YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 27 November 2012

కాంగ్రెస్ జేబు సంస్థా?


 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులపై విచారణ ముగించడానికి ఇంకో మూడు నెలల సమయం పడుతుందని పదవీ విరమణ చేయబోతున్న సీబీఐ డెరైక్టర్ ఏపీ సింగ్ చెప్పడం గర్హనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారమిక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘పదవి నుంచి దిగిపోతూ ఆయనిలాంటి ప్రకటన చేయడమేమిటి? ఈ అధికారుల తీరు చూస్తుంటే అసలు సీబీఐ ఒక రాజ్యాంగ సంస్థా? లేక కాంగ్రెస్ జేబు సంస్థా? అనిపిస్తోంది. ఈ సీబీఐ అధికారి యూపీపీఎస్‌సీ ద్వారా ఎంపికయ్యారా? లేక ఎవరి దయాదాక్షిణ్యాలపైనో కొనసాగుతున్న ఒక ఏజెంటా?’ అని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ.. మానవ విలువలకు కట్టుబడి వ్యవహరించడం లేదని, ఒక వ్యక్తి భావ స్వేచ్ఛను, జీవించే హక్కును కాపాడాల్సింది పోయి కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

జగన్‌ను ఆరు నెలలుగా జైల్లో పెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. ‘విచారణకు ఇంకా మూడు నెలల వ్యవధి కావాలంటున్నారు. అసలు జగన్‌ను మూడు నిమిషాలు జైల్లో పెట్టడానికి కావాల్సిన ఆధారాలు కూడా వారి వద్ద లేవు’ అని అన్నారు. ఈ కేసులో ఇంకా కీలక సమాచారం రావాల్సి ఉందని సీబీఐ చెప్పడం చూస్తుంటే.. ఆ సంస్థ ఎవరో చెప్పినట్లుగా ఆడుతున్నట్టు ఉందన్నారు. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పి.. బయటకు వచ్చిన తరువాత ఎంత సమయమైనా పడుతుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

ప్రజలంతా గమనిస్తున్నారు: రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆడుతున్న నాటకం, సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని జూపూడి అన్నారు. ‘జగన్‌పై దాఖలైన పిటిషన్‌పైమూడు వారాల్లోగా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తే.. మూడు వారాలెందుకు రెండు వారాలే చాలని సీబీఐ చెప్పింది. ఆగమేఘాల మీద బృందాలను ఏర్పాటు చేసి, దాడులు నిర్వహించి, నివేదిక ఇచ్చిన వారు ఇప్పుడు దర్యాప్తు విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. కేసుల్లో పది నెలల విచారణ తరువాత ఎన్నికల సమయంలో అదను చూసి కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా జగన్‌ను అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఇదంతా చూస్తుంటే సీబీఐ జగన్‌పై ఎంత కసి, కక్షతో వ్యవహరిస్తోందో అర్థమవుతోందన్నారు. సీబీఐని వెనుక నుంచి ఆడిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు రాష్ట్రంలో నూకలు చెల్లాయని, ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారని చెప్పారు. సీబీఐ మాన్యువల్‌నూ పట్టించుకోవడం లేదని, సుప్రీం ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘మంత్రివర్గాన్ని ప్రశ్నించే అధికారం సీబీఐకి ఎవరిచ్చారని మంత్రి ధ ర్మాన ప్రసాదరావు లేఖ రాస్తే.. ఆయన తప్పు చేయలేదని, మంత్రివర్గ నిర్ణయాలన్నీ సరైనవేనని ప్రభుత్వం చెబుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జారీ అయిన 26 జీవోల లో ఎలాంటి అక్రమాలు లేవని.. క్విడ్‌ప్రోకో లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్పష్టం చేసినపుడు జగన్‌పై కేసెందుకు? ఆయన ఇంకా జైల్లో ఎందుకుండాలి’ అని జూపూడి ప్రశ్నించారు.

నాడెందుకు ప్రశ్నించలేదు

ధర్మానకు ఇప్పుడు మద్దతుగా నిలిచిన మంత్రివర్గం.. వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినపుడు ఒక్కరు కూడా సీబీఐని ప్రశ్నించే సాహసం ఎందుకు చేయలేకపోయారని జూపూడి సూటిగా ప్రశ్నించారు. ‘మీకు రాజకీయ భిక్ష పెట్టి, గెలిపించి మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు దుర్మార్గుడయ్యాడా? జీవోలు కరెక్ట్ అయినపుడు వైఎస్సార్ ఎలా అవినీతిపరుడ య్యాడు?’ అని నిలదీశారు. నెల్లూరుకు చెందిన న్యాయవాది సుధాకర్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఈ ఏడాది మార్చి 12నాటికి జీవోలు సక్రమమో, అక్రమమో తెలపాలని ఆదేశాలిస్తే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం సమాధానమే చెప్పలేదన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే చంద్రబాబు డొంక తిరుగుడుగా సమాధానం చెబుతున్నారన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!