
మాట నిలబెట్టుకునేందుకు, ఓదార్పు యాత్ర కొనసాగించేందుకు ఆయన ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని వీడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు. ఓదార్పు యాత్ర కొనసాగిస్తూనే, ప్రజా సమస్యలపై పోరాటం మొదలు పెట్టారు. రైతుల కోసం, విద్యార్థుల కోసం దీక్షలు చేపట్టారు. చేనేత కార్మికుల దీక్షలకు మద్దతు పలికారు. అతి కొద్ది కాలంలోనే తిరుగులేని నాయకుడుగా జగన్ ఎదిగిపోయారు. ఈ నేపధ్యంలోనే ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటి ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాంతో ప్రజలకు ఆ మహానేత సువర్ణ యుగాన్ని జగన్ మాత్రమే తీసుకురాగలరన్న నమ్మకం ఏర్పడింది. వెళ్లిన ప్రతిచోట జగన్ పట్ల జనం ప్రేమాభిమానాలను చూపసాగారు. ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నినదించారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నది జనాభిప్రాయంగా స్థిరపడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించే ప్రజా మద్దతును చూసి కాంగ్రెస్, టిడిపి ఓర్వలేకపోయాయి. రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. కుట్రలు పన్నాయి. సీబిఐని తోడు చేసుకున్నాయి. సిగ్గులేకుండా బరితెగించాయి. మంత్రి మండలి అక్రమంగా జీఓలు జారీ చేసిందని, ప్రభుత్వంతో సంబంధంలేని, సచివాలయం మొఖం చూడని జగన్ ను అన్యాయంగా అరెస్ట్ చేయించారు. జగన్ బెదరలేదు. చిరునవ్వు చెక్కు చెదరకుండా ధైర్యంగా ఉన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి ఆడుతున్న నాటకాన్ని అర్ధం చేసుకున్నారు. చంద్రబాబు ఆస్తుల విషయంలో, జగన్ విషయంలో సీబిఐ ఎలా వ్యవహరించిందో చూశారు. అసలు జీఓలు జారీ చేసిన మంత్రులు పట్ల, జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో కూడా చూస్తూనే ఉన్నారు. జగన్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆయన త్వరలోనే విడుదలవుతారని వారు నమ్ముతున్నారు. న్యాయవ్యవస్థ పట్ల అచంచలమైన విశ్వాసంతో వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. కొందరు కాలినడకన ఏడుకొండలెక్కారు. మరికొందరు మోకాళ్లతో తిరుమల కొండెక్కారు. ఇంకొందరు పాదయాత్రలు చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఐదు రకాల హోమాలు చేశారు. నానక్‌రాంగూడలోని శ్రీ శివమహంకాళీ హనుమంతగిరి క్షేత్రంలో 18 మంది వేద పండితులు శ్రీ లక్ష్మీగణపతి మూలమంత్ర హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, సుదర్శన పారాయణ హోమం, శ్రీ చండీ పారాయణ హోమం చేశారు. జగన్ క్షేమంగా బెయిల్ పై బయటకు రావాలని కోరుతూ గుంటూరులో 20 మంది వేద పండితులతో చతురావృత గణపతి హోమాన్ని నిర్వహించారు. మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు గుంటూరు జిల్లా వేమూరు నుంచి విజయవాడ మేరీమాత ఆలయానికి నడిచి వెళ్లారు.
తమకు విద్యుత్ కష్టాలు తీరేది, గిట్టుబాటు ధరలు లభించేది జగన్ పాలనలోనేనని రైతులు ఎదురు చూస్తున్నారు. తమ చదువులు కొనసాగేది ఆ యువనేత పాలనలోనని పేద విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తమ బాధలు తీర్చే నేత జగనేనని చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నారు. తమకు ఉపాధి లభించేది యువనేత తెచ్చే ఆ మహానేత స్వర్ణయుగంలోనేనని యువత ఎదురు చూస్తోంది. అర్హులందరికీ ఫించన్ అందించే మాటతప్పని నేత జగన్ అని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఎదురు చూస్తున్నారు. ఇంత మంది ఎదురు చూసే జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆశిద్ధాం.
source:sakshi
No comments:
Post a Comment