YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Wednesday, April 09, 2025

Friday, 7 December 2012

కుమ్మక్కు కుట్రలను ఎదిరించి, వైఎస్ కుటుంబానికి అండగా

సొంత పనులు సైతం వదులుకొని కదం తొక్కుతూ మున్ముందుకు
కుమ్మక్కు కుట్రలను ఎదిరించి, వైఎస్ కుటుంబానికి అండగానిలుస్తామని ఉద్ఘాటన
జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారంటూ మండిపాటు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 51, కిలోమీటర్లు: 724.30

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఆ మహానేత అంటే గుండెల నిండా నింపుకున్న అభిమానం వారితో అడుగులు వేయిస్తోంది! కుమ్మక్కు రాజకీయాలతో ఆ దివంగత నేత కుటుంబాన్ని వేధిస్తున్న తీరు వారిని కదిలిస్తోంది!! అన్యాయంగా తమ అభిమాన నేతను జైలుపాలు చేయించిన కుట్రలు వారిని తట్టిలేపుతున్నాయి!! అందుకే వైఎస్ కుటుంబానికి అండగా నిలవాలని, నీచ రాజకీయాలకు పాతరేయాలని వారంతా తమ పనులను సైతం వదిలేసి ఎండనక వాననక షర్మిల వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి చేపట్టిన మరో ప్రజాప్రస్థానం వెన్నంటి నడుస్తున్నారు. గురువారం నాటికి పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. వైఎస్ కుటుంబంపై అభిమానంతో అన్ని కష్టాలను ఆధిగమిస్తూ షర్మిలతో నడుస్తున్నామని వారు చెబుతున్నారు. యాత్రలో నడిచేవారిలో ఎవరికైనా చేతులు, కాళ్లు నొప్పులు వస్తే విశ్రాంతి తీసుకోవాలని షర్మిల కోరినప్పటికీ.. అందుకు ఎవ్వరూ ఒప్పుకోకుండా ‘మీ వెంటనే నడుస్తాం’ అంటూ ముందుకు కదులుతున్నారు.

వైఎస్ చలవతో సర్పంచ్ అయ్యా..

ఈయన పేరు ఎ.వెంకటయ్య. వికలాంగుడు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్. కర్ర లేనిదే నడవలేని పరిస్థితుల్లో కూడా 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. 25 ఏళ్లుగా వైఎస్ అంటే ఎంతో అభిమానం. వైఎస్ పేరు చెప్పుకొని ఆరేళ్ల కిందట జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించానని, ఆ ఆ కృతజ్ఞతతోనే రోజుకు 15 నుంచి 18 కిలోమీటర్లు నడవటం కష్టమైనా ఏమాత్రం అలసట లేకుండా 50 రోజులుగా షర్మిలమ్మ వెంట నడుస్తున్నాని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైలు పాలు చేశారని, ఆ కుటుంబం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాలని కోరారు.

అండగా నిలిచేందుకే...

ఈయన పేరు కసునూరు రఘునాథరెడ్డి. కాంట్రాక్టర్. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామం. మొదట్నుంచీ వైఎస్ కుటుంబం అంటే ఎంతో అభిమానం. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనస్తత్వం వైఎస్ కుటుంబానికి మొదట్నుంచీ ఉందని చెప్పారు. మహానేత రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన నేతలు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకే కాంట్రాక్టు పనులను వదులుకొని షర్మిల వెంట నడుస్తున్నానన్నారు.

ఏమీ కష్టం అనిపించడం లేదు

ఈమె పేరు కాపు భారతి. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సతీమణి. పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలు గాలికొదిలేయడంతో వారి సమస్యలను, బాధలను నేరుగా వినేందుకు షర్మిల యాత్ర చేపట్టారని ఆమె తెలిపారు. షర్మిల తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఒక మహిళగా ప్రసంశిస్తూ తాను కూడా షర్మిల అడుగులో అడుగు వేయాలని నిర్ణయించుకొని వెంట నడుస్తున్నట్లు చెప్పారు. 50 రోజులుగా షర్మిల వెంట నడుస్తున్నా తనకేమీ కష్టం అనిపించడం లేదన్నారు.

ఆరోగ్యశ్రీ లేకుంటే ఈ నడకే లేదు..

ఈమె పేరు ఎన్.దయామణి. ప్రకాశం జిల్లా. నాలుగేళ్ల కిందట పులివెందులకు వచ్చి స్థిర పడ్డారు. వెన్నెముక నొప్పి రావడంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేదు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల లక్ష రూపాయల విలువ చేసే అపరేషన్ ఉచితంగా చేయించుకున్నానని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకపోతే ఈనాడు ఇలా నడిచేదాన్ని కాదన్నారు. పేదలకు వైఎస్ మంచి పనులు చేశారని, ఆయన మరణానంతరం ఆ ఆశయాలు కొనసాగించేందుకు జగన్ ప్రజల్లోకి వెళ్తుంటే అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ ద్వారా లబ్ధి పొందిన మాలాంటి వాళ్లు షర్మిల వెంట నడుస్తున్నామని తెలిపారు.

క్లినిక్‌ను వదులుకొని నడుస్తున్నా..

ఈయన పేరు డాక్టర్ హరికృష్ణ. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ఎనుముపల్లి గ్రామం. ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన వారు వైద్యం సక్రమంగా అందక, మృత్యువాతపడ్డారని, ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిగా నిలిచిందన్నారు. ఎందరికో మేలు చేసిన వైఎస్ కుటుంబాన్ని పాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తన క్లినిక్‌ను వదులుకొని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు షర్మిల చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నానని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!