YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 18 July 2012

అనంతపురం-భోగసముద్రం రోడ్డు టెండర్లలో గోల్‌మాల్

- వ్యయాన్ని రూ.179 కోట్ల నుంచి రూ.270 కోట్లకు పెంచేసిన అధికారులు
- మాజీ మంత్రికి పది శాతం, మంత్రికి ఐదు శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం
- 4.59 శాతం తక్కువ ధరలకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌పై అనర్హత వేటు 
- 3.99 శాతం అధిక ధరలకు కోట్ చేసిన వ్యక్తికి పనులను కట్టబెట్టే యత్నం 

అనంతపురం, న్యూస్‌లైన్‌ప్రతినిధి: అయిన వారికి ప్రజాధనాన్ని దోచిపెట్టడం కోసం సాక్షాత్తూ ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత రింగ్‌మాస్టర్ అవతారం ఎత్తారు. అంచనా వ్యయాన్ని రూ.179 కోట్ల నుంచి ఏకంగా రూ.270 కోట్లకు పెంచేశారు. ఉప్పు నిప్పుగా ఉన్న జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి మధ్య రాజీ కుదిర్చారు.

పని విలువలో పది శాతం మాజీకి.. ఐదు శాతం మంత్రికి కమీషన్లు ఇచ్చేలా తన సమీప బంధువైన కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదిర్చారు. 4.59 శాతం తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను కాదని.. 3.99 శాతం అధిక ధరలకు కోట్ చేసిన తన సమీప బంధువుకు పనులు కట్టబెట్టేలా చక్రం తిప్పారు. ఆ క్రమంలో సర్కారు ఖజానాకు రూ.23.16 కోట్లు నష్టం చేకూర్చారు. ఈ దోపిడీకి అనంతపురం-భోగసముద్రం ఫోర్‌లేన్ రోడ్డు పనులు వేదికయ్యాయి. 

వివరాల్లోకి వెళితే.. గతేడాది సెప్టెంబర్‌లో అనంతపురం-భోగసముద్రం రోడ్డు(68.8 కిలోమీటర్లు)ను ఫోర్‌లేన్ రహదారిగా విస్తరించి, అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలిచారు. ఈ రోడ్డు శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో విస్తరించడం వల్ల ఆ పనులపై మంత్రి, మాజీ మంత్రి కళ్లు పడ్డాయి. ఆ రోడ్డు పనులను చేజిక్కించుకోవడానికి ఇద్దరూ పట్టుపట్టారు. మాజీ మంత్రి అనుచరునికే ఆ పనులు దక్కడంతో టెండర్లలో అక్రమాలు జరిగాయని కమిషనరేట్ ఆఫ్ టెండర్స్(సీఆర్‌టీ)కు మంత్రి ఫిర్యాదు చే శారు. దాంతో ఆ టెండర్లు రద్దయ్యాయి. 

పక్కా వ్యూహం: ఫిబ్రవరి 27న అనంతపురం-భోగసముద్రం రోడ్డు పనులకు రెండోసారి టెండర్లు పిలిచారు.దరలు పెరిగాయనే సాకు చూపి, అంచనా వ్యయాన్ని రూ.179 కోట్ల నుంచి రూ.270 కోట్లకు పెంచారు. టెండర్ నోటిఫికేషన్ వెలువడిన తక్షణమే మాజీ మంత్రి అప్రమత్తమయ్యారు. తనను కాదని ఎవరైనా టెండర్ వేస్తే అంతు చూస్తానని బెదిరింపులకు దిగడంతో షెడ్యూళ్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లెవరూ సాహసించలేదు. షెడ్యూళ్లు దాఖలు చేయడానికి తుది గడువు సమీపించినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో.. గడువును ఏప్రిల్ 27 వరకు పొడిగించారు. ఈ సమయంలోనే ముఖ్యనేత జోక్యం చేసుకున్నారు. లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి ఇటు తనకూ అటు మాజీ మంత్రికి బంధువు కావడంతో ఆయన సంస్థకు కాంట్రాక్టు పనులు దక్కేలా చూడాలని కోరినట్లు సమాచారం. 

దీనికి మాజీ మంత్రి అంగీకరించడంతో అంచనా వ్యయంలో పది శాతాన్ని కమీషన్ ముట్టచెప్పేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదిర్చారు. ఇక మంత్రికి శింగనమల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రోడ్డు పని వ్యయంలో ఐదు శాతం కమీషన్‌ను కాంట్రాక్టర్ ఇచ్చేలా పంచాయితీ చేశారు. ఈ ప్రణాళిక పక్కాగా అమలయ్యేలా రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఆర్‌డీసీ) ఉన్నతాధికారికి దిశా నిర్దేశం చేశారు. 

నిబంధనలు గాలికి
ఈ రోడ్డు పనులకు మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్లు పోటీపడుతూ షెడ్యూళ్లు దాఖలు చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ 4.59 శాతం తక్కువ ధరకు.. లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌రెడ్డికి చెందిన ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ 3.99 శాతం అధిక ధరలకు, రమేష్‌రెడ్డే తన బినామీలతో మరో రెండు షెడ్యూళ్లు 4.5, 4.79, 4.99 శాతం అధిక ధరలకు కోట్ చేయించారు. టెండర్ల ప్రక్రియ జరిగే క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. టెక్నికల్ బిడ్‌ను తెరవడం వాయిదా వేశారు. 

ఈనెల 3న టెక్నికల్ బిడ్‌ను ఓపెన్ చేశారు. ఒకే సంవత్సరంలో రూ.వంద కోట్ల విలువైన పనిని చేసే సామర్థ్యం లేదనే కారణం చూపి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో ఆ సంస్థ షెడ్యూల్‌తో పాటు జతపరిచిన అర్హత పత్రాలను తొక్కిపట్టారు. ఇది పసిగట్టిన కాంట్రాక్టర్ తనకు సన్నిహితుడైన నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రిని సంప్రదించారు.

ఇదే అంశంపై వారం రోజుల క్రితం ఆయన ముఖ్యనేతను నిలదీసినట్లు సమాచారం. ‘తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను కాదని.. అధిక ధరలకు కోట్ చేసిన వారికి పనులు కట్టబెట్టడం కోసమే అనర్హత వేటు వేశారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోన్న నేపథ్యంలో మీరు జోక్యం చేసుకోండి.. పరిస్థితిని చక్కదిద్దండి’ అని ఆ మంత్రి కోరినట్లు తెలిసింది. అయినా ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రైస్ బిడ్‌ను బుధవారం తెరిచారు. 3.99 ఎక్సెస్‌కు కోట్‌చేసిన ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థే ఎల్-1గా నిలవడంతో అదే సంస్థకు పనులు కట్టబెట్టాలని కోరుతూ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వైఆర్ సుబ్రమణ్యం సీఆర్‌టీకి నివేదిక పంపారు. ఈ టెండర్లపై సీఆర్‌టీ ఆమోదముద్ర వేయడం ఖాయమని ఆర్‌అండ్‌బీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో ముఖ్యనేత తీరు వల్ల సర్కారు ఖజానాకు రూ.23.16 కోట్ల మేర గండి పడినట్లయింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!