YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 20 July 2012

పెరిగిన ఫీజు విద్యార్థే చెల్లించాలి!


‘సుప్రీం’ తీర్పు ప్రకారం భారీగా పెరగనున్న వృత్తి విద్య ఫీజులు
రూ.3,600 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు చేరనున్న రీయింబర్స్‌మెంట్
పెరిగిన భారాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం అన్వేషణ
పాత ఫీజులే చెల్లించాలని యోచన
గ్రేడింగ్, మార్కులకు లింకుపై కసరత్తు
బీసీ, ఈబీసీలకు చెల్లింపులేం చే యాలన్నదానిపై సందిగ్ధం
నేడు కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వృత్తి విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఆ ఫీజులు పెరిగితే.. విద్యార్థులకు రీయింబర్స్‌మెంటు పథకం కింద చెల్లించాల్సిన మొత్తం కూడా పెరగనుండడమే దీనికి కారణం. అయితే అదనపు భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు చెల్లిస్తున్నందున ఇంతకన్నా ఎక్కువ భరించవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. భారాన్ని తప్పించుకునేందుకు సర్కారు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది.

నేడు ఉపసంఘం భేటీలో కీలక ప్రతిపాదనలు

కోర్టు తీర్పు ప్రకారం ఏ కోర్సుకు ఎంత ఫీజు పెరిగినా తమకు సంబంధం లేదని, ఇప్పటి వరకు చెల్లిస్తున్న మొత్తాన్ని మాత్రం ప్రభుత్వం యథాతథంగా చెల్లిస్తుందని, మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే చెల్లించుకోవాలని చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వృత్తివిద్యా కోర్సులకు ఫీజులను ఖరారు చేయాల్సిన సమయం ఆసన్నం కావడం, ఒక్కో కళాశాలలో 40 నుంచి 150 శాతం వరకు ఫీజుల పెంపునకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఫీజుల పథకం బడ్జెట్ మరింత పెరగనున్న నేపథ్యంలో ఈ పథకం అమలులో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై ఉపసంఘం కీ లక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనుంది.

రూ.5 వేల కోట్లకు చేరనున్న ఫీజుల బడ్జెట్

ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ బడ్జెట్ రూ.3600 కోట్లు ఉండగా, వృత్తివిద్యా కోర్సుల ఫీజులు పెరిగితే ఆ మొత్తం దాదాపు రూ.5 వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫీజుల పథకంలో మార్పులు చేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోందని చెబుతున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రతియేటా పెరిగే అవకాశముందని, ఈ ఏడాది కొన్ని కళాశాలలకే ఫీజుల పెంపు పరిమితమైనా, వచ్చే ఏడాది మిగిలిన కళాశాలలు అనుమతి తెచ్చుకుంటాయని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇలా అన్ని వృత్తివిద్యా కళాశాలల్లో ఫీజులు పెరిగితే ఫీజుల పథకం బడ్జెట్ భారీస్థాయికి చేరుతుందని వ్యాఖ్యానించారు. వార్షిక బడ్జెట్‌ను ప్రభావితం చేసేలా ఫీజుల పథకానికి నిధులివ్వాల్సి వస్తే మిగిలిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్వహణ పరిస్థితేంటని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కొంత ఫీజును విద్యార్థులు భరించక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

సబ్‌ప్లాన్‌లో కలిపేద్దామా?

ఫీజుల భారాన్ని తప్పించుకునేందుకు ఎస్సీ, ఎస్టీలకు ఫీజుల చెల్లింపును సబ్‌ప్లాన్ బడ్జెట్‌లో కలిపే అవకాశంపై కూడా ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. అయితే, ఎస్సీ, ఎస్టీ ఫీజులను సబ్‌ప్లాన్‌లో కలిపితే ఏ శాఖ ద్వారా చెల్లింపులు జరగాలి, వివిధ శాఖల బడ్జెట్ నుంచి ఫీజులకు నిధులను మంజూరు చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. కానీ, ఈ ప్రతిపాదన అమలుసాధ్యం కాదనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సబ్‌ప్లాన్ నిధుల్లో కలిపి ఎస్సీ, ఎస్టీలకు పెరిగిన ఫీజుతో సహా మొత్తం ఫీజును చెల్లిస్తే మరి బీసీ, ఈబీసీలకు ఎలా చెల్లించాలన్న దానిపై సమస్య ఏర్పడుతుందనే మీమాంసలో ఉంది.

ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో ఫీజుల పథకాన్ని యథాతథంగా కొనసాగించి, పెరిగిన ఫీజులను విద్యార్థులే భరించాలని చెప్పేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. లేదంటే కోర్సుకు అత్యధికంగా ఖరారయిన ఫీజును తీసుకుని, అందులో 50 శాతం చెల్లిస్తామని, ఈ మొత్తాన్ని అన్ని కళాశాలలకు వర్తింపజేస్తామని, మిగిలినది విద్యార్థులే చెల్లించుకోవాలని చెప్పే అంశాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ విధంగా కళాశాలల గ్రేడింగ్ పూర్తయ్యేవరకు ఫీజులు చెల్లించి ఆ తర్వాత మంచి గ్రేడింగ్ పొందిన విద్యాసంస్థలకే ఫీజుల పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించనున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల మాదిరిగానే వృత్తి విద్యా కోర్సుల ఫీజుకూ ఒక పరిమితి నిర్ణయించి ఆ మేరకు ప్రభుత్వమే చెల్లించి.. మిగతాది విద్యార్థి చెల్లించే అంశాన్ని కూడా ప్రతిపాదనల్లో పెడుతున్నారు. ఇన్ని సమస్యలు, ప్రశ్నల నేపథ్యంలో ఫీజుల పథకం అమలుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం 26 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!