YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 30 June 2012

జేడీ ‘కాల్‌లిస్ట్’ కేసును కొట్టేయండి

హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్
ఎమ్మార్ కేసులో సాక్షిగా సీబీఐ నన్ను విచారించింది
ఆ వివరాలన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో రావడం మొదలైంది
నా ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు కథనాలు ప్రచురించాయి
జేడీ లేదా ఆయన సహచరులు నేను చెప్పిన వివరాలను లీక్ చేసినట్లు అనుమానం వచ్చింది
నా మిత్రుడొకరు దర్యాప్తు అధికారుల కాల్స్ వివరాలను ఇచ్చారు.. వాటినే హైకోర్టు ముందుంచాను
జేడీ వ్యక్తిగత విషయాలను నేను ఎక్కడా ప్రస్తావించలేదు
మీడియాకు లీకులు ఇవ్వడం లేదని జేడీ నాకు చెప్పారు.. 
తరువాత నా పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాను
సాక్షి కథనం వెనుక నా ప్రమేయం ఉన్నట్లు జేడీ అనుమానిస్తున్నారు
ఆ అనుమానంతోనే నాపై ఫిర్యాదు చేశారు.. దానిలో వాస్తవం లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్ బహిర్గతం కావడంపై టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద సీసీఎస్ పోలీసులు కేసును నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలేవీ చేపట్టకుండా హైదరాబాద్ కమిషనర్, సీసీఎస్ ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించాలంటూ ఆయన శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీసీఎస్ ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అంతేకాక సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. 

‘ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్)లో నేను, నా భార్య ప్లాట్లు కొనుగోలు చేశాం. మాతోపాటు వందమందికి పైగా ప్లాట్లు కొన్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించి, 2011 ఆగస్టు 29న నాకు సీఆర్‌పీసీ సెక్షన్ 91, 160ల కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను గౌరవిస్తూ డీఎస్‌పీ ఎస్.సి.జిలానీ ముందు హాజరై, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. తరువాత మరికొన్నిసార్లు సీబీఐ అధికారులు సాక్షిగా నాకు నోటీసులు జారీ చేసి విచారించారు. ప్రతి విచారణ సమయంలో నాకు తెలిసినవన్నీ చెప్పాను. ఇదిలా ఉండగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు నాకు వ్యతిరేకంగా అవాస్తవాలతో తప్పుడు కథనాలు వరుసగా ప్రచురించడం మొదలుపెట్టాయి. వాస్తవానికి విచారణ సమయంలో ఏం జరిగిందనేది నాకు, విచారించిన అధికారికి మాత్రమే తెలుసు. అది మొత్తం రహస్య సమాచారం. 

సాక్షుల విచారణ పకడ్బందీగా జరగాల్సి ఉండగా, సాక్షులు చెప్పే వివరాలను ఈ రెండు పత్రికలు సొంత ఆలోచనలు జోడించి కథనాలు ప్రచురిస్తూ వచ్చాయి. దీంతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ లేదా ఆయన సహచరులు ఈ రెండు పత్రికలతో కుమ్మక్కయి, నా పరువు, ప్రతిష్టలను దెబ్బతియ్యాలని భావిస్తున్నట్లు నాకు అనిపించింది. ఈ రెండు పత్రికల్లో వచ్చే కథనాలను లక్ష్మీనారాయణ గానీ ఆయన సహచరులు గానీ ఎన్నడూ ఖండించలేదు. 

దీంతో సీబీఐ అధికారుల తీరును, మీడియాతో వారికున్న సాన్నిహిత్యాన్ని ప్రశ్నిస్తూ 2011లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. సాక్షులు ఇచ్చే వాంగ్మూలాలను బహిర్గతం చేసేందుకు మీడియాను ఓ ఆయుధంగా సీబీఐ అధికారులు వాడుకుంటూ, ఆ మీడియా ప్రతినిధులకు ఉద్దేశపూర్వకంగా లీకులు ఇవ్వడం ప్రారంభించారు. మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా సీబీఐ అధికారులు సాక్షులపై ఒత్తిడి తేవడం, తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించడం ప్రారంభించారు. సీబీఐ దర్యాప్తు తీరు, దానిపై నేను దాఖలు చేసిన పిటిషన్ గురించి మీడియాలో విస్తృత్తంగా కథనాలు వచ్చాయి. కె.వి.రెడ్డి అనే నాకు తెలిసిన వ్యక్తి దర్యాప్తు అధికారుల కాల్స్ వివరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనే నాకు కాల్ లిస్ట్ సమాచారాన్ని ఇచ్చారు. కొంత ప్రయత్నం తరువాత దర్యాప్తు అధికారులకు వచ్చిన, వారు చేసిన నంబర్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర పత్రికల ప్రతినిధుల నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా దర్యాప్తు సంస్థ అందించే తప్పుడు సమాచారాన్ని ప్రచురించిన వారే. నేను సేకరించిన ఈ కాల్ లిస్ట్‌ను హైకోర్టు ముందుంచి, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరాను. దర్యాప్తు అధికారుల అధికార దుర్వినియోగంపైన కూడా దర్యాప్తు కోరాను. 

