YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 2 June 2012

వైఎస్‌ను మేం చంపుకుంటామా?

*ఎన్నికల కోసం ఇంత నీచంగా మాట్లాడతారా? 
*కాంగ్రెస్ పెద్దల మాటలపై విజయమ్మ ఆవేదన
*రాజశేఖరరెడ్డి మరణంపై నాకే కాదు..
*అందరికీ అనుమానాలున్నాయి
*ఎవరు చేశారని నేను అడగడం లేదు..
*అయినా భుజాలు తడుముకుంటారెందుకు?

పోలవరం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘కొందరు కాంగ్రెస్ పెద్దలు రాజశేఖరరెడ్డిని మేమే చంపామంటున్నారు. నేను, నా కొడుకు ఆయన్ను చంపుకొన్నామట. ఎన్నికల సమయమని ఎంత నీచంగా, అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి. రకరకాలుగా మాట్లాడి మమ్మల్ని బాధపెడుతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజశేఖరరెడ్డి మరణంపై నాకొక్కదానికే కాదు. అందరికీ అనుమానాలున్నాయి. రష్యన్ వెబ్‌సైట్లోనూ దీని గురించి పెట్టారు. చాలా పత్రికల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందరో నేతలూ ఇదే అన్నారు. 

ఆయన మరణంపై సీబీఐ విచారణను హడావుడిగా పూర్తిచేసింది. 3, 4 నెలలుగా పక్కన పెట్టిన హెలికాప్టర్‌ను ఎందుకు వైఎస్ కోసం తీసుకొచ్చారని సీబీఐ అడగను కూడా అడగలేదు. ఎవరు చేశారని నేను అడగడం లేదు.. అయినా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడంలేదు’ అని ఆమె అన్నారు. ‘జగన్‌బాబుకు అధికార దాహమని అంటున్నారు. అధికార దాహం ఉంటే 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు కూడా రోశయ్యను ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు ప్రతిపాదిస్తాడు’ అని విజయమ్మ ప్రశ్నించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఆమె ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టి.నర్సాపురం, కొయ్యలగూడెంలలో అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు కుట్రను ఎండగట్టారు. ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

ఎక్కడా న్యాయం దొరక్క మీ ముందుకొచ్చాను..

‘ఇక్కడకు వచ్చేటప్పుడు జగన్‌బాబును కలిశా. ప్రజలకు ఏం చెప్పాలి నాన్నా అని అడిగా. ‘నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే ధైర్యంగా ఉన్నాను. అందరినీ (ప్రజలు) ధైర్యంగా ఉండాలని చెప్పు. ఎలాంటి సంశయాలు పెట్టుకోవద్దని చెప్పమ్మా.. దేవుడు గొప్పవాడు. నేను చాలా త్వరలోనే బయటకు వస్తానని చెప్పు.. ఈ కుట్రలు, కుతంత్రాలు ప్రజల ప్రేమ ముందు నిలబడవని చెప్పు’ అని అన్నాడు. మీ మీద ఆయనకు అంత నమ్మకముంది. ఒకవైపు భర్తను పోగొట్టుకున్నాను. మరోవైపు కొడుకును జైలు పాలు చేసుకున్నాను. ఇప్పుడు జరుగుతున్న ప్రతి అన్యాయమూ మీకు తెలుసు. ఎక్కడ కూడా న్యాయం దొరక్క నేను మీ ముందుకు వచ్చాను. న్యాయం కోసం ఓ ఆడబిడ్డగా వచ్చాను. ప్రజా కోర్టులోనైనా న్యాయం జరుగుతుందని మీ ముందుకు వచ్చాను.

170 మంది ఎంపీలను అరెస్టు చేయలేదే..?

జగన్‌బాబు ఏం చేశారని అరెస్టు చేశారు? విచారణకు సహకరించలేదని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఒక ఎంపీగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తాడని చెబుతున్నారు. దేశంలో 170 మంది ఎంపీలపై కేసులున్నాయి. వారిని ఎవరినైనా అరెస్టు చేశారా? తొమ్మిది నెలలుగా సీబీఐ విచారణ నిర్వహిస్తోంది. ‘సాక్షి’పై రైడ్‌లు చేయించారు. బ్యాంకు ఖాతాలను సీజ్ చేయించారు. ప్రకటనలు రాకుండా అడ్డుకున్నారు. ఇంతకాలంగా ఇన్ని చేస్తున్నా.. జగన్‌బాబు పట్టించుకోకుండా ప్రజల మధ్యే తిరిగాడు. అన్ని నెలలపాటు విచారణ జరిగినా ఎవ్వరినైనా జగన్‌బాబు ప్రభావితం చేశాడా? తొమ్మిది నెలలపాటు అరెస్టు చేయకుండా ఉన్నట్టుండి ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్టు చేశారు? నా కొడుకును ఏం చేయాలనుకుంటున్నారు? ఈ విచారణలను చూస్తుంటే భయం వేస్తోంది.. నా కొడుకును ఏం చేయాలనుకుంటున్నారో అని భయమేస్తోంది. 

అరెస్టు చేసిన రోజు దిల్‌కుశ గెస్ట్‌హౌస్ వద్ద నిరసన కూడా తెలపనీయలేదు. ఇందిరా పార్కు దగ్గర నిరసన తెలుపుతామన్నా అనుమతి ఇవ్వలేదు. చివరికి మా ఇంటి ముందు కూర్చుని నిరసన తెలుపుతుంటే టెంట్లు కూడా కూల్చేయాలని చూశారు. అక్కడికి జనాన్ని రానీయకుండా అన్ని దార్లను దిగ్బంధం చేశారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ నాయకులను అరెస్టు చేసి, బైండోవర్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉంటే మా సూట్ కేసుల్ని తెరిచి మా బట్టల్ని బయటపెడుతున్నారు. చూడండి ఎంత దారుణంగా చేస్తున్నారో. ఇంకా ఎంత కాలం ఈ వేధింపులు? ఈ సాధింపులు?

