YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 29 May 2012

చంచల్‌గూడ జైల్లో జగన్‌తో కుటుంబ సభ్యుల భేటీ


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు జగన్ తల్లి వై.ఎస్.విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బావ అనిల్, మామ గంగిరెడ్డి, చిన్నమ్మ స్వర్ణమ్మతో పాటు నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జగన్ గ్రూపు సంస్థల ఆర్థిక సలహాదారు విజయసాయిరెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు అధికారుల అనుమతితో జగన్‌ను కలిశారు. 

కుటుంబ సభ్యులంతా ఒకేసారి లోపలికి వెళ్తుండగా.. అనిల్, స్వర్ణమ్మకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. ఐదు నిమిషాల అనంతరం తిరిగి లోపలికి పంపారు. సుమారు 45 నిమిషాల పాటు జగన్‌తో మాట్లాడిన వారు ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుమారుడిని చూడగానే విజయమ్మ భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టినట్లు తెలిసింది. బయటికి వచ్చిన విజయమ్మను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టడంతో జగన్ క్షేమంగానే ఉన్నారని చెప్పారు. జగన్ ధైర్యంగా ఉన్నారని షర్మిల తెలిపారు. 

అవన్నీ జగన్ కోసమే.. కొన్ని చానళ్ల హంగామా..
చంచల్‌గూడ జైల్లో మంగళవారం ఉదయం 6 గంటలకు కాఫీ తాగిన జగన్ అల్పాహారం తీసుకోలేదని.. రెండు గంటలపాటు పత్రికలను తిరగేసిన ఆయన మధ్యాహ్నం జైలు క్యాంటీన్‌లో వండిన పప్పుచారు, కూరగాయల కూరతో కొద్దిగా అన్నం తిన్నట్లు జైలు వర్గాలు చెప్పాయి. రాత్రి కూడా క్యాంటిన్‌లో వండిన భోజనం తిన్నట్లు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఉదయం 11 గంటలకు జైలుకు రోజూ వచ్చే కూరగాయల వాహనంలో దాదాపు క్వింటాల్ టమాటా, 50 కిలోల దొండకాయలు, ఆలుగడ్డలు, ఒక సంచి నిండా కరివేపాకు వెళ్తుండగా.. ఒక టీవీ చానల్ ఆ వాహనాన్ని ఫోకస్ చేస్తూ జగన్ కోసం తాజా కూరగాయలు తెస్తున్నారంటూ ‘లైవ్’ పెట్టడం గమనార్హం. 

మరో సందర్భంలో జనరేటర్ తరలిస్తుండగా జగన్ కోసమే జనరేటర్ ఏర్పాటు చేస్తున్నారంటూ ‘ఫోన్ ఇన్’లో మాట్లాడుతూ ఊదరగొట్టారు. మరోవైపు పోలీసులు చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంలోకి వెళ్లే రోడ్డుకు రెండు వైపులా పోలీసు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులను తప్ప ఇతరులనెవ్వరినీ అనుమతించలేదు. జైల్లో ఉన్న తమ బంధువులను పలకరించేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలుగా భావించి, పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!