YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 21 July 2012

రాజధానిలో వరద బీభత్సం.. తొమ్మిది మంది దుర్మరణం

* 20 గంటలపాటు కుండపోత.. 18 సెంటీమీటర్ల వర్షపాతం
* గత 12 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షం.. జలదిగ్బంధంలో 78 కాలనీలు.. 
* పొంగి పొర్లిన నాలాలు, డ్రైనేజీలు.. బిక్కుబిక్కుమన్న బస్తీలు
* గోడ కూలి హఫీజ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
* బాలానగర్‌లో మరో ఐదుగురి కన్నుమూత.. 
* చెరువులను తలపించిన రహదారులు.. స్తంభించిపోయిన రవాణా
* మరో 24 గంటలు రాష్ట్రమంతటా వర్షాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: చినుకు వణుకు పుట్టించింది. వరద హడలెత్తించింది. శుక్రవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలై శనివారం తెల్లవారుజాము వరకూ హోరెత్తిన వర్ష బీభత్సానికి రాష్ట్ర రాజధాని చిగురుటాకులా వణికిపోయింది. గత పన్నెండేళ్లుగా ఎన్నడూ లేనంతగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి హఫీజ్‌పేటలో ఇళ్లు కూలి నలుగురు, బాలానగర్ సమీపంలో గోడ కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దాదాపు 20 గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని మూడోవంతు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 78 ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని విలవిల్లాడిపోయాయి. 

లంగర్‌హౌస్ పరిధిలోని థాన్‌కోట, మెహిదీపట్నం సమీపంలోని నదీంకాలనీ, ముషీరాబాద్‌లోని నాగమయ్యకుంట, పద్మాకాలనీ, అంబర్‌పేట బతుకమ్మకుంట, ప్రేమ్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ కాలనీ, తపోవన్ కాలనీ, లెనిన్‌నగర్‌లలోని వీధులన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షంతో జనం అతలాకుతలమైనా.. కాలనీలు, బస్తీల్లో వరద ఉధృతిని మళ్లించేందుకు జీహెచ్‌ఎంసీ సహాయక చర్యలేవీ చేపట్టలేదు. శనివారం మధ్యాహ్నం వరకు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూశారు. ఇక రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అడుగుతీసి అడుగు పెట్టాలంటే కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. 

టోలీచౌకీ, షేక్‌పేట్, బీఎస్‌మక్తా, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు హడలిపోయారు. సామాన్లు నీటిలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు రాత్రంతా జాగరణ చేశారు. ఎల్బీనగర్ ప్రాంతంలోని వికలాంగుల హాస్టల్‌లోకి నీళ్లు చేరడంతో పిల్లలు కిటికీలు, సజ్జలపై కూర్చొని ప్రాణాలు రక్షించుకొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 1 గంట నుంచి శనివారం తెల్లవారుజాము 5 గంటల వరకు కుండపోతగా వర్షం కురవడంతో అనేక నాలాలు పొంగిపొర్లాయి. 2000 ఆగస్టులో 24.3 సెం.మీ వర్షం కురిసింది. అప్పట్నుంచి ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి.

ఉసురు తీసిన వరద
గుడిసెలో ఆదమరచి నిద్రపోతున్న బడుగు జీవులను వరద కబళించింది. మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఏడుగురు, మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు.. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బాలానగర్‌లోని ఓ పెయింట్ కంపెనీ వద్ద ప్రహరీ గోడను ఆనుకొని గుడిసె వేసుకుని జీవిస్తున్న రెండు కుటుంబాలపై గోడ కూలడంతో మృతి చెందారు. వీరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన గరేష శాంతీలాల్ (19), కాలూఖాన్ (19), గోపాల్ (18) ఉన్నారు. అలాగే ఇదే ప్రమాదంలో మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన పోచమ్మ అలియాస్ లక్ష్మి (42), జక్కల బాబు (24) కన్నుమూశారు. ఆటో డ్రైవర్ బాబు గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదలగా మిగిలిన వారు శిథిలాల కిందే ప్రాణాలు వదిలారు. 

