వైఎస్ జగన్‌కు నార్కో పరీక్షలు సుప్రీం తీర్పునకు విరుద్ధం
సాయిరెడ్డికి మళ్లీ అనుమతి కోరడం విచారణార్హం కాదు
తేల్చిచెప్పిన సీబీఐ కోర్టుల ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐకి ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డిలకు నార్కో అనాలసిస్, పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్), బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివేషన్ ప్రొఫైల్(బీప్) టెస్టులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పరీక్షలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వీటి నిర్వహణకు అనుమతి ఇవ్వలేమని సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సోమవారం తేల్చిచెప్పారు. సాయిరెడ్డికి ఈ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే న్యాయస్థానం ఫిబ్రవరి 2న కొట్టివేసిన నేపథ్యంలో.. మళ్లీ ఆయనకు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరడాన్ని కోర్టు తప్పుపట్టింది. సాయిరెడ్డికి పరీక్షలు నిర్వహించేందుకు మళ్లీ పిటిషన్ దాఖలు చేయడం అసలు విచారణార్హమే కాదని స్పష్టం చేసింది.
వేధించేందుకే సీబీఐ ‘నార్కో’ పిటిషన్
నార్కో పరీక్షలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చినా.., జగన్‌మోహన్‌రెడ్డిని, సాయిరెడ్డిని వేధించడానికే నార్కో అనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలకు అనుమతించాలంటూ సీబీఐ పిటిషన్ వేసిందని వాదనల సందర్భంగా జగన్, సాయిరెడ్డి తరపు న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, జి.అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. నార్కో పరీక్షలు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని, ప్రాథమిక హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్ 161(2), ఎవిడెన్స్ చట్టాలతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం నిందితుల్ని, అనుమానితుల్ని, సాక్షులను ఒత్తిడి చేసి వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని బలవంతపెట్టడం సరికాదన్నారు. అలా చేయటం చట్ట విరుద్ధమని, విచారణ సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండే హక్కును కూడా నిందితులకు రాజ్యాంగం కల్పించిందని, నార్కో పరీక్షలు నిర్వహించటమంటే ఆ హక్కును కాలరాయటమేనని కోర్టుకు నివేదించారు. మనస్సాక్షికి వ్యతిరేకంగా, దర్యాప్తు సంస్థలకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాలని నిందితులను ఒత్తిడి చేసే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. ఇలా చేయటమంటే రాజ్యాంగంలోని 20(3), 21 అధికరణాల్ని ఉల్లంఘించటమేనని తెలిపారు. సాయిరెడ్డికి నార్కో పరీక్షలు చేయటానికి అనుమతి కోరుతూ గతంలో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 2న ఇదే కోర్టు కొట్టివేసిందని, కావాలంటే ఆ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేయవచ్చునని, మళ్లీ ఇదే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కోర్టు ధిక్కరణ తప్ప మరొకటి కాదని న్యాయవాదులు వాదించారు.
సీబీఐకి జరిమానా వేయాలి: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు తదితరులకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు ధర్మాసనం సైతం నిరాకరించిందని జగన్, సాయిరెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు. నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఇలాంటి పరీక్షలను అనుమతించలేమని హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన తీర్పులిచ్చాయని చెప్పారు. ఇటువంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు సీబీఐకి జరిమానా విధించాలని కోరారు. శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించే ఈ పరీక్షలతో శరీరానికి ఎటువంటి ప్రమాదం లేదని సీబీఐ చెబుతుండటం వాస్తవం కాదని, నార్కో పరీక్షల సందర్భంగా ఇచ్చే మత్తు పదార్థాలు తీవ్ర ప్రమాదకరమని, మత్తు మోతాదు పెరిగితే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతోపాటు ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉందని నివేదించారు.
ఏకాంతంలోకి చొరబడడమేనని ‘సుప్రీం’ తేల్చింది: ‘‘మనిషిని స్పృహలో లేని స్థితికి తీసుకెళ్లి మాట్లాడించడం ఆయన మానసిక ఏకాంతంలోకి చొరబడినట్లే. స్వచ్ఛందంగా కాక మత్తు పదార్థాల ద్వారా ఇలాంటి పరీక్షలు నిర్వహించి మాట్లాడించడం క్రూరమైన, అమానవీయమైన చర్య. మనిషిపై మత్తు ప్రయోగించి, అతనిపై అతనికే నియంత్రణ లేని స్థితిలో అతనికి తెలియకుండా మాట్లాడించడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇటువంటి పరీక్షలు మనుషులపట్ల దిగజారుడు స్థాయిలో ప్రవర్తించడం కిందకే వస్తాయి. న్యాయవాది సాయం తీసుకుని నిందితుడు కోర్టుల్లో అతని వాదనను పటిష్టంగా వినిపించే హక్కును ఈ పరీక్షలు హరిస్తాయి. కోర్టుల్లో స్వేచ్ఛతోకూడిన, పారదర్శకమైన తుది విచారణ (ట్రయల్)కు ఈ పరీక్షలతో అర్థంలేకుండా పోతుంది. ఏ వ్యక్తి మీదా బలవంతంగా ఇలాంటి పరీక్షలు జరపరాదు’’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొందని నిరంజన్‌రెడ్డి, అశోక్‌రెడ్డిలు కోర్టుకు వివరించారు. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం ఈ పిటిషన్ విచారణార్హం కాదని, దానిని కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది.
No comments:
Post a Comment