YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Wednesday, April 09, 2025

Wednesday, 15 August 2012

‘ఒక్కడు’ లక్ష్యంగా మమ్మల్ని బలిస్తారా?



రోడ్లు భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ చార్జిషీట్ ఉదంతం రాష్ట్ర కాంగ్రెస్‌లో కుంపట్లు రాజేస్తోంది. అధిష్టానం తన కొమ్మను తానే నరుక్కుంటోందని, ఢిల్లీ అండ చూసుకుని సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ‘‘పార్టీకి పెద్ద దిక్కు తరహాలో వ్యవహరిస్తున్న ధర్మానకే ఈ గతి పట్టిస్తే ఇక మిగతా వారి పరిస్థితేమిటి? ఇలా ఒక్కో మం త్రినీ కేసుల్లో ఇరికిస్తుంటే పార్టీ మనగలుగుతుందా?’’ అం టూ వారు ప్రశ్నిస్తున్నారు. ధర్మానను నిందితుడిగా సీబీఐ పేర్కొనడంపై కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోం ది.

మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన ధర్మానను బుధవారం పలువురు మంత్రులు, పార్టీ నేతలు విడివిడిగా కలిశారు. వారంతా పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ చార్జిషీట్లతో పాటు అధిష్టానం, సీఎం కిరణ్ వ్యవహార శైలిపైనా ధర్మానతో వారు సుదీర్ఘంగా చర్చిం చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీబీఐ చార్జిషీటును తప్పుబడుతూధర్మాన తీవ్రంగా ఆవేదన చెందారు. ‘‘30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ స్థాయికి వచ్చానంటే కొన్ని విలువలు పాటిస్తేనే కదా? నాపై ఇలాంటి అభియోగాలు మోపాక పదవి కోసం ఆ విలువలను వదులుకోలేను. అందుకే రాజీనామా చేశాను’’ అని వివరించారు.

సీబీఐ తీరు చూస్తుంటే మరీ ఇంత దారుణమా అనిపిస్తోందని ధర్మానతో భేటీ అయిన మంత్రి ఒకరు వాపోయారు. ఎవరిపైనో కుట్రలు చేసేందుకో, వాటిని నిరూపించేందుకో తమను ఇలా పావులుగా చే స్తోందంటూ తప్పుబట్టారు. ‘‘ఇదివరకు సీబీఐ తన విచారణ సందర్భం లో మేం తీసుకున్న శాఖాపరమైన నిర్ణయాలపై సందేహాలు లేవనెత్తింది. అప్పుడే వాటన్నింటికీ స్పష్టమైన వివరణలి చ్చాం. అన్నీ తెలిసి కూడా ఇలా మమ్మల్ని కేసుల్లో ఇరికిం చడం, బజారుపాలు చేయడం ఏం పద్ధతి?’’ అంటూ ధర్మానను కలిసి సీనియర్ మంత్రులు కూడా ఆక్షేపించారు. ఈ విషయంలో అధిష్టానం తీరును కూడా వాళ్లు తప్పుబట్టారు. చూస్తుంటే అసలిదంతా కావాలనే ఆడుతున్న నాటకమేమోననే అనుమానం కలుగుతోందన్నారు.

‘‘సీబీఐ ఎవరిపైనో పెట్టిన కేసులో ‘కుట్ర’ను నిరూపించే ప్రయత్నంలో మమ్మ ల్ని బలిపశువులను చేస్తోందా? ప్రభుత్వం కూడా దీన్ని చూస్తూ మౌనంగా కూర్చుం టోందా? అసలు ఇదెక్కడి పద్ధతి? ముప్ఫై ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే ఇలాగేనా మాతో ప్రవర్తిం చేది? ఢిల్లీ పెద్దలు కూడా తాము ఎంచుకున్న వ్యక్తులను వేధిం చే క్రమంలో మంత్రులను కూడా బలి పెడుతున్నా రు. సీబీఐని మాపైకి ఉసిగొల్పుతున్నారు. మాపై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తే పార్టీతో పాటు ప్రభుత్వం పరువు కూడా మంటగలుస్తుందని కూడా అధిష్టానానికి అర్థం కాకపోవడం విచిత్రం!’’ అంటూ ధర్మానతో పాటు ఇతర మం త్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ధర్మాన తనపై మోపిన అభియోగాలకు బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

