YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 25 August 2012

విద్యుత్తు సంక్షోభానికి ముస్లింలు కారణమా?ముస్లింల పట్ల టీడీపీ వైఖరికి సుజనా చౌదరి వ్యాఖ్యలే నిదర్శనo

రంజాన్ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలకు నిరంతరాయంగా కరెంటు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందంటూ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహ్మాన్ తీవ్రంగా ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సుజనా చౌదరి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెహ్మాన్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వారంలోగా బహిరంగంగా ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పార్టీలకు అతీతంగా ఏకమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇంటితోపాటు సుజనా చౌదరి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్తు కోతలకు సంబంధించి సుజనా చౌదరి ఈనెల 22వ తేదీన పత్రికలకు విడుదల చేసిన ప్రకటన ప్రతిని ఈ సందర్భంగా రెహ్మాన్ ప్రదర్శించారు. ముస్లింల పట్ల టీడీపీ వైఖరికి సుజనా చౌదరి వ్యాఖ్యలే నిదర్శమని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీయే అధికారంలో కొనసాగడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు డిక్లరేషన్ల పేరుతో బీసీలు, ఎస్సీలు, ముస్లింలను మోసగించే పనిలో ఉన్నారని ఆరోపించారు. 

రంగారెడ్డి జిల్లాలో విజయమ్మ పర్యటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇదే కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)తోపాటు మేడ్చల్ నియోజకవర్గ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు వైస్సార్ సీపీలో చేరనున్నారు. వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను విజయమ్మ వివరించే అవకాశం ఉంది. 

భారీ స్వాగత సన్నాహాలు...
గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగతానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, జనార్దన్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్ ఏర్పాట్లను పరిశీలించారు.

చంద్రబాబు ప్రకటనకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలో నూటికి నూరు శాతం చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయతీ


అసెంబ్లీలో బీసీలకు వంద స్థానాలు రిజర్వ్ చేయాలని విజయమ్మ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. ఆ ప్రతిపాదనను బీసీలు అందరూ హర్షిస్తున్నారు. బీసీలకు వంద టిక్కెట్లు, పది వేల కోట్లతో సబ్ ప్లాన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన డిక్లరేషన్‌ను కూడా మేం స్వాగతించాం. అయితే చంద్రబాబు ప్రకటనకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలో నూటికి నూరు శాతం చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయతీ కనిపిస్తున్నాయి. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. మిగతా డిమాండ్ల మీద కూడా డిక్లరేషన్ ప్రకటించాలి. చట్ట సభల్లో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని వైఎస్ పరితపించారు. అందుకోసం ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ వద్దకు వెళ్దామని వైఎస్ అప్పట్లో నాతో చెప్పారు. అందుకు సన్నద్ధమవుతున్న సమయంలోనే దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం కేంద్రంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావాలి. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ చేసిన పలు ఆలోచనలు సగంలోనే ఆగిపోయాయి. వాటన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిచేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నందున బీసీల కోసం చంద్రబాబు ప్రకటించిన డిక్లరేషన్‌కంటే మెరుగైన వాటిని వైఎస్సార్ సీపీ ప్రకటించాలి. ఇప్పటికే ఒక విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించినందున మిగతా వాటిపైనా అదే స్పష్టత ఇస్తూ బీసీల్లో నమ్మకాన్ని కలిగించాలి.

బీసీలకు సరైన న్యాయం 

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనతో బీసీలకు రాబోయే రోజుల్లో సరైన న్యాయం జరుగుతుంది. జెండాలు మోయడం, ధర్నాలు చేయడానికే పరిమితమైన బీసీలకు విజ యమ్మ ప్రకటనతో రాజకీయంగా మంచి జరుగుతుంది.
-వెంకటస్వామి నాయుడు, గౌరకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

బీసీల్లో స్పూర్తి నింపారు 

చట్ట సభల్లో వంద స్థానాలు రిజర్వేషన్ చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ చేసిన ప్రకటన బీసీల్లో స్ఫూర్తి నింపింది. వైఎస్‌చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్నప్పటికీ, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం అమలుకావడంలేదు. వైఎస్ పోయిన తర్వాత ఆయన వెంటే 108లాంటి మంచి మంచి పథకాలూ పోయాయి. వైఎస్ అందరిమాదిరిగా బతకలేదు. చరిత్రలో నిలిచిపోయేట్లుగా జీవించారు. జగన్ కూడా తండ్రి మాదిరిగా మంచి పేరు తెచ్చుకోవాలి.
-రాంకోటి (ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేత)


అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం

విజయమ్మ చేసిన ప్రతిపాదనతో ఇన్నాళ్లూ చట్ట సభలకు దూరమైన బలహీనవర్గాల వారు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం రానుంది. దీన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. మిగతా పార్టీలు అందుకు ప్రయత్నం చేయాలి.
-లాల్‌కోట వెంకటాచారి 
(విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)

అన్ని పార్టీల వైఖరి కోరాలి

బీసీల కోసం విజయమ్మ చేసిన ప్రతిపాదనపై వైఖరి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ సమావేశాలప్పుడు అన్ని పార్టీలను నిలదీయాలి. లక్షలాదిమంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు విజయమ్మ చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ దీక్ష వంటి పోరాటాలకు బీసీలు మద్దతివ్వాలి.
-డి.గిరిబాబు (క ళింగ సంఘం రాష్ట్ర నేత)

ఆ రెండు నియోజకవర్గాలూ ఉండొచ్చు కదా! 

అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బోయ వ్యక్తికి అవకాశం కల్పిస్తామని ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటన కలిగించిన ఆనందానికి విజయమ్మ ప్రకటన తోడయింది. 100 మంది బీసీలను పంపుదామని విజయమ్మ చేసిన ప్రతిపాదనలోకి ఆమె ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల స్థానం కూడా రావొచ్చు.. లేదా కుప్పం సైతం ఉండవచ్చు కదా! ఆ చరిత్రాత్మక ప్రకటనను సైతం వక్రీకరించడం సరికాదు.
-గోపి (బోయ హక్కుల పోరాట సమితి నేత)

ఆ ప్రతిపాదనలో స్త్రీల కోటా ఉంచండి 

విజయమ్మ ప్రతిపాదన బీసీలకు వరం లాంటిది. అయితే బీసీల్లోని అణగారిన కులాలకు సరైన ప్రాధాన్యం కల్పించే దిశగా కూడా కృషి చేయాలి. బీసీలకు ఇవ్వనున్న వంద సీట్లలో మహిళా కోటాను సైతం దృష్టిలో ఉంచుకోవాలి.
-శైలజ (వడ్డెర హక్కుల అభివృద్ధి సంఘం గౌరవాధ్యక్షురాలు)

నిజమైన బీసీలకే టిక్కెట్లు ఇవ్వాలి 

అసెంబ్లీకి పంపించే వంద మందిలో నిజమైన బీసీలే ఉండాలి. పెట్టుబడిదారులు, ఎన్నారై, వ్యాపారవేత్తలు ఉండకూడదని వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేయకపోతే అసెంబ్లీకి 150 మందిని పంపినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎన్నారైలు, వ్యాపారవేత్తలు వారి వ్యాపారాలు చూసుకుంటారే తప్ప బీసీల సమస్యలపై మాట్లడలేరు. ఎన్నికలకు సంవత్సరం ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు ప్రకటించాలి. 
-నారాయణ గౌడ్, గౌడ సంఘాల ఐక్యవేదిక

కృష్ణయ్య పోరాట ఫలితమే 

రాష్ట్రంలో 35 ఏళ్లుగా ఆర్.కృష్ణయ్య చేస్తున్న నిర్విరామ పోరాట ఫలితంగానే నేడు వంద స్థానాల ప్రకటన వెలువడింది. రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా లక్ష్య సాధన కోసం బీసీలు కలసికట్టుగా పోరాడాలి. బీసీ రాజ్యాధికార లక్ష్యం కోసం ఏ పార్టీ ముందుకొచ్చినా కలుపుకొనిపోవాలి. 
-జాజుల శ్రీనివాస్‌గౌడ్ 
(బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)

