YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 29 May 2012

ఈ కుట్రకు అంతెక్కడ?



*శంకర్రావు, టీడీపీ నేతల పిటిషన్లు, ఎఫ్‌ఐఆర్, చార్జిషీటుల్లోని ఆరోపణలే రిమాండ్ రిపోర్ట్‌లో రిపీట్
*లీజులు, మినహాయింపులు ఇచ్చినందుకే ఆయా సంస్థలు
*ముడుపులను జగన్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టాయట
*ఈ విషయాన్ని సీబీఐ అధికారులు దర్యాప్తు చేసి నిగ్గుతేల్చారట
*జగతి విలువను ఎక్కువ చూపించి ఇన్వెస్టర్లను మోసం చేశారట
*ఆ ఇన్వెస్టర్లు జగతిలో పెట్టిన పెట్టుబడులన్నీ ముడుపులేనట
*హెటెరో, అరబిందో సంస్థలకు రూ. 16 కోట్లు మినహాయింపు
*ఇచ్చినందుకు అవి రూ. 32 కోట్లు పెట్టుబడులు పెట్టాయట
*అవే పొంతన లేని చెత్త ఆరోపణలను మళ్లీ తిరగరాసిన సీబీఐ
*ఆరోపణలనే మళ్లీ రాసుకోవటానికి ఇంత దర్యాప్తు ఎందుకో?
*దర్యాప్తులో కొత్తగా తేల్చిన, సేకరించిన ఆధారాలేమున్నాయి?
*ఆయా జీవోలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చారా?
*దీనికి సంబంధించి నాటి మంత్రివర్గం తప్పు చేసిందని తేల్చారా?
*అనుసరిస్తున్న నిబంధనలకు విరుద్ధంగా చేశారని నిగ్గుతేల్చారా?
*ఇవేవీ చేయకుండా.. ఇంత అడ్డగోలుగా బరితెగింపు ఎందుకు?
*జగన్ సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని 9 నెలలుగా అనిపించని
*సీబీఐకి.. సరిగ్గా ఎన్నికలకు 15 రోజుల ముందు అనిపించిందట
*ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న ఈ కుట్రంతా జగన్‌ను
*ఎన్నికల ప్రచారానికి దూరం చేయటానికేనని తేలటం లేదా?

అవే అబద్ధాలు. పిటిషన్‌లో అవే.. చార్జిషీటులో అవే.. చివరికి రిమాండ్ రిపోర్టులో కూడా అవే అవాస్తవాలు! ఒక సిమెంటు కంపెనీకి గనులు లీజుకిచ్చినందుకు.. మరో సిమెంటు కంపెనీకి నీటి కేటాయింపు చేసినందుకు.. ఇంకో కంపెనీకి గ్రీన్‌బెల్ట్‌లో మినహాయింపు ఇచ్చినందుకే.. ఆ సంస్థలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయట!! దర్యాప్తు మొదలుపెట్టిన తొమ్మిది నెలల తరవాత.. చార్జిషీటు దాఖలు చేసిన రెండు నెలల తరవాత.. ఉప ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన సందర్భంగా సీబీఐ నిగ్గు తేల్చిందట!! ఇవన్నీ తమ దర్యాప్తులో తేలాయంటూ సీబీఐ వండి వార్చిన రిమాండ్ రిపోర్టు ఇది.
- సాక్షి ప్రత్యేక ప్రతినిధి

కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి వేసిన పిటిషన్లలో పేర్కొన్న ఆరోపణలే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేసి.. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అవే ఆరోపణలను ముక్కలు ముక్కలు చేసి పథకం ప్రకారం ఒక్కొక్క చార్జిషీటు చొప్పున తీరిగ్గా వేస్తూ.. పొలిటికల్ బాసుల అవసరాలకు అనుగుణంగా ఇపుడు జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులోనూ మళ్లీ అవే ఆరోపణలను చేర్చింది. కాకపోతే వాటన్నిటినీ తాము దర్యాప్తు చేసి నిగ్గుతేల్చినట్లు రాసేసుకుంది. పెన్నా సిమెంట్‌కు గనులు లీజుకు ఇచ్చినందుకే ఆ సంస్థ ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టిందని, ఇండియా సిమెంట్స్‌కు నీరు కేటాయించినందుకే ఆ సంస్థ జగతిలో ఇన్వెస్ట్ చేసిందని, గ్రీన్‌బెల్ట్‌పై మినహాయింపులిచ్చినందుకే రాంకీ సంస్థ ‘సాక్షి’లో వాటా కొనుక్కుందని ఆరోపించటానికి ఇంత దర్యాప్తు అవసరమా? డెలాయిట్ సంస్థ చేత అధిక వాల్యుయేషన్ వేయించి.. ఆ నివేదిక ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించి వారిని మోసం చేశారంటూనే.. ఆ పెట్టుబడిదారుల నుంచి తీసుకున్న పెట్టుబడులన్నీ ముడుపులేననీ రెండు విరుద్ధమైన మాటలు చెప్పటం సీబీఐకే చెల్లింది! హెటెరో, అరబిందో సంస్థలకు భూమిని తక్కువ రేటుకు కేటాయించటం ద్వారా వారికి రూ. 16 కోట్లు లబ్ధి చేకూర్చారని.. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు రూ. 32 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టాయని చెప్పటానికి ఇంత ‘దర్యాప్తు’ అవసరమా? ఇవన్నీ నాటి పిటిషన్లలోనే ఉన్నాయి కదా? ఇవన్నీ ఎఫ్‌ఐఆర్‌లోనే ఉన్నాయి కదా? మరి ఇప్పుడు సీబీఐ కొత్తగా తేల్చినదేంటి? ఆయా సంస్థలకు ‘ప్రయోజనం కలిగిస్తూ’ ఇచ్చిన జీవోలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో లేదో తేల్చారా? నాటి మంత్రివర్గం తప్పు చేసిందని తేల్చారా? కేటాయింపుల్లో అప్పటిదాకా అనుసరిస్తూ వచ్చిన నిబంధనల్ని పాటించలేదని ఏమైనా తేల్చారా? మరి ఇవేవీ చెప్పకుండా తామేదో తేల్చామని చెప్పటం ఎంతవరకూ సమంజసం? ఎవరిని మభ్యపెట్టటం కోసం? ఎవరిని సంతృప్తి పరచటం కోసం?

ఈ 9 నెలలూ సాక్ష్యాలను తారుమారు చేశారా?

శంకర్రావు, టీడీపీ నేతలు వేసిన పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించి.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులపై దర్యాప్తుకు ఆదేశించి ఇప్పటికి 9 నెలలు గడుస్తోంది. అప్పుడే కేసు నమోదు చేసిన సీబీఐ ఈ 9 నెలలూ కనీసం ఒక్కసారి కూడా జగన్‌మోహన్‌రెడ్డిని విచారించకుండానే 3 చార్జిషీట్లు దాఖలు చేసేసింది. మరి ఇన్నాళ్లూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉంటే సాక్ష్యాల్ని తారు మారు చేస్తారని సీబీఐకి అనిపించలేదా? ఆయన ఎంపీ అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడని ఆ హోదాతో సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని ఇప్పుడే కొత్తగా అనిపించిందా!! అంటే ఆయన ఇప్పుడే ఎంపీ అయ్యారా? నిన్నా మొన్నా ఏమైనా పార్టీ పెట్టారా? ఇన్నాళ్లూ లేని అనుమానాలు సడెన్‌గా ఎన్నికలకు 15 రోజుల ముందు, ఆదివారం రాత్రి సీబీఐకి ఎందుకొచ్చాయి? మరీ ఇంత బరితెగింపా? ఎందుకింత దిగజారుడు? అసలు జనం ఏమనుకుంటున్నారోనన్న ఇంగితజ్ఞానం, సృ్పహ కాస్తయినా ఉన్నాయా? ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్లకుండా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయటం ద్వారా ఆ పార్టీ కార్యకర్తల్ని అడ్డుకోవటానికే ఈ తతంగం నడిపారని తెలియటం లేదా? అసలు సీబీఐ ఆరోపణల్లో ఏ కొంచెమైనా నిజం ఉందా? కనీసం దర్యాప్తులో అదేమైనా తేల్చినట్టయినా కనిపిస్తోందా? ఎల్లో మీడియా రాతలకు తందానతాన తప్ప వీటిలో నిజం ఏమాత్రముందో మీరే చూడండి...

