YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 21 December 2012

సీబీఐ, ప్రభుత్వ తీరుపై అనుమానాలు

ప్రహసనంలా ధర్మాన ‘ప్రాసిక్యూషన్’

జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పులు వచ్చే ప్రతిసారీ ‘వ్యూహాత్మక’ చర్యలు
గతంలో ప్రభుత్వ అనుమతి కోరిన సీబీఐ.. అక్కర్లేదంటూ ఇప్పుడు పిటిషన్
ప్రాసిక్యూషన్ తిరస్కరణ ఫైలును తాజాగా తిప్పి పంపిన గవర్నర్! - 2లో

సాక్షి, హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతిని కోరిన సీబీఐ, ఇంతకాలం కిమ్మనకుండా ఉండి, అలాంటి అనుమతి తమకేమీ అక్కర్లేదని నాలుగు నెలల తర్వాత తాపీగా ఇప్పుడు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ వైఖరి అనుమానాస్పదంగా మారిన నేపథ్యంలోనే.. ధర్మాన ప్రాసిక్యూషన్‌ను తిరస్కరిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి తీర్మానం చేసి పంపిన ఫైలును పలు సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తిప్పిపంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫైలుపై గవర్నర్ ఎలాంటి అనుమానాలను లేవనెత్తారు? ఏ అంశాలపై న్యాయ సలహాలు సూచించారు? ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసిన తరుణంలోనే సంబంధిత ఫైలును గవర్నర్ వెనక్కి పంపిన విషయం బయటికి రావడంలోని ఆంతర్యమేమిటి? ..ఇలాంటి అనేక ప్రశ్నలు కాంగ్రెస్ నేతల్లోనే పెను చర్చకు దారి తీశాయి. 

ధర్మాన ప్రాసిక్యూషన్‌కు గత ఆగస్టు 10న రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్నాక నిర్ణయిస్తామంటూ నాలుగు నెలలకు పైగా దాన్ని కిరణ్ పక్కన పెట్టారు. అడ్వొకేట్ జనరల్ నుంచి వివరణ వచ్చాక.. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి తిరస్కరిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ మేరకు ఫైలును గవర్నర్‌కు పంపారు. అయితే, మంత్రి ధర్మాన, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ డిసెంబర్ 13న న్యాయస్థానం ముందు సీబీఐ అత్యంత గోప్యంగా మెమో దాఖలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నట్టుండి సీబీఐ దాఖలు చేసిన ఈ మెమో వ్యవహారం బయటికి లీకైంది! పైగా మంత్రిమండలి సిఫార్సు చేసిన ఫైలును పలు సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ తిప్పిపంపిన విషయం సైతం సరిగ్గా ఈ సమయంలోనే బయటికి రావడం గమనార్హం. చూస్తుంటే ఇదంతా పక్కా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారంలాగే కనబడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 

మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేనప్పుడు, మొదట దానికోసం సీబీఐ ఎందుకు కోరినట్టంటూ పలువురు మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని 4 నెలల కిందట కోర్టుకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వొద్దని మంత్రిమండలి తీర్మానం చేసినప్పుడు విపక్షంతో పాటు స్వపక్షం నుంచి కూడా పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవిని విచారణ కోసం దిల్‌కుశ అథితి గృహానికి పిలిచిన సీబీఐ, రెండో రోజు, అంటే మే 24న విచారణ అనంతరం ఉన్నపళంగా ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. సరిగ్గా జగన్ సీబీఐ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఇది జరిగింది! జగన్‌ను అరెస్టు చేయాలని కచ్చితమైన నిర్ణయానికి వచ్చినందునే, మంత్రులను ఎందుకు విస్మరించారన్న విమర్శలను తప్పించుకునేందుకు పథకం ప్రకారమే మోపిదేవిని అరెస్టు చేశారని అప్పట్లోనే విమర్శలు బలంగా విన్పించాయి. మే 25 నుంచి వరుసగా మూడు రోజుల పాటు జగన్‌ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ, ఆయనను అరెస్టు చేస్తున్నట్టు 27 రాత్రి 7.20కి తెలియజేసింది. మోపిదేవిని అరెస్టు చేసేటప్పటికి ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. 