బీసీలను ఓడించే కుట్ర చేయొచ్చు 

బీసీలను చట్ట సభలకు పంపాలన ప్రతిపాదన అభినందనీయం. అయితే కొన్ని పార్టీలు దీనికి మొక్కుబడి మద్దతునిస్తూ అగ్రవర్ణాలకు మద్దతిచ్చే ప్రయత్నం చేస్తాయి. బీసీలను ఓడించే కుట్ర చేయొచ్చు. గతంలో కొన్ని పార్టీలు ఇలా చేశాయి. 
-డి.మధు (కర్నూలు)

అణగారిన వర్గాలకూ అవకాశమివ్వాలి 

కొన్ని కులాలు ఎద గటమే బీసీలు అభివృద్ధి చెందినట్లు కాదు. ఆ విభాగం కిందికి వచ్చే అణగారిన వర్గాలకూ మంచి వేదిక కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఎంత ఆలోచిస్తోందో విజయమ్మ ప్రకటన ద్వారా స్పష్టమయింది. వెనకబడిన వర్గాలలోని ఎదగని కులాలు పైకి వచ్చేందుకు ఈ ప్రకటన అవకాశం కల్పించాలి.
-పుల్లయ్య (నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకుడు)

క్షేత్రస్థాయి యువతకు మంచి అవకాశం 

వందమంది బీసీలను శాసన సభకు పంపించాలనే వైఎస్సార్ కాంగ్రెస్ ఆలోచన క్షేత్రస్థాయి నుంచి ఎదగాలని కోరుకుంటున్న యువతకు మంచి అవకాశం. వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆ పార్టీకి ధన్యవాదాలు.
-కె.వేణుమాధవ్ (కృష్ణా జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు)

బీసీలకు మంచి రోజులు 

విజయమ్మ ప్రకటనతో బీసీలకు మంచి రోజులు వచ్చాయి. వారికి రాజ్యాంగబద్ధ వేదికల్లో అవకాశం పొందేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేదికగా నిలుస్తుంది. 
-రమాదేవి (బీసీ సంక్షేమ సంఘం మహిళా నేత)

బీసీలకు 100 స్థానాలు కచ్చితంగా ఇవ్వాలి 

అసెంబ్లీలో బీసీలకు వంద స్థానాలు రిజర్వు చేయాలనే ప్రతిపాదన అమలుకు ఏ పార్టీలూ ముందుకు రాకపోయినా, వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం వంద మందిని చట్ట సభలకు పంపేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అలా చేస్తేనే బీసీలు ఆ పార్టీని హర్షిస్తారు. గతంలో ఓబీసీల కోటాలోని 27 శాతం నుంచి 4 శాతం మైనారిటీలకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదన చేసినప్పుడు రాష్ట్రంలోని ప్రధానపార్టీలు మౌనంగా ఉన్నాయి. 
-దుర్గయ్య గౌడ్ (బీసీ సంఘం)


బీసీల గురించి ఆలోచించడం చాలా సంతోషం

రాష్ట్రంలో 65 ఏళ్ల తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు బీసీల గురించి ఆలోచించడం చాలా సంతోషం. విజయమ్మ ప్రతిపాదనతో ఇన్నాళ్లూ పార్టీల జెండాలు మోయడానికే పరిమితమైన బీసీలు ఇక నుంచి చట్ట సభల్లో ఎక్కువ సంఖ్యలో ప్రవేశించే అవకాశం కలిగింది. బీసీలు ఐక్యంగా ఉండి వందకంటే ఎక్కువ స్థానాలు సాధించుకునేలా కృషి చేయాలి. దివంగత రాజశేఖరరెడ్డి పేదలకు చేసిన మంచి వల్లే ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. గుడిసెలో పుట్టినవాడు కూడా ఆయన చలువతో ఈరోజు డాక్టర్, ఇంజినీర్ అవుతున్నాడు. 
-ఎ.ఎల్.మల్లయ్య, మత్స్యకారుల సంఘం

విజయమ్మ ఆలోచన చరిత్రాత్మకమైంది 

బీసీలపట్ల వై.ఎస్.విజయమ్మ చేసిన ఆలోచన చరిత్రాత్మకమైనది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో వంద మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో బీసీల గొంతు వినిపించే అవకాశం ఉంటుంది. చట్ట సభల్లో బీసీలు అడుగుపెడితే, రిజర్వేషన్ల చట్టం తప్పకుండా ఆమోదం పొందుతుంది. ప్రజలపక్షాన పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ చట్టం కోసం పోరాడాలి. 
-భాగ్యలక్ష్మి, జి.సుధాకర్, శ్రీకాంత్, ఆరె కటికె సంఘం రాష్ట్ర నేతలు

వంద స్థానాల కోసం ఒత్తిడి చేయాలి 

బీసీల అభివృద్ధి కోసం అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నేతలు ఐకమత్యంతో ఉండాలి. 52 శాతం జనాభా ఉన్న బీసీలు అందుకుతగ్గ సీట్లను సాధించుకోవాలి. వంద స్థానాల కోసం అన్ని పార్టీల్లోనా బీసీ నేతలు వారి నాయకత్వాలపై ఒత్తిడి తేవాలి. ఇన్నాళ్లూ పార్టీల అధినేతలు మనల్ని గమనించారు. ఇక నుంచి వాళ్లని మనం గమనించాలి.
-మొగిలిచర్ల వీరన్న, ఎం.పురుషోత్తం, శాలివాహన సంఘం రాష్ట్ర నాయకులు

మీ చిత్తశుద్ధిని బీసీలు గమనిస్తున్నారు 

జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట సభల్లో 150 మందికి అవకాశం కల్పించాలి. బీసీల సంక్షేమం కోసం కృషిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆలోచనలను ప్రతి వెనకబడిన తరగతికి చెందిన ప్రజలు గమనిస్తున్నారు. విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో వారంతా సరైన నిర్ణయం తీసుకుంటారు.
-రాజేశ్వరరావు (వీరభద్రయ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)

బీసీలను గుర్తించింది ఎన్టీఆర్, వైఎస్సే 

రాష్ట్రంలో బీసీలను గుర్తించి వారికి లబ్ధి చేకూర్చిన ఘనత దివంగత నేతలైన ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లకే దక్కుతుంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ బీసీలను పట్టించుకోలేదు. అయితే ఆయనిప్పుడు వంద స్థానాలు ఇస్తామనడం ఆహ్వానించదగ్గ పరిణామం. బీసీల అభివృద్ధికి వైఎస్ చాలా కృషిచేశారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు మేమంతా స్వాగతిస్తున్నాం.
-నీల వెంకటేష్ (బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు)



మంచి ఆశయం

రాజశేఖరరెడ్డి ఆశయాలతో వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల కోసం మంచి ప్రతిపాదన చేసింది. వంద స్థానాల్లో కూడా తక్షణమే అభ్యర్థులను ప్రకటించాలి. ప్రస్తుతం అన్ని పార్టీలు రైతుల గురించి మాట్లాడుతున్నందున అందులోనూ బీసీ రైతులకు నిర్దిష్ట ప్రణాళిక ఉండేట్లుగా చూడాలి.
-హనుమంతరావు (బీసీ ఎప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)


కుల సంఘాల పోరాట ఫలితమే 

బీసీ కుల సంఘాలు చేసిన పోరాటం ఫలితంగానే ఈరోజు చట్టసభల్లో వంద స్థానాలు ఇవ్వడానికి ప్రధాన పార్టీలు ముందుకొచ్చాయి. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చేదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను అన్ని పార్టీలు పెద్ద మనసుతో ఆచరిస్తే మంచిది. బీసీలపట్ల ప్రేమ ఉంటే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు కూడా విజయమ్మ ప్రతిపాదనకు ముందుకురావాలి. 
-జి.మల్లేష్ (బీసీ ఫ్రంట్ చైర్మన్)

సంఘటితంగా ఉండాలి 
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనపై బీసీలందరూ కులాలుగా చీలిపోకుండా సంఘటితంగా ఉంటే మరింతగా లబ్ధి కలుగుతుంది.
-ముసలయ్య (చేనేత సంఘం నేత)

ఎనలేని మేలు చేసిన వైఎస్ 

సంచారజాతికి చెందిన మా కులాన్ని అగ్రవర్ణాలు ఉండే బీసీ-డి కోటా నుంచి బీసీ-ఎలోకి మార్చాలని ఎందరికో మొరపెట్టుకున్నాం ఫలితం లేకపోయింది. ఆ వరం మాకు అందించిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన నిర్ణయంతో అనేకమంది డాక్టర్లు, విద్యావంతులు అవడమే కాకుండా పదోన్నతులు కూడా పొందారు. అంతేకాకుండా రూ.5.5 కోట్లతో ఏర్పాటుచేసిన ఫెడరేషన్ వల్ల మాకు ఆర్థిక సాంత్వన కలిగింది. వైఎస్ నిర్ణయాలకు కొనసాగింపుగా విజయమ్మ చేసిన ప్రకటనకు బీసీలందరి తరపున ధన్యవాదాలు.
-కోల శ్రీనివాస్ (పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)

బీసీలందరికీ మేలు 

విజయమ్మ ప్రకటనకు మద్దతిస్తే బీసీలందరికీ మేలు కలుగుతుంది. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందనే కొన్ని పార్టీలు ముందుకురావడంలేదు. 
-శివరాఘవయ్య (కృష్ణ బలిజ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు)

అన్నివర్గాల్లోనూ చలనం 

విజయమ్మ ప్రకటనతో అన్ని వర్గాల్లోనూ చలనం వచ్చింది. తమకు అధికారం దక్కుతుందని బీసీల్లో గర్వం, సీటు కదిలిపోతుందని అగ్రకులాల్లో గుబులు, తమ ఉనికి ఏమౌతుందోనని పార్టీల్లో వణుకు ప్రారంభమయింది. 
-దివాకర్ (వైజాగ్ జిల్లా బీసీ ప్రతినిధి) 


వీరితోపాటు మరికొన్ని సంఘాలకు చెందిన తిరుపతిరావు, లక్ష్మి, రవి, సాగర్, మహబూబ్‌నగర్ వాసి వేణుగోపాల్ తదితరులు కూడా ప్రసంగించారు.

టీడీపీకి రైతుల షాక్


విజయవాడ, న్యూస్‌లైన్: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలంటూ కృష్ణా నది ఇసుక తిన్నెలపై శనివారం టీడీపీ నిర్వహించిన మహాధర్నాకు రైతులు షాకిచ్చారు. కృష్ణా జిల్లా నుంచి రైతులు నామమాత్రంగానే రాగా, పొరుగు జిల్లాల నుంచీ స్పందన కరువై సభా స్థలి వెలవెలపోయింది. పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి ఒకరిద్దరు నాయకులు మాత్రమే హాజరయ్యారు. పైగా ఈ రెండు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టడం మరింత చర్చనీయాంశమైంది. పోలీసులు మాత్రం భారీగా పికెట్లు ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారు. చివర్లో ప్రకాశం బ్యారేజీ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండ వేసి వినతిపత్రం ఇస్తామంటూ నేతలు హైడ్రామా సృష్టించారు. దాంతో వారు బ్యారేజీ గేట్లను ముట్టడిస్తారేమోనని పోలీసులు అరెస్టు చేశారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 510 అడుగుల కంటే తక్కువుంటే నీరు విడుదల చేయొద్దన్న హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులను రద్దు చేయించాలని అంతకుముందు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు డిమాండ్ చేశారు. లేదంటే 13 లక్షల ఎకరాల్లో పంటలెండి ఆహార సంక్షోభం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలంలో 760 అడుగులు, సాగర్‌లో 490 అడుగులున్నా కృష్ణా డెల్టాకు నీరివ్వొచ్చని మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు అన్నారు.

కాంగ్రెస్‌ను వీడాకే జగన్‌పై సీబీఐ విచారణ :బీజేపీ సీనియర్ నేత జైట్లీ

‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై ఎలాంటి విచారణల్లేవు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చాక మాత్రం సీబీఐ జగన్‌పై విచారణ చేపట్టింది’ అని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ అన్నారు. శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ చార్జిషీటు, రాష్ట్రంలో అవినీతి తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఆయన పైవిధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై విచారణ చాలా ఆలస్యంగా జరుగుతోందని, అవినీతి జరిగినప్పుడే విచారణ చేసుంటే బాగుండేదని జైట్లీ అభిప్రాయపడ్డారు. ధర్మాన వ్యవహారంపై మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

పరమ రహస్యం! దాని పేరు ‘సుడిగాడు!’.


‘కిరణ్ కుమార్ రెడ్డిలో ఏం చూసి ఆయన్ను ముఖ్యమంత్రిని చేసిందో కాంగ్రెస్ అధిష్టానం?!’- ఈ అనుమానం మీకో నాకో వస్తే అందులో విశేషం లేదు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నెగ్గుకొస్తున్న ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డికే ఇలాంటి అనుమానం తలెత్తడం కన్నా విడ్డూరమేముంది? కిరణ్ కుమార్ రెడ్డి గొప్ప రాజనీతిజ్ఞుడా? కాదు! పరిపాలనా దక్షుడా? కానేకాదు! రాష్ట్ర రాజకీయాలను ఔపోసన పట్టేసిన అభినవ అగస్త్యుడా? ఎబ్బే, ఎంతమాత్రం కాదు. కనీసం ఒక్క భాషలోనయినా, శ్రోతలను ఆకట్టుకునేలా మాట్లాడగల వక్తా? అంటే అదీ కాదు. పోనీ, కన్నుమూసి తెరిచేలోగా తలకాయలు మార్చిపారేయగల జాదూగరా? ఆయన శత్రువులు కూడా అనలేని మాట అది! మరేం చూసి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టారో? కాంగ్రెస్ కురువృద్ధుడు పురుషోత్తమరెడ్డికి ఎదురయిన ధర్మ సంకటమే మనకూ తప్పలేదు!

అయినా, పురుషోత్తమరెడ్డి గారు పెద్దవారు. ఆయనకో చిన్న సామెత తెలిసే ఉంటుంది- ‘అందమన్నది చూసేవారి కళ్లలో ఉంటుంది!’ మీకూ, నాకూ, పురుషోత్తమరెడ్డిగారికీ కిరణ్ కుమార్ రెడ్డిలో ఏ ప్రత్యేకతా కనిపించి ఉండకపోవచ్చు. అసలు నిజంగానే మన ముఖ్యమంత్రిలో ఏ ప్రత్యేకతా లేకపోనూ వచ్చు. కానీ, ఆయన్ను ఆ పదవిలో కూర్చోపెట్టిన అధిష్టానమ్మ ఉందే, ఆమెకు కిరణ్ కుమార్ రెడ్డిలో ఏ విశిష్టత కనిపించిందో? మన దృష్టి కన్నా, ఆమె దృష్టికి ఎక్కువ ప్రాముఖ్యం ఉందన్న వాస్తవాన్ని సవినయంగా అంగీకరించాల్సిందే!

ఇంతకీ, సదరు అధిష్టానమ్మ ఎంపిక చేసి, కిరణ్ కుమార్ రెడ్డికి పదవి కట్టబెట్టిన అనంతరం, మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో పురుషోత్తమరెడ్డి శుక్రవారం నాడు -అగస్ట్ 24న- విలేకరుల సమావేశంలో సవివరంగా పేర్కొన్నారు. ‘రాష్ర్టంలో ఏ ప్రాంతంలోనూ కరెంటు ఉండడం లేదు- గుక్కెడు మంచినీళ్లక్కూడా దిక్కులేదు- ఇక సాగు నీరు విషయం మాట్లాడ్డమే అనవసరం- పేదలు కడుపుకింత కూడుదినే పరిస్థితులు కూడా లేవు- కూరగాయల ధరలు నింగినంటాయి- ఇవీ నేటి పరిస్థితులు!’ అన్నారు పురుషోత్తమరెడ్డి. ఆయనతో విభేదించడం కష్టం. ఎందుకంటే ఆయన చెప్పిందంతా పచ్చి నిజం!

ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడి ఉన్న నేపథ్యంలో మన సీఎంగారూ, ఆయనకు సరిజోడునని అనుకుంటున్న పీసీసీ అధ్యక్షుడూ, వారికి సహచరులయిన మంత్రులూ, ఆశించిన పదవులు దొరక్క పరాయి ప్రాంతాలకు పారిపోయిన పెద్దలూ ఏం చేస్తున్నారు? అధిష్టానమ్మకు అడుగడుగు దండాలు అర్పించుకుంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకరిమీద మరొకరు చాడీలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వమనే పదార్థం ప్రబంధాంగనల నడుములాగా -అస్తినాస్తి విచికిత్సా హేతువుగా- పరిణమించింది! కాంగ్రెస్ కురువృద్ధుడు పురుషోత్తమరెడ్డి ఈ పరిణామాలపట్ల తీవ్ర ంగా మండిపడడంలో వింతే ముంది?

అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఏర్పడి ఉన్న పరిస్థితుల మధ్య ఓ సామ్యం చూపించారు పురుషోత్తమరెడ్డి . ఢిల్లీలో అధిష్టానమ్మ సోనియా గాంధీ, తోలుబొమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇద్దరూ చేస్తున్న పనే ఇక్కడ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డీ, బొత్స సత్యనారాయణా కూడా చేస్తున్నారు. ఇంతకీ అక్కడా ఇక్కడా ఈ కాంగ్రెస్ మహాశయులు చేస్తున్న ఘనకార్యమేమిటి? ‘అవినీతిపరులయిన మంత్రులను వెంటబెట్టుకుని కాంగ్రెస్ పరువు బజారుకీడ్చడమే’నని పురుషోత్తమరెడ్డి తేల్చేశారు. ‘రాష్ట్రంలో కరువు కాటకాలు ఇంతకు ముందెప్పుడూ రాలేదా? అప్పటి నాయకులు ఇలాగే చేశారా? మన పాలకులకు బొత్తిగా సంకల్ప శుద్ధి లేదు. పదవి ఉంటుందా ఊడుతుందా అనే యావతప్పితే ప్రజలను గురించి వారికి పట్టదు!’ అని జాడించేశారు పురుషోత్తమరెడ్డి.

కిరణ్ కుమార్ రెడ్డి లక్షణమేమిటో తానెన్నడో కనిపెట్టి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పానని పురుషోత్తమరెడ్డి వెల్లడించారు. ‘అతివినయం ధూర్త లక్షణమ్’ అన్న పెద్దల మాట కిరణ్ విషయంలో నూరుశాతం నిజమయిందన్నారు పురుషోత్తమరెడ్డి. ‘నాడు వైఎస్ అడుగులకు మడుగులొత్తిన కిరణ్ నేడు ఆయన ఫొటోనే మాయం చెయ్యాలనుకుంటున్నాడు. అయితే, మహానేత బొమ్మ జనహృదయాల్లో స్థిరపడిపోయింది. వందమంది కిరణ్ కుమార్‌లూ, వెయ్యిమంది సోనియమ్మలూ కూడబలుక్కున్నా ఆ బొమ్మను ఏం చెయ్యలేరు’ అన్నారు పురుషోత్తమరెడ్డి.

ఇవన్నీ విన్న తర్వాత పురుషోత్తమరెడ్డిగారికి వచ్చిన సందేహం తొలగకపోగా మరింత బలపడుతోంది. అవునూ, కాంగ్రెస్ అధిష్టానమ్మ కిరణ్ కుమార్ రెడ్డిలో ఏంచూసి ఆయనకా పదవి ప్రసాదించింది? అసలు ఆయనకు అంత అదృష్టంపట్టడానికి దారితీసిన కారణాలేమిటి? ఆలోచించగా, చించగా ఈ మధ్య తయారయిన ఓ సినిమా టైటిల్ గుర్తుకొచ్చింది. దాని పేరు ‘సుడిగాడు!’.
ఇంతకుమించిన తర్కమేదీ తోచడం లేదు మరి! 

బీసీల కోసం వైఎస్ఆర్ సిపి కసరత్తు

శాసనసభకు వంద మంది బీసీలను పంపిద్దాం అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ లక్డీకపూల్‌ సెంట్రల్‌ కోర్ట్‌ హోటల్‌లో పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 40 బీసీ సంఘాలు,50కి పైగా కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ బీసీ నేతలు బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిబద్దతతో పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యా, ఉద్యోగం, సామాజికంగా, రాజకీయంగా వారు ఎదగడానికి పార్టీ తోడ్పడుతుందన్నారు. అంతేకాక అందరి సూచనలు, సలహాలను దృష్టిలో ఉంచుకుని అన్ని బీసీ కులాలు హర్షించేలా పార్టీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తుందని బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ గట్టు రామచంద్రరావు చెప్పారు.

Monday 20 August 2012

ఎదురు తన్నిన బీసీ ఎత్తు (andhrabhoomi)

http://www.andhrabhoomi.net/content/bc-strategy-misfires


హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ట్రంలో బీసీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ‘వంద టికెట్లు కాదు, బీసీలకు వంద సీట్లు’ అనే ప్రతిపాదనను బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆహ్వానించారు. కానీ టిడిపి నేతలు మాత్రం జరుగుతున్న పరిణామాలపై మండిపడుతున్నారు. ‘మేం వంద అంటే మీరు 105 అనండి పరవాలేదు. కానీ లేఖ ఏమిటి? దాన్ని ఉప సంహరించుకోండి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నారు. టిడిపి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కేటాయిస్తామని ప్రకటించి ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా హడావుడికి శ్రీకారం చుట్టింది. వివిధ కుల సంఘాల నేతలను ఎన్టీఆర్ భవన్‌కు తీసుకొచ్చి బాబును సత్కరించే బాధ్యతను జిల్లా నేతలకు పార్టీ నాయకత్వం అప్పగించింది. బీసీల నుంచి రోజూ ఒక కులం నాయకులు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి బాబును అభినందించే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ హడావుడి కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఊహించని విధంగా బీసీ రాజకీయం మొదలైంది. ‘వంద టికెట్లు కాదు, వంద సీట్లు కేటాయిద్దాం’ అంటూ వైఎస్ విజయమ్మ చంద్రబాబుకు రాసిన లేఖ టిడిపిని ఇరకాటంలో పెట్టింది. టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ వాదంపై పేటెంట్ హక్కుగా భావిస్తున్న స్థాయిలో బీసీ అంశానికి పేటెంట్ హక్కు మాదేననే స్థాయిలో టిడిపి ప్రచారం సాగించాలని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బీసీ టికెట్లపై మీ అభిప్రాయం చెప్పాలి అని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను టిడిపి డిమాండ్ చేసింది. తీరా వైఎస్సార్ కాంగ్రెస్ కొత్త మెలిక పెట్టడంతో లేఖను ఉపసంహరించుకోవాలని టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. టిడిపి బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే, మీరు 105 అని చెప్పండి. అంతే తప్ప ఇదేంటి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. మరో ప్రధాన కార్యదర్శి అనురాధ ఇతర నేతలు సైతం ఇదేవిధంగా విమర్శించారు.
గత ఎన్నికల్లో హామీ ఇచ్చి బీసీలకు వంద సీట్లు ఇవ్వలేకపోయినప్పటికీ, ఈసారి మాత్రం బాబు కచ్చితంగా వంద సీట్లు ఇవ్వాలనే నిర్ణయంతోనే ఉన్నారని టిడిపి సీనియర్ నాయకులు తెలిపారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం లేదని తెలిపారు. వంద మందికి టికెట్లు ఇవ్వడం కాదు, అసెంబ్లీకి పంపిద్దాం అంటూ ఆ పార్టీ చేసిన సూచన మంచిదే కానీ ఒకవేళ మేం దాన్ని ఆమోదిస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం తప్ప మాకొచ్చే ప్రయోజనం ఏముందని టిడిపి నాయకులు ప్రశ్నించారు. మెజారిటీ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. వీటిలో వంద నియోజక వర్గాలను బీసీ నియోజక వర్గాలుగా గుర్తించి కేటాయించేందుకు ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ టిడిపి అలా చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్‌ను అనుసరించినట్టు అవుతుందని టిడిపి నాయకులు తెలిపారు. అంతేకాదు ఇబ్బంది లేని వంద నియోజక వర్గాలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయించడం వేరు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలను గుర్తించి టికెట్ ఇవ్వాలంటే ఇంతకాలం ఆ నియోజక వర్గంపై ఆశలు పెట్టుకొని, ఖర్చు భరిస్తున్న టిడిపి నాయకుల నుంచి తిరుగుబాటు వస్తుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇంకా అభ్యర్థుల ఖరారు చేసే పరిస్థితి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ వెళ్లలేదు కాబట్టి వాళ్లు ఉత్సాహంగా వంద టికెట్లు కాదు వంద సీట్లు ఇద్దామని ప్రతిపాదన చేస్తున్నారని టిడిపి నాయకులు విమర్శించారు. బీసీలకు తాము టికెట్ ఇచ్చినా ఇతర పార్టీల నాయకులు అగ్రవర్ణాలకు ఇవ్వడం వల్ల సమ ఉజ్జీల మధ్య పోటీ లేక బీసీ అభ్యర్థులు ఓడిపోతారని 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రకటనలను పత్రికల నుంచి సేకరించారు. తమ ప్రతిపాదన పట్ల చంద్రబాబు స్పందన వెలువడిన తరువాత ఈ ప్రకటనల గురించి ప్రస్తావిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మాట మీరే అన్నారు కాబట్టి ఇద్దరం బీసీలకే టికెట్ ఇద్దాం. ఈ ప్రతిపాదనకు మీరు ముందుకు రావాలి అని డిమాండ్ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఆశ్చర్యపోయా!
విజయమ్మ లేఖ చూసి ఆశ్చర్యపోయానని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. గత చరిత్ర మరిచిపోయి ఆమె లేఖ రాశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన విశ్వకర్మ సమావేశంలో, తిరుపతిలో ఇదే విషయం మాట్లాడారు. వందమందిని అసెంబ్లీకి పంపేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా మేం వంద సీట్లు ఇస్తామంటే మీరు 150 సీట్లు ఇవ్వండి అంతేగాని లేఖరాయడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో వైఎస్‌ఆర్ పార్టీకి వణుకుపుట్టిందని అన్నారు. వంద నియోజక వర్గాలను గుర్తించి వాటిని రెండు పార్టీలు బిసిలకే కేటాయించాలి అనే ప్రతిపాదన పట్ల చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదు.

