YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Friday, 9 November 2012

మనీ స్కీమ్‌తో ముంచేశారు!అధికార పార్టీ అండతోనే !

తాళిబొట్లు, కమ్మలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు కట్టాం..
నాలుగు జిల్లాల్లో వేల మందిని వంచించారు రూ.100 కోట్ల మేర మోసం 
ఆత్మహత్యాయత్నం చేసుకున్నవాళ్లూ ఉన్నారు అధికార పార్టీ అండతోనే ఈ ద్రోహం
నిందితులకు కాంగ్రెస్ ఎంపీ సపోర్ట్ ఉందని వెల్లడి
హోంమంత్రికి విన్నవించి న్యాయం చేస్తామని షర్మిల హామీ
నిందితులను అరెస్టు చేసేంతవరకు పోరాడతామని భరోసా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 23, కిలోమీటర్లు: 296.80

మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొంటూ సాగుతున్న షర్మిల ముందుకు శుక్రవారం ఓ కొత్త సమస్య వచ్చింది. ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే చూసిన ఆమె.. అధికార పార్టీ ఎంపీ మద్దతుతో ఆ పార్టీకే చెందిన ఓ వ్యక్తి రూ.100 కోట్ల మేర కర్నూలు సహా నాలుగు జిల్లాల ప్రజల్ని ముంచేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో అధికార పార్టీకి చెందిన రంగస్వామి అనే వ్యక్తి తమను మోసం చేశాడని, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని, అతడికి ఓ కాంగ్రెస్ ఎంపీ మద్దతు ఉండడంతో పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లాలో 23వ రోజు శుక్రవారం షర్మిల పాదయాత్ర సాగిన దారి పొడవునా రైతులు, వ్యవసాయ కూలీలు ప్రధానంగా ఇదే అంశంపై షర్మిలకు ఫిర్యాదుచేశారు. రంగస్వామి ‘శ్రీనంది యువజన సమాఖ్య’ పేరుతో సంస్థ ప్రారంభించాడని, తాను ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకున్నానంటూ తమను నమ్మించాడని తెలిపారు. రూ.700 కడితే 10 నెలల పాటు ప్రతి నెలా రూ. 300 చొప్పున చెల్లిస్తామని చెప్పాడని, రూ. 700కు రూ. 3 వేలు వస్తున్నాయని ఆశపడి తాళిబొట్లు, చెవి కమ్మలతో సహా తాకట్టు పెట్టి ఈ స్కీమ్‌లో పెట్టామని పలువురు మహిళలు వాపోయారు. కొద్దిరోజులు డబ్బులు ఇచ్చి అందరినీ నమ్మించి బిచాణా ఎత్తేశాడన్నారు. సుమారు రూ.100 కోట్ల దాకా మోసం జరిగి ఉండొచ్చని పలువురు తెలిపారు. తమకు న్యాయం చేయాలని షర్మిలను కోరారు.

అవసరమైతే ఎంపీనీ అరెస్టు చేయాలి: షర్మిల

ఉదయం గం.10.40కు పత్తికొండ నియోజకవర్గ పరధిలోని అగ్రహారంలో రచ్చబండ వద్ద షర్మిల ప్రజలతో ముచ్చటించినపుడు వారు ఈ మనీ సర్క్యు లేషన్ స్కీమ్ గురించి చెప్పారు. అది మొదలు యాత్ర సాగిన దారి పొడవునా ప్రజలు ఇదే అంశాన్ని ఆమెకు మొరపెట్టుకున్నారు. న్యాయం చేస్తామన్న డోన్ డీఎస్పీ రెండు నెలలైనా తమ ముఖం చూడలేదని చెప్పుకొచ్చారు. నిందితులకు ఎవరి సపోర్టు ఉందని షర్మిల ఆరాతీయగా.. ‘కాంగ్రెస్ ఎంపీ అని చెబుతున్నారు. స్కీమ్ తెచ్చింది కాంగ్రెస్ వ్యక్తి రంగస్వామి. మాకైతే ఏజెంట్లే దిక్కు. దాదాపు 2 వేల మంది ఏజెంట్లు ఆయన కింద పనిచేశారు’ అని ఒకరు చెప్పారు. 

మరో వ్యక్తి మాట్లాడుతూ మల్లికార్జున్ అనే యువకుడు రూ.5 లక్షలు అప్పుతెచ్చి బాండ్లు కొన్నాడు. మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే మేమే రూ. 12 వేలు ఖర్చుపెట్టి బతికించుకున్నాం..’ అని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘మనీ స్కీమ్‌లో వందల కోట్లు మోసపోయారని చెబుతున్నారు. మోసం చేసిన వాళ్లకు అధికార కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉందని చెబుతున్నారు. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. తప్పుచేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దు. అవసరమైతే సపోర్ట్ చేస్తున్న ఎంపీని కూడా అరెస్టు చేయాలి. ప్రభుత్వం తక్షణం కళ్లు తెరవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. వీళ్ల బతుకుల మీద, కడుపుల మీద దెబ్బ కొట్టొద్దు..’ అని పేర్కొన్నారు. ‘మా పార్టీ తరఫున హోంమంత్రిని క లిసి ఈ సమస్యపై విన్నవిస్తాం. తక్షణం సమస్య పరిష్కారమయ్యే దిశగా వైఎస్సార్ సీపీ మీకు అండగా నిలుస్తుంది’ అని భరోసా ఇచ్చారు.

జనప్రవాహం: శుక్రవారం పాదయాత్ర మద్దికెర నుంచి తుగ్గలి వరకు 15.5 కిలోమీటర్ల మేర సాగింది. అడుగడుగునా జనప్రవాహం ఎదురేగి షర్మిలకు స్వాగతం పలికింది. సాయంత్రం 6.50కి తుగ్గలి చేరుకున్న షర్మిల అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. సభ అనంతరం రాత్రి 7.20కు దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బస వద్ద షర్మిలను కలిశారు. ఇప్పటివరకు పాదయాత్ర మొత్తం 296.80 కిలోమీటర్లు పూర్తయింది. శుక్రవారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!