YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 15 July 2012

శ్రమకు ఫలం దక్కక అన్నదాత దిగాలు



శ్రమకు ఫలం దక్కక రైతు దిగాలు
పెట్టుబడి ఖర్చులూ రాని దైన్యం
వ్యాపారిలా వ్యవహరిస్తున్న సర్కారు
ఏ మూలకూ చాలని మద్దతు ధర
అన్ని పంటలకూ మద్దతు తక్కువే
చుక్కలనంటుతున్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు
తడిసి మోపెడవుతున్న వ్యయం
దిగుబడి ఏమాత్రం తగ్గినా వ్యయం మరింత పెరుగుతుంది
అన్ని పంటలదీ ఇదే పరిస్థితి


కొండంత పెట్టుబడి పెడితే, వచ్చేది గోరంత ప్రతిఫలం. తెలంగాణ, కోస్తా, సీమ, ఉత్తరాంధ్ర.. ప్రాంతంతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల దుస్థితి ఒకేలా ఉంది. దుక్కి దున్నడం మొదలుకుని పంట చేతికొచ్చేదాకా సీజన్ పొడవునా కుటుంబంతో కలిసి రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా.. పెడుతున్న ఖర్చుకు, కళ్లజూస్తున్న ఆదాయానికి పొంతనే లేని దైన్యంతో అన్నదాత దిగులే మిగులుతోంది. మచ్చుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్క వరిసాగు తీరుతెన్నులనే తీసుకుంటే పరిస్థితి ఇదీ..

క్వింటాలు వరి ధాన్యం పండించేందుకు రైతుకయ్యే ఖర్చు సగటున 1,600 రూపాయల పై చిలుకే. ఎకరాకు కనీస దిగుబడి 19 క్వింటాళ్లు దాటని పక్షంలో ఖర్చు మరింతగా పెరుగుతుంది.

కానీ వరికి సర్కారు వారు నిర్ణయించిన కనీస మద్దతు ధర.. కేవలం 1,280 రూపాయలు! అందులోనూ కనీసం రూ.200 దాకా వ్యాపారుల కోత పోను అన్నదాతకు దక్కేది కనాకష్టంగా వెయ్యికి కాస్త అటూ ఇటుగా ఉంటుంది.

లాభాలు దేవుడెరుగు, కనీసం పెట్టుబడి ఖర్చులకే దిక్కు లేని దిక్కుమాలిన పరిస్థితులకు తాళలేక వరి రైతు వెన్నెముక నిలువునా వంగి, కుంగిపోతోంది.
ఇది కేవలం వరికే పరిమితమైన దుస్థితి కాదు. రాష్ట్రంలో ప్రధానంగా సాగవుతున్న అన్ని పంటలనూ పీడిస్తున్న పెను సమస్యగా మారి చాలాకాలమైంది. దడ పుట్టిస్తున్న ఎరువుల ధరలు, సబ్సిడీకి సర్కారు కోతతో భారమైన విత్తనాలు, పురుగుమందుల ధరలు, తీవ్రమైన కూలీల కొరత తదితరాల పుణ్యాన సాగుపై పెట్టుబడి ఖర్చులు ఏడాదిలోనే 25 నుంచి 30 శాతం పెరిగినట్టు వ్యవసాయ శాఖ లెక్కలే చెబుతున్నాయి. అయితే కరువు, కాకుంటే వరదల బారిన పడి అల్లాడుతున్న రైతుకు, ఆరుగాలం శ్రమించిన పంటకు చివరికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం పక్కా వ్యాపారిలా ప్రవర్తిస్తోంది. ఏ శాస్త్రీయతా పాటించకుండా, దేశీయ మార్కెట్‌లో డిమాండ్-గోదాముల్లోని నిల్వల లెక్కల ఆధారంగా, పెట్టుబడి ఖర్చులు కూడా రానంత తక్కువగా కనీస మద్దతు ధరలను ఖరారు చేసి రైతు ఉసురు పోసుకుంటోంది. వారిని చేజేతులా మరింతగా అప్పుల ఊబిలోకి నెడుతోంది. పంటల పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వాలు పంపుతున్న ప్రతిపాదనలను, క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రం పట్టించుకుంటున్న దాఖలాలే కన్పిం చడం లేదు. ఫలితంగా రైతు కష్టనష్టాల పాలవడమే గాక వ్యవసాయ రంగమే పెను సంక్షోభంలో కూరుకుపోతోంది.


పొంతన లేని ‘మద్దతు’...

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో వరి సాగు ఖర్చును పరిశీలించినా మిగిలేది నిరాశే. క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యం పండించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సగటున రూ.1,638 ఖర్చవుతోంది. అది కూడా ఎకరాకు సగటు దిగుబడి 19.2 క్వింటాళ్లుంటేనే! అంతకంటే ఏ మాత్రం తగ్గినా పెట్టుబడి ఖర్చు కూడా ఆ మేరకు పెరిగిపోతుంది. పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం మొత్తం కలిపి ఎంఎస్‌పీగా నిర్ణయించాలన్న జాతీయ రైతు కమిషన్ (స్వామినాథన్) సిఫార్సును కేంద్రం పట్టించుకోవడం లేదు. సరికదా కనీసం పెట్టుబడికి సమానంగానైనా ఎంఎస్‌పీని నిర్ణయించడం లేదు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఏ గ్రేడ్ ధాన్యం ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.1,280. ఈ లెక్కన కాలం కరుణించి రైతు సాధారణ దిగుబడి కళ్లజూసినా ఒక్క క్వింటాల్ మీదే రూ.358 చొప్పున నష్టపోతున్నాడు! ఇక ఎకరాకు నష్టం రూ.6,873 పైచిలుకే. గతేడాది రూ.4,777 ఉన్న ఈ నష్టం అంతలోకే రూ.2,000కు పైగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తిగా తమ గుప్పిట్లో ఉంచుకున్న వ్యాపారులు, మిల్లర్లు.. ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు తప్ప రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వరు. క్వింటాల్‌కు కనీసం రూ.100 నుంచి రూ.200 తక్కువకే కొనుగోలు చేస్తుంటారు.