2ఐ క్యాపిటల్ గురించి తెలియదా?

సీబీఐ: 1998లో ఎం.బి.గోర్పడే ఏర్పాటుచేసిన సండూర్ పవర్ కంపెనీలో.. 2001లో జగన్‌మోహన్‌రెడ్డి, హరీశ్ సి. కామర్తి, జె.జె.రెడ్డి చేరారని దర్యాప్తులో తేలింది. ఈ సంస్థ 2005లో రూ. 10 ముఖవిలువ గల 1,75,49,307 షేర్లను మారిషస్‌లోని 2ఐ కేపిటల్, ప్లూరి ఎమర్జింగ్ కంపెనీలకు రూ. 61 చొప్పున విక్రయించి.. రూ. 124.60 కోట్లు పొందింది. దీన్లో రూ. 90 కోట్లను బ్యాంకు రుణాలు చెల్లించటానికి ఉపయోగించారు. 2ఐ క్యాపిటల్‌లో ఏసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సికార్, ఎమర్జింగ్ స్టార్ ఫండ్‌లకు షేర్లున్నాయి. అవి పెట్టిన పెట్టుబడినే 2ఐ క్యాపిటల్ సండూర్‌లో పెట్టింది. ఈ రెండు కంపెనీల్లోకి మైనాంక్ మెహతా అనే వ్యక్తికి చెందిన లక్సెంబర్గ్ ఖాతా నుంచి నిధులు వెళ్లాయి.

ఇదీ వాస్తవం: ఇందులో సీబీఐ తేల్చిందేమిటి? అసలు తేల్చాలనుకున్నదేమిటి? 2ఐ క్యాపిటల్‌లో ఎవరికో వాటాలుంటే.. ఆ వాటాదారుల నుంచి వచ్చిన సొమ్మును అది సండూర్ పవర్‌లోకి మళ్లించిందా? అంటే 2ఐ క్యాపిటల్ అనే సంస్థ ఒక్క సండూర్ పవర్‌లోనే పెట్టుబడి పెట్టిందా? మారిషస్‌కు చెందిన ఈ వెంచర్ క్యాపిటల్ సంస్థ పనే పెట్టుబడులు పెట్టడం. 2001 నుంచి సెబీ అనుమతి పొందటం ద్వారా ఇప్పటికే పలు ఇన్వెస్ట్‌మెంట్లు చేసింది. అమెరికా, బ్రిటన్ సహా ఏసియాలో పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఈ వెంచర్ ఫండ్.. ఇండియాలో ఐడియా సెల్యులర్, పిపావవ్ షిప్‌యార్డ్, టిటాగఢ్ వ్యాగన్స్, ఇండ్‌లా కమ్యూనికేషన్స్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది.

మరి ఆ సంస్థ సండూర్ పవర్‌లో పెట్టుబడి పెట్టడం తప్పెలా అవుతుంది? ఎల్లో మీడియా చెప్తున్నట్లుగా మారిషస్ నుంచి నిధులు వస్తే అవి అడ్డదారిలో వచ్చినట్టా? భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 60 నుంచి 70 శాతం నిధులు మారిషస్ నుంచే వస్తున్నాయన్న సంగతి ఎల్లో మీడియాకు తెలియకపోవచ్చు.. సీబీఐకి సైతం తెలియదనుకోవాలా? నిన్నమొన్నటి వరకూ లక్సెంబర్గ్ ఖాతా లబ్ధిదారు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడే అయి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో సైతం సీబీఐ పేర్కొనటం వాస్తవం కాదా? ఇపుడేమో ఆ లబ్ధిదారు మైనాంక్ మెహతా అనే వ్యక్తిగా పేర్కొనటం దేనికి నిదర్శనం? అలా పేర్కొని కూడా ఈ ఆరోపణల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించాలని చూస్తుండటం ఏ స్థాయి దిగజారుడు తనం? దీనికసలు హద్దుందా?

తిరిగి కొనుగోలు చేయటం తెలియదా?

