంది. అవి కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమవడం, కొన్నిచోట్ల ఇప్పటికీ వానల ఆనవాలైనా లేకపోవడం రైతన్నను ఆందోళన పరుస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,126 మండలాల పరిధిలో 1,186 వర్షపాత నమోదు కేంద్రాలున్నాయి. అవి గ్రామీణ ప్రాంతాల్లో మండలానికొకటి, పట్టణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఏకంగా 410 కేంద్రాల్లో జూన్ 1 నుంచి బుధవారం దాకా కూడా చుక్క వర్షమైనా పడలేదు. మరో 238 కేంద్రాల్లో కేవలం 0.1 నుంచి 2.5 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. ఇంకో 168 కేంద్రాల్లో పాక్షికంగా, అంటే 2 మి.మీ. దాకా కురిసింది. కేవలం 17 కేంద్రాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం, మరో 75 కేంద్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నా ఖరీఫ్ ఆరంభం నుంచి జూలై 18 దాకా 213 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా 194.6 మి.మీ.కే పరిమితమైంది. అంటే సాధారణం కంటే 9 శాతం తక్కువ. నిజానికి గత వారాంతానికి వర్షపాతంలో 17 శాతం తగ్గుదల నమోదైంది. ఐదు రోజులుగా కురుస్తున్న వానలతో పరిస్థితి కాస్త మెరుగైంది.

17 శాతం తగ్గిన సాగు..

రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలు. ఈ ఏడాది 2.2 కోట్ల ఎకరాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తోడు పెరిగిన పెట్టుబడి ఖర్చులు, ప్రభుత్వం అదనులో విత్తనాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో పంటల సాగు తక్కువగా ఉంది. జూలై 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల ఎకరాలు సాగవాల్సి ఉండగా ఇప్పటికి 76.7 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. పంటలపరంగా చూస్తే పత్తి సాగు ఈ ఏడాది కూడా బాగా పెరుగుతోంది. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 26.82 లక్షల ఎకరాల్లో పత్తి వేయాల్సి ఉండగా, 34.12 లక్షల ఎకరాల్లో వేశారు. వరి సాగుపై మాత్రం వర్షాభావం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికి 10 లక్షల ఎకరాల్లో వరి సాగవాల్సి ఉండగా, 5 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. వరితో పాటు మొక్కజొన్న, సజ్జ, జొన్న, రాగుల వంటి ఆహార ధాన్యాలన్నీ కలిపి ఇప్పటికి 12 లక్షల ఎకరాల్లో సాగవాల్సి ఉండగా, 10 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. నూనె గింజల పంటలు 23 లక్షల ఎకరాల్లో కావాల్సి ఉండగా ఇప్పటికి 12 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 10 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన పప్పుధాన్యాలు 7.5 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!