YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 21 July 2012

ఆర్మూరు, పరకాల,సంగారెడ్డిలలో సభలు నిర్వహించినప్పుడు లేని అభ్యం తరం ఇప్పుడెందుకని ?

23న సిరిసిల్ల బంద్‌కు టీఆర్‌ఎస్ పిలుపు 
సిరిసిల్లలో పోలీసు బలగాల కవాతు 
తెలంగాణపై మాకే చిత్తశుద్ధి: కేకే మహేందర్‌రెడ్డి 
వైఖరి స్పష్టం చేశాకే రావాలె: కోదండరాం 
రాజకీయ ప్రాబల్యం కోసమే : విజయశాంతి
విజయమ్మకు భద్రత కల్పించండి: గోనె ప్రకాష్

సిరిసిల్ల (కరీంనగర్)/మెదక్/ఖమ్మం/వరంగల్/హైదరాబాద్ న్యూస్‌లైన్:వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు ైవె ఎస్ విజయమ్మ సోమవారం సిరిసిల్లలో ‘నేతన్నధర్నా’ చే పట్టేందుకు పోలీసులు అనుమతించారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ధర్నా నిర్వహిస్తారని ఏఎస్పీ రమారాజేశ్వరి తెలిపారు. శనివారం సాయంత్రం సిరిసిల్లలో శాంతిభద్రతల సమస్యపై సమీక్షించిన ఆమె.. ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు రోడ్లపైకి రావొద్దని, అనుమతి లేకుండా ఎలాంటి సభలు నిర్వహించరాదని చెప్పారు. 

కాగా, విజయమ్మ ధర్నాను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్, జేఏసీలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్లలో మోహరించిన బలగాలు.. శనివారం కవాతు నిర్వహించాయి. ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు 113 ఎఎస్‌ఐలు, వందమందికి పైగా హెడ్‌కానిస్టేబుళ్లు, 465 మంది కానిస్టేబుళ్లు, 12 మంది మహిళా కానిస్టేబుళ్లు, 460 మంది హోంగార్డులు, 91 మంది మహిళా హోంగార్డులతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీకి చిత్తశుద్ధి ఉందని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెబుతుంటే.. వైఖరిచెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్మూరు, పరకాల,సంగారెడ్డిలలో సభలు నిర్వహించినప్పుడు లేని అభ్యం తరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. సిరిసిల్ల అభివృద్ధిని పట్టించుకోని కేటీఆర్.. ఇక తనకు స్థానం ఉండదని భావించి విజయమ్మ ధర్నాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాగా, విజయమ్మ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు ఆదిశ్రీనివాస్, రాజ్‌ఠాకూర్, పుట్టమధు తదితరులు సిరిసిల్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. నేతన్న విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 

ఇదిలావుండగా.. ఈ నెల 23న సిరిసిల్ల బంద్ చేయాలని టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. విజయమ్మ పర్యటనను ఆరునూరైనా అడ్డుకుని తీరుతామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు చెప్పారు. మెదక్ జిల్లా చిన్నకోడూరులో, అలాగే విజయమ్మ రావద్దంటూ సిరిసిల్లలో జరిగిన టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో వారు మాట్లాడారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన 800 మంది యువకుల త్యాగాలను గుర్తించని సీమాంధ్రనేతలు.. నేతన్న సమస్యల పేరిట దీక్షలు చేపట్టే హక్కు ఎక్కడిదన్నారు. వచ్చిన తెలంగాణను చంద్రబాబు, వైఎస్ జగన్‌లే అడ్డుకున్నారని వారు ఆరోపించారు. సిరిసిల్లలో ఎంతోమంది నేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే విజయమ్మ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తెలంగాణపై చిదంబరానికి లేఖ రాశాక ఆమె పర్యటిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కాగా విజయమ్మ ధర్నాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, సిరిసిల్లలలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. చందుర్తి మండలం మర్రిగడ్డలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా పార్టీ నేత ఆదిశ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. 

ఎవరైనా సరే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే ఈ ప్రాంతంలో పర్యటించాలని జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం చెప్పారు. ఖమ్మం, వరంగల్‌లలో ఆయన వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, పోలవరం నిర్మాణం, వనరుల దోపిడీపై ఏ పార్టీవారైన వైఖరి ప్రకటిస్తే స్వాగతం పలికి వేములవాడ రాజన్న దగ్గర కోడెను కడుతామన్నారు. లేని పక్షంలో అడ్డుకుంటామని కోదండరాం హెచ్చరించారు ప్రస్తుతం నోట్ ఫర్ బెయిల్ పద్ధతి కొనసాగుతోందని, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓట్ ఫర్ బెయిల్ పద్ధతికి మారిందని ఎద్దేవాచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిపి వేయాలని కోర్టు ఆదేశాలున్నా టెండర్లను పిలిచి కాంట్రాక్ట్ అప్పగించేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో రాజకీయ ప్రాబల్యం కోసం వైఎస్ విజయమ్మ నేతన్న దీక్ష పేరుతో ప్రచారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గొడవలు సృష్టించి రాజకీయంగా ప్రయోజనం పొందడానికే ప్రయత్నిస్తున్నారని, సిరిసిల్లలో ఎలాంటి పరిణామాలు జరిగినా వైఎస్సార్సీపీ, ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుపై తనకేమీ సిగ్నల్స్ లేవన్నారు. 

వైఎస్ విజయమ్మ పర్యటన సజావుగా జరిగేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో వున్న ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ, విజయమ్మ రాకను ప్రతిఘటిస్తామని శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసే వారిని నియంత్రించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలపై ఉందని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!