సమర్థ నాయకత్వం లేకే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం
కోతలతో పరిశ్రమలు, వ్యవసాయం కుదేలు
పరిశ్రమల్లో పనిచేసే 20 లక్షల కుటుంబాలు
రోడ్డునపడే దుస్థితి... సాగునీరు అందక పంటలు ఎండి రైతులు నష్టపోతున్నారు
పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి..
ఆసుపత్రుల్లో రోగులు విలవిల్లాడుతున్నారు
వైఎస్ హయాంలో విద్యుత్ సర్‌చార్జీలు,
గ్యాస్ భారాన్ని ప్రభుత్వమే భరించింది
విజయవాడ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కిరణ్ సర్కారుకు ముందుచూపు కొరవడడం వల్లే రాష్ట్రం చీకటిలో మగ్గిపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. విద్యుత్తు కోతలను నిరసిస్తూ విజయవాడ ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఎండను లెక్కచేయకుండా మధ్యాహ్నం వరకూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రం ఎన్నో సమస్యల్లో పడిందన్నారు. సమర్థ నాయకత్వం లేకపోవడం, ముందుచూపు లోపించడమే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమన్నారు.
విద్యుత్తు సరఫరా సక్రమంగా, తగినంతగా జరగకపోవడంతో రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా ఉండాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశపడ్డారని గుర్తుచేశారు. ప్రస్తుత పాలకుల వైఫల్యంతో రాష్ట్రం అన్ని రంగాల్లో కనీసం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని, ఈ ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
సాగునీటి కోసం రైతన్నల కష్టాలు: కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని విజయమ్మ అన్నారు. చిన్నతరహా వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారని, ఇంత జరుగుతున్నా ఈ పాలకులకు ఏమీ పట్టడంలేదని ఆమె విమర్శించారు. లోడ్ రిలీఫ్ పేరుతో ఎప్పుడు పడితే అప్పుడు కోతలు విధించడాన్ని ఆమె దుయ్యబట్టారు. రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్తును విజయవంతంగా అందించిన రాజశేఖరరెడ్డి 2009లో తిరిగి ఎన్నికయ్యాక.. తొమ్మిది గంటలు ఇచ్చేందుకు హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం రోజుకు మూడు గంటలు, అదీ రెండు మూడుసార్లుగా ఇస్తూ ఆయన హామీకి తూట్లు పొడిచిందని విమర్శించారు. దీనివల్ల సాగునీటి కోసం రైతులు నానా కష్టాలు పడుతున్నారని, పంటలు ఎండిపోయి నష్టపోతున్నారని తెలిపారు. సర్కారుపై నమ్మకం లేక ఎన్నడూ లేని విధంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో నిరుడు రైతులు సమ్మెకు దిగాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు.
ఆసుపత్రులకూ కరెంటు కోత: పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయని, పగలు పూర్తిగా.. రాత్రివేళ రెండు మూడు గంటల కన్నా ఎక్కువ సేపు విద్యుత్తు ఉండడంలేదని విజయమ్మ పేర్కొన్నారు. ఆస్పత్రులను కూడా కరెంట్ కోతల నుంచి మినహాయించకపోవడంతో ఐసీయూ, ల్యాబ్‌లు, ఇంక్యుబేటర్లు సరిగా పనిచేయక వృద్ధులు, సీరియస్‌గా ఉన్న రోగులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ట్రిపుల్ ఐటీలు పెట్టి ఏసీ గదుల్లో కంప్యూటర్ల విద్య అందించాలని రాజశేఖరరెడ్డి భావిస్తే.. ఇప్పుడు వీధి దీపాల కింద కూడా చదువుకునే పరిస్థితి లేకుండా పోతోందని ఆమె విమర్శించారు.
పరిశ్రమలకు శాపం: విద్యుత్తు కోత పరిశ్రమలకు శాపంగా మారిందని విజయమ్మ అన్నారు.