పంటలన్నింటిదీ అదే తీరు..

మితిమీరిన పెట్టుబడి ఖర్చులు, వ్యాపారుల మార్కెట్ మాయాజాలంతో వాణిజ్య పంటల సాగు కూడా జూదంగానే మారింది. రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంటయిన పత్తి గతేడాది క్వింటాల్ రూ.3,300 పలికింది. ఉత్పత్తి ఖర్చేమో క్వింటాలుకు రూ.4,239 అవుతుందని వ్యవసాయ శాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఆ ఖర్చుకు 50 శాతం అదనంగా, రూ.6,359 ఎంఎస్‌పీని నిర్ధారిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుంది. కేంద్రం మాత్రం పత్తికి కేవలం రూ.3,900 ఎంఎస్‌పీగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలైన మిరప, ఉల్లి, పసుపులకు కూడా కేంద్రం ఎంఎస్‌పీ ప్రకటించకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గతేడాది క్వింటాల్‌కు రూ.18,000 పలికిన పసుపుకు ఇప్పుడు రూ.4,000 రావడమే గగనమైంది. గతేడాది క్వింటాల్‌కు రూ.9 వేలు అమ్మిన మిరప ఇప్పుడు రూ.3 వేలకు పడిపోయింది. ఉల్లి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి క్వింటాల్‌కు రూ.4,000 ఉండగా ఇప్పుడు 1,000 కూడా రావడం లేదు.



ఎరువుల మంట...

కంపెనీలకిచ్చే రాయితీని స్థిరంగా ఉంచి, అమ్మకం ధరలను పెంచేలా రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన పోషకాధారిత ఎరువుల విధానంతో ఎరువుల ధరలు అనూహ్యంగా ఎగబాకాయి. యూరియా మినహా అన్ని ఎరువుల ధరలు రెండేళ్లలోనే 12 సార్లు పెరిగాయి! రైతులు ఎక్కువగా వాడే 50 కిలోల డీఏపీ బస్తా రూ.486 నుంచి రూ.1,260కి పెరిగింది. కాంప్లెక్సుల్లో ఎక్కువగా వాడే 17:17:17 కూడా బస్తాకు రూ.301 నుంచి రూ.1,021కి చేరింది. దిగుబడి పెంచడంలో కీలకమైన పొటాష్ కూడా రూ.231 నుంచి రూ.885కు పెరిగింది. 28:28:0 ధర బస్తాకు రూ.389 నుంచి రూ.1,297కు పెరిగింది. ఇంతా చేసి అవి ఎమ్మార్పీకి దొరకడమే లేదు.






విత్తనాలూ భారమే..

ప్రస్తుత ఖరీఫ్‌కు ముందు సబ్సిడీ విత్తనాల ధరలను ప్రభుత్వం అమాంతంగా పెంచింది. గతేడాది రూ.1,540కి పంపిణీ చేసిన క్వింటా సోయాబీన్ విత్తనాల ధరను రూ.2,680కి పెంచింది. వేరుశనగ విత్తనాల ధర కూడా క్వింటాల్‌కు రూ.3,600 నుంచి రూ.3,950కి పెరిగింది. వరిదీ అదే దారి. బీపీటీ-5204 రకం విత్తనాల ధర గతేడాది క్వింటాల్‌కు రూ.1,950 ఉండగా ఇప్పుడు రూ.2,100కి పెరిగింది. బాస్మతిని పోలిన ఆర్‌ఎన్‌ఆర్-2332 విత్తనాల ధరా రూ.1,850 నుంచి 2,300లకు ఎగబాకింది. ఎక్కువగా సాగు చేసే ఎంటీయూ-1010, ఎంటీయూ-1001 రకం రూ.1,850 నుంచి 2,000కు పెరిగింది. మొక్కజొన్న, ఆముదం, నువ్వులు, జొన్నలు, సజ్జ విత్తనాలపై గతేడాది క్వింటాల్‌కు రూ.2,500 చొప్పున సబ్సిడీ ఇచ్చిన సర్కారు, దాన్నిప్పుడు రూ.1,200కు తగ్గించింది. దాంతో వాటిని సాగు చేసే రైతులపై రూ.100 కోట్ల అదనపు భారం పడింది. ఇక పత్తి విత్తనాల ప్యాకెట్ ఎమ్మార్పీ రూ.930 అని ఎక్కడా పొరపాటున కూడా లేదు. కంపెనీలు, డీలర్లు కలిసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.2 వేలకు అమ్మి రైతులను దోచుకున్నారు.

పురుగు మందులూ ప్రియమే..: పురుగు మందులు, పంట సంరక్షణ ఉత్పత్తుల ధరలు కూడా రైతును కంటతడి పెట్టిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే పురుగుమందుల ధరలను అన్ని కంపెనీలూ 10 నుంచి 15 శాతం పెంచాయి. దాంతో రాష్ట్ర రైతులపై రూ.240 కోట్ల అదనపు భారం పడుతోంది.

- న్యూస్‌లైన్ ,హైదరాబాద్, న్యూస్‌లైన్ నెట్‌వర్క్

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!