YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Wednesday, April 09, 2025

Monday, 5 November 2012

ఐఎంజీకి భూములు.. నేరపూరిత కుట్రే!

- ఐఎంజీకి భూ కేటాయింపులతో వేల కోట్ల మేర ఖజానాకు నష్టం
- అప్పటి అధికారులకు, బిల్లీరావుకు మధ్య పెద్ద కుట్ర నడిచింది
- అందుకే ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం
- బిల్లీరావు అవాస్తవాలను కోర్టు ముందుంచుతున్నారు
- సీబీఐ దర్యాప్తు జరగకుండా ఉండేందుకు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల భూములను ‘ఐఎంజీ భారత అకాడమీస్’ సంస్థకు కట్టబెట్టడంలో నేరపూరిత కుట్ర ఉందని, దీని వల్ల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, అందుకే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఐఎంజీకి భూములు కట్టబెట్టడంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, బిల్లీరావుకు మధ్య పెద్ద కుట్ర నడిచిందన్నారు. 

అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందుకే సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 310ని అమలు చేయాలని అభ్యర్థిస్తున్నామని ఆయన వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఎంజీ సంస్థ డెరైక్టర్ అహోబలరావు అలియాస్ బిల్లీరావు వాస్తవాలను కోర్టు ముందుంచకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అంతేకాక ఐఎంజీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు జరగకుండా ఉండేందుకు అవాస్తవాలను కోర్టు ముందుంచుతున్నారని వివరించారు. ఇటీవల బిల్లీరావు దాఖలు చేసిన కౌంటర్‌పై సాయిరెడ్డి తన వాదనలు వినిపిస్తూ సోమవారం దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్‌లో ఈ విషయాలు పేర్కొన్నారు.

బిల్లీరావు కౌంటర్‌లో శుద్ధ అబద్ధాలు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐఎంజీపై దర్యాప్తు చేసి, ఈ మొత్తం వ్యవహారం విచారించదగ్గ కేసు ఎంత మాత్రం కాదని సీఐడీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిందని బిల్లీరావు తన కౌంటర్‌లో కోర్టుకు తెలిపారని, ఇది శుద్ధ అబద్ధమని సాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించలేదని ఆయన వివరించారు. అంతేకాక జీవో 310ని సవాలు చేస్తూ బిల్లీరావు ఇటీవల హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని, ధర్మాసనం ఆగ్రహంతో దానిని ఉపసంహరించుకున్నారని, ఈ విషయాన్ని ఆయన తన కౌంటర్‌లో చెప్పకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. 

దర్యాప్తునకు ఆదేశిస్తూ 2006 ప్రభుత్వం జీవో 310 జారీ చేసినా, సీబీఐ ఇప్పటి వరకు దర్యాప్తు ప్రారంభించలేదని, ఈ వ్యవహారంలో వెంటనే దర్యాప్తు ప్రారంభించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, ఆడిటర్ వి. విజయసాయిరెడ్డిలు ఈ ఏడాది మార్చిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అభ్యర్థనతో న్యాయవాది టి.శ్రీరంగారావు కూడా మరో పిల్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, గత నెలలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు సిద్ధమైంది. ఈ దశలో బిల్లీరావు తనకు ఇప్పటి వరకు నోటీసులు అందలేదని, సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తానని చెప్పారు. దీంతో ధర్మాసనం రెండు వారాల గడువునిస్తే, నాలుగు వారాల తరువాత బిల్లీరావు కౌంటర్ దాఖలు చేశారు. ధర్మాసనం ఆదేశాల మేరకు బిల్లీరావు కౌంటర్‌కు విజయసాయిరెడ్డి తన వాదనలను వినిపిస్తూ తాజాగా రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు.

ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన అంశం: ఐఎంజీకి భూముల కేటాయింపు ప్రభుత్వ విధాన నిర్ణయమని, విధాన నిర్ణయాలపై దర్యాప్తు చేయడం సబబు కాదని బిల్లీరావు చెబుతున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని సాయిరెడ్డి తెలిపారు. వాస్తవానికి ఇదే హైకోర్టు జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే సమయంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లినప్పుడు, అధికార దుర్వినియోగం జరిగినప్పుడు, నేరపూరిత కుట్ర ఉన్నప్పుడు దర్యాప్తునకు ఆదేశించవచ్చునని చెప్పిందని గుర్తు చేశారు. ప్రజా ప్రయోజనాలు ఉన్న వ్యవహారంలో వ్యక్తుల మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా, ప్రభుత్వం జారీ చేసే జీవో ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయవచ్చునని, ఈ విషయంలో బిల్లీరావు చేస్తున్న వాదనల్లో అర్థం లేదని ఆయన తెలిపారు. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం ఒక విషయంపై సీబీఐ దర్యాప్తు చేయాలంటే, ప్రభుత్వం నుంచి ఫిర్యాదు ఉండాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు, ఆయన బినామీల అక్రమాస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని, అం దులో ఐఎంజీ భూముల వ్యవహారం కూడా ఉందని బిల్లీరావు చెబుతున్నారని, వాస్తవానికి ఐఎంజీ భూముల గురించి హైకోర్టు కనీస స్థాయిలో కూడా చర్చించలేదని సాయిరెడ్డి తెలి పారు. ఆ వ్యాజ్యంలో విజయమ్మ లేవనెత్తిన ఆరోపణలపై తిరిగి ఎక్కడా ఫిర్యాదు చేయరాదని కాని, కోర్టును ఆశ్రయిం చకూడదని కాని సుప్రీంకోర్టు చెప్పలేదని గుర్తు చేశారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!