YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Tuesday, 6 November 2012

 అచ్చం మహానేత రాజన్నను తలపించే రీతిలో చిరునవ్వుతో షర్మిల ప్రజలతో మమేకమయ్యారు. అక్కా.. అన్నా.. అవ్వా.. తాతా అంటూ ఆత్మీయంగా పలకరించారు.. ప్రజల కష్టాలు కడగండ్లను తెలుసుకున్నారు. ‘ఇప్పుడు రాబంధుల రాజ్యం నడుస్తోంది.. కొన్నాళ్లు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది.. జగనన్న సీఎం అవుతారు.. అందరి కష్టాలను తీరుస్తారు’ అంటూ ధైర్యం చెప్పారు. 

ఇదీ ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు మంగళవారం వచ్చిన జనస్పందన తీరు. సోమవారం రాత్రి వజ్రకరూరు శివారులో బస చేసిన షర్మిల మంగళవారం ఉదయం 11 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. గుడారం నుంచి ఆమె కాలు బయట పెట్టగానే ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. భారీ జనసందోహం మధ్య షర్మిల పాదయాత్ర సాగించారు. మార్గమధ్యలో వజ్రకరూరుకు చెందిన ఓ రైతు చేనులోకి షర్మిల వెళ్లారు. ఆ రైతు కష్టాలను అడిగి తెసుకున్నారు. ‘అన్నా.. పంట పరిస్థితి ఎలా ఉంది.. ఏమైనా గిట్టుబాటు అవుతుందా’ అంటూ ఆత్మీయంగా అడిగారు. ఇందుకు ఆ రైతు స్పందిస్తూ.. ‘అమ్మా.. మూడెకరాల్లో వేరుశనగ పంట వేశా. రూ.35 వేలు ఖర్చయింది. వానలు సరిగా కురవకపోవడం వల్ల పంట పండలేదు. 

చేతికి రూ.పది వేలు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. బీమా పరిహారం వచ్చేలా లేదు’ అంటూ బావురుమన్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా అధైర్యపడొద్దు.. ఇప్పుడు కాంగ్రెస్ రాబంధుల రాజ్యం నడుస్తోంది. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది. రైతుకు అండగా జగనన్న ఉంటారు’ అంటూ ఆ రైతులో ఆత్మస్థైర్యం నింపారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వేలాది మంది ప్రజలు తరలి వచ్చి కమలపాడుకు క్రాస్‌కు సమీపంలో షర్మిలకు సంఘీబావం తెలిపారు. షర్మిలతో పాదం కలిపి కదంతొక్కారు. ఆ తర్వాత కమలపాడుకు చేరుకున్న ఆమె.. ఆ గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు.

కులవృత్తులకు ఏదీ దిక్కు..
కమలపాడుకు చెందిన రజకులు మాట్లాడుతూ ‘అమ్మా.. మా గ్రామంలో బట్టలు ఉతకడానికి నీళ్లు లేవు. వైఎస్ ఉన్నప్పుడు దోబీఘాట్లు కట్టించారు. కానీ.. ఇప్పుడు నీళ్లందడం లేదు. ఎలా బట్టలు ఉతకాలి. కులవృత్తులపై ఆధారపడి జీవించే ప్రజలపై ఈ ప్రభుత్వం కక్ష కట్టింది’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అక్కా.. కులవృత్తులకు వైఎస్ పెద్దపీట వేశారు. అందుకే ఆయన హయాంలో కులవృత్తులపై ఆధారపడిన ప్రజలు సుఖంగా జీవించారు. కొద్ది రోజులు ఓపికపట్టండి.. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది.. జగనన్న సీఎం అవుతారు.. మీకు మంచి చేస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు. కమలపాడుకు చెందిన మరో మహిళ మాట్లాడుతూ ‘అక్కా.. వడ్డీలేని రుణాలు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. కానీ.. ఇప్పుడు అధికారులు ముక్కుపిండి రెండు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అక్కా.. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేసి, పేదరికాన్ని తరిమికొట్టాలని రాజన్న భావించారు. 

అందుకే పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. కాానీ.. ఈ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి మొదటికే మోసం చేసింది.. కొన్నాళ్లు ఆగండి.. జగనన్న సీఎం అవుతారు. అప్పుడు వడ్డీలేని రుణాలు ఇస్తారు’ అంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడే భోజనం చేసిన షర్మిల కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.50 గంటలకు పాదయాత్రను కొనసాగించారు. గూళ్యపాళ్యానికి సమీపంలో మదనపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేత బాబ్‌జాన్ వందలాది మందితో తరలివచ్చి షర్మిల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి.. కదంతొక్కారు.

