YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 20 July 2012

సిరిసిల్లలో నేతన్నల ఉపాధి కోసం కేటాయించిన భూమిని మింగేసిన అధికారపార్టీ నేతలు

టెక్స్‌టైల్ పార్కులోని స్థలంపై కాంగ్రెస్ నాయకుల కన్ను
చక్రం తిప్పిన జిల్లా మంత్రి!

స్థలం పొందిన కాంగ్రెస్ కార్యకర్తలు వీరే...
1. నాగుల సత్యనారాయణ - 2.55 ఎకరాలు (ఈయన స్థానిక కాంగ్రెస్ కార్యకర్త. మంత్రి అనుచరుడు.)
2. కల్యాడపు కిరణ్ - 1.37 ఎకరాలు (ఈయన కాంగ్రెస్ కార్యకర్త కల్యాడపు సుభాష్ కొడుకు. సుభాష్ డీఎల్‌సీ సభ్యుడు కూడా)
3. ఎల్లా హేమలత -1.05 ఎకరాలు (ఈమె కాంగ్రెస్ కౌన్సిలర్ ఎల్లా లక్ష్మీనారాయణ భార్య)
4. ఎల్లా దేవదాసు - 1.05 ఎకరాలు (ఎల్లా లక్ష్మీనారాయణ సంబంధీకులు)

హైదరాబాద్, న్యూస్‌లైన్: సిరిసిల్ల నేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించేందుకు వీలుగా టెక్స్‌టైల్ పార్కులో కామన్ ఫెసిలిటీ కేంద్రం (సీఎఫ్‌సీ) ఏర్పాటుకు కేటాయించిన భూమిపై అధికార పార్టీ నేతలు వాలిపోయారు. నేతన్నల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన స్థలాన్ని కార్యకర్తలకు పంచేశారు. ఈ అడ్డగోలు బాగోతంలో జిల్లా మంత్రి చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి అతి విలువైన స్థలాన్ని కార్యకర్తలకు దక్కేలా చేశారు. అనుకున్నదే తడవుగా సీఎఫ్‌సీలో యూనిట్ల ఏర్పాటుకు స్థలం కేటాయించాలంటూ కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడం.. అనంతరం వారికి స్థలం దక్కడం చకచకా జరిగిపోయింది. ఈ నెల 4న జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) సమావేశంలో సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు భూమిని కేటాయిస్తూ నిర్ణయం జరిగింది. భూములు పొందిన వారిలో కాంగ్రెస్ కౌన్సిలర్ భార్యతో పాటు వుంత్రి అనుచరులు, కార్యకర్తలు ఉండటం గమనార్హం. దీంతో సీఎఫ్‌సీలో రంగుల అద్దకం, ప్రాసెసింగ్, టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు కేటాయించిన స్థలం కాస్తా కాంగ్రెస్ కార్యకర్తల పరమైంది. ఫలితంగా సిరిసిల్లలో నేతన్నల కష్టాలు మళ్లీ మొదటికొచ్చినట్టయింది!

ఇదీ వైఎస్ విజన్..

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వరుసగా జరుగుతున్న కార్మికుల ఆత్మహత్యలు నివారించాలన్న లక్ష్యంతో నాడు వైఎస్ నష్టపరిహారం, బ్యాంకు రుణాలతో పాటు ఏడాదంతా ఉపాధి దొరికేందుకు వీలుగా ప్రత్యేక కార్యచరణ ప్రకటించారు. ఇందుకు ప్రత్యేకంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌ఎఫ్‌ఎస్) సంస్థతో అధ్యయనం చేయించారు. ఈ సంస్థ అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులో ప్రధానంగా... సిరిసిల్ల కార్మికులు తయారుచేసే వస్త్రాలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేవని నివేదిక తేల్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు టెక్స్‌టైల్ పార్కులో సీఎఫ్‌సీ ఏర్పాటు చేయాలని నివేదిక పేర్కొంది. ఇందుకు వైఎస్ వెంటనే స్పందించారు. సీఎఫ్‌సీ ఏర్పాటుకు టెక్స్‌టైల్ పార్కులో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఆయన మరణానంతరం సీఎఫ్‌సీ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా అధికార పార్టీ నేతలు ఈ స్థలంపై కన్నేశారు. ఈ స్థలం సీఎఫ్‌సీ కోసం కేటాయించారని అధికారులు మొత్తుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో.. ఇప్పటికే పార్కులో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 200కి పైగా ప్రతిపాదనలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ కార్యకర్తలకు స్థలం కేటాయించారు.

సీఎఫ్‌సీతో కార్మికులకు ఉపయోగం ఇదీ..
సిరిసిల్ల నేత కార్మికులు ఒకే తరహా వస్త్రాలను తయూరుచేస్తారు. ఫలితంగా మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నల బాధలను తీర్చేందుకు సీఎఫ్‌సీ ఏర్పాటును వైఎస్ సంకల్పించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అయ్యే వ్యయం రూ.16.80 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు గ్రాంటు కింద ఇస్తుంది. మరో రూ.2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుందని వైఎస్ హామీనిచ్చారు. మిగిలిన రూ.4.80 కోట్లను పార్కులో యూనిట్లు ఏర్పాటు చేసే యాజమాన్యాలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కేంద్రంలో ప్రాసెసింగ్, రంగుల అద్దకం, కాటన్ సైజింగ్ బీంలు, యార్న్ ట్విస్టింగ్, టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. తక్కువ ధరకే ఈ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా పార్కులో తయారైన వస్త్రాలను ప్రాసెసింగ్ చేసి, రంగులు అద్ది.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారుచేసే వీలు ఏర్పడుతుంది. దీంతో మార్కెట్లో వస్త్రాలకు డిమాండ్ కూడా ఉంటుంది. ఏడాది మొత్తం కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!