తిరుపతి,న్యూస్‌లైన్: రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉం డాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై ఆపార్టీ పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధినేత తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ప్రజల హక్కును, ప్రజాస్వామ్యాన్ని హరించేదిగా ఉందన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌నుంచి ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
దేశ ప్రథమపౌరుడైన రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందన్నారు. బాబు నిర్ణయం మేరకు ఈ ఎన్నికల్లో ఓటుకు దూరంగా ఉండడం వల్ల తన నియోజకవర్గ ప్రజల హక్కును హరించడమే గాక, దేశ ప్రథమపౌరుడిని ఎన్నుకునే విషయంలో వారి ఆశలను, కోరికలను తాను కాలరాసిన వాడినవుతానన్నారు. లోక్‌సభ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేసిన టీడీపీ దేశ ప్రథమ పౌరుడిఎన్నికలో రాజకీయకారణాలతో ఎమ్మెల్యేలు, ఎంపీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడం దారుణమన్నారు. బాబు తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యక్తిగతంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. అయితే పార్టీ సభ్యుడిగా తమ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని అయిష్టంగానే ఆమోదిస్తున్నానన్నారు. బాబు సొంతజిల్లాలో ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరో సంక్షోభానికి తెర తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment