YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 20 August 2012

ఈసీ ప్రకటనతో తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించిన నేతల గుండెల్లో రైళ్లు


‘తాను మునిగిందే గంగ...’ అన్న చందంగా వ్యవహరించే రాజకీయ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడే రోజులు దగ్గర పడ్డయా అంటే అవుననే అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. తప్పుడు అఫిడవిట్(ప్రమాణపత్రం)లతో తోక జాడించే నేతలకు కళ్లెం వేస్తామని ధీమాగా చెబుతోంది. ఎన్నికల్లో పోటీ సందర్భంగా తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించిన నాయకులపై విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలో తమకు సంబంధించిన పూర్తి వివరాలతో రిటర్నింగ్ అధికారులకు నేతలు అఫిడవిట్‌లు అందజేయడం అనవాయితీగా వస్తోంది.

తమకున్న ఆస్తులు, సొమ్ములు, కేసుల వివరాలు అఫిడవిట్‌లో తప్పనిసరిగా పొందుపరచాలి. అయితే ఈసీకి మన నాయకులు సమర్పిస్తున్న అఫిడవిట్‌లు అధికారులతో పాటు సామాన్య జనాన్ని అవాక్కయ్యేలా చేస్తున్నాయంటే నమ్మాల్సిందే మరి. హవ్వా! అందరూ నోళ్లు వెళ్లబెట్టెలా అఫిడవిట్‌లు అదరగొడుతున్నాయి. అంతేకాదండోయ్ మన నేతలపై రవ్వంత జాలి చూపేలా చేయడంలో ‘ఫాల్స్ అఫిడవిట్‌లు’ తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాయి. కొమ్ములు తిరిగిన నేతలు సైతం తమకు కనీసం సొంతకారు లేదని, తన దగ్గర దమ్మిడి లేదని, తన పేరు మీద ఆస్తిపాస్తుల్లేవని ‘ఆ’ అఫిడవిట్‌లలో గగ్గోలు పెడతారు. తనకున్న కొద్దొగొప్పో ఆస్తిపాస్తులు తనవాళ్ల పేరు మీద ఉన్నాయని అందులో చూపిస్తారు. ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది.

నామినేషన్లు వేయడానికి నాలుగైదు కార్లు తక్కువ కాకుండా భారీ కాన్వాయ్‌తో దయచేసే మన నేతాశ్రీల మాటలు నీటిమీద రాతలని తెలియనిదెవరికీ? ‘నవ్విపోదురు నాకేటి సిగ్గు’ రీతిలో లేకుంటే నెగ్గుకురాలేమని నయా నేతలకు మరొకరు చెప్పాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. ఏదో ఫార్మాలిటీ కాబట్టి అఫిడవిట్ పెడుతున్నాం అన్న చందంగా వ్యహరిస్తున్న నాయకులకు ఈసీ తాజాగా షాక్ ఇచ్చింది. దీంతో నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఆడింది ఆట, పాడింది పాటగా నెట్టుకొస్తున్న నేతలకు ఈసీ ప్రకటన మింగుడు పడడం లేదు.

ఎన్నికల్లో పోటీ సందర్భంగా తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించినట్లు అందిన ఫిర్యాదులపై స్థానిక మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ చెప్పడంతో నేతలు వణుకుతున్నారు. తప్పులు జరిగినట్టు విచారణలో తేలితే ఐపీసీ ప్రకారం శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి సమర్పించిన అఫిడవిట్‌పై విలేకరుల అడిగిన ప్రశ్నకు స్పందించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ ఇలా సమాధానమిచ్చారు. ఈసీ ప్రకటనతో తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించిన నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆషామాషీగా అఫిడవిట్‌లు పడేసిన నేతలు వణుకుతున్నారు. తమ గుట్టు ఎక్కడ బట్టబయలవుతుందనే భయంతో బెదురుతున్నారు. ఈసీ హెచ్చరికతో భవిష్యత్‌లోనైనా మన నేతలు బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!