YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 29 October 2012

చెంపదెబ్బ- గోడదెబ్బ!

గోదావరి జిల్లాల ప్రజలకు చమత్‌‘కారం’ అంటే మహయిష్టం! తెలుగు సినిమాల పుణ్యమాని -బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సునీల్ లాంటి నటుల మాటల ద్వారా- ఈ విషయం రాష్ట్రమంతా పాకిపోయింది. నిజానికి అంతకు ఎన్నో తరాల ముందునుంచీ ‘గోదారి నీళ్లకు పదునెక్కువ’ అనే అభిప్రాయం పాతుకుపోయింది. ఇది ఏదో కాలక్షేపం కబుర్లకే పరిమితమయిన విషయం కాదు. రాజకీయ తీర్పులు ప్రకటించే సందర్భంలో కూడా గోదావరి జిల్లా ప్రజలు గొప్ప చమత్‌‘కారం’ ప్రదర్శిస్తూ ఉంటారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో పరిశీలకులు ఓ కంట కనిపెడుతుంటారు. ఎందుకంటే, ఆ జిల్లాల్లో ఏ పార్టీకి ఆధిక్యం దక్కితే, అదే పార్టీ -సాధారణంగా- ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పరిశీలకులు నమ్ముతారు. ఈ అంచనా, ఒక్క ఎన్నికల ఫలితాలకే పరిమితం కాదు. ప్రజాదరణకూ, ప్రజాభిప్రాయ ప్రకటనకూ సైతం వర్తించడం సహజం!

ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఎన్నికలేం జరగడం లేదు. అయితే, ప్రతినిత్యం ప్రజాభిప్రాయం ఏదో రూపంలో వ్యక్తమవుతూనే ఉంది. ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్- టీడీపీ ‘కూటమి’కి చెందిన ఎమ్మెల్యేలూ, మాజీలూ క్యూ కట్టి వైఎస్‌ఆర్‌సీపీలో వచ్చి చేరుతున్నారు. తాజాగా సోమవారం నాడు -అక్టోబర్ 29న- చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చిత్రమేమిటంటే, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజేష్ పై పోటీచేసిన కర్రా రాజారావు కూడా వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. చింతలపూడికి దగ్గిర్లోనే ఉండే గోపాలపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెల్చిన తానేటి వనిత కూడా టీడీపీ నుంచి రాజీనామా చేశారు. ఆమె కూడా త్వరలోనే వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారని చెప్తున్నారు. కొవ్వూరు ప్రాంతానికి చెందిన బలమయిన టీడీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతోనే ఇక్కడి రాజకీయ సమీకరణల్లో మార్పు మొదలయింది. అది క్రమంగా ఊపందుకుని పెనుమార్పులకు దారి తీస్తోంది. 

ఇక, పాయకరావు పేట నియోజకవర్గం నుంచి తెలుగు దేశం ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన ప్రముఖ సినీ నిర్మాత చెంగల వెంకట రావు కూడా వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇదిలాఉండగా,అనంతపురం జిల్లాకు చెందిన నేత, ప్రస్తుతం తెలుగు రైతు రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్న తరిమెళ్ల శరత్ చంద్రారెడ్డి కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర చేపట్టి.. జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల సమక్షంలో తన అనుచరులతో కలిసి శరత్ చంద్రారెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరనున్నారు. దీంతో, దాదాపు రెండేళ్లుగా మన రాష్ట్రంలో సాగుతున్న టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయానికి చావుదెబ్బ తగిలినట్లయింది. 

ఒకవైపు పదవికోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఈ రాజీనామాలూ, రాజకీయ సమీకరణల్లో మార్పులూ జరగడం ప్రత్యేకించి పేర్కోవలసిన విశేషం. పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణబాబు వర్గం టీడీపీకి వెన్నెముక లాంటిది. చంద్రబాబు నాయుడు ఈ వర్గం ముఖ్యలతో ‘హాట్‌లైన్’ మెయింటెయ్న్ చేస్తారని చెప్పుకుంటారు. టీడీపీకి ఆ జిల్లాలో ఒక సామాజిక వర్గం నుంచి గట్టిమద్దతు లభించడానికి సైతం కృష్ణబాబు వర్గం వత్తాసే కారణం. టీడీపీకి రాజీనామా చేసిన తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీ రావు -గతంలో టీడీపీ తరఫున గెలిచిన-మాజీ ఎమ్మెల్యే. కృష్ణబాబు వర్గానికి చెందిన దళిత ప్రముఖుడు. ఆయన కుమార్తెగానే కాక, అసెంబ్లీలో జిల్లా సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేగా కూడా తానేటి వనిత కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఇక, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ పిన్న వయసులోనే అసెంబ్లీకి ఎన్నికయిన యువనేత. సౌమ్యుడూ, సాత్వికుడూ కావడంతో ఆయనకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆదరణ ఉంది. ఆయనకు పోటీగా టీడీపీ తరఫున రంగంలోకి దిగి, ఓడిపోయిన కర్రా రాజారావు కూడా జనబలం ఉన్న నేత. ఈ నాయకులందరూ ఒకేసారి టీడీపీ-కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభావం నుంచి బయటపడ్డం చూస్తే ఇక ఆ జిల్లాలో టీడీపీ బతికి బట్టకట్టే సమస్యే లేదనిపిస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శల్యావశిష్టమయి ఉంది. ఏనాడో ఆ పార్టీకి చెందిన ప్రజాబలం కలిగిన నేతలంతా వైఎస్‌ఆర్‌సీపీలో చేరిపోయారు. ఇంకా కాంగ్రెస్ శథిలాలయాన్ని అంటిపెట్టుకుని వేల్లాడుతున్న దివాంధాలకు ఈ దెబ్బతో కొసప్రాణం సైతం కడబట్టినట్లయింది.

గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్- టీడీపీ అపవిత్ర కూటమికి భవిష్యత్తు లేదని ఎన్నడో తేలిపోయింది. అంతకుమించి -ఈ పరిణామాల పర్యవసానంగా- అటు కాంగ్రెస్ పార్టీకీ ఇటు టీడీపీకీ కూడా చెంపదెబ్బా గోడదెబ్బా తగిలాయి. నాయకులే కాదు, ప్రజా పునాది కూడా ఈ దెబ్బతో కదిలిపోయింది. ఇప్పట్లో ఈ పార్టీలు కోలుకోవడం అసాధ్యం.


http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=51619&Categoryid=28&subcatid=0

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!