YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 25 November 2012

జగన్ బెయిల్ పై చర్చ


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు రాష్ట్రంలోనే కాదు దేశమంతటా చర్చ జరుగుతోంది. వ్యక్తి స్వేచ్ఛ - చట్టం - న్యాయం- దర్యాప్తు - హక్కులు - బెయిల్ కు షరతులు- ప్రజాప్రతినిధుల అరెస్టులు ... ఇలా అనేక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చిస్తున్నారు. జగన్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిభావంతమైన ముఖ్యమంత్రిగా పేరు ఘఢించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎంపి కావడంతోపాటు అరెస్ట్ చేసి ఆరు నెలలు కావస్తుండటంతో ఆయన బెయిల్ కు ఇంతటి ప్రాధాన్యత లభించింది. తీవ్ర నేరం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ వ్యక్తినైనా, నేరం రుజువు కానప్పుడు బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచే అధికారం కోర్టులకు కూడా లేదు. జైలులో మగ్గే వారు బెయిల్ పొందేందుకు అవకాశాలు కల్పిస్తూ చట్టానికి సవరణలు కూడా చేశారు. నెలల తరబడి జైల్లో ఉంచిన తరువాత వారు నిర్దోషులుగా తేలితే, ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారు? ప్రజాప్రతినిధులను జైల్లో పెడితే నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజలకు ప్రత్యామ్నాయం ఏమిటి?.... ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దర్యాప్తు ఎన్ని రోజులయినా జరగవచ్చుగానీ నిందితుడిని జైలులోనే ఉంచడానికి వీలులేదు. బెయిల్ బేషరతు కాదు. షరతులు విధించవచ్చు. వాటిని ఉల్లంఘిస్తే ఆ బెయిల్ ను రద్దు చేయవచ్చు. చట్టాలు అన్నీ ఆంగ్ల భాషలో ఉండటం వల్ల అవి అందరికీ అర్ధం కావడంలేదు. చట్టాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ఇందు కోసం చట్టాలను ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉంది.

చట్ట ప్రకారం ఏదైనా కేసు విచారణ సమయంలో దర్యాప్తు ఎన్ని రోజులు జరిగినా, ఆ అంశంతో సంబంధం లేకుండా కోర్టులు వ్యవహరించాలి. కేసు దర్యాప్తు జరిగే సమయంలో షరతులతో కూడిన బెయిల్ ఇవ్వవచ్చు. మనిషి స్వేచ్ఛా జీవి. అతనికి స్వేచ్ఛ చాలా ముఖ్యం. అందువల్లే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకు స్వేచ్ఛగా జీవించే హక్కును ప్రసాదించింది. ఏ చట్టాలైనా దీనికిలోబడే తయారు చేయాలి. మనిషి స్వేచ్ఛకు అనేక రకాలుగా రక్షణ కల్పించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 154 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి కేసు విచారణ పూర్తయి కోర్టు నేరాన్ని నిర్ధారించడం లేదా కొట్టివేసేంత వరకు అరెస్ట్ అయిన నిందితులకు హక్కులుంటాయి. వ్యక్తి స్వేచ్ఛను, హక్కులను పరిగణనలోకి తీసుకొనే ఎలాంటి కేసులో అయినా 14 రోజుల వరకు మాత్రమే రిమాండ్ విధించే అధికారాన్ని కోర్టులకు ఇచ్చారు. ఆ తర్వాత కూడా నిందితునికి రిమాండ్ పొడిగించాలంటే కోర్టుకు తగిన కారణాలు చూపాలి. అప్పుడు కూడా న్యాయమూర్తి సంతృప్తి చెందితేనే మరో 14 రోజులు రిమాండ్ విధిస్తారు. 1973కు ముందు బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేసే విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. అయితే ఈ వ్యవహారం దుర్వినియోగ అవడంతో వ్యక్తి స్వేచ్ఛ హరించుకుపోతుందని భావించి పార్లమెంటులో చట్ట సవరణ చేశారు. సవరించిన చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో 60 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న వ్యక్తికి కచ్చితంగా బెయిల్ ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ శిక్షపడే అవకాశమున్న కేసుల్లో 90 రోజుల గడువు విధించారు. అంతకన్నా ఎక్కువ కాలం ఏ వ్యక్తినీ రిమాండ్‌లో ఉంచే అధికారం ఏ కోర్టుకూ లేదు. ఎంత తీవ్రమైన నేరం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నా 90 రోజుల రిమాండ్ తర్వాత ఆ వ్యక్తిని బెయిల్‌పై బయటకు పంపవలసిందే. పోలీసులు లేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ఎన్ని రోజులైనా చేయవచ్చుగానీ, నిందితుని మాత్రం విడుదల చేయాలి. నిందితుడు నిబంధనలు పాటిస్తే బెయిల్ ఇవ్వకుండా ఉండే అవకాశం కోర్టుకు కూడా లేదు. ఈ విషయాలు తెలియని చాలా మంది నిందితులు జైళ్లలోనే ఉంటున్నారు. శిక్ష పడే కాలం కన్నా ఎక్కువ రోజుల పాటు విచారణ ఖైదీలుగా చాలా మంది నిందితులు జైలులో ఉన్న సందర్భాలు అనేకం. మనదేశంలో నమోదవుతున్న కేసుల్లో 20 శాతం కేసుల్లో మాత్రమే నేరం రుజువు అవుతోంది. ఒకవేళ నేరం రుజువై శిక్ష పడితే, నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న కాలాన్ని శిక్షా కాలంలో కలపాలనే నిబంధన ఉంది. అయితే అతను నిర్దోషిగా తేలితే రిమాండ్‌లో ఉన్న కాలాన్ని ఎలా పూడుస్తారు? అతనికి కలిగిన స్వేచ్ఛా భంగానికి ఎవరిని బాధ్యులను చేస్తారు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచడానికి న్యాయసేవా సంస్థలు కృషి చేస్తున్నాయి. వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూనే కోర్టులకు కొన్ని అధికారాలను కల్పించారు. రిమాండ్ కాలపరిమితి ముగిసిన తర్వాత నిందితులకు బేషరుతుగా బెయిల్ ఇవ్వాలన్న నిబంధన ఏదీలేదు. నిందితుడు సాక్షులను ప్రభావితం చేస్తాడనుకున్న సందర్భంలో షరతులతో కూడిన బెయిల్ ఇవ్వవచ్చు. ఆ అధికారం కోర్టులకు ఉంది. షరతులను నిందితుడు ఉల్లంఘించినట్లయితే అతడి బెయిల్‌ను రద్దు చేస్తారు.