ఇందుకుగాను జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టును అభ్యర్థించాను. ఆ కాల్ లిస్ట్‌లో లక్ష్మీనారాయణకు సంబంధించిన ఇతర కాల్స్ వివరాలను నేను ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా అవి ఆయన వ్యక్తిగత కాల్స్ అయి ఉండొచ్చు. లక్ష్మీనారాయణ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా, మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలపై దర్యాప్తు కోరాను. నేను సేకరించిన కాల్ లిస్ట్‌ను మరే రకంగానూ ఉపయోగించలేదు. నాకు వచ్చిన వివరాలను యథాతథంగా కోర్టు ముందుంచాను. లక్ష్మీనారాయణ పరోక్షంలో మీడియా నా పరువు, ప్రతిష్టలపై దురుద్దేశాలతో చేస్తున్న దాడుల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో నేను ఆ కాల్ లిస్ట్‌ను కోర్టు ముందుంచాల్సి వచ్చింది. 

తరువాత మీడియాలో వస్తున్న కథనాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ నాతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. మీడియాకు తానుగానీ, తన సహచరులుగానీ ఎటువంటి లీకులు ఇవ్వలేదని చెప్పారు. ఇందుకు అనుగుణంగా లక్ష్మీనారాయణ మీడియా ప్రకటన జారీ చేశారు. అది విస్తృతంగా ప్రచురితమైంది. లక్ష్మీనారాయణ వివరణలు ఇచ్చిన నేపథ్యంలోనే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై నేను రూ.25 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ రెండు పరువు నష్టం దావాలు వేశాను. ఇటువంటి పరిస్థితుల మధ్య నేను హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఉపసంహరించుకున్నాను. రికార్డుల్లో ఉన్న కాల్స్ వివరాలన్నింటినీ తీసుకునేందుకు సీబీఐ న్యాయవాదికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ పిటిషన్ ఉపసంహరణ తరువాత, కాల్స్ వివరాలను ఎన్నడూ నేను పట్టించుకోలేదు. 

ఇదిలా ఉండగా.. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు సంబంధించిన కాల్స్ వివరాలంటూ తెలుగు దినపత్రిక సాక్షి ఇటీవల ఓ కథనం ప్రచురించింది. వీటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టినట్లు, జేడీ కాల్స్‌పై విచారణకు ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేసినట్లు ఆ కథనంలో పేర్కొంది. సాక్షి కథనానికి కౌంటర్‌గా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు ప్రచురించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక నేరుగా నా పేరును ప్రస్తావించకుండా, నా పేరు స్ఫురించేలా, కాల్స్ వివరాలు బయటకు వచ్చేందుకు నేనే కారణమనే రీతిలో కథనం ప్రచురించింది. తరువాత జేడీ లక్ష్మీనారాయణ సాక్షి టీవీ చానల్, సాక్షి పత్రిక, కొందరు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు, నాపై హైదరాబాద్ కమిషనర్ ముందు ఫిర్యాదు చేసినట్లు పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్నాను. లక్ష్మీనారాయణ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వివరాల ఆధారంగా సాక్షి పత్రిక, టీవీ చానల్ వరుసగా తన కాల్స్‌కు సంబంధించిన వివరాలతో కథనాలు మొదలుపెట్టాయని జేడీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కాల్స్ వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సాక్షి పత్రిక, టీవీ ఎలా సంపాదించాయో తనకు తెలియదని ఆ ఫిర్యాదులో తెలిపారు. వాస్తవానికి జేడీ కాల్స్‌కు సంబంధించి నేను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాను. 

అయినప్పటికీ లక్ష్మీనారాయణ నాపైన, కొందరు ప్రైవేటు డిటెక్టివ్‌లపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీ, టెలిగ్రాఫ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీనారాయణ చేస్తున్న ఆరోపణలకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి నేరం చేయలేదు. నా హక్కులను పరిరక్షించుకునేందుకే గతంలో పిటిషన్ దాఖలు చేశాను. కాల్స్‌కు సంబంధించిన వివరాలు నేను అందజేసినట్లుగా సాక్షి కథనాల్లో ఎక్కడా లేదు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు తప్పుడు కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదులోని ఆరోపణల్లో నేను నేరం చేసినట్లు ఎక్కడా లేదు. కేసు నమోదుకు అవసరమైన అంశాలే అందులో లేవు. ఫిర్యాదులోని ఆరోపణలన్నీ అర్థరహితంగా ఉన్నాయి. నాపై కేసుకు ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవు. 

ఫిర్యాదులోని ఆరోపణలను పూర్తిగా పరిశీలిస్తే, అందులో నేను ఎటువంటి నేరం చేసినట్లు కనిపించదు. దురుద్దేశాలతోనే ఆ ఫిర్యాదు చేసినట్లు కనిపిస్తోంది. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే. వేధింపులకు గురి చేయడానికే ఈ ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతోంది. సీబీఐ చర్యలను ప్రశ్నిస్తూ కోర్టుకెక్కినందుకే నాపై అలా నిరాధార ఆరోపణలు చేశారు. అనుమానితునిగా, నిందితునిగా పేర్కొనడం తప్ప, ఎఫ్‌ఐఆర్‌లో నాపై నిర్దిష్టంగా ఎటువంటి ఆరోపణలు చేయలేదు. కాల్స్ వివరాలు బహిర్గతం కావడంలో నాపాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేయడం అర్థ రహితం. అందువల్ల ఐపీసీ సెక్షన్లు నాకు వర్తించవు’ అని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. కేసుకు సంబంధించి తదుపరి చర్యలేవీ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను సోమవారం విచారించనున్నారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!