YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 17 July 2012

‘క్విడ్ ప్రో కో’ కు ఆస్కారమే లేదు

సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించిన నిమ్మగడ్డ తరఫు న్యాయవాది

హైదరాబాద్, న్యూస్‌లైన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత కూడా నిమ్మగడ్డ ప్రసాద్ రూ.430 కోట్లను జగన్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారని.., లాభాల కోసమే ఆయన పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టమవుతుండగా ‘క్విడ్ ప్రోకో’కు ఆస్కారమెక్కడిదని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ మొత్తం రూ.847 కోట్లు పెట్టుబడులు పెట్టారని, వాటిలో 70 శాతం పెట్టుబడులు వాన్‌పిక్‌కు ముందు, వైఎస్‌ఆర్ మరణం తర్వాతే ఉన్నాయని వివరించారు. వాన్‌పిక్ సంస్థను ప్రారంభించక ముందు 2006 డిసెంబర్ నుంచి 2007 జనవరి మధ్య 20 శాతం పెట్టుబడులు పెట్టారని చెప్పారు. 2009 సెప్టెంబరు 2న వైఎస్‌ఆర్ మరణించారని, ఆ తర్వాత 2010 ఏప్రిల్ వరకు 50 శాతం పెట్టుబడులు పెట్టారని తెలిపారు.

కేవలం లాభాల కోసమే జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, ఇందులో పరస్పరం లబ్ధి పొందింది ఏమీ లేదని చెప్పారు. రాక్‌తో చేసుకున్న ఒప్పందం ప్రతిని (ఎంవోయూ) ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్ మంత్రి మండలికి పంపారని, అలాంటప్పుడు మంత్రి మోపిదేవి కేబినెట్‌ను తప్పుదోవ పట్టిచ్చారని ఎలా అంటారని ప్రశ్నించారు. వాన్‌పిక్‌కు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించలేదని చెప్పారు. వాన్‌పిక్ అనేక రాయితీలను కోరిందని, ప్రభుత్వం కొన్నింటిని తిరస్కరించిందని తెలిపారు. 66 ఏళ్లు లీజుకు ఇవ్వాలని కోరినా, ప్రభుత్వం 33+11+11 ప్రాతిపదికన 55 ఏళ్ల వరకు మాత్రమే లీజు ఇచ్చిందని తెలిపారు. వాన్‌పిక్ సేకరించిన 13 వేల ఎకరాల్లో 200 ఎకరాలే ప్రభుత్వ భూమి ఉందని, దీనికి కూడా ప్రభుత్వం ధర నిర్ణయించిందని, డబ్బు చెల్లించిన తర్వాతే ఆ భూమిని స్వాధీనం చేసిందని వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రస్‌ఆల్‌ఖైమా (రాక్), వాన్‌పిక్ సంస్థలు... ఆర్థిక మాంద్యం కారణంగా వాటాలను నవయుగ సంస్థకు విక్రయించారని, ఇందులో సీబీఐకున్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. రాక్‌తో మాత్రమే వాన్‌పిక్ భాగస్వామ్య ఒప్పందం చేసుకుందన్నారు. ప్రభుత్వానికి, వాన్‌పిక్‌కు సంబంధమే లేదని అన్నారు. అలాంటప్పుడు ఏదో జరిగిపోయిందంటూ నిమ్మగడ్డను అరెస్టు చేయడమే చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సీబీఐ చేస్తున్న 90 శాతం ఆరోపణలకు ఆధారాలే లేవన్నారు. కుట్రలో భాగస్వాములై ఉంటే చనిపోయిన వారిని నిందితుల జాబితాలో ఎలా చేర్చాలో సీబీఐకి తెలుసని, వైఎస్‌ఆర్ కుట్రదారుడు కాదు కాబట్టే సీబీఐ ఆయన్ని నిందితునిగా చేర్చలేకపోయిందని చెప్పారు.

వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో జగన్ కుమ్మక్కై పలువురికి లబ్ధి చేకూర్చడం ద్వారా ఆయన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టించుకున్నారని సీబీఐ ఆరోపిస్తోందని.., అయితే వైఎస్‌ఆర్ మరణం తర్వాత జగన్ ఏ రకంగా లబ్ధి చేకూర్చగలడని ప్రశ్నించారు. నిమ్మగడ్డ అరెస్టు సమయంలో ఆధారాలను మాయం చేస్తారనే అనుమానంతోనే ఆయన్ని అరెస్టు చేశామని పేర్కొన్నారని, సీబీఐ అపోహతోనే ఆయన్ని అరెస్టు చేసిందని పేర్కొన్నారు.

రూ.285 కోట్లే మొదటి పెట్టుబడి: జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ మొదట రూ.285 కోట్లు మాత్రమే పెట్టుబడిగా పెట్టారని ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. భారతీ సిమెంట్స్‌లో ఆయన పెట్టుబడులను ఫ్రెంచ్ కంపెనీకి విక్రయించారని, దీంతో రూ.560 కోట్లు వచ్చాయని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ తెలివి తక్కువగా వాటాలు కొనుగోలు చేయలేదని, లాభాలు వస్తాయనే నమ్మకంతోనే వాటాలు కొన్నారని చెప్పారు. అదే తరహాలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, అందుకు వారు లాభాలు కూడా ఇచ్చారని వివరించారు. భారతీ సిమెంట్స్‌లో వాటాల విక్రయం ద్వారా నిమ్మగడ్డకు లాభం రూపంలో దాదాపు రూ.300 కోట్లు వచ్చిందని చెప్పారు. అందులో రూ.62 కోట్లు ఆదాయ పన్నుగా చెల్లించారని తెలిపారు. భారీగా లాభాలు వస్తాయనే ఈ డబ్బును మళ్లీ జగన్ సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ప్రసాద్‌కు ప్రభుత్వం లబ్ధి చేకూర్చినందుకే లంచంగా ఇవ్వాల్సిన డబ్బును జగన్ సంస్థల్లో పెట్టుబడుల రూపంలో పెట్టారని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే లంచంగా ఇచ్చిన డబ్బును తిరిగి వెనక్కు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు.

పెట్టుబడులకు లాభం వచ్చేలా చేసి, 100 శాతానికి పైగా అదనంగా డబ్బు ఎందుకు ఇస్తారని అన్నారు. సాండూర్ పవర్ కంపెనీలో రూ.650 ప్రీమియంతో 22.46 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందని, అయితే ప్రసాద్ కొన్నది రూ.140 ప్రీమియంతో మాత్రమేనని వెల్లడించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండానే సీబీఐ ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తూ కోర్టును తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించారు. భారతీ సిమెంట్స్‌లో ప్రసాద్ రూ.285 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, సీబీఐ మాత్రం రూ.240 కోట్లు పెట్టుబడిగా పెట్టారంటూ తప్పుడు లెక్కలు చూపుతోందని వివరించారు. వాదనలు కొనసాగుతుండగానే కోర్టు సమయం ముగియడంతో... వాదనలను గురువారానికి వాయిదావేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!