నిజానికి 2ఐ క్యాపిటల్, ప్లూరి ఎమర్జింగ్ సంస్థల ద్వారా సండూర్ పవర్‌లోకి వచ్చిన మొత్తం రూ. 124 కోట్లు. తరవాత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ రెండు కంపెనీలకూ కేటాయించిన షేర్లను ఎక్కువ ధర చెల్లించి తిరిగి కొనుగోలు చేశారు. తద్వారా ఆయా సంస్థలు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్లకు లాభం రావటంతో అవి రెండూ షేర్లను తిరిగి జగన్‌మోహన్‌రెడ్డికి విక్రయించి ఎగ్జిట్ అయ్యాయి. సీబీఐ చెప్తున్నట్లుగా ఆ సంస్థల ద్వారా వచ్చిన డబ్బులు జగన్‌మోహన్‌రెడ్డివే అయి ఉంటే ఆ షేర్లను ఆయన తిరిగి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది? అందుకోసం తనకు వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ కన్నా ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సిన అవసరం ఏముంది? ఈ మాత్రం కనీస జ్ఞానం సీబీఐకి లేదా? కేవలం జగన్‌ను ఏదో ఒకరకంగా ఇరికించటానికే ఇదంతా చేస్తున్నారని తెలియటం లేదా?

ముడుపులకు లాభాలొస్తాయా?

సీబీఐ: జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 854 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీన్లో కొంత విక్రయించగా ప్రస్తుతం రూ. 505 కోట్ల పెట్టుబడి ఇంకా మిగిలి ఉంది. ఇదే సమయంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రసాద్‌కు ‘వాన్‌పిక్’ను కేటాయించటం ద్వారా పలు ప్రయోజనాలు చేకూర్చింది. ఇంకా ఈ ప్రాజెక్టుకు పలు రాయితీలిచ్చింది. తొలుత ఈ ప్రాజెక్టు కోసం రస్ అల్ ఖైమా ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత రాక్ సంస్థ మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్‌ను దేశీయ భాగస్వామిగా చేర్చుకుంది.

ఇదీ వాస్తవం: వెనకబడిన ప్రకాశం జిల్లాలో పోర్టును, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలనేది ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేసిన ప్రతిపాదన కాదు. 1999-2000వ సంవత్సరంలో చంద్రబాబునాయుడు హయాంలో మొదట ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ ఈ ప్రతిపాదన చేసింది. తర్వాత విరమించుకుంది. తర్వాత చెక్ దేశ సంస్థ స్కోడా తెరపైకి వచ్చింది. దాంతో ఎంఓయూ కుదిరి.. అది ఎన్నాళ్లయినా చేపట్టక ఒప్పందం రద్దయిపోవటంతో.. అప్పుడు వచ్చింది రస్ అల్ ఖైమా. వాడరేవు, నిజాంపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ (వాన్‌పిక్) ఏర్పాటు చేస్తామని ఆసక్తి వ్యక్తంచేసింది. దాంతో ఎంఓయూ కుదిరాక.. తన భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్ సంస్థను చేర్చుకుంది.

రెండు సీపోర్టులు, ఒక ఎయిర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ కోసం వాన్‌పిక్ సంస్థ 28,000 ఎకరాల్ని అడిగింది. కానీ వైఎస్సార్ ప్రభుత్వం వివిధ అధ్యయనాలు చేసి.. 18,000 ఎకరాలు చాలని స్పష్టంచేసింది. ఈ 18,000 ఎకరాల్లో ఇప్పటిదాకా సేకరించింది 13,000 ఎకరాలే. దీన్లో ప్రభుత్వ భూమి కేవలం 200 ఎకరాలు. మిగతావి అసైన్డ్, పట్టా భూములే. వీటి కోసం రూ. 450 కోట్లు ఖర్చుపెట్టింది. మొత్తమ్మీద సగటున ఎకరాకు రూ. 3.5 లక్షలు ఖర్చుచేసింది.

