YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 20 August 2012

విజయమ్మ ప్రతిపాదనపై బీసీ సంఘాల హర్షం

 బీసీలకు అసెంబ్లీలో 100 సీట్లు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదన రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది బీసీల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఉందని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో కొన్నిపార్టీలు 100 స్థానాలను బీసీలకు కేటాయిస్తామంటూ ఇచ్చిన హామీలను నిలుపుకోలేదని, ఇప్పుడు మళ్లీ కొత్తగా 100 టికెట్లు ఇస్తామని చెపుతున్నా నమ్ముదామా లేదా అన్న సందిగ్ధంలో బీసీలున్న పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటన కొత్త ఉత్సాహాన్ని నింపిందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

చరిత్రాత్మకం: ఏపీ బీసీ విద్యార్థి సంఘం

బీసీలకు 100 సీట్లు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదన చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం తెలిపింది. అన్ని పార్టీలు దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చి 100 మంది బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ర్యాగ రమేశ్ కోరారు. 

స్వాగతిస్తున్నాం: బీసీ ప్రజాసమితి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను బీసీ ప్రజా సమితి స్వాగతించింది. దేశ జనాభాలో గణనీయంగా ఉన్న బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, విజయమ్మ చేసిన ప్రతిపాదన వల్ల కనీసం 100 మంది బీసీ శాసనసభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

సాధికారతకు బాటలు: బీసీ విద్యార్థి ఐక్య వేదిక

అసెంబ్లీలో బీసీలకు వంద సీట్లు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర బీసీ విద్యార్థి ఐక్యవేదిక స్వాగతించింది. ఇది బీసీల అభ్యున్నతికి, సాధికారతకు ఎంతగానో దోహదపడుతుందని, అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెరిగేందుకు ఉపయోగపడుతుందని ఐక్య వేదిక అధ్యక్షుడు దేశగాని సాంబశివగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి పార్టీ డిక్లరేషన్ చేయాలి: బీసీ రీసెర్చ్ స్కాలర్స్

బీసీలకు 100 టికెట్లు కాకుండా వంద సీట్లు ఇద్దామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడం హర్షణీయమని బీసీ రీసెర్స్ స్కాలర్స్ తెలిపారు. ప్రతి పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని, లేదంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీలు భూస్థాపితం కావడం ఖాయమని స్కాలర్స్ అధ్యక్షుడు ఉయ్యాల వెంకటేశ్ గౌడ్ హెచ్చరించారు.

దేశ చరిత్రలోనే మొదటిసారి: ఉస్మానియా జేఏసీ

బీసీలకు 100 సీట్లు ఇవ్వాలన్న విజయమ్మ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేత లోకేశ్‌యాదవ్ తెలిపారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రతిపాదన చేయడం చరిత్రాత్మకమని, ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. 

పార్టీల అధ్యక్షులే స్పందించాలి: తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ‘అసెంబ్లీకి వందమంది బీసీలను పంపుదాం’ అంటూ చేసిన ప్రతిపాదనపై మిగతా అన్ని పార్టీల అధ్యక్షులే స్వయంగా స్పందించాలని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, టీడీపీలోని కొందరు నేతలు డొంకతిరుగుడు ప్రకటనలతో తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించింది. పార్టీల అధినేత లే స్వయంగా దీనిపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలనే డిమాండ్‌తో త్వరలో వారిని కలవనున్నట్లు జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!