YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 29 May 2012

జగన్ అరెస్ట్‌ను నిరసిస్తూ అన్ని మండల కేంద్రాల్లో పదిరోజుల పాటు కొనసాగింపు

ప్రజాస్వామ్యం ముసుగులో రాష్ట్ర సర్కారు అరాచకాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తల్ని వేధిస్తున్నారు..
సోనియాను ఇటలీ పంపేదాకా రాష్ట్ర ప్రజలు విశ్రమించరు
లగడపాటి మాటలు విని జనం నవ్వుకుంటున్నారు.. 
వైఎస్ మరణంలో కుట్ర లేకుంటే బ్లాక్‌బాక్స్ వాయిస్ బయటపెట్టరెందుకు?

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బుధవారం నుంచి పది రోజులపాటు నిరాహారదీక్షలు, రిలే నిరాహారదీక్షలతో పాటు వివిధ మార్గాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. అయితే ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో మాత్రం వీటికి మినహాయింపు ఉంటుందని చెప్పారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అన్ని జిల్లాల కన్వీనర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంబటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక వ్యక్తి అరెస్టుకు సంబంధించి ప్రజల్లో ఇంత గందరగోళం సృష్టించడం ఇదే మొదటి సారి. అరెస్టుకు ముందు నుంచే ప్రభుత్వమే స్వయంగా ఒక టైను సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై రెండు రోజుల ముందు నుంచే బైండోవర్ కేసులు నమోదు చేయడం, మరికొందరిని కస్టడీలోకి తీసుకోవడం, ముఖ్యనేతలను ఇళ్లవద్దే బంధించడం దేనికి సంకేతం?’ అని నిలదీశారు. 

జగన్ అరెస్టు అక్రమం, అన్యాయమైనందున ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పోలీసుల చేత భయానక వాతావరణం సృష్టించిందా? అని ప్రశ్నించారు. పోలీసుల అరాచకాలపై స్వయంగా ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే వీరి ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికపు అరాచకాలు చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయకుండా, కార్యకర్తలను భయాందోళనకు గురిచేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై నీచరాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. జగన్‌ను ఇరుకున పెట్టామని సంతోషిస్తున్న చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దల ఆనందం మూడునాళ్ల ముచ్చటేనని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నలిపేయాలని చూస్తే నలిగేది కాదని, కెరటంలా పైకి ఎగుస్తుందని అంబటి స్పష్టం చేశారు.

సోనియాను ఎదిరించినందుకే అరెస్ట్ చేశారా?

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎలాంటి ఆధారం లేకుండా ఉప ఎన్నికల ముందు విచారణ పేరుతో వేధింపులు చాలదన్నట్లు అరెస్టు చేయడం దేనికి సంకేతమని అంబటి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఎదిరించి, ఆపార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా..? అని ప్రభుత్వ పెద్దలను నిలదీశారు. ‘మాఫియా అనే పదం ఇటలీలో పుట్టింది. అమ్మ సోనియా కూడా అక్కడి నుంచే వచ్చారు. ఆమె ఇటలీ నుంచి వస్తూ.. తనతో పాటే మాఫియాను తెచ్చారు. 

అదే మాఫియా ఇక్కడ కొన్ని శక్తుల్ని కలుపుకొని వైఎస్ కుటుంబాన్ని, 39 ఏళ్ల యువకుడిని వేధిస్తున్నారు. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న జగన్‌ను కర్కశంగా జైలుకు పంపారు. జగన్‌ను జైలుకు పంపిన సోనియాను ఇటలీకి పంపేదాకా తెలుగు ప్రజలు విశ్రమించరు. అన్యాయం జరిగిన చోట ఎదురొడ్డి పోరాడటం తెలుగు ప్రజల నైజం’ అని అంబటి ఘాటుగా వ్యాఖ్యానించారు. విజయమ్మ కన్నీళ్లను అపహాస్యం చేస్తున్న సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ అధినేత చంద్రబాబులకు ప్రజలు త్వరలో తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. బఫూన్‌లాంటి లగడపాటికి రాష్ట్రంలో ఏం జరిగినా అందుకు జగనే కారణమని చెప్పడం సిగ్గుచేటన్నారు. ‘లగడపాటికి ఒక ఫాంహౌస్ ఉందట. అది రాత్రి కార్యక్రమాలకు ఉపయోగిస్తారో, మరేదానికి వాడుతారో నాకు తెలియదు. అయితే అక్కడ జిలెటిన్ స్టిక్ పేలిందట అందుకు జగనే కారణమని చెబుతున్నారు. లగడపాటి చెప్పే మాటలు విని జనం నవ్వుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. 

ప్లీనరీలో మేం చేసిన తీర్మానం మీకు గుర్తుకు లేదా?

దివంగత వైఎస్ మరణం పట్ల తమకు అనుమానాలున్నాయని, వీటిని నివృత్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీలోనే తీర్మానం చేసిన విషయం సీఎం కిరణ్ గుర్తుచేసుకోవాలని అంబటి సూచించారు. వైఎస్‌ది సహజ మరణంకాదని, దీనిపై సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని అప్పట్లోనే తాము చేసిన డిమాండ్‌ను మరిచారా? అని ప్రశ్నించారు. వైఎస్ మరణంలో ఎలాంటి కుట్ర లేకపోతే హెలికాప్టర్‌లోని బ్లాక్‌బాక్స్ వాయిస్‌ను ఎందుకు బయటపెట్టడంలేదని అడిగారు. 33 నిమిషాల నిడివిగల వాయిస్‌లో కేవలం 7 నిమిషాలు మాత్రమే బయటపెట్టడంలో ఆంతర్యమేమిటని సీఎంని నిలదీశారు. ఈ అనుమానాలకు కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ‘జగన్ కేసు విషయమై సీఎం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి మోపిదేవి ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషిగా బయటకొస్తారని చెబుతున్నారు. కానీ మరోవైపు జగన్‌ను మాత్రం దొంగ అంటూ జైలుకు పంపుతారట. ఒకే కేసులో ఇద్దరు ముద్దాయిలుంటే ఒకరు మంచోళ్లట, మరొకరు నేరస్తులట.. ఇదేం పద్ధతి. సీఎం స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడటం దేనికి సంకేతం. అయితే నిర్దోషైన మోపిదేవిని సీబీఐ అన్యాయంగా అరెస్టు చేసిందా..? ఆధారాలు లేకుండానే సీబీఐ అలా ప్రవర్తించిందా..?’ అని సీఎంను నిలదీశారు. అలాగే పరిటాల రవి కేసును సీబీఐ చేత పునఃవిచారణ జరి పించాలని వస్తున్న వార్తలపై అంబటి స్పందిస్తూ... పరిటాల రవిదే కాదు, వంగవీటి మోహనరంగా, చంద్రబాబు అక్రమ ఆస్తులపై కూడా విచారణ జరిపించుకోండని చెప్పారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!