YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 28 August 2012

31న రాష్ట్ర బంద్:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు

విద్యుత్ కోతలకు నిరసనగా ఈ నెల 31న రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ బంద్ కు అందరూ సహకరించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కోరారు. 31న ప్రయాణాలుంటే వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సమస్యని పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యుత్ కొరతల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. సాధారణంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల పిలుపుపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటారు. అందుకు భిన్నంగా విద్యుత్ సమస్యపై ప్రజలే తమంతట తాము స్పందించారన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారని చెప్పారు. 

విద్యుత్ సంక్షోభం వస్తుందని ముందే తెలిసి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. మన రాష్ట్రానికి రావలసిన గ్యాస్ తెచ్చుకోవడంలో కూడా ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. పక్క రాష్ట్రాలలో మనకంటే చాలా తక్కువమంది ఎంపిలు ఉన్నా, వారు బెదిరించి కేంద్రంలో పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. వైఎస్ హయాంలో కూడా సమస్యలు వచ్చేవని, అయితే ఆనాడు ఆయన సమర్థవంతంగా పరిష్కరించేవారని ఆమె తెలిపారు. శాసనసభ సమావేశాలు తక్షణం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని ఆమె కోరారు. 

రాష్ట్రంలో ప్రజల సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రికి మాత్రం ఎమ్మెల్యేలను కలిసే తీరిక లేదన్నారు. ఆయన విదేశీ ప్రతినిధులకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. 

బషీర్ బాగ్ కాల్పుల ఘటన నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మళ్లించేందుకు టీడీపీ డ్రామాలాడుతోందన్నారు. ఎన్డీటీవీ సర్వేపై టిడిపి నేత రేవంత రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ఏ సర్వే అయినా వైఎస్ఆర్ సీపీకే ప్రజాదరణ ఉందని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని రేవంత రెడ్డి గమనించాలన్నారు. వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితుల్లో టీడీపీ నేతలు లేరని అన్నారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!