YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 21 July 2012

రెక్కాడినా..డొక్కాడదు

వంద శాతం వరకూ పెరిగిన నూలు, రంగుల ధరలు 
పెరిగిన కరెంటు చార్జీలతో నేతన్నలపై మరింత భారం 
ముడిసరుకుల ధరలు పెరిగాయి.. వస్త్రాల ధర పెరగలేదు 
ఆప్కోకు రూ. 10 కోట్ల మేరకు బకాయిపడ్డ సర్కారు 
కార్మికులు నేసిన వస్త్రాలకు నిధులివ్వలేకపోతున్న ఆప్కో 
80 శాతానికి పైగా మూలనపడ్డ చేనేత, మర మగ్గాలు 
వలసలు, ఆత్మహత్యల దిశగా నేతన్నల పయనం
చేనేత సమస్యలపై రేపు సిరిసిల్లలో విజయమ్మ దీక్ష

నేతన్నలకు నూలుపోగే ఉరితాడుగా మారుతోంది. నూలు, రంగుల ధరలు భారీగా పెరిగిపోవటంతో పాటు.. కరెంటు బిల్లుల భారం కూడా వాటికి తోడయింది. అయితే.. నేసిన వస్త్రాల ధరలు మాత్రం ఇందుకు అనుగుణంగా పెరగలేదు. ఫలితంగా యజమానులు మగ్గాలను మూలకుపడేశారు. ప్రభుత్వ ఆధీనంలోని సహకార సంఘాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ సంఘాలకు ముడి సరుకులకు ఆప్కో సరఫరా చేయటం లేదు. దీంతో చేనేత కార్మికులకు పనిలేకుండా పోయింది. సరఫరా చేసిన వస్త్రాలకు ఆప్కో డబ్బులు చెల్లించటం లేదు. ఇదేమిటని అడిగితే.. వస్త్రాలను కొనుగోలు చేసిన ప్రభుత్వశాఖలు బకాయిపడి ఉన్నాయుని ఆప్కో చెప్తోంది. ఫలితంగా కార్మికులు పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. రేయింబవళ్లు కష్టపడినా పూటగడవకపోవటంతో కూలిరేట్లు పెంచాలని ఇటీవలే సిరిసిల్ల నేతకార్మికులు నిరవధికసమ్మెకు దిగారు. ఒక్క సిరిసిల్లే కాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నేత కార్మికులది ఇదే దుస్థితి.

హైదరాబాద్, న్యూస్‌లైన్: సిరిసిల్ల మృత్యుఘోషకు తల్లడిల్లిన దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రత్యేక ప్యాకేజీతో నేత కార్మికులను ఆదుకున్నారు. రుణమాఫీ సహా అనేక సహాయ కార్యక్రమాలు అమలు చేశారు. నేతన్నల దీనస్థితిని గుర్తించి సిరిసిల్ల ప్యాకేజీని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని భావించారు. బడ్జెట్‌లో నేత కార్మికులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. కానీ.. ఆయన మరణంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వైఎస్ ఇచ్చిన హామీలను పాలకులు తుంగలో తొక్కారు. ఆదుకోవటానికి బదులు భారాలు మోపుతుండటంతో నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. మళ్లీ ఆత్మహత్యల బాట పడుతున్నారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్ల కేంద్రంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఈ నెల 23న దీక్షకు సన్నద్ధమవుతున్నారు. 

పెరిగిన ముడి సరుకు ధరలు: చేనేత పనికి ఉపయోగించే ముడి సరుకు ధరలు ఒక్క ఏడాది కాలంలోనే భారీగా పెరిగాయి. గత ఏడాది 40వ నంబరు కాటన్ నూలు ధర 4.5 కేజీలకు రూ. 590 నుంచి రూ. వెయ్యికి, 60వ నెంబరువి రూ. 889 నుంచి రూ. 1,185కు, 80వ నెంబర్‌వి రూ. 1,200 నుంచి రూ. 1,680కి, 100 నెంబర్‌వి రూ. 1,700 నుంచి 2,100కు పెరిగాయి. రంగుల ధరలు కూడా ఇదే బాట పట్టాయి. కాస్టిక్ కెమికల్ కిలో ఏడాది కిందట రూ. 50 ఉంటే ఇప్పుడు రూ. 100కిపెరిగింది. బట్టి రంగులు కేజీ రూ. 1,800 నుంచి రూ. 2,200కు పెరిగింది. మొత్తం మీద సిల్క్ నూలు ధరలు 100 శాతం పెరగగా, రంగుల ధరలు 60 శాతం పెరిగాయి. అయితే, ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ ఆప్కోమాత్రం వస్త్రాల ధరలను పెంచటం లేదు. ఫలితంగా నేత పని కార్మికులకు గిట్టుబాటు కావటం లేదు.

