YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 2 June 2012

మీరొస్తే వచ్చే ఓట్లు పోయేలా ఉన్నాయ్
చిరంజీవి ప్రచారానికి రావొద్దని ఎస్సెమ్మెస్‌లు
నాగబాబును కలిసిన నర్సాపురం, రామచంద్రాపురం నేతలు
సీఎం వస్తే అసలుకే ఎసరొస్తుందంటున్న నాయకులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారమంటేనే నేతల హడావుడి. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు వస్తున్నారంటే స్థానిక నేతల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఇక చిరంజీవిలాంటి సినీనటులు వస్తున్నారంటే మరింత జోష్ ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు తిరగబడ్డాయి. ముఖ్యమంత్రి, చిరంజీవి, తదితర కాంగ్రెస్ అగ్రనేతల పేర్లు చెబితేనే ఉప ఎన్నికల అభ్యర్థులు, పార్టీ శ్రేణులు భయపడిపోతున్నారు. వారు ప్రచారానికి వస్తున్నారంటేనే హడలిపోతున్నారు. దయచేసి ఉప ఎన్నికల ప్రచారానికి రావొద్దంటూ బతిమలాడుకుంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు నేరుగా చెప్పేందుకు కొందరు వెనుకాడుతుండగా.. మరికొందరు ఏకంగా ఆయా నేతలకు ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. పెద్దలు వస్తామంటే ఎందుకు వద్దంటున్నారని ఆరాతీస్తే... ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలే కారణమని స్థానిక నేతలు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంతో నియోజకవర్గాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి జగన్‌ను అరెస్టు చేయించిందనే అనుమానాలు ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు చెప్పారు. అయినప్పటికీ తమకు నియోజకవర్గంలో ఉన్న పలుకుబడి, వ్యక్తిగత పరిచయాలను ఆసరా చేసుకుని ఇంటింటి ప్రచారం చేసుకుంటూ పోతున్నామని, ఈ పరిస్థితుల్లో పార్టీ పెద్దలొస్తే తమకొచ్చే నాలుగైదు ఓట్లు కూడా రాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

చిరంజీవి రాకపోతేనే మంచిదట!

కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా చిరంజీవి సామాజికవర్గానికి చెందిన నాయకులు కూడా చిరు తమ నియోజకవర్గానికి రాకపోతేనే మంచిదనే భావనను వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గాలకు చెందిన కొందరు కాపు సామాజికవర్గ నేతలు చిరంజీవి సోదరుడు నాగబాబును కలిసి ఈ విషయం చెప్పినట్లు తెలిసింది. 

‘‘నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏం బాగోలేదు. నిన్నటిదాకా పరవాలేదని అనుకున్నా తాజాగా సీన్ రివర్స్ అయ్యింది. ఈ టైంలో చిరంజీవిగారు వచ్చి ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదు. పైగా చిరంజీవి వచ్చినా ఓడిపోతే ఆయనకే చెడ్డపేరొస్తుంది. దయచేసి రావొద్దని చెప్పండి’’ అని వారు నాగబాబుతో చెప్పినట్లు సమాచారం. నర్సాపురం నాయకులైతే ‘‘పుట్టిన ఊరులో తిరిగి ప్రచారం చేసినా గెలిపించుకోలేకపోయారనే అపప్రథ చిరంజీవికి రావడం మాకిష్టం లేదు. ఏదో ఒకటి చెప్పి.. రాకుండా చేయండి’’ అని సూచించినట్లు తెలిసింది. కొందరు నాయకులైతే చిరంజీవి ప్రచారానికి , పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాకు లింకు పెడుతున్నారు. చాలా ఏళ్ల తరువాత ఉభయగోదావరి జిల్లాల్లో గబ్బర్‌సింగ్ సినిమా విజయవంతంగా నడుస్తోందని, ఈ సమయంలో చిరంజీవి ప్రచారానికి వస్తే ఆయనపై ఉన్న వ్యతిరేకత గబ్బర్‌సింగ్ సినిమాపై పడే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. 

సీఎం వస్తున్నారంటే బెదురు!

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ నియోజకవర్గ ప్రచారానికి వస్తే ఏదో ఒక లాభం ఉంటుందని నిన్నటివరకు భావించిన అభ్యర్థులు సైతం సీఎం వస్తున్నారంటేనే బెదిరిపోతున్నారు. ‘‘ఆయనకున్న భాష సమస్యతో ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. దీనికితోడు జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ముఖ్యమంత్రే ఆయనను అరెస్టు చేయించారనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది. ఈ సమయంలో ఆయన వస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదముంది’’ అని కడప జిల్లా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి ఒకరు అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చులను, ఓటర్లకు పంచాల్సిన సొమ్మును తమకు అందజేస్తే అదే చాలని, ప్రత్యేకించి ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం గమనార్హం. కర్నూలు, అనంతపురం జిల్లా నేతలదీ అదే పరిస్థితి. ఆళ్లగడ్డ నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆళ్లగడ్డ ప్రచారానికి రాకపోవడమే మంచిదని, వచ్చినా ఉపయోగం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!