YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 21 December 2012

అన్న దానాలు.. వైద్య శిబిరాలు

దేవాలయాలు, చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను నిరసిస్తూ నిరసనలు
జైలులో జగన్‌ను కలసిన కుటుంబసభ్యులు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత మెగా వైద్యశిబిరాలు, రక్తదానం, పేదలకు దుస్తులు, వికలాంగులకు వీల్‌చైర్స్, వృద్ధులకు చేతికర్రలు అందజేయడం, ఆసుపత్రులలో పండ్లు, విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయించడానికి నిరసనగా పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని కుటుంబసభ్యులు ప్రత్యేక ములాఖత్ ద్వారా కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

జగన్‌ను కలిసిన వారిలో తల్లి విజయమ్మ, భార్య భారతి, కూతుళ్లు హర్ష, వర్ష, షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి ఉన్నారు. అనంతరం వారు తిరిగి వెళ్లే ముందు జైలు బయట పార్టీనేతల కోరిక మేరకు వారు తీసుకొచ్చిన కేక్‌ను విజయమ్మ కట్‌చేశారు. అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ జైలు వద్ద కేక్ కట్ చేసి, పావురాలను గాల్లోకి ఎగురవేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జగన్ జన్మదిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, నల్లా సూర్యప్రకాష్, జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, ఎంవీఎస్ నాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, పీఎన్వీ ప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డిలతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పార్టీనేతలు నిరసన, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా: జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో 100 మంది మహిళలు మదనపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆయన పేరుపై ప్రత్యేక పూజలు చేయించారు. సీబీఐ తీరును నిరసిస్తూ కడపలోని వైఎస్‌ఆర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ ఏడురోడ్ల కూడలి మీదుగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గుంటూరుజిల్లా నరసరావుపేటలో రెండుచోట్ల 40 కేజీల భారీ కేక్‌లను కట్‌చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులోని బధిరుల పాఠశాలలో అన్నదానం నిర్వహించారు. నెల్లూరులో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 300 మీటర్ల పొడవైన పార్టీ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ నిర్దోషి అని, ఆయనను విడుదల చేయాలంటూ రాష్ట్రపతికి పంపేందుకు బుజబుజనెల్లూరులో రక్తంతో సంతకాల సేకరణ చేశారు. 

కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో వైఎస్సార్ గ్రామ సమైక్య సంఘ సభ్యులు వరి పొలంలో కట్టేత పనులు చేసి రూ. ఏడువేలు సంపాదించారు. ఆ మొత్తాన్ని గ్రామంలో మంచినీటి చెరువుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో అంధుల పాటల కచేరీ నిర్వహించారు. నల్లగొండజిల్లా సూర్యాపేటలో భారీ కేక్‌ను కట్‌చేసి, వికలాంగునికి వీల్‌చైర్‌ను అందించారు. జగన్ విడుదల కాకుండా ప్రభుత్వం కుట్రపన్నడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో పార్టీ కార్యకర్తలు రోడ్డు ఊడ్చారు. కరీంనగర్‌జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అయ్యప్ప ఆలయానికి ఒక గదిని విరాళంగా ప్రకటించారు.

జగన్ సీఎం కావాల్సిందే
శతాధిక వృద్ధురాలి ఆకాంక్ష

‘‘పేదల కోసం పనిచేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. తిరిగి ఆయన పాలన రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాజన్న కొడుక్కి ఓటేసేందుకే నేను బతికున్నాను’’ అని తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన శతాధిక వృద్ధురాలు పేకల చెల్లమ్మ చెప్పారు. జగన్‌కు జన్మదినం పేదలకు పండుగరోజులాంటిదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన వరదానమ్మ తన ఇంటివద్ద జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్‌చేసి చుట్టుపక్కల ఇళ్లవారికి, స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ‘‘నీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక నా భర్త మరణిస్తే నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మా ఇంటికి వచ్చి ఓదార్చావు.. మమ్మల్ని ఆపదలో ఆదుకున్నావు. నీవు నిండు నూరేళ్లు వర్ధిల్లు... కుట్రలు, కుతంత్రాలు అశాశ్వతం. విశ్వసనీయత, ఆదరణ, ఆత్మీయత ఎప్పటికీ నిలిచి ఉంటారుు. త్వరలోనే జనం మధ్యకి వస్తావు.. నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఆశీర్వదించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!