ఇప్పటికే వారానికి మూడు రోజులు పవర్‌హాలిడే ప్రకటించడంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కష్టాల్లో కూరుకుపోయాయన్నారు. ఫలితంగా 20 లక్షల మంది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని, మరోపక్క 20 లక్షల మంది జీవనోపాధి కోల్పోతున్న వాస్తవాన్ని మాత్రం ఆయన పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కోతల వల్ల కరెంట్ బిల్లుల రూపంలో ప్రభుత్వానికి రూ.600 కోట్ల నష్టం వస్తోందన్నారు. ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కిరణ్ సర్కార్‌కు పట్టడం లేదని ఆమె విమర్శించారు.
వైఎస్ లాంటి సీఎం మరొకరు లేరు: రైతు కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నదాతలను ఆదుకునేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేయడమేగాక, రూ.1,300 కోట్ల బకాయిలను మాఫీ చేశారని అన్నారు. రైతులు, పేదల కుటుంబాలు కూడా విద్యా పరంగా అభివృద్ధి చెందాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఆరోగ్యశ్రీ, 104, 108, మహిళలకు పావలా వడ్డీ ద్వారా అందరి సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించారని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైతుల కోసం ఇన్ని మేళ్లు చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరని గర్వంగా చెప్పారు. ఆయన పాలనలో ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదని, ఇది ఒక రికార్డు అని ఆమె సగర్వంగా ప్రకటించారు.
చంద్రబాబు ఐదుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు 1999 నుంచి 2002 వరకూ ఐదారుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పెద్ద భారం మోపారని విజయమ్మ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జిల్లాలకు వచ్చి మూడు రోజుల పాటు తిరుగుతున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవడం కాకుండా, సమస్యలపై నిలదీయాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. వైఎస్ హయాంలో వచ్చిన 26 జీవోలు తప్పంటూ ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు చేర్చడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. వైఎస్ పథకాల పేర్లు మార్చాలని ప్రయత్నిస్తున్నారని, ఏ పేరు ఉంటే ఏమవుతుందన్నారు. అమలు చేసే ఉద్దేశం ఉండాలని అన్నారు. నిత్యం జనం మధ్య ఉండే జగన్‌ను ఉప ఎన్నికల కోసం జైలులో ఉంచారని విజయమ్మ విమర్శించారు. ధర్మం, న్యాయం తమవైపు ఉన్నాయని, త్వరలోనే జగన్ బయటకు వస్తారని, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తారని ఆమె స్పష్టంచేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని, వైఎస్ సువర్ణయుగం మళ్లీ తెస్తారని విజయమ్మ విశ్వాసం వ్యక్తంచేశారు.
ఈ ధర్నాలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ ఉదయభాను, నగర ఎన్నికల పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, మేకా ప్రతాప అప్పారావు, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ తలశిల రఘురామ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాతినేని పద్మావతి, మాజీ మేయర్ తాడి శకుంతల తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన విజయవాడలో విజయమ్మను కలిశారు.
వైఎస్‌లా ఆలోచించరేం?
విద్యుత్తు సర్‌చార్జీల భారాన్ని, కేంద్రం పెంచిన గ్యాస్ ధరను కూడా ఆనాడు వైఎస్ ప్రభుత్వమే భరించిన విషయాన్ని విజయమ్మ వివరించారు. ఇప్పటి ప్రభుత్వం ఆ మహానేత చనిపోయిన రోజు నుంచి సర్‌చార్జీలను ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. 2009లో ఆరువేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ తెచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. విద్యుత్తు ఉత్పత్తి కోసం రిలయన్స్ గ్యాస్ కొనుగోలు చేస్తుంటే ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయని, దాంతో వైఎస్ విదేశాల నుంచి గ్యాస్ తెచ్చారని, ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని విజయమ్మ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నాశనం చేస్తున్నాయన్నారు.
No comments:
Post a Comment