ఇన్వెస్ట్‌మెంట్ల విషయానికొస్తే.. స్కోడాతో ఒప్పందం రద్దు కాకముందు, డెలాయిట్ నివేదిక రాకముందు.. 2007 ఆగస్టులో జగతి పబ్లికేషన్స్‌లో ప్రసాద్ రూ. 50 కోట్లు పెట్టుబడి పెట్టారు. భారతి సిమెంట్స్‌లో సైతం రూ. 280 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. తరవాత జగతిలో మరో రూ. 50 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2010 మొదట్లో భారతి సిమెంట్స్‌లోని వాటా విక్రయించటం ద్వారా పెట్టుబడిపై రూ. 308 కోట్ల లాభం వచ్చింది. ఆ లాభానికి మరో రూ. 42 కోట్లు కలిపి మరో రూ. 350 కోట్లు 2010 ఏప్రిల్‌లో జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారు.

ఇక్కడ సీబీఐ గమనించాల్సిన అంశాలివీ... 

ప్రసాద్ తొలిసారి 2007 ఆగస్టులో పెట్టుబడి పెట్టేనాటికి వాన్‌పిక్ ఊసేలేదు. డెలాయిట్ నివేదికా లేదు.

రెండోసారి రూ. 350 కోట్లు పెట్టుబడి పెట్టే సమయానికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి లేరు. మరణించారు.

భారతి సిమెంట్స్‌లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపునకు పైగా లాభం వచ్చింది. మరి దీన్ని క్విడ్ ప్రో కో అంటారా?

క్విడ్ ప్రో కోలకు లాభాలు కూడా వస్తాయా? ఎందుకింత అడ్డగోలు వాదనలు? ఎవరిని టార్గెట్ చేయటం కోసం?

డెలాయిట్ నివేదికపై ఇన్ని అబద్ధాలా?

సీబీఐ: జగతి పబ్లికేషన్స్‌కు విలువ కట్టిన డెలాయిట్ సంస్థ 2008 ఏప్రిల్‌లో నివేదికను పూర్తిచేయగా.. ఆ నివేదిక తేదీని 2007 నవంబర్‌కు మార్చాల్సిందిగా విజయసాయిరెడ్డి ఫోన్‌చేసి కోరారు. దీంతో డెలాయిట్ ఆ తేదీని 16-11-2007గా మార్చింది. క్విడ్ ప్రో కో ద్వారా ముడుపులను తెచ్చుకునేందుకే ఇలా చేశారు.

ఇదీ వాస్తవం: జగతి పబ్లికేషన్స్‌లోకి 2007 ఆగస్టు నుంచే పెట్టుబడులు రావటం మొదలయ్యాయి. నిమ్మగడ్డ ప్రసాద్ సైతం 2007 ఆగస్టులోనే రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఒకవేళ ఈ నివేదికను చూపించి ఇన్వెస్ట్‌మెంట్లు తెచ్చుకోవాలనుకుంటే 2007 ఆగస్టుకన్నా ముందు తేదీని వేయించే అవకాశం ఉంది కదా? నవంబర్‌నే ఎందుకు వేయించినట్లు? నవంబర్‌కన్నా ముందు పెట్టుబడులు వచ్చాయంటే దానర్థం ఈ నివేదికతో పనిలేకుండానే ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారని కాదా? మరి ఈ సంగతి సీబీఐకి గానీ, దానికి వంతపాడే ఎల్లో మీడియాకు గానీ ఎందుకు తెలియటం లేదు? ఏ సంస్థకైనా తన వాల్యుయేషన్‌పై తనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది.

కాకుంటే పేరొందిన ఆడిట్ సంస్థ ఆ మేరకు నివేదిక ఇస్తే దానికి విలువ ఉంటుంది. రామోజీరావు తన పాత ఫిల్మ్‌ల లైబ్రరీకి రూ. 1,100 కోట్లకు పైగా విలువ కట్టించలేదా? దాని ఆధారంగా రిలయన్స్ నుంచి గొట్టాం కంపెనీల ద్వారా రూ. 2,600 కోట్ల పెట్టుబడి తెచ్చుకోలేదా? ఇవన్నీ దర్యాప్తు సంస్థలకెందుకు పట్టవు? ‘సాక్షి’ వాల్యుయేషన్‌ను మరీ ఎక్కువ చేసి చూపించారని, ఈ రంగంలో ఉన్న సంస్థలకన్నా అధిక అంచనాలు వేశారని చెప్తున్న సీబీఐ.. ‘ఈనాడు’ వాల్యుయేషన్ రూ. 9,600 కోట్లని తెలియదా? దానితో పోలిస్తే సాక్షి విలువ సగమే ఉందని తెలుసుకోవటం కష్టమా? ఎందుకింత నేలబారు ఆరోపణలు?

