
కడప, పులివెం దుల ప్రాంతాల గురించి ప్రతిపక్షనేత చంద్రబాబు మరోమారు అవమానకరంగా మాట్లాడితే సహించబోమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేళ్ళు రాష్ట్రానికి సీఎంగా, కొన్నేళ్లుగా ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న బాబు ఒక ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడడమేమిటని ఆయన మండిపడ్డారు. బాబు అలా మాట్లాడుతుంటే ఈ ప్రాంతంలోని ఆ పార్టీ క్యాడర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోకుంటే ఆయనను ప్రజలు జిల్లాలోకి అడుగుపెట్టనివ్వరన్నారు. తన హయాంలో బాబు జిల్లా అభివృద్ధికి పాటు పడకపోగా, వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, జిల్లాలో సిమెంటు ఫ్యాక్టరీల ఏర్పాటును సైతం జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. సుమారు 20 లక్షల మందికి మేలు చేకూర్చేందుకు ఉద్దేశించిన వాన్‌పిక్ ప్రాజెక్టును సమర్ధించాల్సింది పోయి దానికి కేటాయించిన భూములన్నింటినీ రైతులతో దున్నించేస్తానంటూ మాట్లాడడం ఆయనకు తగదన్నారు. గతంలో మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని విమర్శించిన చంద్రబాబు, నేడు అదే పథకాన్ని సక్రమంగా అమలు పరచాలంటూ రోడ్డుకెక్కడం విడ్డూరమన్నారు. తన పాలనలో చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోగా ప్రజల గుండెల్లో నిద్రపోతా! పారిశ్రామికవేత్తల గుండెల్లో నిద్రపోతానంటున్నాడని, ఆయనకు గుండెల్లో తప్ప బయట నిద్రరాదా అంటూ ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment