YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 1 December 2012

నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ఖబడ్దార్!

పయ్యావులకు భూమా నాగిరెడ్డి హెచ్చరిక

 ‘‘నీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించుకో... లేదంటే నోరు అదుపులో పెట్టుకో... అంతేగానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది’’ అంటూ వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నా తోటి మహిళా నాయకురాలిపై ఎలా మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో కేశవ్ ఉన్నారని భూమా ధ్వజమెత్తారు. కేశవ్ సన్నిహితుడికి చెందిన ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఓబుళాపురం గనులను కట్టబెట్టేందుకు ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజానిజాలేమిటో వెల్లడించాల్సింది పోయి... వాస్తవాలను కప్పిపుచ్చుకొనేందుకు ఆమెపై సంస్కారహీనంగా విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కేశవ్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు చంద్రబాబు తలొగ్గొచ్చేమోగానీ తమకు ఆ అవసరం లేదన్నారు. శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావు తదితర వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించినట్లుగా ఎస్‌ఆర్ మినరల్స్ సంస్థ యజమానితో తనకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేశవ్‌కే ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నట్లు చంద్రబాబును బెదిరించి... ఓబుళాపురం గనుల లీజ్ స్నేహితుడి కంపెనీకి కట్టబెట్టించే ప్రయత్నం చేసిందెవ్వరని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూలేనివిధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభలకు కేశవ్ హాజరైంది ఈ గనులను కట్టబెట్టించుకోవడానికే అనేది బహిరంగ రహస్యమేనని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీలో చోటుచేసుకున్న కఠోర వాస్తవాలనే శోభ ప్రస్తావించారని, అవి నిజం కాదని నిరూపించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. 

ఎస్‌ఆర్‌పై స్పందించలేదేమి చంద్రబాబూ?: ఓబుళాపురం గనులను ఎస్‌ఆర్ మినరల్స్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే, ప్రతిపక్షనేతగా చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ ఎందుకు స్పందించట్లేదని నాగిరెడ్డి ప్రశ్నించారు. ‘మీకు దక్కితే ఒక న్యాయం... వేరొకరికైతే ఇంకో న్యాయమా...’’ అని విమర్శించారు. గతంలో టీడీపీలో ఉన్న తాము ఆ పార్టీకి అన్ని వేళలా సేవ చేస్తే, ఫలితంగా అందిన ఫలాలను కేశవ్‌లాంటి వాళ్లు అనుభవించారని ఆరోపించారు. తామెప్పుడూ టీడీపీపై ఆధారపడి రాజకీయం చేయలేదని, తమపై ఆధారపడే ఆ పార్టీ రాజకీయాలు కొనసాగించిందని గుర్తు చేశారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనన్నారు. పాదయాత్ర కన్నాముందు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో చంద్రబాబు తెలుసుకోవాలని, అలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలుపు మాట దేవుడెరుగు, కనీసం గ్రామాల్లో టీడీపీకి బ్యానర్లు కట్టేవారన్నా మిగులుతారని సూచించారు. తెరమరుగైన పార్టీల జాబితాలో టీడీపీ కూడా చేరిపోనుందని, కార్యకర్తలను మభ్యపెట్టడానికే ఇంకా వైద్యం చేస్తూ బతికి ఉన్నట్లుగా మభ్య పెడుతున్నారని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.

sakshi news

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!