YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 25 November 2012

ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.. అవిశ్వాసం మాత్రం పెట్టనంటున్నారు

సీఎం అంటే.. ప్రభుత్వ రంగ సంస్థలకు కాపలాదారుగా ఉండాలి
కానీ చంద్రబాబు ఒక్కొక్క సంస్థనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ వచ్చారు
ఆయన తొమ్మిదేళ్ల పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు
ఇప్పుడు వైఎస్సార్ పథకాలను అమలు చేస్తానంటూ అబద్ధాలాడుతున్నారు
ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.. అవిశ్వాసం మాత్రం పెట్టనంటున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 39, కిలోమీటర్లు: 522.90

ఒక వ్యక్తి రిమాండ్ కాలం 90 రోజులు దాటితే.. బెయిల్ ఇవ్వాలని భారతచట్టాలు చెప్తున్నాయి. 90 రోజులు దాటిన తరువాత కూడా జగనన్నను ఎందుకు ఇంకా జైల్లోనే ఉంచుతున్నారు? సీబీఐని ఉపయోగించుకొని ఇది కాంగ్రెస్ వాళ్లు చేస్తున్న కుట్ర కాదా?
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఆర్టీసీ ప్రైవేటుపరమైపోయేది. వేలాది మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడేవి. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ రంగ సంస్థలకు కాపలాదారుగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ వచ్చారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు. మరో అవకాశం ఇస్తే మహానేత వైఎస్సార్ చేసిన పనులనే తానూ చేస్తానంటూ ఇప్పుడు అబద్ధపు మాటలు చెప్తూ తిరుగుతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రాజకీయ కుట్రలకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పాదయాత్ర 39వ రోజు ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో సాగింది. ఐజ మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కొంత మంది తెలంగాణ సెంటిమెంటును అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, విద్యార్థులను, యువకులను బలి తీసుకుంటున్నారని విమర్శించారు. సొమ్ము సంపాదించడం కోసమే వారు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జిల్లాను దత్తత తీసుకొని బాబు చేసిందేం లేదు..

‘‘నాన్న బతికున్నప్పుడు పాలమూరు జిల్లా వాళ్లు త్యాగమూర్తులని ఎప్పుడూ చెప్పే వారు. ఎందుకు నాన్నా అని అడిగితే.. ‘ఇది కరువు జిల్లా.. పంటలు సరిగా పండవు. కూలీ చేద్దామన్నా దొరకదు. ఈ జిల్లా అన్నదమ్ములు కుటుంబం కోసం ఎక్కడెక్కడికో వలసలు పోయి అక్కడ వాళ్లు తిన్నా, తినకపోయినా నాలుగు డబ్బులు వెనుకేసుకొని వాళ్ల కుటుంబాలకు పంపుతారమ్మా. ఈ జిల్లాను చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు కానీ ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదు. జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 8 లక్షల ఎకరాలకు నీళ్లు అంది జిల్లా సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు నా అన్నాదమ్ములు వలసలు మానేసి వాళ్ల కుటుం బాలతో సంతోషంగా ఉంటారు’ అని నాన్న చెప్పేవారు’’ అని షర్మిల గుర్తుచేసుకున్నారు. ‘‘నాన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 75 శాతం పనులు పూర్తి చేశారు. 

మరో 25 శాతం పనులు పూర్తి చేస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అయ్యేది. కానీ కాంగ్రెస్ పాలకులు మూడేళ్ల నుంచీ ఈ ప్రాజెక్టుల పనులను పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారు. మాట వరుసకు ముఖ్యమంత్రి వచ్చి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను ప్రారంభించిపోయారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క చుక్క నీళ్లు ఎందుకు పొలాల్లోకి పారడం లేదని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నేను దారి వెంట నడుస్తుంటే అక్కా చెల్లెమ్మలు కలుస్తున్నారు. ‘మాకు సాగునీళ్ల సంగతి దేవుడెరుగు కనీసం తాగు నీళ్లు కూడా లేవ క్కా’ అని బాధపడుతున్నారు. ప్రజలకు కనీసం తాగే నీళ్లు కూడా అందించలేని ఈ ప్రభుత్వం ఉండటం అవసరమంటారా?’’ అని షర్మిల ఉద్వేగంగా ప్రశ్నించారు.
అవిశ్వాసం పెట్టకుండా నాటకాలు ఎందుకు?

