YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 18 July 2012

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి, ఉప రాష్ర్టపతి ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ అభ్యర్థి హమీద్ అన్సారీకి మద్దతు


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి, ఉప రాష్ర్టపతి ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ అభ్యర్థి హమీద్ అన్సారీకి మద్దతునివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో జరిగిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మేకపాటి మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హుడైన వ్యక్తిగా ప్రణబ్‌ను భావించామని, అందుకే ఆయనకు మద్దతునిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా ప్రణబ్ వ్యవహరించగలరని అన్నారు.

ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే
విజయమ్మ సంతకంతో వెలువడిన పార్టీ విధాన ప్రకటనను మేకపాటి చదివి వినిపించారు. ‘ఇప్పుడు మన ముందున్న రాష్ర్టపతి ఎన్నిక దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకునే ప్రక్రియ. ఈ పరిస్థితుల్లో ఒక పార్టీగా మన ముందున్న ప్రత్యామ్నాయం.. ఓటు వేయడమా, వేయకపోవటమా అన్నది. బాధ్యతగల ఒక రాజకీయ పక్షంగా ఉంటూ ఏదైనా విషయంలో అవుననో కాదనో ఒక నిర్ణయం చెప్పాల్సిన పరిస్థితి వస్తే.. అలాంటి పరిస్థితుల్లో దాటవేసే ధోరణిని అవలంబించి ఏ నిర్ణయమూ తీసుకోలేని పార్టీగా మిగిలిపోవటం. అలాంటి ముద్ర వేయించుకోవటం పార్టీగా సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే, ఎప్పుడైనా ఒక ఎన్నిక వచ్చినప్పుడు ఒక పార్టీగా మనమే ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ఉంటాం. 

అలాంటిది మనమే ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఒక చెడ్డ ఉదాహరణగా మిగిలిపోవడం సరైనది కాదనే భావనతో ఓటు హక్కును వినియోగించుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాం. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటవుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పదవిని అలంకరించే వ్యక్తి రాజకీయ పార్టీలన్నింటి గౌరవాభిమానాలను పొందగలిగి ఉండాలి. ప్రభుత్వం-రాజకీయాలతో ముడిపడిన అనేకానేక కీలకాంశాలను సమర్థంగా దేశ ప్రయోజనాల దృష్టితో నిర్వహించగలిగి ఉండాలి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో లేని పార్టీలైన జనతాదళ్(యు), సమాజ్‌వాది, ఎంఐఎం, బిఎస్పీ, శివసేన, వామపక్షాల మాదిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రణబ్ ముఖర్జీ.. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించగలరని భావిస్తోంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 19వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్ ముఖర్జీకి పార్టీ మద్దతు ప్రకటించాలని నిర్ణయించాం. ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అన్సారీకి మా పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాం’ అని ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

రాజ్యాంగ అధినేతగా సరైన వ్యక్తి
రాజ్యాంగ అధినేతగా ప్రణబ్ రాష్ట్రపతి పదవికి సరైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని మేకపాటి చెప్పారు. కాంగ్రెస్‌తో ఒప్పందంలో భాగంగానే మద్దతునిస్తున్నారనడాన్ని ఆయన తోసిపుచ్చారు. రాష్ట్రపతి పదవిలో ఆయన రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని భావిస్తున్నామని చెప్పారు. 

జగన్ ఎప్పుడో చెప్పారు..
వైఎస్సార్ కాంగ్రెస్ భవిష్యత్తులో యూపీఏకు మద్దతునిస్తుందనడానికి ఈ నిర్ణయం ఒక సంకేతమా? అని ప్రశ్నించినపుడు గతంలోనే రాష్ట్రపతి ఎన్నికలకు చాలా ముందే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను మేకపాటి గుర్తుచేశారు. ‘మా పార్టీకి మంచి సంఖ్యలో ఎంపీ సీట్లు వస్తే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యూపీఏ భాగస్వామ్య పక్షాలైన మమతా బెనర్జీకిగానీ, శరద్ పవార్‌కుగానీ మద్దతునివ్వడానికి సిద్ధమే’ అని జగన్ పేర్కొన్నారన్నారు. విజయమ్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాతే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారనడాన్ని ఆయన ఖండిస్తూ దానికీ, దీనికీ సంబంధమే లేదన్నారు. ఎంపీ సబ్బం హరి ఢిల్లీలో ప్రణబ్‌ను కలిసి ఒప్పందం కుదిరాకే ఈ నిర్ణయం తీసుకున్నారనడాన్ని కూడా మేకపాటి తోసిపుచ్చారు. జగన్ వ్యవహారం కోర్టుల్లో ఉన్నపుడు రాష్ట్రపతి చేసేది ఏముంటుంది? అని ప్రశ్నించారు.

సంగ్మాపై మాకు అపార గౌరవం
సంగ్మా అంటే తమకు అపారమైన గౌరవం ఉందని, ప్రణబ్‌కు ఓటేయాలని నిర్ణయించింది ఆయన సుదీర్ఘ పరిపాలనానుభవాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమేనని మైసూరారెడ్డి చెప్పారు. ప్రణబ్‌ను తాము ఒక పార్టీ అభ్యర్థిగా చూడటం లేదని, అందరికీ సంబంధించిన వ్యక్తినని ఆయనే ప్రచారం సందర్భంగా విజ్ఞప్తి చేశారని మైసూరా అన్నారు. సీబీఐ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందంటూ గతంలో తాము చేసిన విమర్శలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్, జనక్ ప్రసాద్, ఎమ్మెల్యేలు జి.బాబూరావు, కె.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు విజయమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు సుచరిత, బి.గురునాథరెడ్డి, టి.బాలరాజు, జి.బాబూరావు, ధర్మాన కృష్ణదాస్, పి.రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, అమరనాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, సుజయ్ కృష్ణరంగారావు, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావు హాజరయ్యారు. 

ఎంపీ మేకపాటితో ‘టుది పాయింట్’ 
సాక్షి టీవీలో నేటి రాత్రి 8.30కి
వైఎస్సార్ మరణం తరువాత ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర కొనసాగుతుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ వచ్చేంత వరకూ ఆ బాధ్యతను విజయమ్మ చేపడతారని చెప్పారు.

జగన్ తొలుత సీఎం కావాలనుకున్న వారిలో ఉన్నారా? లేదా?
ముఖ్యమంత్రుల కుమారులంతా సీఎంలు అవుతారా? లేదా? 

ఇటువంటి సందేహాలన్నింటికీ రాజమోహన్‌రెడ్డి నిస్సంకోచంగా వెలిబుచ్చిన అభిప్రాయాల మాలిక ‘టుది పాయింట్’ కార్యక్రమం. ఈ ఇంటర్వ్యూ సాక్షి టీవీలో గురువారం రాత్రి 8.30కి ప్రసారమవుతుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!