రాష్ట్రంలోని ఎయిడెడ్, మున్సిపల్ టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందే

రాష్ట్రంలోని ఎయిడెడ్, మున్సిపల్ టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీవైఎస్సార్‌టీఎఫ్) స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కె.ఓబుళపతి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 010 పద్దు కింద వేతనాలు పొందుతున్న వారికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చినపుడు ఎయిడెడ్, మున్సిపల్ టీచర్లను కలపకపోవడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

జగన్‌కు రంజాన్ శుభాకాంక్షలూ చెప్పనివ్వరా?

పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన తమకు జైలు అధికారులు అనుమతివ్వకపోవటం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎంఏ రెహమాన్ మండిపడ్డారు. సోమవారం రంజాన్ ప్రార్థనలు ముగిసిన అనంతరం ఆయన నేరుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లి, జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అనుమతించాలని అధికారులను అభ్యర్థించా రు. అయితే వారు నిరాకరించటంతో రెహమాన్ అక్కడే నిరసన వ్యక్తం చేశారు.

ఆరోగ్యశ్రీ భవన్‌కు వైఎస్సార్ పేరు తొలగింపు.గుమ్మంలో ఉన్న నిలువెత్తు వైఎస్ ఫొటో కూడా

గుమ్మంలో ఉన్న నిలువెత్తు వైఎస్ ఫొటో కూడా తీసేశారు
చిరునామాలో కూడా ఆయన పేరు కనపడకూడదని ఆదేశాలు
ఓపీ, డయాగ్నస్టిక్ స్లిప్‌లలోనూ ఆయన బొమ్మను దూరం చేసిన సర్కారు
బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా తీసేశారని ఉద్యోగుల ఆవేదన

హైదరాబాద్, న్యూస్‌లైన్: కోట్లాదిమంది గుండెల్లో కొలువైన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను తొలగించడం, ఆయన పేరును తలచుకోకుండా చేయడమే సర్కారు లక్ష్యమని మరోసారి స్పష్టమైంది. పేద ప్రజల ఆరోగ్యం కోసం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆయన పేరును, ఫొటోను దూరం చేసి సర్కారు తన వైఖరిని వెల్లడించింది. కోట్లాదిమందికి పునర్జన్మనివ్వడమేకాకుండా ఇతర రాష్ట్రాలకూ, ఇతర దేశాలకూ రోల్‌మోడల్‌గా నిలిచిన ఈ పథకాన్ని ఓవైపు నిర్వీర్యం చేస్తూనే, మరోవైపు రూపకర్త పేరును, బొమ్మను కూడా ఆరోగ్యశ్రీ పథకం నుంచి చెరిపివేసింది. ఇందులో భాగంగా తాజాగా జూబ్లీహిల్స్‌లోని వైఎస్సార్ భవన్ (ఆరోగ్యశ్రీ భవన్) నుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాదు భవన్‌లోకి వెళ్లగానే దర్శనమిచ్చే నిలువెత్తు వైఎస్సార్ బొమ్మను కూడా అక్కడ్నుంచి తొలగించారు. ఆ స్థానంలో రేపోమాపో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 

2009 సెప్టెంబర్ 2న రాజశేఖరరెడ్డి మరణించిన మరుసటి రోజే ట్రస్ట్‌భవన్ ఉద్యోగులు సంతాప సభ ఏర్పాటు చేశారు. దీంతోపాటే ఈ భవన్‌కు వైఎస్సార్ భవన్‌గా పేరు పెట్టాలని బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.సత్యనారాయణ ఈ తీర్మానాన్ని ఓకే చేశారు. అప్పటినుంచి ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, వైఎస్సార్ భవన్‌గా చలామణీ అవుతోంది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లోగానీ, కార్డ్‌లలోగానీ ఓవైపు సీఎం ఫొటో, మరోవైపు వైఎస్ ఫొటో ఉండేది. ఇప్పుడు కేవలం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో మాత్రమే పెట్టారు. అంతేకాదు డయాగ్నస్టిక్స్ స్లిప్‌లు, ఓపీ స్లిప్‌లు, కేస్ షీట్ స్లిప్పుల్లోనూ వైఎస్ ఫొటో తీసేశారు.

చిరునామాలోనూ వైఎస్ పేరు రాయవద్దు: ఇకపై ఆరోగ్యశ్రీ భవన్‌కు వచ్చే ఉత్తరాల్లోగానీ, ఇక్కడ నుంచి పంపే లెటర్‌లలోగానీ, లెటర్ హెడ్‌లలోగానీ, చిరునామాలో గానీ ఎక్కడా వైఎస్సార్ భవన్ అనే పేరు కనిపించకూడదని ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, వైఎస్సార్ భవన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎదురుగా, జూబ్లీహిల్స్ అనే చిరునామా ఉండేది. ఇప్పుడు వైఎస్సార్ భవన్, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రెండు పేర్లనూ తొలగించారు. ఆ స్థానంలో ఆ భవనానికి ఉన్న డోర్ నంబర్ వాడుతున్నారు. వైఎస్ పేరు, ఆయన ఫొటోను తీసేసేందుకు 3 నెలలుగా యత్నిస్తున్నారని, ఎలాంటి బోర్డుమీటింగ్ లేకుండా ఉన్నఫళంగా సర్క్యు లర్ పంపించారని అక్కడున్న కొందరు ఉద్యోగులు వాపోయారు. రాజీవ్ మరణించినా ఆయన పేరుమీద ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతోందని, మరి రాజశేఖరరెడ్డికి ఈ విధా నం ఎందుకు వర్తించదని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై ఆరోగ్యశ్రీ సీఈవో శ్రీకాంత్‌ను సంప్రదించేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు.

బీసీలకు ఏం చేశారు? చంద్రబాబుకు వై.ఎస్.విజయమ్మ ప్రశ్న

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలికి బీసీ సంఘాల ఘన సన్మానం

పులివెందుల (వైఎస్సార్ కడప) న్యూస్‌లైన్: రాష్ట్రంలో బీసీలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రశ్నించారు. ‘బీసీ జనాభా ప్రాతిపదికన వంద అసెంబ్లీ స్థానాలను లాటరీ ద్వారా నిర్ణయిద్దాం.. ఆ సీట్లల్లో బీసీ అభ్యర్థులను మాత్రమే నిలబెడదాం’ అంటూ విజయమ్మ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో.. సోమవారం పులివెందులలో పలువురు బీసీ సంఘాలకు చెందిన నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలువురు నాయకులు పులివెందులలోని విజయమ్మ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ మిఠాయిలు పంచి విజయమ్మకు శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల చదువుల గురించి పట్టించుకున్నారా.. కళాశాలలకు ఎప్పుడైనా వెళ్లారా.. రైతులకు ప్రయోజనం చేకూర్చే ఏదైనా మంచి ఆలోచన చేశారా.? అని నిలదీశారు. చివరకు సాధారణ ప్రజలను కూడా పట్టించుకోలేదని చెప్పారు. పైగా ఇప్పుడు వైఎస్‌ఆర్ పథకాలన్నీ తనవే అంటున్నారని, దీన్నిబట్టి ఆయన మానసిక స్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. 