భారీ జనసందోహం మధ్య గూళ్యపాళ్యంకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు అపూర్వరీతిలో స్వాగతం పలికారు. ఆ గ్రామంలో రచ్చబండ నిర్వహించిన షర్మిల.. ప్రజల సమస్యలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ‘అమ్మా.. ప్రభుత్వం రాయితీపై అందిస్తోన్న విత్తనాల్లోనే కల్తీ విత్తనాలు ఇస్తున్నారు. అవి కూడా పంట కాలం పూర్తయిన తర్వాత ఇస్తున్నారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ ఆ గ్రామానికి చెందిన ఓ రైతు షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా ఇదో కల్తీ సర్కారు. అందుకే కల్తీ విత్తనాలు ఇస్తోంది.. కల్తీ ఎరువులు అంటగట్టి రైతులను దగా చేస్తోంది. రాజన్న హయాంలో రైతే రాజు.

కొన్నాళ్లు ఆగితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న సీఎం అయితే రైతే రాజు అవుతారు’ అంటూ ధైర్యం చెప్పారు. ఇంతలోనే మరో రైతు స్పందిస్తూ.. ‘అమ్మా 2010 ఇన్‌పుట్ సబ్సిడీనే ఇప్పటిదాకా ఇవ్వలేదు.. 2011 ఇన్‌పుట్ సబ్సిడీ నేటికీ చేరలేదు. వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీరే ఆదుకోవాలి’ అంటూ కోరారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ... ‘అన్నా ఇది కోతల సర్కారు. అందుకే మాటలు చెబుతోంది. కొన్నాళ్లు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యంలో రైతుకు జగనన్న అండగా ఉంటారు’ అంటూ ధైర్యం చెప్పారు. ‘అక్కా హాస్టల్‌లో పురుగుల అన్నం.. నీళ్ల సాంబారు పోస్తున్నారు. వాటిని తిని జబ్బుల బారిన పడుతున్నాం’ అంటూ ప్రభుత్వ హాస్టల్‌లో చదువుతోన్న విద్యార్థులు షర్మిల ముందు వాపోయారు. దీనిపై షర్మిల స్పందిస్తూ.. ‘తమ్ముడూ.. జైల్లో ఉన్న ఖైదీలకే రోజుకు రూ.40 వంతున మెస్ చార్జీలు ఇస్తున్నారు. విద్యార్థులకు మాత్రం రూ.17 ఇస్తున్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఈ కష్టాలు కొద్ది రోజులే. ఓపికపట్టండి.. జగనన్న సీఎం అయితే అన్నీ సర్దుకుంటాయి’ అంటూ హామీ ఇచ్చారు.

ఉరవకొండలో ముగింపు.. 
నేడు గుంతకల్లులో ప్రవేశం
గూళ్యపాళ్యం నుంచి కొనకొండ్లకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కొనకొండ్ల బహిరంగసభకు భారీ ఎత్తున జనం పోటెత్తారు. ఈ సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘రెండో సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రెండు హామీలు ఇచ్చారు. వాటిలో ఒకటి సేద్యానికి తొమ్మిది గంటల విద్యుత్.. రేషన్‌కార్డులకు అదనంగా పది కేజీల బియ్యం. కానీ.. ఈ ప్రభుత్వం సేద్యానికి రెండు మూడు గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదు. రూపాయికే కిలో బియ్యం పేరుతో దగా చేస్తోంది. వైఎస్ ఇచ్చిన హామీ మేరకు రూ.2కే కిలో బియ్యం ఇస్తే రూ.60 వెచ్చిస్తే సరిపోతుంది. రూపాయికే కిలో బియ్యం వల్ల 20 కేజీల బియ్యానికి రూ.20.. పది కేజీల బియ్యాన్ని బయట కొంటే రూ.వంద.. మొత్తం రూ.120 వెచ్చించాల్సి వస్తోంది. రూపాయికే కిలో బియ్యం పేరుతో ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. 

విద్యుత్ సంక్షోభానికి ఈ ప్రభుత్వ విధానాలే కారణం.. జనం అష్టకష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రజల కోసం పోరాడుతోన్న జగనన్నపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా జైలుకు పంపారు. జగనన్నను ఆశీర్వదించండి.. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది.. అప్పుడు వైఎస్ ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుంది.. అన్ని వర్గాల ప్రజలకూ మంచి జరుగుతుంది’ అంటూ హామీ ఇచ్చారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎనిమిది రోజులపాటు సాగిన పాదయాత్ర మంగళవారంతో ముగిసింది. బుధవారం గుంతకల్లు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. మంగళవారం పాదయాత్రను రాత్రి 8 గంటలకు కొనకొండ్ల శివారులో ముగించిన షర్మిల అక్కడే బస చేశారు. మంగళవారం 12.5 కిలోమీటర్లు నడిచారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!