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర నాటకం ఆడుతున్నారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు. మళ్లీ ఇప్పుడు అవే పల్లెల మీదుగా తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడుకు పాదయాత్ర ఎందుకు? అవిశ్వాసం పెట్టడానికి సరిపడా ఎమ్మెల్యేలు ఆయన వద్ద ఉన్నారు. ఈ ప్రజాకంటక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయొచ్చు.. కానీ దించేయరట. ఇప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూలదోయడం చాలా సులభం. ప్రతిరోజూ అడుగుతూనే ఉన్నాం. నిలదీస్తూనే ఉన్నాం. కానీ అవిశ్వాసం పెట్టరట. పేరుకు మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదంటూ చంద్రబాబు తిడుతూనే ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారారు..’’ అని షర్మిల చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

ఆపద్ధర్మ సీఎంగా 850 ఎకరాలు జేబులోకి..

‘‘రెండెకరాలతో రాజకీయాల్లోకొచ్చిన చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాదించారని కమ్యూనిస్టులు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఆయనపై విచారణ జరపదు. చంద్రబాబును మించిన ధనవంతుడైన రాజకీయ నేత లేడని తెహల్కా వెబ్‌సైట్ ఆరోపించినా విచారణ చేయరు. రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు కేజీ బేసిన్‌లోని లక్షల కోట్ల రూపాయల విలువైన గ్యాస్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టారు. అయినా దానిపై విచారణ జరపరు’’ అని షర్మిల విమర్శించారు. ‘‘ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు.. ఎకరా రూ.2 కోట్ల దాకా విలువ చేసే 850 ఎకరాల భూమిని ఎకరా రూ.50 వేలకే తన బినామీ సంస్థ అయిన ఐఎంజీ భారతకు కట్టబెడితే దానిపైనా విచారణ చేయరు. ఐఎంజీ వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళితే.. దీనిపై ఎందుకు విచారణ జరపరు అని జడ్జిగారు సీబీఐని ప్రశ్నించారు. కానీ సీబీఐ తన వద్ద సిబ్బంది లేరని సమాధానం చెప్పింది. అదే సీబీఐ.. జగనన్న, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో 28 బృందాలతో ఒకేసారి సోదాలకు దిగింది. కానీ చంద్రబాబుపై విచారణకు సిబ్బంది లేరని చెప్పింది’’ అని అన్నారు.

షర్మిల ఆదివారం యాత్రను ఉదయం పరిదిపురం నుంచి ప్రారంభించారు. ఐజ మండల కేంద్రానికి చేరుకునే మార్గ మధ్యంలో బుడగ జంగాలు, గీత కార్మికులు కలిశారు. ఐజలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఐజ మండల కేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. ఆదివారం 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తంగా 522.90 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.


పట్టించుకునేవారే లేరమ్మా..

‘‘మా గోడు పట్టించుకునేవారే లేరమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు చెట్టు పన్ను తగ్గించారు. గీత కార్మిక సంఘాలు తాటి, ఈత చెట్లు పెంచుకోవడానికి 5 ఎకరాల స్థలమివ్వాలని నిర్ణయించారు. కానీ, ఈ పాలకులు పట్టించుకోవడం లేదమ్మా.. గీత కార్మిక వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి తీసివేసి కార్పొరేషన్‌కు అప్పగించేలా చూడండి’’ అంటూ పరిదిపురం గీత కార్మికులు షర్మిలను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జగనన్న దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని షర్మిల హామీ ఇచ్చారు.


గ్రామాలకు గ్రామాలు కదిలాయి

షర్మిల పాదయాత్రకు సంఘీభావంగా ఆదివారం గ్రామాలకు గ్రామాలు కదిలొచ్చాయి. విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపాధి హామీ, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలపై పలువురు షర్మిల వద్ద ఏకరువు పెట్టారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అన్ని పథకాలూ తిరిగి ఊపిరి పోసుకుంటాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆమె వారికి అభయమిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలపై వైఎస్సార్‌కు ఎనలేని ప్రేమ ఉండేదన్నారు. పాదయాత్రలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, బాల మణెమ్మ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, నాయకులు చల్లా రామకృష్ణారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!