వైద్యానికి వచ్చి ఏడాదిలో 22 వేల మంది చిన్నారుల మృతి


ప్రభుత్వాస్పత్రుల్లో రోజూ 60 మంది శిశువుల మృత్యువాత
వైద్యానికి వచ్చి ఏడాదిలో 22 వేల మంది చిన్నారుల మృతి
రాష్ట్రంలో శిశు మరణాలపై యూనిసెఫ్ నివేదిక 
వైద్యులు, సదుపాయాల కొరతే ప్రధాన కారణం 
వైద్యుల్లో పీడియాట్రిక్ డాక్టర్లు కేవలం 5 శాతమే 
పిల్లల వార్డుల్లో నర్సుల కొరత
ప్రభుత్వ, బోధనాస్పత్రులన్నిటా వెంటిలేటర్లు, రేడియంట్ వార్మర్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత 
ఉన్న పరికరాల్లోనూ పనిచేసేవి సగానికి సగమే 
నివేదిక ఇచ్చి మూడు నెలలైనా చలించని సర్కారు

తిరుపతి రుయా ఆస్పత్రిలో మూడు మాసాల్లో 130 మంది శిశువుల మృతి!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏడు మాసాల్లో 365 మంది పసిపిల్లలు మృత్యువాత! 
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో ఏడాదిలో ఏడు వేల మందికి పైగా చిన్నారుల మరణం! 

రాష్ట్రంలో ప్రధాన ఆస్పత్రుల్లో శిశు హననం కొనసాగుతూనే ఉంది. ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీరనే లేదు. వెంటిలేటర్లు ఏర్పాటు జరగనే లేదు. వైద్యులు, నర్సుల కొరత ఏళ్లతరబడి కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బోధనాస్పత్రుల్లో పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది. ఏటికేటికీ శిశు మరణాల సంఖ్య తగ్గాల్సింది పోయి పెరుగుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. బరువు తక్కువగా పుట్టిన శిశువుల్లో 90 శాతం మరణిస్తున్నారు. చిన్నారులకు కామెర్లు సోకి ఆస్పత్రికి వెళితే.. ప్రాణాలతో తిరిగివస్తారన్న నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 63 శాతం రేడియంట్ వార్మర్స్ పనిచేయటంలేదని.. దీనివల్ల వేలాది మంది శిశువులు మృతి చెందుతున్నారని స్పష్టమైంది. రాష్ట్రంలో ఏటా 14 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వచ్చి మృతి చెందుతున్న వారి సంఖ్య 22 వేలకు పైనే ఉన్నట్టు యూనిసెఫ్ నివేదికలే చెప్తున్నాయి. 

హైదరాబాద్ (న్యూస్‌లైన్): ‘తల్లులు పోషకాహారం కొరత వల్లే బరువు తక్కువ బిడ్డలను కంటారు. క్లిష్ట సమయాల్లోనే తమ బిడ్డలను ప్రభుత్వాస్పత్రులకు తీసుకొస్తారు. కానీ.. అందుబాటులో వైద్యులు లేక.. ఆక్సిజన్ అందించలేక.. కామెర్ల జబ్బుకు వార్మర్స్ లేక.. ఇతరత్రా వైద్య సదుపాయాలు లేక.. ఆ శిశువులు మరణిస్తున్నారు...’ - రాష్ట్రంలో శిశు మరణాలపై అంతర్జాతీయ శిశు నిధి సంస్థ యూనిసెఫ్ చెప్పిన అక్షర సత్యాలు ఇవి. మూడు నెలల కిందట రాష్ట్ర పరిస్థితులపై యూనిసెఫ్ ఒళ్లు గగుర్పొడిచే నిజాలను బయటపెట్టింది. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో వైద్యం కోసం వచ్చిన 22 వేల మంది శిశువులు మరణించారని యూనిసెఫ్ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అంతా డొల్ల అనీ, ఎక్కడా ప్రమాణాలు లేవని, రోగి బతికి బయటపడితే అదృష్టమేనని వ్యాఖ్యానించింది. యూనిసెఫ్ దేశంలోని 13 మంది నిపుణుల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో అధ్యయనం చేసింది. 

ఈ అధ్యయనం ఆధారంగా బోధనాస్పత్రులపై 132 పేజీలతో నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందించింది. ‘న్యూస్‌లైన్’కు లభించిన ఈ నివేదిక పరిశీలించగా కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. 2011 మే నుంచి 2102 ఏప్రిల్ మధ్య 12 మాసాల్లో 22 వేల మంది శిశువులు ఆస్పత్రులకు వైద్యానికి వచ్చి మృతి చెందినట్టు స్పష్టమైంది. అంటే సగటున ప్రతిరోజూ 60 మంది శిశువులు మృతి చెందుతున్నారు. అత్యధికంగా కర్నూలులో ప్రతి 100 అడ్మిషన్లకు 34 శాతం మంది శిశువులు మృతి చెందారు. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రతి వంద అడ్మిషన్లలో 29.4 శాతం శిశువులు వివిధ కారణాల వల్ల మృతి చెందారు. నీలోఫర్ ఆస్పత్రిలో ఒక్క ఏడాదిలో 7 వేల మంది శిశువులు మృతిచెందినట్టు తేలింది. అయితే మిగతా ఆస్పత్రులతో పోలిస్తే నీలోఫర్ వైద్యం ఫరవాలేదని యూనిసెఫ్ పేర్కొంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, బరువు తక్కువ కారణంగా ఎక్కువ మంది శిశువులు మృతి చెందినట్టు వెల్లడైంది. 

అధ్వానం... అలసత్వం... 

రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో అత్యంత అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయన్నది యూనిసెఫ్ నివేదిక సారాంశం. వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. చాలా ఆస్పత్రుల్లో నవజాత శిశువులకు కామెర్లు సోకితే చికిత్స అందించాల్సిన రేడియంట్ వార్మర్స్ లేవు. చాలా చోట్ల ఉన్నా కూడా అవి పనిచేయటం లేదు. నవజాత శిశువులకు వైద్యం అందించటంలో డాక్టర్లకు కానీ, నర్సులకు కానీ ఎవరికీ సరైన శిక్షణ లేదు. ఫొటోథెరపీ యూనిట్లు పనిచేయటం లేదు. ఎక్కడ చూసినా అలసత్వమే. రుయా లాంటి ఆస్పత్రుల్లో ప్రసవం అనంతరం వైద్యులు చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్ బేసిన్‌లు కూడా లేవు. ప్రతి చోటా పడకల సంఖ్యకు మించి పేషెంట్లు వస్తున్నా ఎక్కడా అదనపు సౌకర్యాలు సమకూర్చిన దాఖలాలు లేవు. విజయవాడ సిద్ధార్థ ఆస్పత్రిలో 20 శాతం, నీలోఫర్‌లో 23 శాతం, కాకినాడ రంగరాయ కళాశాలలో 25 శాతం, వైజాగ్‌లో 28 శాతం, గాంధీలో 52 శాతం, గుంటూరులో 50 శాతం, వరంగల్ ఎంజీఎంలో 51 శాతం పరికరాలు మాత్రమే పనిచేస్తున్నట్టు అధ్యయనంలో తేటతెల్లమైంది. రాష్ట్రంలో బయోమెడికల్ ఇంజనీర్లు లేరు. ఏ పరికరానికీ నిర్వహణ లేక కోట్లాది రూపాయల పరికరాలు మూలనపడి ఉన్నాయి.

వేధిస్తోన్న వైద్యుల కొరత

రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో మొత్తం 2,200 మంది వైద్యులున్నారు. ఇందులో కనీసం పది శాతం మంది చిన్నపిల్లల వైద్యులుండాలి. కానీ ఐదు శాతం కూడా లేరు. ప్రతి ఆస్పత్రిలోనూ పీడియాట్రిక్ డాక్టర్ల కొరతే. ఇక వైద్యవిధాన పరిషత్‌లోని 17 జిల్లా ఆస్పత్రుల్లో 90 మంది పీడియాట్రిక్ వైద్యుల కొరత ఉంది. మరో 77 మంది అనస్థీషియన్ల లోటు ఉంది. నీలోఫర్ లాంటి ప్రధాన శిశు వైద్య ఆస్పత్రుల్లోనే పీడియాట్రిక్ డాక్టర్ల కొరత ఉందంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. మొత్తం పీడియాట్రిక్ వార్డుల్లోనే 600 మంది నర్సుల కొరత ఉందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎన్‌సీయూ (సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్) పరిస్థితి అధ్వానంగా ఉందని, వీటిని తక్షణమే పునరుద్ధరించాలని ఆరు మాసాల కిందట డీఎంఈ నివేదిక ఇచ్చినా వాటిని గురించి పట్టించుకోలేదు. 

