YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Friday, April 11, 2025

Saturday, 10 November 2012

‘నీలం’ నష్టాలపై ప్రధానమంత్రికి విజయమ్మ లేఖ

తుపాను వల్ల రాష్ట్రంలో భారీ నష్టం సంభవించింది 
20 లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి 
ఒక్కో ఎకరాకు రూ. 30 వేల వరకూ పంట నష్టం 
కౌలురైతులకు ఎకరాకు రూ. 10 వేలు పరిహారమివ్వండి 
ప్రధానిని స్వయంగా కలిసి పరిస్థితిని వివరించేందుకు సమయం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో నీలం తుపానుకారణంగా నష్టపోయిన రైతులు, బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శనివారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని వారి రుణాలు రద్దుచేసి, రీషెడ్యూల్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ప్రధానికి వివరించారు. ‘‘వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులు మీ సహాయం కోసం వేచిచూస్తున్నారు. అకాల వర్షాలతో రాష్ట్రంలోని 7 జిల్లాలు చాలా దెబ్బతిని, ఆర్థిక, ప్రాణ నష్టం సంభవించింది. అధికారవర్గాల అంచనా ప్రకారం 20 లక్షల ఎకరాల్లో ఎదిగొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్కొక్క ఎకరాలో జరిగిన పంట నష్టం రూ. 30 వేలు వరకూ ఉంది. 41 వేల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 31 మంది మరణించారు. 1.35 లక్షల మంది శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకా అనేక లక్షల మంది ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండిపోయారు. అదే విధంగా 670 ఆవులు, గేదెలతో పాటు దాదాపు 7 వేల కోళ్లు, ఇతర పక్షులు మృత్యువాతపడ్డాయి. 500 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ, 3 వేల కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. 427 ఆర్‌డబ్ల్యూఎస్, 44 లిఫ్ట్ ఇరిగేషన్ సోర్స్‌లు, 1,900 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి’’ అని వివరించారు. 

గతంలోనూ ఆదుకోలేదు... 

‘‘గతంలో 2009లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల వల్ల తీవ్ర నష్టం కలిగింది. ఆ వరదల్లో ప్రాణ నష్టంతో పాటు పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధితుల్ని ఆదుకోవటంలో విఫలమయింది. ప్రకటించిన ప్యాకేజీలను బాధితులకు అందజేయలేదు. కనీసం ఐదు శాతం మంది రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం అందించలేదు. అప్పుడు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రవర్తించింది’’ అని విచారం వ్యక్తం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సువర్ణయుగాన్ని చూసిన రైతులు, ఆయన మరణ ం తర్వాత సంభవించిన విపత్తులతో అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలంలో వరి కనీస మద్దతు ధర 25 శాతం పెరిగితే.. ఎరువులు, రసాయనాల ధరలు 200 శాతం పెరిగాయని వివరించారు. ఇతర పెట్టుబడులు కూడా క్రమక్రమంగా పెరగటంతో రైతులకు వ్యవసాయం తలకు మించిన భారంగా మారిందన్నారు. అయినప్పటికీ అప్పుచేసి సాగుచేసిన పంట మొత్తం అకాల వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్నందున కేంద్ర ప్రభుత్వం పెద్దమనసు చేసుకుని రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి కొన్ని సూచనలు చేశారు. అవి... 

పంట కోల్పోయిన రైతులకు సంబంధించి పంట రుణాలను, వాటి వడ్డీలను పూర్తిగా రద్దుచేయాలి. తర్వాతి పంట కోసం కొత్తగా రుణాలు మంజూరు చేయాలి. ఈ విషయంలో ప్రతి రైతునూ పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా కౌలురైతులను మరవొద్దు. 

స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలు వ్యవసాయ రంగంలోనే పెట్టుబడి పెట్టినందున వారి రుణాలు కూడా రీషెడ్యూల్ చేసి, ఆరు నెలల దాకా వడ్డీ వసూలును వాయిదా వేయాలి. 

రానున్న రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేయాలి. 

అర్హులైన రైతులంద రికీ పంటల విషయంలో 25 శాతం దాకా బీమా కల్పించాలి. 

వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న తదితర వాణిజ్య పంటలను, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. 

పంట కోల్పోయిన కౌలురైతులకు కనీసం ఎకరాకు రూ. 10 వేలు తక్కువ కాకుండా విపత్తు నివారణ కింద సహాయం అందించాలి. ఈ విషయంలో భూపీందర్‌సింగ్ హూడా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలి. 
ఠ మరణించిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షలు పరిహారం అందించాలి. 

కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్ల పునఃనిర్మాణానికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలి. ఇందిరా ఆవాస్ యోజన, లేదా మరే ఇతర పథకాల ద్వారానైనా వారికి శాశ్వత పరిష్కారం చూపుతూ పక్కా గృహాలు నిర్మించాలి. 

పశువులు, కోళ్లు తదితర పక్షుల మరణం వల్ల సంభవించిన నష్టానికి పరిహారం అందించాలి. 
వరదల కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలకు రేషన్ ద్వారా ఉచితంగా సరుకులు అందించాలి. 

ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న చేనేత కార్మికులు, మత్స్యకారులతో పాటు ఇతర చేతివృత్తిదారులకు నష్టపరిహారం అందించాలి. 

వరదల వల్ల పంట పొలాల్లో ఇసుకమేటలు, కోతకు గురైన పొలాలను బాగు చేసుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. 

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నేరుగా కలిసి వివరించేందుకు.. వీలును బట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజయమ్మ ఈ లేఖ ద్వారా ప్రధానిని కోరారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!