YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 19 July 2012

అందరి దృష్టి జగన్‌పైనే

ఆయన రాకకు ముందు అసెంబ్లీలో ఉత్కంఠ 
భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: గురువారం అందరి దృష్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపైనే కేంద్రీకృతమైంది. కోర్టు అనుమతితో ఆయన రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు రానుండడంతో ఉదయం నుంచే అసెంబ్లీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పోలీసులు అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం పదిన్నరకల్లా వైఎస్ జగన్ అసెంబ్లీ ప్రాంగణానికి వస్తారని ముందు ప్రచారం జరిగినప్పటికీ మధ్యాహ్నం 12.20కి పోలీసు వాహనంలో వచ్చారు. అప్పటికి గంట ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. విజయమ్మ లోపల ఉండగా, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, శోభానాగిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాథరెడ్డి, శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, ధర్మాన కృష్ణదాస్, సుచరిత, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెన్నకేశవరెడ్డి, టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, దేవగుడి నారాయణరెడ్డి తదితరులు బయటే నిరీక్షించారు. 

అప్పటికే అక్కడికి వచ్చిన మంత్రులు రఘువీరారెడ్డి, కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజేష్, పూతలపట్టు రవి, జోగి రమేష్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, పి.శంకర్రావు, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, బొత్స అప్పలనర్సయ్య, బి.అప్పలనాయుడు తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కరచాలనం చేస్తూ అభినందనలు తెలిపారు. మంత్రి జానారెడ్డి ఎంపీ మేకపాటికి అభినంద నలు తెలిపారు. ఇంతలో జగన్ వస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు భారీగా ఆ ప్రాం తానికి తరలివచ్చారు. జగన్ అక్కడికి చేరుకోగానే పార్టీ ఎమ్మెల్యేలు జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. జగన్ చుట్టూ ఎమ్మెల్యేలు, పోలీసులు చేరడంతో మీడియా ప్రతినిధులు జగన్ రాక దృశ్యాలు చిత్రీకరించడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎమ్మెల్యేల నినాదాల మధ్య జగన్ లోపలకు నడిచారు. 

బయటకు వ స్తూ.. లోపలకు వెళ్లిన మంత్రులు

జగన్ లోపలకు అడుగుపెడుతున్న సమయంలోనే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు బయటకు వస్తున్నారు. మాజీ మంత్రి మోపిదేవి ఓటువేసి బయటకు వస్తున్న మార్గంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స, మంత్రులు ఆనం, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు తదితరులు ఆయన్ను కలిసి మాట్లాడారు. అందరూ కలిసి నిష్ర్కమణ ద్వారం నుంచి బయటకు వ స్తున్న సమయంలో జగన్ లోపలకు వస్తుండటం గమనించి మోపిదేవితో సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి లోపలకు వెళ్లిపోయారు. సిబ్బంది ఆ ద్వారం తలుపులు మూసేయగా మంత్రులంతా అక్కడే నిల్చుండిపోయారు. జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలింగ్ ప్రవేశద్వారం లోపలకు వెళ్లాక మోపిదేవితో పాటు మంత్రులు బయటకు వచ్చారు. 

జగన్‌కు విజయమ్మ ఆశీర్వాదం 

పై అంతస్తులోని పోలింగ్ కేంద్రంలో ఓటువేసి కిందకు దిగిన జగన్ అక్కడే ఉన్న విజయమ్మ వద్దకు వచ్చారు. విజయమ్మ ఆయన్ను ముద్దాడి దీవించారు. తర్వాత ఇద్దరూ ఎమ్మెల్యేలతో కలిసి బయటకు వచ్చారు. మీడి యా ప్రతినిధులు ఆయన్ను తమ కెమెరాలవైపు తిరగాలని కోరినా పోలీసులు చుట్టూ మూగడంతో ఆయనకు వినిపించలేదు. ఎమ్మెల్సీ జూపూడి.. జగన్ వద్దకు వెళ్లి ఆ విషయం చెప్పినా పోలీసులు ఆయన మీడియావైపు తిరిగే అవకాశం లేకుండా కారువద్దకు తీసుకువెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేల వీడ్కోలు మధ్య జగన్ పోలీసు వాహనంలోకి ఎక్కారు. జగన్‌మోహన్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణలను అసెంబ్లీకి తరలించే సమయంలో చంచల్‌గూడ జైలు దారి పొడవునా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!