ఇదేనా ఆస్పత్రుల పనితీరు?

రాష్ట్రంలోని ఆస్పత్రుల స్థితిగతులపై యూనిసెఫ్ తీవ్ర విమర్శలు చేసింది. పర్యవేక్షణ, పనితీరు లోపభూయిష్టంగా ఉందని చెప్పింది.

తిరుపతి రుయా: వెంటిలేటర్లు పనిచేయటం లేదు. సరైన నీటి సౌకర్యం లేదు. 16 మంది పీడియాట్రిక్ వైద్యులు అవసరమైతే 10 మందే ఉన్నారు. రికార్డుల నిర్వహణ లేదు. ప్రతి వంద అడ్మిషన్లకూ 15 మంది చనిపోతున్నారు. 
కాకినాడ రంగరాయ: ఇక్కడ ఆక్సిజన్ సౌకర్యం కొరత వేధిస్తోంది. వైద్యుల కొరత కూడా ఉంది. మరణాల రేటు చాలా ఎక్కువ. 
గుంటూరు జీజీహెచ్: వెంటిలేటర్లు లేవు. రేడియంట్ వార్మర్స్ పనిచేయటం లేదు. ల్యాబొరేటరీ అత్యంత అధ్వానంగా ఉంది. 24 గంటలూ వైద్యం అనేది ఇక్కడ అందని ద్రాక్షే. ఇక్కడికి వైద్యానికి వస్తున్న నెలలోపు శిశువుల్లో ప్రతి వంద మందికీ 30 మంది మరణిస్తున్నారు.

హైదరాబాద్ గాంధీ: ఇక్కడ నియోనేటాలజీ వార్డే లేకపోవడం విచిత్రం. ఒక రూము నుంచి పేషెంటును మరో రూమ్‌కు షిఫ్ట్ చేసే సౌకర్యం లేదు. పరికరాలు పడకేశాయి. ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. నెలకు 750 మంది డెలివరీ అవుతున్నా కనీస వసతులు లేవు.
హైదరాబాద్ నీలోఫర్: శిశువులకు కామెర్లు సోకితే అంతే. 80 రేడియంట్ వార్మర్స్ ఉంటే 20 మాత్రమే పనిచేస్తున్నాయి. ఫొటోథెరపీ యూనిట్లు పనిచేయటం లేదు. పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా సౌకర్యాల్లేవు. 

విజయవాడ సిద్ధార్థ: నియోనేటాలజీ వార్డే లేదు. సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం లేదు. ఏటా 4 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్నా సౌకర్యాలు లేవు. ప్రతి వంద ప్రసవాలకూ 18 మంది మృతి చెందుతున్నారు. 
కర్నూలు జీజీహెచ్: ఆక్సిజన్ సిలిండర్లు లేవు. రక్తపరీక్షలు సరిగా జరగటం లేదు. 24 గంటలూ వైద్యం అందదు. ఆస్పత్రిలో లైట్లు కూడా లేని పరిస్థితి. ప్రతి వందమంది శిశువుల్లో 34.5 మంది మృతి చెందుతున్నారు. 
విశాఖ కేజీహెచ్: కింగ్ జార్జి ఆస్పత్రి పిల్లల వార్డులో ప్రతి రోజూ కనిష్టంగా రెండు మూడు, గరిష్టంగా ఐదారు మరణాలు సంభవిస్తుంటాయి. వైద్యుల కొరత వల్ల రాత్రి వేళల్లో ఎక్కువగా పీజీలే విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఆస్పత్రుల నిర్వహణపై యూనిసెఫ్ సూచనలు... 
తక్షణమే నియోనేటాలజీ యూనిట్లు ఏర్పాటు చేయాలి

ఎస్‌ఎన్‌సీయూ (సిక్ నియోనేటల్ కేర్ యూనిట్)లను పునరుద్ధరించాలి విద్యుత్ సరిగా లేకపోవటం వల్ల పరికరాలు పాడవుతున్నాయి. పవర్ ఆడిట్ ఉండాలి శిశువులను వార్డులకు మార్చే సౌకర్యాన్ని మెరుగుపరచాలి 24 గంటలూ ల్యాబొరేటరీ సేవలు అందుబాటులోకి తేవాలి ఎస్‌ఎన్‌సీయూలలో అగ్నిప్రమాద రహిత సౌకర్యం కల్పించాలి పరికరాలు కొన్నాక కనీసం ఐదేళ్లయినా నిర్వహణ ఉండాలి పేషెంట్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని పరికరాల సామర్థ్యం పెంచాలి స్టాఫ్ నర్సులకు తక్షణమే శిక్షణ కల్పించాలి శిశువుల జనన, మరణ వివరాలకు రికార్డులు నిర్వహించాలి కేంద్ర నిధులు సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి.

24 గంటలూ వైద్య సేవలు అందిస్తున్నాం 

నీలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పేషెంటు పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నా అడ్మిషన్ ఇస్తున్నాం. వైద్యసేవలు అందిస్తూనే ఉన్నాం. వైద్యులందరూ 24 గంటలూ సేవలు అందిస్తూనే ఉన్నారు. కానీ శిశువులు ఇక్కడికొచ్చే సరికే చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉంటున్నారు. దీంతో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. 
-డా.డి.రంగనాథ్, సూపరింటెండెంట్, నీలోఫర్ ఆస్పత్రి

విజయమ్మ ప్రతిపాదనపై బీసీ సంఘాల హర్షం

 బీసీలకు అసెంబ్లీలో 100 సీట్లు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదన రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది బీసీల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఉందని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో కొన్నిపార్టీలు 100 స్థానాలను బీసీలకు కేటాయిస్తామంటూ ఇచ్చిన హామీలను నిలుపుకోలేదని, ఇప్పుడు మళ్లీ కొత్తగా 100 టికెట్లు ఇస్తామని చెపుతున్నా నమ్ముదామా లేదా అన్న సందిగ్ధంలో బీసీలున్న పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటన కొత్త ఉత్సాహాన్ని నింపిందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

చరిత్రాత్మకం: ఏపీ బీసీ విద్యార్థి సంఘం

బీసీలకు 100 సీట్లు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదన చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం తెలిపింది. అన్ని పార్టీలు దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చి 100 మంది బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ర్యాగ రమేశ్ కోరారు. 

స్వాగతిస్తున్నాం: బీసీ ప్రజాసమితి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను బీసీ ప్రజా సమితి స్వాగతించింది. దేశ జనాభాలో గణనీయంగా ఉన్న బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, విజయమ్మ చేసిన ప్రతిపాదన వల్ల కనీసం 100 మంది బీసీ శాసనసభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

సాధికారతకు బాటలు: బీసీ విద్యార్థి ఐక్య వేదిక

అసెంబ్లీలో బీసీలకు వంద సీట్లు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర బీసీ విద్యార్థి ఐక్యవేదిక స్వాగతించింది. ఇది బీసీల అభ్యున్నతికి, సాధికారతకు ఎంతగానో దోహదపడుతుందని, అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెరిగేందుకు ఉపయోగపడుతుందని ఐక్య వేదిక అధ్యక్షుడు దేశగాని సాంబశివగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి పార్టీ డిక్లరేషన్ చేయాలి: బీసీ రీసెర్చ్ స్కాలర్స్

బీసీలకు 100 టికెట్లు కాకుండా వంద సీట్లు ఇద్దామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడం హర్షణీయమని బీసీ రీసెర్స్ స్కాలర్స్ తెలిపారు. ప్రతి పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని, లేదంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీలు భూస్థాపితం కావడం ఖాయమని స్కాలర్స్ అధ్యక్షుడు ఉయ్యాల వెంకటేశ్ గౌడ్ హెచ్చరించారు.

దేశ చరిత్రలోనే మొదటిసారి: ఉస్మానియా జేఏసీ

బీసీలకు 100 సీట్లు ఇవ్వాలన్న విజయమ్మ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేత లోకేశ్‌యాదవ్ తెలిపారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రతిపాదన చేయడం చరిత్రాత్మకమని, ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. 