ప్రజాప్రతినిధులు: ఈ మధ్య కాలంలో ప్రజాప్రతినిధులు తీవ్రనేరారోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని అరెస్టు చేసి నెలలపాటు రిమాండ్‌లో ఉంచుతున్నారు. కొందరికి శిక్షలు పడుతున్నాయి. కొందరు నిర్ధోషులుగా విడుదల అవుతున్నారు. ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి జైల్లో పెడితే ఆ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏమిటి? వారి సమస్యలను ఎవరి ద్వారా పరిష్కరించుకోవాలి? సామాన్యులు నేరుగా వెళ్లి తమకు ఫలానా పని కావాలంటే అధికారులు అంత సులువుగా చేస్తారా? లేదు. అందుకే ప్రజాప్రతినిధులతో వెళ్లి లేకపోతే వారితో ఫోన్ చేయించుకుని పనులు చేయించుకుంటుంటారు. ప్రతినిధులు లేకుండా చేస్తే ఎలా? ఈ విషయం గురించి చట్టసభలు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా ప్రతినిధులను జైల్లో పెట్టవలసి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా రూపొందిచుకోవలసిన అవసరం ఉంది.

జగన్ కేసు: జగన్ కేసు విషయంలో సిబిఐ మొదటి నుంచి పక్షపాతంతోనే వ్యవహరిస్తోంది. అనేక సందర్భాలలో ఆ విషయం స్పష్టమైంది. అరెస్ట్ చేసిన తరువాత ఎక్కువ కాలం జైలులోనే ఉంచాలన్న ఉద్దేశంతో విచారణ విషయంలో తీవ్రజాప్యం చేస్తోంది. ఇంతకాలం తరువాత జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే, దర్యాప్తు పూర్తి చేయకపోగా బెయిల్ కు సిబిఐ అడ్డు తగులుతోంది. ఏదోఒక రకంగా జాప్యం చేయడమే సిబిఐ ప్రధాన ఉద్దేశంగా ఉంది. చివరకు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ కు కూడా సిబిఐ గడువు కోరింది. సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో లోక్ సభ సభ్యుడైన జగన్ ను జైలులో పెట్టి ఆరునెలలు కావస్తోంది. అతనిని అరెస్ట్ చేసిన సిబిఐ 90 రోజులలో దర్యాప్తు పూర్తి చేయలేదు. నిర్ణీత గడువులోపల ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. అందువల్ల తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ నాంపల్లి సీబీఐ న్యాయస్థానంలో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో చట్టపరమైన(స్టాట్యుటరీ) బెయిల్ పిటిషన్ పై ఈ నెల 23న కోర్టులో వాదప్రతివాదాలు జరిగాయి. వాదనలు ముగిసిన తరువాత కోర్టు తీర్పుని ఈ నెల 28కి వాయిదా వేసింది.

2 comments:

  1. http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=53163&Categoryid=28&subcatid=0

    For more interesting articles, pl. visit www.sakshi.com and www.sakshipost.com (for news in English)

    ReplyDelete
  2. http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=53163&Categoryid=28&subcatid=0

    For more articles like these, pl. visit www.sakshi.com and www.sakshipost.com (for news in English)

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!