కిరణ్ అగమేఘాలపై మోపిదేవి నుంచి రాజీనామా లేఖ తెప్పించుకుని, తక్షణం దానికి ఆమోదం తెలిపారు. పైగా మోపిదేవి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి గానీ, న్యాయ సలహాలు గానీ తీసుకోలేదు. ధర్మాన విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతి కోరుతూ గత ఆగస్టు 10న సీబీఐ లేఖ రాసింది. అది బయటికి తెలిశాక ఆగస్టు 14న ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ కిరణ్‌కు లేఖ పంపారు. 4 నెలలు దాటుతున్నా దానిపై సీఎం నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే ఉన్నట్టుండి, మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సీబీఐ కొత్త వాదనను తెరపైకి తేవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ధర్మాన 2009కి ముందు రెవెన్యూ మంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలపై కేసు నడుస్తోంది.ఆయన పదవీకాలం 2009తో పూర్తయింది గనుక ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు’ అని సీబీఐ కోర్టు ముందుంచిన మెమోలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 4 నెలల క్రితం ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వాన్ని అనుమతి కోరినప్పుడు కూడా ఈ విషయం సీబీఐకి తెలుసని, అయినా దాన్ని ఈ సమయంలోనే తెరపైకి తేవడంలో ఆంతర్యమేమిటని ఒక ఉన్నతాధికారి ప్రశ్నించారు. జగన్ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందుకొచ్చే ప్రతిసారీ సీబీఐ ఇలా చేయడం పరిపాటి అయిందని కాంగ్రెస్ నేతల్లోనే వినిపిస్తోంది. 

హైకోర్టులో ప్రస్తుతం జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయి, ఈ నెల 24న తీర్పు రానుండటం తెలిసిందే. సరిగ్గా దానికి మూడు రోజుల ముందు సీబీఐ మెమో ఉదంతం, ధర్మాన ఫైలును గవర్నర్ తిప్పి పంపిన వార్త ఒకేసారి బయటికి వచ్చాయి! దీన్ని యాదృచ్ఛికంగా ఎంతమాత్రమూ చూడలేమని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గత జూలైలో జగన్ జగన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అందుకు తిరస్కరిస్తూ అక్టోబర్ 5న తీర్పు వచ్చింది. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాల రూ.51 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఢిల్లీలో నోట్ విడుదల చేసింది. పైగా, టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ‘విజ్ఞప్తి’ చేసీ చేయగానే ఈడీ నుంచి అటాచ్‌మెంట్ ఆదేశాలు వెల్లడయ్యాయి. ఇలాంటి సందర్భాలను లోతుగా విశ్లేషిస్తే పై ఆదేశాల మేరకే పథకం ప్రకారం సాగుతోందన్న అనుమానాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

అంతా గందరగోళమే...: శుక్రవారం నాటి ఉదంతాలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో గందరగోళం నెలకొంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు కేబినెట్ అనుమతి నిరాకరణతో అంతా సాఫీగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో.. ప్రాసిక్యూషన్‌కు అసలు ప్రభుత్వ అనుమతే అక్కర్లేదంటూ సీబీఐ కోర్టుకెక్కడం, సంబంధిత ఫైలును అదే సమయంలో గవర్నర్ తిప్పి పంపడం చూస్తుంటే అసలేం జరుగుతోందో తమకేమీ అంతుబట్టడం లేదని ఒక మంత్రి వాపోయారు. 

గతంలో సుప్రీంకోర్టు నుంచి నోటీసులందుకుని, వాటికి సమాధానాలు పంపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న మంత్రులను కూడా తాజా పరిణామాలు ఆందోళనలో పడేశాయి. మున్ముందు చిక్కులు తలెత్తకుండా ధర్మాన ఫైలును మరోసారి జాగ్రత్తగా ఏజీ ద్వారా పరిశీలన చేయించి పంపాలని మాత్రమే గవర్నర్ కోరారని కొందరంటున్నారు. కానీ ఏజీ పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఇప్పుడిలా తిప్పి పంపడంపై మరో మంత్రి ఆశ్చర్యం వెలిబుచ్చారు. మరోవైపు శుక్రవారమే గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు! తాజా పరిణామాల నేపథ్యంలో ధర్మాన రాజీనామా వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గవర్నర్ చర్య నేపథ్యంలో బొత్స సత్యనారాయణ, సబిత సహా పలువురు మంత్రులు కిరణ్‌తో భేటీ అయ్యారు.

జగనే లక్ష్యంగా జగన్నాటకాలు?

ఏం జరిగింది?
గత మే 27న వైఎస్ జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది
గత అక్టోబర్ 5న జగన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది

డిసెంబర్ 24న జగన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది

దానికి ముందేం జరిగింది?
మే 24న, సరిగ్గా మూడు రోజుల ముందు అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసింది
అక్టోబర్ 4న, అంటే ఒక్క రోజు ముందు రూ.51 కోట్ల విలువైన జగతి, జనని ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నోట్ విడుదల చేసింది

డిసెంబర్ 21న, సరిగ్గా మూడు రోజుల ముందు, ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి లేదంటూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసిన విషయం ‘బయటికి’ వచ్చింది. ప్రాసిక్యూషన్‌కు మంత్రివర్గం నిరాకరించిన ఫైలును గవర్నర్ తిప్పి పంపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!