కాంగ్రెస్ పథకాలైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా?

2004, 2009 ఎన్నికల్లో గెలుపు, ఓటములకు నాదే బాధ్యత అని చెప్పి రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోను, కేంద్రంలోను కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. 25 ఏళ్లపాటు పోరాటాలు, ఉద్యమాలు చేసి.. ప్రాణానికి తెగించి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ప్రజల కోసం పోరాటాలు, పాదయాత్ర చేస్తున్నప్పుడే ఆయన మదిలో కొన్ని సంక్షేమ పథకాలు మెదిలాయి. 

ఆయన సీఎం అయినప్పటినుంచీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేయడం మొదలుపెట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కూడా ఏ సీఎం ప్రవేశపెట్టలేని విధంగా ఆయన ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ, ఆరోగ్యశ్రీ, రూ.2 బియ్యం..ఇలా ఎన్నో పథకాలు.. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా.. అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా ఆయన రూపొందించారు. వైఎస్ ప్రజా సంక్షేమంతోపాటు అభివృద్ధిని కూడా కాంక్షించారు. జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పనచేశారు. ఆయన చనిపోయాక ఈ ప్రాజెక్టులు, పథకాలను ప్రభుత్వం పక్కన పడేసింది. వైఎస్‌ను, జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడానికే వీరి సమయమంతా సరిపోతోంది. ఆ రోజు రాజశేఖరరెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అన్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఆయన అవినీతిపరుడు అంటూ బురదజల్లుతున్నారు. మీరు నమ్ముతారా?(లేదు.. లేదు..అంటూ జన స్పందన). పైగా ఆయన అమలు చేసిన పథకాలన్నీ కాంగ్రెస్‌వేనంటున్నారు. కాంగ్రెస్ పథకాలే అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా.. ఎందుకు లేవు?

ఆ 26 జీవోలు అక్రమమో.. సక్రమమో చెప్పరేం?

వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వారి ఇంటికి వస్తానని జగన్ ఆ రోజు నల్లకాలువలో మాట ఇవ్వడమే తప్పయింది. ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. అందువల్లే జగన్‌పై ఈ వేధింపులన్నీ. అందుకే కాంగ్రెస్, టీడీపీ వారు కలిసి.. 26 జీవోల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టులో కేసులు వేశారు. ఆ 26 జీవోలకు సంబంధించి ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయాల్సి ఉంది. ఎనిమిది నెలలు కోర్టు సమయమిచ్చింది. ఈ 8 నెలల్లో ఆ జీవోలు సక్రమమా? అక్రమమా? అన్న సంగతి ప్రభుత్వం తెలపాల్సి ఉంది. అయినా ప్రభుత్వం కోర్టుకు సమాధానం చెప్పలేదు. 

దీంతో సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఇప్పటికీ కోర్టుకు సక్రమమో అక్రమమో తెలపకుండానే.. మంత్రులతో వైఎస్ మీద నిందలు వేయించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ కుట్రలకు పాపం మోపిదేవి వెంకటరమణ బలైపోయారు. ఆయనతో రకరకాలుగా చెప్పిస్తున్నారు.. ఆ రోజు వైఎస్ చెబితేనే ఏమీ చూడకుండా జీవోలపై సంతకాలు చేసేశానని, తనకు ఏమీ తెలియదని ఆయనతో చెప్పిస్తున్నారు. దానికి కూడా జగన్‌బాబే బాధ్యుడంట. జగన్ వల్లే ఆయన జైల్లో ఉన్నాడని మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూడండి. దేవుడు చూస్తున్నాడు. పైనున్న రాజశేఖరరెడ్డి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 18 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు(ప్రజలు) చాలా విజ్ఞులు. ధర్మ రక్షకులు. నా కడుపులో ఉన్న బాధను, జగన్‌బాబుకు జరుగుతున్న అన్యాయాన్ని చూడండి.. మీరే తీర్పు చెప్పండి.

జగన్ వస్తాడు.. పోలవరం పూర్తిచేస్తాడు

‘‘రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెప్పేవారు. గోదావరి జిల్లాల ప్రజలు చాలా మంచివారని, తనను చాలా ప్రేమించేవారని. ఆయన ఈ జిల్లాకు చాలాసార్లు వచ్చారు. ఆయన 2004లో ఎంతో సాహసోపేతంగా పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణించాక ఈ ప్రభుత్వ పెద్దలు ప్రాజెక్టు సంగతే మర్చిపోయారు. వైఎస్ ఉండి ఉంటే ఈ సమయానికి పోలవరం పూర్తయి ఉండేది. అధికారంలోకొచ్చిన వెంటనే పోలవరం పూర్తిచేస్తానని జగన్‌బాబు మొన్న ఇక్కడికొచ్చినప్పుడు చెప్పాడు. అలాగే నిర్వాసితుల ముఖాల్లో చిరునవ్వు చూశాకే దాన్ని ప్రారంభిస్తానని కూడా చెప్పాడు. జగన్ వస్తాడు.. పోలవరం పూర్తిచేస్తాడు.. నాకు ఆ నమ్మకముంది.’’

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!