మూలన పడ్డ మగ్గాలు: రాష్ట్రవ్యాప్తంగా పట్టు నూలుతో వస్త్రాలు చేసే మగ్గాలు రెండున్నర లక్షల మేరకు ఉన్నాయి. వీటి మీద ఆధారపడి 7, 8 లక్షల మంది చేనేత కార్మికులు జీవిస్తున్నారు. పట్టు వస్త్రాలు విపరీతంగా పెరగటంతో మగ్గాల యజమానులు పనులను నిలిపివేశారు. సుమారు 80 శాతం మగ్గాలు మూలకు పడ్డాయని ఒక అంచనా. వాస్తవానికి రాష్ట్రంలో వివిధ సహకార చేనేత సంఘాలకు అవసరమైన నూలును (యార్న్) ఆప్కో సరఫరా చేస్తుంది. ఈ యార్న్‌ను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) నుంచి ఆప్కో కొనుగోలు చేస్తుంది. 

ఎన్‌హెచ్‌డీసీ నుంచి కొనుగోలు చేసిన నూలుకు ఆప్కో రూ. 10 కోట్ల మేరకు బకాయి పడి ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవటంతో ఎన్‌హెచ్‌డీసీకి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆప్కో చెల్లించలేకపోయింది. ఫలితంగా కొత్తగా నూలు సరఫరాను ఎన్‌హెచ్‌డీసీ నిలిపివేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు అవసరమైన నూలును ఆప్కో సరఫరా చేయటం లేదు. మార్కెట్లో కూడా ముడిసరుకు ఎక్కువగా లభించటం లేదు. ఫలితంగా మగ్గాలు మూలనపడుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ మగ్గం యజమానులు కూడా పెరిగిన ధరలతో గిట్టుబాటు కాక మగ్గాలను మూలకుపడేశారు. దీంతో పాటు గత ఏడు నెలల నుంచి చేనేత కార్మికులకు ఆప్కో వేతనాలు చెల్లించటం లేదు. చేనేత కార్మికులు ఆకలితో అలమటించాల్సి వస్తోందని చేనేత ఐక్య వేదిక (డబ్ల్యూయూఎఫ్) కన్వీనర్ గడ్డం జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆప్కోకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

సబ్సిడీలు విడుదల చేయని సర్కారు: చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. 10 శాతం యూర్న్ సబ్సిడీతో పాటు పావలా వడ్డీకే రుణాలు అందించారు. పవర్‌లూంల విద్యుత్ చార్జీలు పెంచలేదు. విద్యుత్ బిల్లులో 50 శాతం సబ్సిడీ భరించారు. అయితే, ఈ పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయటం లేదు. ఇప్పటికే విద్యుత్ సబ్సిడీ మొత్తం 40 కోట్ల మేరకు గత మూడేళ్లుగా ప్రభుత్వం బకాయి పడి ఉంది. అదేవిధంగా యూర్న్ సబ్సిడీ కూడా దిక్కులేకుండా పోయింది. పావలా వడ్డీ బకాయిల పరిస్థితీ అంతే. దీంతో సబ్సిడీలు అందక కార్మికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రుణ మాఫీలకూ కొర్రీలు: నేతన్నలు, చేనేత సహకార సంఘాల రుణాలు మాఫీ చేస్తామంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ 2009-10 బడ్జెట్‌లో రూ. 312 కోట్లు కేటాయించారు. దీనిని కాస్తా విజిలెన్స్ కేసుల పేరుతో ఆ తర్వాతి ప్రభుత్వం రూ. 200 కోట్లకు తగ్గించింది. ఇందులోనూ కేవలం రూ. 150 కోట్లను మాత్రమే విడుదల చేశారు. మరో రూ. 21.25 కోట్ల వ్యక్తిగత రుణాలు ఇప్పటికీ మాఫీ కాలేదు. దీంతో రుణాలు కట్టాల్సిందేనంటూ బ్యాంకర్ల వేధింపులు పెరిగాయి. మరోవైపు బతుకు బండి లాగటం కోసం తీసుకున్న రుణాలు కట్టాల్సిందేనంటూ వడ్డీ వ్యాపారులు, మైక్రో సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఊరికి దూరంగా పారిపోతున్న వారు కొందరైతే.. ఏకంగా ఈ లోకాన్నే విడిచిపెట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు మరికొందరు. ముడిసరుకులను తక్కువ ధరకు చేయాలనే ఆలోచన ప్రభుత్వం నుంచి కరువైంది. ఉపాధి కోల్పోతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవటం లేదు.