వండి వార్చిన చార్జిషీట్లే మళ్లీ...

సీబీఐ: పిటిషన్ ప్రతిని ముక్కలు ముక్కలు చేసి చార్జిషీట్లుగా వేస్తున్న సీబీఐ.. మళ్లీ వాటన్నిటినీ రిమాండ్ రిపోర్టులో పునరావృతం చేసింది. హెటెరో ఫార్మా, అరబిందో డ్రగ్స్‌కు జడ్చర్ల సెజ్‌లో భూమి కేటాయించటం ద్వారా వారికి రూ. 16 కోట్లు లబ్ధి చేకూర్చారని, ప్రతిగా వారు రూ. 32 కోట్లు పెట్టుబడి పెట్టారని అదే ఆరోపణను మళ్లీ చేసింది.

ఇదీ వాస్తవం: అసలు రూ. 16 కోట్లు లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగా రూ.32 కోట్లు పెట్టుబడి పెట్టే వారెవరైనా ఉంటారా? అలా పెట్టారంటే దానర్థం వారు ఆ కంపెనీల్లో లాభాల కోసమే ఇన్వెస్ట్ చేశారని భావించనక్కర్లేదా? జడ్చర్ల సెజ్‌కు చంద్రబాబు హయాంలోనే భూములు సేకరించినా.. మూడేళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టటానికి ఎవరూ రాలేదని సీబీఐకి తెలియదా? అభివృద్ధి చేసిన తరవాత ఎకరా రూ. 15 లక్షలకు కేటాయించినపుడు.. చుట్టూ ప్రహరీ కట్టి, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసిన వారికి తక్కువకివ్వాల్సిన పనిలేదా?

‘క్విడ్ ప్రో కో’లా... పెట్టుబడులా?

సీబీఐ: పెట్టుబడిదారులతో జగతి పబ్లికేషన్స్‌కు షేర్ హోల్డర్ ఒప్పందం లేదు. జగతి పబ్లికేషన్స్‌కు డివిడెండ్ పాలసీ లేదు. పెట్టుబడిదారులకు లాభం ఎలా వస్తుందనేది చెప్పలేదు. పెట్టుబడిదారులను మోసం చేశారు.

వాస్తవం: అసలు సీబీఐ విచారిస్తోంది క్విడ్ ప్రో కో ముడుపులనా.. లేక పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు మోసపోయారనే అంశాన్నా? జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి తాము మోసపోయినట్లు ఏ ఇన్వెస్టరైనా ఫిర్యాదు చేశారా? కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు చేసినపుడు లాభనష్టాలు సహజమని సీబీఐకి తెలియదా? డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టించారని, మోసం చేశారని చెప్తున్న సీబీఐ.. అదే నివేదికలో ఉన్న ‘డిస్‌క్లెయిమర్’ గురించి కూడా ప్రస్తావించింది. పెట్టుబడిదారులు ఆ నివేదిక ఆధారంగా పెట్టినపుడు దాన్లోని డిస్‌క్లెయిమర్‌ను చూసుకోరా? ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాల్ని విచారించటానికా సీబీఐ ఈ దర్యాప్తును చేస్తున్నది? ‘సాక్షి’ షేరును రూ. 350 చొప్పున అధిక విలువకు విక్రయించారని చెప్తున్న సీబీఐకి.. ‘ఈనాడు’ తన షేరును రూ. 5,28,630 చొప్పున అమ్మటం అక్రమమనిపించలేదా? ‘సాక్షి’ కొత్త సంస్థ. కానీ 35 ఏళ్లుగా నడుస్తున్న ‘ఈనాడు’ 2008 నుంచి తన దగ్గర పెట్టుబడి పెట్టిన అంబానీకి ఒక్క పైసా అయినా డివిడెండ్ ఇచ్చిందా? ఇది సీబీఐకి ఎందుకు పట్టదు?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!