కిరణ్ మౌనమెందుకో?
ఈ విషయాలపై కిరణ్ మౌనం పట్ల మంత్రులు మరింత అసంతృప్తితో ఉన్నారు. పదేపదే ప్రస్తావించినా ఆయన కనీసం స్పందించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఒక్కొక్కరుగా మంత్రుల పేర్లను చార్జిషీట్లలో చేరుస్తూ, వారిని ప్రాసిక్యూషన్ చేసేందుకు సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. ‘‘సీబీఐ అభియోగాలు మరీ హాస్యాస్పదం. నాటి అవసరాలు, పారిశ్రామికాభివృద్దికోసం ఒప్పందాలు చేసుకునే అధికారం ప్రభుత్వానికుంటుంది. ఆ మేరకు రాయితీలూ ఇస్తుంటారు.

కాదనే హక్కు సీబీఐకి ఎక్కడిది? మాపై నిందలేస్తున్నప్పుడు, మాకు డబ్బో, ఇతరత్రా ప్రతిఫలాలో ముట్టి ఉంటే వాటినైనా బయటపెట్టాలి? అదేమీ చేయకుండా కేవలం ఎవరినో లక్ష్యంగా చేసుకొని సీబీఐ ఇలా మాపై కేసులు పెట్టి వేధిస్తుండటం బాధ కలిగిస్తోంది’’ అని ధర్మానను కలిసిన మహిళా మంత్రి ఒకరు వాపోయారు.

కిరణ్-బొత్స కొత్త వివాదం
ధర్మానపై సీబీఐ చార్జిషీట్, ఆయన రాజీనామా వ్యవహారం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణల మధ్య కొత్త వివాదానికి దారి తీస్తోంది. సీనియర్ మంత్రి అయిన ధర్మాన వ్యవహారంపై కిరణ్ తనతో మాటమాత్రంగానైనా చర్చించలేదంటూ బొత్స మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్ అయిన తనను కనీసం పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం తీరుపై తన ఆక్రోశాన్ని పార్టీ నేతలతో పాటు మీడియా ముందు కూడా బొత్స బాహాటంగానే వెళ్లగక్కారు. బుధవారం గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దిన వేడుకలకు కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ , కొందరు మంత్రులు హాజరయ్యారు.

అనంతరం కిరణ్‌ను బొత్స తన చాంబర్‌కు తీసుకువెళ్లి మాట్లాడారు. అప్పుడు కూడా ఇతర విషయాలు ప్రస్తావించారే తప్ప ధర్మాన ఊసే ఎత్తలేదంటూ బొత్స మండిపడుతున్నారు. దీన్ని అవమానకరంగా భావిస్తున్నారు. ‘ఈ పరిణామాలన్నీ పార్టీకి పెద్ద దెబ్బే. ధర్మాన విషయమై ఢిల్లీ పెద్దలతో నిన్న, ఈ రోజు మాట్లాడాను. సీఎం మాత్రం నాతో ఆ విషయాలేవీ చెప్పడం లేదు. ఇదేం పద్ధతో అర్థం కావడం లేదు. ధర్మాన రాజీనామా లేఖ ఇచ్చాక కూడా దాని గురించి నాతో కిరణ్ చర్చించకపోవడాన్ని ఏమనుకోవాలి?’’ అని బొత్స తనను కలసిన నేతలతో ప్రస్తావించారు.

నెలాఖరునుంచి అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపైనా గవర్నర్‌తో సీఎం చర్చించారని చెబుతున్నారు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 28లోపల చేపట్టాల్సి ఉంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై చర్చించాల్సి ఉన్నందున ఈ నెలాఖరున అసెంబ్లీని సమావేశపర్చాలని భావిస్తున్నామని సీఎం గవర్నర్‌కు నివేదించినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!