10-8-12-450.jpg)
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
కలెక్టరేట్ల ముందు ధర్నాలు.. రాస్తారోకోలు.. కలెక్టర్లకు వినతి పత్రాలు
సీఎం కార్యాలయం ముందు టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
మంత్రుల క్వార్టర్లను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. బడుగులను పెద్ద చదువులకు దూరం చేస్తే సహించబోమని హెచ్చరించింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాదిరి పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. పథకంపై ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థిలోకం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి, ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. రోడ్డుపై బైఠాయించి ‘‘పెద్ద చదువులు.. పేదల హక్కు’’ అంటూ నినదించారు.
10-8-12-46812.jpg)

సీఎం కార్యాలయం ముందు టీడీపీ ధర్నా: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, ఫీజు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేశారు. సచివాలయంలో సీఎం కార్యాలయం ఉండే సీ బ్లాక్ ప్రధాన ద్వారం ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ధర్నాలో పాల్గొన్నవారిలో ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బల్లి దుర్గాప్రసాద్, మండవ వెంకటేశ్వరరావు, బీదా మస్తాన్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, జి. జైపాల్‌యాదవ్, మల్లెల లింగారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్ ఉన్నారు.
మంత్రుల క్వార్టర్ల ముట్టడి..: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎలాంటి షరతు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు గురువారం బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్లను ముట్టడించారు. అలాగే టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 50 మంది విద్యార్థులు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
No comments:
Post a Comment