విద్యార్థులకు ఇచ్చిన హామీలపై సర్కారు మీనమేషాలు
విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ పథకం అటకెక్కిన వైనం
రూ. 200 కోట్లు ఖర్చవుతుందని సర్కారు వెనుకడుగు
ముస్లిం బాలికలకు సైకిళ్ల పంపిణీపైనా తాత్సారం
పుస్తకాలు, పెన్నులు, బ్యాగుల పంపిణీ ఫైలు పెండింగ్
పేద విద్యార్థులకు చెప్పుల పంపిణీ హామీ ఊసే లేదు
గతేడాది ఇచ్చిన హామీలు ఇప్పటికీ పెండింగ్‌లోనే
స్కూళ్లు తెరచి రెండు నెలలు కావస్తున్నా
ఒక్క హామీ అమలు కాలేదు
హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు.. ఇవన్నీ మోసుకెళ్లడానికి ఒక బ్యాగ్ కూడా ఉచితం!! అంతేకాదు స్కూలుకెళ్లేందుకు విద్యార్థినులకు ఉచితంగా సైకిల్, చెప్పుల్లేని విద్యార్థులకుఉచితంగానే కొత్త చెప్పులు.. ఇవేవీ రాబోయే ఎన్నికల హామీలు కాదు! స్వయానా రాష్ట్ర సర్కారు విద్యార్థులకు ఇచ్చిన హామీలు. సర్కారు మాటలు నమ్మి కొత్త పెన్నులు, కొత్త పెన్సిళ్లు, బ్యాగ్.. ఇవన్నీ ఎప్పుడెప్పుడొస్తాయా అని బడి పిల్లలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మా అమ్మాయికి సైకిల్ రేపోమాపో వచ్చేస్తుందని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. చెప్పులు లేకుండా బడికెళుతున్న పేద పిల్లలు.. సర్కారీ చెప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఎదురుచూపులు తీరే అవకాశమే కన్పించడంలేదు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ గతేడాది ఇచ్చిన ఈ హామీల్లో ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నా.. ఇప్పటికీ ఉచిత సైకిళ్లు, నోటు పుస్తకాల హామీ ప్రతిపాదనలకే పరిమితం కాగా.. చెప్పులైతే ప్రతిపాదనలకు కూడా దిక్కు లేదు!
రూ. 200 కోట్లు లేవని...
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం.. ప్రైవేటు స్కూళ్లలో చదివే అణగారిన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వటం, ఉచితయూనిఫాం లాంటి పథకాలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమైన సర్కారు.. కొత్తగా ప్రకటించిన ఈ పథకాల అమలుకూ పక్కా చర్యలు చేపట్టలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా సైకిళ్ల పథకం కోసం నిధులు కేటాయించే అధికారం రాజీవ్ విద్యా మిషన్(ఆర్‌వీఎం)కు లేకపోయినా పథకం అమలు చేస్తామని మంత్రి శైలజానాథ్ ప్రకటించేశారు. గత ఏడాది అక్టోబర్ 18న హైదరాబాద్‌లోని జూబ్లీ హాల్‌లో జరిగిన బాలికా స్రవంతి కార్యక్రమంలో శైలజానాథ్ బాలికలకు ఉచిత సైకిళ్లు ఇస్తామని ప్రకటించారు. మొత్తం 11 లక్షల మంది విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ.. నిధులు లేవు. కేంద్రం ఆమోదం లేనందున ఆర్‌వీఎం నిధుల నుంచి ఒక్క పైసా వీటికి కేటాయించటానికి వీల్లేదు. ఈ పథకం అమలుకేమో రూ. 200 కోట్లు అవసరం అని తేల్చారు. ఆ భారాన్ని భరించలేమనే ఆలోచనతో స్కూళ్లలో హాజరు శాతం 80కి పైగా ఉన్న వారికే సైకిళ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా చేశారు. అయితే కేంద్రం నిబంధనల ప్రకారం అందుకు కూడా అవకాశం లేకపోవటంతో మంత్రితో సహా అంతా నిశ్చేష్టులయ్యారు. సైకిళ్ల పథకాన్ని పక్కనపెట్టారు.
ముస్లిం బాలికలకు ఇస్తామన్న సైకిళ్లేవీ..?
ఉచిత సైకిళ్ల పథకానికి కేంద్రం ఆమోదం లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా గత డిసెంబర్‌లో ముస్లిం బాలికలకు సైకిళ్లు ఇస్తామంటూ ప్రణాళికలు వేశారు. రాష్ట్రంలో రెగ్యులర్ స్కూళ్లలో (తెలుగు, ఉర్దూ మీడియం) చదువుతున్న ముస్లిం బాలికల్లో 7వ తరగతి పూర్తి చేసుకుని 8వ తరగతికి వెళ్లేవారు 60 వేల మంది ఉన్నట్లు అంచనా. ముస్లిం బాలికల్లో అనేక మంది ఏడో తరగతి పూర్తయ్యాక 8వ తరగతిలో చేరటం లేదని.. ఈ డ్రాపవుట్స్ రేటును తగ్గించేందుకు వారికి ఉచిత సైకిళ్లను పంపిణీ చేస్తామని సర్కారు వారు పేర్కొన్నారు. ఇంటికి పాఠశాలకు మధ్య దూరంతో సంబంధం లేకుండా వారికి మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిళ్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. దానికీ అతీగతీ లేకుండా పోయింది. దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో పడింది.
చెప్పుల ప్రతిపాదనే లేదు..
గత ఏడాది అక్టోబర్‌లో కోస్తా జిల్లాల పర్యటనకు వెళ్లిన మంత్రి శైలజానాథ్ అక్కడ చెప్పులు లేకుండా స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులను చూసి ఆవేదన చెందారు. అందుకే నిరుపేద విద్యార్థులకు చెప్పులు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇది జరిగి కూడా ఎనిమిది నెలలు గడిచిపోయింది! కొత్త విద్యా సంవత్సరం మొదలై నెల కావస్తోంది. కానీ.. విద్యార్థులకు చెప్పులు మాత్రం రాలేదు!! మంత్రి హామీ ఇచ్చినా చెప్పులకు సంబంధించి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి వెళ్లకపోవటం గమనార్హం.
సబ్జెక్టుకో నోటు బుక్కు, పెన్ను, పెన్సిల్, బ్యాగులు ఎక్కడ?
ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఇస్తోంది. వీటితో పాటు సబ్జెక్టుకో నోట్ బుక్కు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగులు ఉచితంగా ఇవ్వాలని ప్రాథమిక విద్యాశాఖ సంకల్పించింది. వెంటనే ప్రతిపాదనలు పంపాలని రాజీవ్ విద్యా మిషన్ (ఆర్‌వీఎం)ను ఆదేశించింది. దీంతో విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు విద్యార్థులు దాదాపు 55 లక్షల మందికి నోటు బక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు ఇచ్చేలా ఆర్‌వీఎం ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకు ఏటా రూ. 59 కోట్లు అవసరమని తేల్చి సర్కారుకు నివేదించింది. ఇది జరిగి మూడు నెలలు గడిచిపోయింది. కానీ ఈ ఫైలు కూడా ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో పడిపోయింది. వెరసి.. విద్యార్థులకు అందింది బండి సున్నా!!
No comments:
Post a Comment