రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తలపెట్టిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రాన్ని(ఐజీకార్ల్) రాష్ట్రప్రభుత్వం విస్మరిస్తోందని... వెంటనే దాని వినియోగానికి చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి శుక్రవారం నాలుగు పేజీల లేఖ రాశారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ ఆమెరికా దేశాల రైతాంగానికి అవసరమైన మేలు జాతి పశువులను అందించేందుకు పులివెందులలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వైఎస్ శ్రీకారం చుట్టిన సంగతిని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2007-08 నుంచి 2009-10 ఆర్థిక సంవత్సరాలకు గాను ఈ ప్రాజెక్టు స్థాపన, నిర్వహణ కోసం రూ.386 కోట్ల నిధులను మంజూరు చేసి ప్రధాన నిర్మాణాలను పూర్తి చేయగా 2009 జనవరి 25వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభోత్సవం చేశారన్నారు.
ఆ తర్వాత పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పరిశోధన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయని, అయితే, గత రెండేళ్ళుగా ప్రభుత్వ నిరాసక్తత కారణంగా మంజూరైన రూ.వంద కోట్ల నిధులు కూడా వెనక్కు వెళ్ళినట్లు చెప్పారు. పరిశోధనలు కూడా నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి, కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వహణాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వైఎస్‌ఆర్ కలగన్న అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజయమ్మ లేఖలో కోరారు.
No comments:
Post a Comment