YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Saturday, 8 December 2012

జగనన్న రాజ్యంలో రైతే రాజు

ఈ పాలకులు ప్రజల శ్రమను దోచుకుంటున్నారు
సమయం వచ్చినపుడు ఈ దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి.. జగనన్నను ఆశీర్వదించండి
చంద్రబాబు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు
తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 52, కిలోమీటర్లు: 739.80

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతన్నకు ప్రాణం, చేనూ రెండూ ముఖ్యమే. తొందరపాటుతో ఏ ఒక్కదాన్ని కూడా పొగొట్టుకోవద్దని కోరుతున్నా.. ఒక్క ఏడాది పాటు ఓపిక పట్టండి.. త్వరలోనే జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీ అప్పులను ఆయన మీదేసుకుంటారు. రైతును రాజులా చూసుకుంటారు. రాజన్న రాజ్యంలో ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఉంటుంది.’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ఉద్ఘాటించారు. ప్రస్తుత పాలకులు ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారని, ప్రజల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. సమయం వచ్చినపుడు ఈ దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. నాయకుడంటే వైఎస్సార్‌లా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే మనుసుండాలని, అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏకకాలంలో అమలు చేసే నాయకత్వ లక్షణం ఉండాలన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం, దానితో కుమ్మక్కైన చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం 52వ రోజు పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో సాగింది. అల్వాల్, ఎక్లాసన్‌పేట, సంగెం, కొంగగూడెం గ్రామాల్లో రచ్చబండపై కూర్చుని స్థానిక మహిళలలో షర్మిల మాట్లాడారు.

వారి సాధకబాధకాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘‘రూపాయికి కిలో బియ్యం అన్నారు. 20 కేజీలు ఇచ్చే బియాన్ని 15 కేజీలకు కోత పెట్టారు. ఐదు కేజీల బియ్యం ఇక్కన్నే పాయె! ఈరోజు కేజీ బియ్యం రూ.20పైనే ఉంది. రేషన్‌లో కోత పెట్టిన 5 కేజీల బియ్యం తెచ్చుకోవాలంటే రూ.100 పెట్టాల్సిందే. సర్కారోళ్లు మొత్తం కలిపి రూ.15 తగ్గించి మా నెత్తిన రూ.100 బరువు పెట్టారు’’ అని అల్వాల్ గ్రామానికి చెందిన దుర్గమ్మ, సాయమ్మ అనే మహిళలు షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉప్పు, పప్పు, చింతపండు, కారం పసుపు.. ఇలా అన్ని ధరలు పెంచేశారని, ఉపాధి పనికి పోయి పొద్దంతా కష్టం చేస్తే రూ 30, రూ 40 కూలీ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘ఇప్పుడిస్తున్న బియ్యంలో కూడా కోత పెడతారేమానని కొందరు.. మొత్తం రేషన్ బియ్యమే ఎత్తేస్తారేమోనని మరికొందరు అక్కాచెల్లెమ్మలు భయపడుతున్నారు. నేను గ్రామాల వెంట వస్తున్నప్పుడు చాలా మంది నాతో ఈ విషయం చెబుతున్నారు.

అక్కా..! అలాంటిది ఏదీ జరగదు. ఒకవేళ మీరు భయపడినట్లు మీకు ఏదైనా అన్యాయం జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చోదు. జగనన్న ప్రజల పక్షాన నిలబడి మీకు న్యాయం జరిగే వరకు పోరాడుతాడు’’అని భరోసా ఇచ్చారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలు పట్టడం లేదని షర్మిల చెబుతుండగా సంగెం గ్రామానికి చెందిన సువర్ణ అనే మహిళ కలుగజేకుంటూ సీఎంపై మండిపడ్డారు. ‘‘వైఎస్ తెచ్చి పెట్టిన కుర్సీల కాలు మీద కాలేస్కొని కిరణ్‌కుమార్ గూసుండు. ఆయనేమన్నా కష్టపడి కుర్సీ తెచ్చుకున్నడా? జనం నడిమిట్ల తిరిగి కుర్సీ మీదికొచ్చినోళ్లకు మా బాధలు తెలుస్తయి. జనం సత్తే ఆయినకేంది.. బతికితే ఆయినకేంది? కుర్సీల గూచోని జనం బాధలు సూడమంటే టీవీలు జూత్తరు. ఆయనకెంత మందొచ్చిండ్రు.. ఈనకెంత మందొచ్చిండ్రు అని టీవీలల్లా జూసుడు తప్ప మాకేం జేత్తలే!’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

బాబు పాదయాత్ర నాటకం: ‘‘చంద్రబాబుది నాటకాల పాదయాత్ర. ఆయనకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అవిశ్వాసం పెట్టాలి. కానీ పెట్టరు. రైతులు కష్టాల కడలిలో ఉంటే చంద్రబాబు సాగునీటికి 9 ఏళ్లలో కనీసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేయలేదు. అదే రైతు పక్షపాతి రాజన్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. వైఎస్సార్ బతికి ఉంటే ఇప్పటికే పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారేది’’ అని షర్మిల అన్నారు. ‘‘చంద్రబాబు మనుసులోని మాటను ఆయనే పుస్తకంగా రాసుకున్నారు. అందులో ఏమి రాసుకున్నారంటే..! వ్యవసాయం దండగ అని రాసుకున్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దని, ఇస్తే సోమరిపోతులు అవుతారని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమని రాసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో గ్రామాల్లో తిరుగుతూ వైఎస్సార్ చేసిన పథకాలన్నీ తాను కూడా చేస్తానని అబద్ధపు హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు గారూ.. మిమ్మల్ని ఒక్కమాట అడుగుతున్నా.. కరువు కోరల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టింది మీరు కాదా? వారింట్లో సామాన్లు లాగేసుకుంది మీరు కాదా? మీ హయాంలో నాలుగు వేల మంది రైతుల ఆత్మహత్యలు నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది మీరు కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవడం నిజం కాదా?’’ అని నిలదీశారు.

పలువురి సంఘీభావం

షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం యాత్రకు శనివారం పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నాయకులు కె.కె. మహేందర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, ఎడ్మ కిష్టారెడ్డి, బాల మణెమ్మ, ప్రసాద రాజు తదితరులు షర్మిలతోపాటు పాదయాత్ర చేశారు. ఐటీ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ నిపుణులు పాదయాత్రలో పాల్గొన్నారు. శనివారం షర్మిల 15.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకూ మొత్తం 739.80 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!