న్యూహఫీజ్‌పేటలో కూడా ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా బెల్లాడకు చెందిన ఎండీ అహ్మద్ హఫీజ్‌పేటకు వలస వచ్చి చిన్న ఇళ్లు నిర్మించుకొన్నారు. కుటుంబ సభ్యులంతా నిద్రపోతుండగా ఇంటి గోడ కూలడంతో మహ్మద్ భార్య ఫరీదాబేగం (30), కుమార్తెలు సమ్రీన్ బేగం (4), ముస్కాన్ బేగం (2), కుమారుడు ఎండీ సమీర్(6) మృతి చెందారు. ఈ సమయంలో ఎండీ అహ్మద్ కాలకృత్యాల కోసం బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం కుటుంబ సభ్యులను కోల్పోయిన అహ్మద్ గుండెలవిసేలా విలపించారు. మృతుల కుటుంబాలకు జీహెచ్‌ఎంసీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

వారికి అది కాలరాత్రి
వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపారు. బట్టలు, నిత్యావసర వస్తువులు, వండుకొన్న ఆహార పదార్థాలు సైతం నీట మునిగాయి. గోల్కొండ సమీపంలోని థాన్‌కోట, నాగమయ్యకుంట, నదీంకాలనీ, అంబర్‌పేటలోని ప్రేంనగర్, బతుకమ్మకుంట, వైభవ్‌నగర్, శాంతినగర్, తిలక్‌నగర్, కుద్బీగూడ, రత్నానగర్, పాతబస్తీలోని ఉప్పుగూడ, బండ్లగూడ, అరుంధతి కాలనీ, యాకుత్‌పురా, బహదూర్‌పురా, రాజన్నబావి, హైటెక్‌సిటీలోని జనప్రియకాలనీ, దీప్తిశ్రీనగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతంలోని గాంధీ ఆస్పత్రి, బాపూజీనగర్, ముషీరాబాద్ జాంబవీనగర్, పార్శీగుట్ట, పద్మారావునగర్, ఉప్పల్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ వరద పోటెత్తింది. 

వరదకు తోడు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం అష్టకష్టాలు పడ్డారు. వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ ఎలాంటి నష్టపరిహారం ప్రకటించకపోవటంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. థాన్‌కోట నీటి ముంపుపై జీహెచ్‌ఎంసీ యంత్రాంగం రోజంతా స్పందించలేదని ఎంఎల్‌ఏ అప్సర్‌ఖాన్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా శనివారం ఒక్క రోజే మూడు వందల డయేరియా కేసులు నమోదయ్యాయి. 

ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్...
ప్రధాన మార్గాల్లో రోడ్లపై నీళ్లు ప్రవహించడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపించాయి. చాదర్‌ఘాట్ వద్ద వరద నీరు పొంగటంతో దిల్‌సుఖ్‌నగర్-మలక్‌పేట మధ్య రవాణా నిలిచిపోయింది. సికింద్రాబాద్ ఒలిఫెంటా, పంజాగుట్టలోని మోడల్ హౌస్, నిమ్స్ వద్ద కూడా వరద పోటెత్తింది. హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే మార్గంలో రోడ్డుపై నడుంలోతు నీళ్లు ప్రవహించడంతో ఓ కారు, రెండు బైక్‌లు నీళ్లలో కొట్టుకు పోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. ఉప్పల్-చిలకానగర్ మార్గంలో నాలా పొంగిపొర్లడంతో శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఆ మార్గంలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షం కారణంగా సిటీ బస్సులు మొరాయించాయి. పలుచోట్ల రోడ్లపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ ముందుకు కదల్లేదు. 

రైళ్ల రాకపోకలు కూడా ఆలస్యంగా సాగాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరింది. శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు కూడా రద్దయ్యాయి. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విశాఖపట్నం, ఢిల్లీ, రాజమండ్రి, తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్, కింగ్‌ఫిషర్, ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావల్సిన విమానం కూడా రద్దుకావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఎయిర్‌లైన్స్ సంస్థలు వేరే విమానాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద..
తాజా వర్షాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో జలమట్టం పెరిగింది. ఉస్మాన్‌సాగర్‌లో నీటి మట్టం నాలుగు అడుగులు (1769 నుంచి 1773.15) పెరిగింది. హిమాయత్‌సాగర్‌లో 1.26 (1747.64 నుంచి 1749.00) అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. మూసీనది పోటెత్తింది.

ఇంకా కురవొచ్చు..: జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్‌లో ఇంకా వర్షం కురిసే అవకాశముందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. వర్షాలతో తొమ్మిది మంది మృతి చెందారని, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని చెప్పారు. వరదలతో నష్టపోయిన 2 వేల మందికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు. కూలిపోయిన 23 ఇళ్లకు రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2,500 అందజేశామన్నారు. పాత భవనాల్లో ఉన్నవారు తక్షణమే వాటిని ఖాళీ చేయాలని, లేదంటే అలాంటి భవనాలను జీహెచ్‌ఎంసీ కూల్చివేస్తుందని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!