పార్టీల అధ్యక్షులే స్పందించాలి: తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ‘అసెంబ్లీకి వందమంది బీసీలను పంపుదాం’ అంటూ చేసిన ప్రతిపాదనపై మిగతా అన్ని పార్టీల అధ్యక్షులే స్వయంగా స్పందించాలని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, టీడీపీలోని కొందరు నేతలు డొంకతిరుగుడు ప్రకటనలతో తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించింది. పార్టీల అధినేత లే స్వయంగా దీనిపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలనే డిమాండ్‌తో త్వరలో వారిని కలవనున్నట్లు జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మరు: వైఎస్సార్‌సీపీ


హైదరాబాద్, న్యూస్‌లైన్: వెనుకబడిన వర్గాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర శాసనసభలో బీసీలకు వంద స్థానాలు ఇవ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేసిన ప్రతిపాదనను స్వాగతించాలని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావులు డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోకుండా వారి కులవృత్తులను ధ్వంసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబని మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ మాయమాటలతో బీసీలను మోసం చేశారని గోవర్ధన్ ధ్వజమెత్తారు. 2007లో వరంగల్‌లో టీడీపీ బీసీ గర్జన సభలో 100 సీట్లిస్తానని చెప్పి మోసం చేశారని గుర్తుచేశారు. అందుకే చంద్రబాబుకు బీసీలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు చేసే నాటకాల్ని ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితిలేదని చెప్పారు. బీసీలకు దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే లబ్ధి చేకూరిందన్నారు. అందుకే వైఎస్‌కు బీసీలు ఆత్మబంధువులుగా ఉన్నారని, ఆయన మరణించి మూడేళ్లు అవుతున్నా మరిచిపోలేకపోతున్నారని తెలిపారు. బీసీలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమే ప్రతినిధి అని గోవర్ధన్ చెప్పారు. 

చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది: గట్టు

బలహీన వర్గాలకు చెందిన 100 మందిని ఎమ్మెల్యేలను చేయాలని విజయమ్మ చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు మిన్నకుండిపోవడంతో ఆయన నిజస్వరూపం బయటపడిందని గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. విజయమ్మ చేసిన ప్రతిపాదనకు బీసీ సంఘాలు, టీడీపీలోని పేద బీసీ నేతలు హర్షిస్తుంటే చంద్రబాబు మాత్రం తేలు కుట్టిన దొంగ మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయమ్మ లేఖతో చంద్రబాబుకు దిమ్మ తిరిగిందన్నారు. ఎన్టీఆర్ హయాంలో సహకార రంగంలో సభ్యత్వ రుసుము రూ.11 ఉంటే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని రూ.300లకు పెంచారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్‌లను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో బీసీలిచ్చిన తీర్పుతో చంద్రబాబు దిమ్మతిరిగి డిక్లరేషన్ అంటూ దొంగ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. విజయమ్మ చేసిన ప్రతిపాదనపై బీసీ కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 24న బీసీ నేతలతో సమావేశం కానున్నట్లు గట్టు వెల్లడించారు. చంద్రబాబు మాటలు నమ్మి శాలువాలు కప్పిన బీసీ నేతలు వైఎస్‌ఆర్ సీపీ చేసిన ప్రతిపాదనకు ఆయన్ని ఒప్పించాలని గట్టు సూచించారు.

Gattu and Bajireddy addressing Media on 20th Aug 2012

YS Vijayamma Wrote a Letter to Uranium Corporation Ind Ltd Director

BC Leaders Meet YS Vijyamma at Pulivendula

ఈసీ ప్రకటనతో తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించిన నేతల గుండెల్లో రైళ్లు


‘తాను మునిగిందే గంగ...’ అన్న చందంగా వ్యవహరించే రాజకీయ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడే రోజులు దగ్గర పడ్డయా అంటే అవుననే అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. తప్పుడు అఫిడవిట్(ప్రమాణపత్రం)లతో తోక జాడించే నేతలకు కళ్లెం వేస్తామని ధీమాగా చెబుతోంది. ఎన్నికల్లో పోటీ సందర్భంగా తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించిన నాయకులపై విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలో తమకు సంబంధించిన పూర్తి వివరాలతో రిటర్నింగ్ అధికారులకు నేతలు అఫిడవిట్‌లు అందజేయడం అనవాయితీగా వస్తోంది.

తమకున్న ఆస్తులు, సొమ్ములు, కేసుల వివరాలు అఫిడవిట్‌లో తప్పనిసరిగా పొందుపరచాలి. అయితే ఈసీకి మన నాయకులు సమర్పిస్తున్న అఫిడవిట్‌లు అధికారులతో పాటు సామాన్య జనాన్ని అవాక్కయ్యేలా చేస్తున్నాయంటే నమ్మాల్సిందే మరి. హవ్వా! అందరూ నోళ్లు వెళ్లబెట్టెలా అఫిడవిట్‌లు అదరగొడుతున్నాయి. అంతేకాదండోయ్ మన నేతలపై రవ్వంత జాలి చూపేలా చేయడంలో ‘ఫాల్స్ అఫిడవిట్‌లు’ తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాయి. కొమ్ములు తిరిగిన నేతలు సైతం తమకు కనీసం సొంతకారు లేదని, తన దగ్గర దమ్మిడి లేదని, తన పేరు మీద ఆస్తిపాస్తుల్లేవని ‘ఆ’ అఫిడవిట్‌లలో గగ్గోలు పెడతారు. తనకున్న కొద్దొగొప్పో ఆస్తిపాస్తులు తనవాళ్ల పేరు మీద ఉన్నాయని అందులో చూపిస్తారు. ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది.

నామినేషన్లు వేయడానికి నాలుగైదు కార్లు తక్కువ కాకుండా భారీ కాన్వాయ్‌తో దయచేసే మన నేతాశ్రీల మాటలు నీటిమీద రాతలని తెలియనిదెవరికీ? ‘నవ్విపోదురు నాకేటి సిగ్గు’ రీతిలో లేకుంటే నెగ్గుకురాలేమని నయా నేతలకు మరొకరు చెప్పాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. ఏదో ఫార్మాలిటీ కాబట్టి అఫిడవిట్ పెడుతున్నాం అన్న చందంగా వ్యహరిస్తున్న నాయకులకు ఈసీ తాజాగా షాక్ ఇచ్చింది. దీంతో నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఆడింది ఆట, పాడింది పాటగా నెట్టుకొస్తున్న నేతలకు ఈసీ ప్రకటన మింగుడు పడడం లేదు.

ఎన్నికల్లో పోటీ సందర్భంగా తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించినట్లు అందిన ఫిర్యాదులపై స్థానిక మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ చెప్పడంతో నేతలు వణుకుతున్నారు. తప్పులు జరిగినట్టు విచారణలో తేలితే ఐపీసీ ప్రకారం శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి సమర్పించిన అఫిడవిట్‌పై విలేకరుల అడిగిన ప్రశ్నకు స్పందించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ ఇలా సమాధానమిచ్చారు. ఈసీ ప్రకటనతో తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించిన నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆషామాషీగా అఫిడవిట్‌లు పడేసిన నేతలు వణుకుతున్నారు. తమ గుట్టు ఎక్కడ బట్టబయలవుతుందనే భయంతో బెదురుతున్నారు. ఈసీ హెచ్చరికతో భవిష్యత్‌లోనైనా మన నేతలు బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం.

'మాయ చేయడానికే టీడీపీ బీసీ డిక్లరేషన్'

ప్రజలను మాయ చేయడానికే టీడీపీ బీసీ డిక్లరేషన్ అని వైఎస్ఆర్ సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బాబు అప్పుడెందుకు స్పందించలేదని బాజిరెడ్డి ప్రశ్నించారు. వైవెస్‌ఆర్ బీసీల పక్షపాతి కాబట్టే రెండుసార్లు అధికారం చేపట్టారని ఆయన అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే.. అసెంబ్లీకి 100 మంది బీసీలను పంపుతారా అని బాజిరెడ్డి సవాల్ విసిరారు. మహానేత వైఎస్ఆర్ మనకు దూరమైనా... బీసీలు జగన్ వెంటే ఉన్నారని బాజిరెడ్డి అన్నారు. 
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!