YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 21 July 2012

‘సూ’కి టెండరు దక్కితే నాడు యాగీ చేసిన టీడీపీ ఇప్పుడు మాట్లాడదేం? రూ.477 కోట్లు వ్యయం పెరిగినా చప్పుడు చేయడం లేదేం?

‘సూ’కి టెండరు దక్కితే నాడు యాగీ చేసిన టీడీపీ ఇప్పుడు మాట్లాడదేం?
రూ.477 కోట్లు వ్యయం పెరిగినా చప్పుడు చేయడం లేదేం?
ఈ పెరిగిన మొత్తాన్ని టీడీపీ-కాంగ్రెస్ నేతలు పంచుకుంటున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఖరారు చేసుకోవడంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద గోల్‌మాల్ జరిగినట్టు చెప్పారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏడాది కాలంలో పోలవరంపై రెండు సార్లు టెండర్లు తెరిస్తే తొలిసారి టెండరు చేజిక్కించుకున్న ‘సూ-పటేల్’ జాయింట్ వెంచర్ కంపెనీ రూ. 4,122 కోట్ల అంచనా వ్యయాన్ని కోట్ చేసిందన్నారు. ‘ఎల్-1’ గా నిలిచిన ఈ కంపెనీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడైన రాజంకు చెందింది కనుక అప్పుడు టీడీపీ నాయకులు .. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారని, ఇప్పుడేమో తమకు వాటా ముడుతోంది కాబట్టి రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతున్నా నోరుమెదపడం లేదని బాజిరెడ్డి విమర్శించారు. అప్పట్లో ‘ఎల్-2’ సోమా కంపెనీ 4,147 కోట్ల రూపాయలతో నిలిచిందన్నారు. టీడీపీ నేతలు కొందరు ఈ అంశాన్ని కోర్టులో వేయిస్తే ఆ టెండరును రద్దు చేసిందన్నారు. అపుడు ‘ఎల్-2’గా ఉన్న సోమా కంపెనీ ఇపుడు ‘ఎల్-1’ స్థానానికి, తొలిసారి ‘ఎల్-1 స్థానంలో ఉన్న‘సూ-పటేల్’ కంపెనీ ఇపుడు ‘ఎల్-2’ స్థానానికి వచ్చాయన్నారు. అప్పట్లో రూ.4,122 కోట్ల వ్యయంతోనే ‘సూ-పటేల్’ కంపెనీ పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి సిద్ధపడితే ఇపుడు ‘సోమా’ కంపెనీ రూ.4,599.99 కోట్ల వ్యయంతో టెండర్లు చేజిక్కించుకుందని బాజిరెడ్డి వివరించారు.

ఇప్పుడు నోరు మెదపరే?

అప్పట్లో రూ.4,122 కోట్ల వ్యయానికే కాంట్రాక్టు ఇస్తే.. అందులో వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని నానా యాగీ చేసిన టీడీపీ నాయకులు ఇపుడు అంతకంటే 477 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగినా నోరు మెదపక పోవడానికి కారణమేమిటి? అని బాజిరెడ్డి ప్రశ్నించారు. ఇటీవలఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పరస్పరం ఓట్లేసుకున్న కాంగ్రెస్, టీడీపీలు పోలవరం టెండర్లలో కూడా అదే మాదిరి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. అధికంగా కోట్ చేసిన మొత్తాన్ని కాంగ్రెస్, టీడీపీ నేతలు సగం సగం పంచుకుంటున్నారని ఆరోపించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును అప్పట్లో రూ.4,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి సంకల్పించారని, పైగా అందులో విద్యుత్ ప్రాజెక్టు కూడా ఇమిడి ఉందని బాజిరెడ్డి వివరించారు. 

ఇపుడు విద్యుత్ ప్రాజెక్టును మినహాయించి (దాని వ్యయం సుమారు రూ.2,500 కోట్లు) సాగునీటి ప్రాజెక్టుకే రూ.4,599.99 కోట్ల వ్యయం కోట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ ప్రాజెక్టు అదనంగా నిర్మించాలంటే మరో మూడు వేల కోట్లు ఖర్చవుతాయన్నారు. ఇంత మొత్తం అదనంగా ఖర్చు చేయడానికి అధికార పక్షం సిద్ధపడితే టీడీపీ మౌనం వహించి చూస్తోందని బాజిరెడ్డి విమర్శించారు. సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా లాంటి పార్టీలు ఈ టెండర్లను లోతుగా పరిశీలించి ఇందులో జరిగిన అవినీతిని ప్రశ్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతిపై పోరాటం చేస్తున్నామని చెప్పే టీడీపీ వైఖరి ‘చెప్పేది శ్రీరంగ నీతులు....’ అన్న చందంగా ఉందని ఆయన అన్నారు.

విజయమ్మ వస్తే టీఆర్‌ఎస్‌కు బాధ ఎందుకు?

వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణకు వస్తే టీఆర్‌ఎస్‌కు బాధ ఎందుకని బాజిరెడ్డి ప్రశ్నించారు. దుర్భర పరిస్థితుల్లో ఉన్న చేనేత కార్మికులను పరామర్శించి వారి కోసం ఒక రోజు సిరిసిల్లలో ధర్నా చేసి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు విజయమ్మ ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిఘటించాలని టీఆర్‌ఎస్ నాయకులు చూడటం సమర్థనీయం కాదన్నారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని కేసీఆర్ పరకాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించారని, విజయమ్మ తెలంగాణలో అడుగు పెడితే తెలంగాణ ఏమైనా రాకుండా పోతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఇతర పార్టీల కన్నా చాలా స్పష్టతతో ఉందని, ఒక ఆడపడుచుగా పరామర్శకు విజయమ్మ వస్తూ ఉంటే కేటీఆర్ స్థానిక శాసనసభ్యుడుగా స్వాగతం పలికితే ఆయన ప్రతిష్ట హిమాలయం అంత ఎత్తుకు పెరుగుతుందని, లేకుంటే అధః పాతాళానికి దిగజారుతుందన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!