సిరిసిల్లది అంతర్జాతీయ సిరి...

అగ్గిపెట్టెలో ఇమిడే చీరలతో సిరిసిల్ల చేనేత ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఇక్కడి నేతన్నలది. ఇక్కడ చేనేత మగ్గాలపై చీరలు, ధోవతులు నేసేవారు. 1968కి ముందు పూర్తిస్థాయిలో చేనేత మగ్గాలపైనే వస్త్రోత్పత్తి జరిగేది. సిరిసిల్ల నేతన్నలు కొందరు మహారాష్ట్రలోని భీవండి, ముంబై వెళ్లి అక్కడ మరమగ్గాలపై వస్త్రోత్పత్తి జరిగే తీరును అవగాహన చేసుకుని సిరిసిల్లలోనూ ఆ మగ్గాలను స్థాపించారు. దాంతో చేనేత కనుమరుగైపోయి మరమగ్గాలు (పవర్‌లూమ్స్) వచ్చాయి. ప్రస్తుతం యంత్రాల సాయంతో వస్త్రోత్పత్తి సాగుతోంది. ఒక్క చీర నేయటానికి చేనేత మగ్గంపై నేత కార్మికుడు కాళ్లుచేతులు ఆడిస్తూ రెండు రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే మర మగ్గంపై ఒక్క రోజులోనే 80 మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. మరమగ్గం చేనేత మగ్గాన్ని మింగేసింది. సిరిసిల్లలో కేవలం ఓ వంద చేనేత మగ్గాలు ఉండగా 34 వేల మర మగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మర మగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అవుతుండగా.. మరో 7 వేల మగ్గాలపై కాటన్ వస్త్రం తయారవుతోంది. వీటికి తోడు 30 సైజింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో కోముల నుంచి దారాన్ని బీములుగా మార్చి ఆసాములకు అందిస్తారు. ఇక్కడ తయారైన కాటన్ వస్త్రాన్ని డైయింగ్ (అద్దకం) యూనిట్లలో రంగులుగా అద్ది ఆరబెట్టి పెట్టీకోట్స్ (లంగా గుడ్డ)గా విక్రయిస్తారు. నేత, చేనేతకు పెద్ద తేడా లేకపోగా.. ఒకప్పుడు నాగలి పట్టి పొలం దున్నే రైతు ఇప్పుడు ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తున్న చందంగా మార్పువచ్చింది. 

మూడంచెల విధానం... 

సిరిసిల్లలో మూడంచెల విధానం అమలవుతోంది. నూలు మిల్లుల ద్వారా సిరిసిల్లలోని యజమానులు (మాస్టర్ వీవర్స్) నూలును దిగుమతి చేసి సైజింగుల్లో భీములను నింపి ఆసాముల (వీవర్స్)కు ఇస్తారు. ఆ భీములను తమ సాంచాలపై (మరమగ్గాలు) బిగించి వస్త్రం తయారు చేసి యజమానులకు అప్పగిస్తారు. ఇలా చేసినందుకు ప్రతి మీటర్‌కు రూ. 2.84 చొప్పున యజమానులు ఆసాములకు కూలిగా ఇస్తారు. ఆసాములు కొందరు తాము పని చేసుకుంటూనే తమ వద్ద కొంతమంది కార్మికులకు పని కల్పిస్తారు. అంటే ఆసాములు మగ్గాలు నడుపుతూనే మరో ఒకరిద్దరు కార్మికులతో రేయింబవళ్లు (24 గంటలు) మగ్గాలపై వస్త్రాన్ని తయారు చేస్తారు. తయారు చేసిన గుడ్డకు వచ్చే కూలిలో సగం సొమ్మును కార్మికుడికి ఆసాములు ఇస్తారు. అంటే ప్రతి మీటర్‌పై రూ. 1.42 పైసలు కార్మికుడికి లభిస్తుంది. మగ్గాల యజమాని ఆసామే కావటంతో కరెంటు బిల్లులను భరిస్తూ యజమాని వద్ద నూలు తెచ్చుకుని వస్త్రాన్ని తయారు చేసి అప్పగించటం ఆసామి డ్యూటీ. ఇక్కడ యజమాని, ఆసామి, కార్మికుడు అనే మూడంచెల విధానం అమలవుతోంది. సిరిసిల్లలో 50 మంది వరకు యజమానులు ఉండగా.. ఐదు వేల మంది ఆసాములు ఉన్నారు. అందరూ కలిసి 25 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!