

శాసనసభ సమావేశాలు తొలిరోజునే వాయిదాల పర్వంతో మొదలైంది. విపక్ష సభ్యుల నినాదాలు, వాయిదా తీర్మానం కోసం పట్టుపట్టడంతో గందరగోళం మధ్య సమావేశాలు ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఆ తరువాత సభ్యులు సహకరించకపోవడంతో శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు. తొలి రోజు ఒక్క అంశంపై కూడా చర్చ జరుగలేదు. సభలో తమ గళం విప్పేందుకు అవకాశం లేకపోవడంతో అన్నిపార్టీలనేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
పేద విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, విద్యుత్ సమస్యపై టీడీపీ, తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని టీఆర్‌ఎస్, తెలంగాణ విమోచన దినం అధికారికంగా పాటించాలని బీజేపీ , తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పింఛన్ ఇవ్వాలని సీపీఐ, పేద విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని ఎంఐఎం వాయిదా తీర్మానాలిచ్చాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ సమస్యపై స్వల్పకాలిక చర్చకు అనుమతించినా ప్రయోజనం లేకుండాపోయింది.
విద్యుత్ కోతపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని నెల రోజుల నుంచీ ప్రగల్భాలు పలికిన టిడిపి నేతలు తొలిరోజే అభాసు పాలయ్యారు. ఈ సమస్యని పరిష్కరించే లెవల్లో లాంతర్ ఒకటి పట్టుకొని శాసనసభకు నడిచి వచ్చారు. సమస్యను తెలియజెప్పేందుకు, సమగ్రంగా చర్చించేందుకు ప్రయత్నించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి సభ వాయిదాపడేందుకు సహకరించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని గాఢాంధకారంలోకి నెట్టివేసిన ఒక ప్రధానమైన సమస్యపై సావదానంగా సభలో ఎలా చర్చించాలో వారికి తెలియదనుకోవాలా? విద్యుత్ సమస్య చర్చకు రాకుండా వారు వ్యవహరించారని మిగిలిన పక్షాల వారికి తెలిసిపోయింది. విపక్షాల విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఆ తరువాత కూడా టిడిపి నేతలు అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సభ వాయిదా వేసినందుకు నిరసన తెలుపుతూ సభాపతి ఇంటి ముందు ధర్నా చేశారు. తొలి రోజు తమ నాటకాన్ని బాగా రక్తికట్టించామని వారు భ్రమపడ్డారు. కానీ విపక్షాలకు, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్, టిడిపిలు ఆడుతున్న నాటకం అర్ధమైపోయింది.
No comments:
Post a Comment