YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 24 June 2012

జగన్ ను మాత్రమే టార్గెట్ గా చేసుకుని విచారణ జరుపుతున్నారన్న విమర్శ(kommineni)

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు జనాన్ని అయోమయంలో పడేస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి కుట్ర జరుగుతోందో, ఎవరి ఫోన్ లు ఎవరు టాప్ చేస్తున్నారో, ఎవరి సెల్ కాల్స్ జాబితా ఎవరు బయటపెడతారో అర్దం కాకుండా ఉంది. ఎవరిది కుట్రో, ఎవరిది మహాకుట్రో తెలుసుకోవడమే రానురాను కష్టమయ్యేలా ఉంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇంతకాలం ఒక హీరోగా కనిపించారు.ప్రత్యేకించి అక్రమ మైనింగ్ కేసులో ఆయన తీసుకున్న చొరవకానివ్వండి, ఆయన అనేక కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చారు.అంతేకాదు. సిబిఐ జడ్జి బెయిల్ కోసం ముడుపులు తీసుకున్న కేసును చేధించిన తీరు కూడా అందరరిని నివ్వెర పరచింది.ఇవి లక్ష్మీనారాయణకు గొప్ప పేరు తెచ్చాయి.ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఆయన నిజాయితీపరుడే అన్నది వాస్తవం కూడా. ఈ కేసులో ఇంత పేరు వచ్చినప్పుడు మరో కేసులో ఎందుకు వివాదాలు వస్తున్నాయి? ఇది ఆలోచించవలసిన విషయమే.ఇదేదో సిబిఐకి, జగన్ కు మధ్య పోరాటంగా ఎందుకు మారుతోంది. అలాగే కొన్ని పత్రికలు సిబిఐకి మద్దతుగా ఎందుకు నిలుస్తున్నాయి? మన దేశంలో సిబిఐకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి వ్యవస్థలు దేశానికి అవసరం. అవినీతిని నియంత్రించడానికి సిబిఐ విశేష కృషి చేస్తుంది. కాని అదే సమయంలో సిబిఐ నిష్పక్షపాతంగాను, నిజాయితీగాను విచారణ చేస్తున్నదన్న భావన ప్రజలలో ఉండేలా చూసుకోవలసిన బాధ్యత సిబిఐకి ప్రాతినిద్యం వహిస్తున్న అధికారులలో ఉంది. వారి పనితీరు సందేహాలకు అతీతంగా ఉండాలి.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు తాజాగా వెలుగులోకి తీసుకువచ్చిన కాల్ప్ జాబితా కచ్చితంగా లక్ష్మీనారాయణకు, సిబిఐ యంత్రాంగానికి ఇబ్బంది కలిగించేదే. మధ్యలో రిపోర్టర్ల నంబర్లను కూడా సాక్షి ప్రసారం చేయడం కాస్త వివాదం అయినా, వారు తర్వాత సర్దుకున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన విషయాలు ఎంతవరకు వాస్తవం అన్నదానిపై సిబిఐ ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అలాగే లక్ష్మీనారాయణ కూడా తన వాదన వినిపించినట్లు లేదు. బహుశా తన ఢిల్లీ బాస్ ల అనుమతి తీసుకుని ఏమైనా సమాధానం చెబుతారేమో తెలియదు. కాని కొందరు విలేకరులతో ఆయన మాట్లాడినట్లు వచ్చిన సమాచారం నిబంధనలకు విరుద్దమైనదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వాదన. లోపల దర్యాప్తులో జరుగుతున్న విషయాలు మక్కీకి, మక్కి కొన్ని పత్రికలలో ఎందుకు వస్తున్నాయని ఇంతకాలం జగన్ తరపు వారు అడుగుతూ వచ్చారు.చివరికి లక్ష్మీనారాయణ ద్వారానే అవి లీక్ అవుతున్నాయని, తద్వారా తమ నాయకుడు జగన్ ను అప్రతిష్టపాలు చేసే లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారన్న ఎలిబీని సృష్టించడంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సఫలం అయింది.అయితే ఇందులో కుట్ర ఉందని,సాక్షులను భయపెట్టడానికి ఇలా కాల్స్ జాబితా వెల్లడించారని సిబిఐని సమర్దిస్తున్న కొందరు పాత్రికేయ ప్రముఖులు వాదిస్తున్నారు.ఈ మాత్రానికే భయపడేవారు సాక్షులుగా ఎటూ ఉండరు. అయితే విశేషం ఏమిటంటే సిబిఐ నిర్భీతిగా , ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తోందని కొన్ని పత్రికలు సర్టిఫికెట్ ఇస్తున్నాయి. నిజంగా అలా జరిగితే అభినందించవలసిందే.అయితే అవే పత్రికలు కొంతకాలం క్రితం జగన్ అరెస్టుకు రంగం సిద్దమైందని, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రముఖంగా కదనాలు ఇచ్చాయి. అంటే సిబిఐ రాజకీయ ఒత్తిడికి లోనవుతోందని అవే పత్రికలు కొంతకాలం క్రితం రాసిన విషయాన్ని సహజంగానే ప్రత్యర్దులు గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు లక్ష్మీనారాయణ కాల్స్ జాబితాపైన, ఆయన మీడియా వారితోకాని, ఆయన క్లాస్ మేట్ చంద్రబాలతోకాని మాట్లాడిన కాల్స్ గురించి సిబిఐ పక్షాన వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.అప్పుడు సందేహాలు నివృత్తి అయి ఉండేవి. అయితే లక్ష్మీనారాయణ ఎంత గట్టి ఆఫీసర్ అయినా, మంచి అదికారి అయినా ఆయన కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారన్నదే ప్రధాన అభియోగం.జగన్ ను మాత్రమే టార్గెట్ గా చేసుకుని విచారణ జరుపుతున్నారన్న విమర్శ, ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వ ప్రముఖులను కాంగ్రెస్ పెద్దలను పట్టించుకోవడం లేదన్నది ఒక ఆరోపణ. అయితే దీనికి పూర్తిగా దర్యాప్తు అయిపోతే కాని ఒక నిర్దిష్ట అభిప్రాయానికి రాజాలం. కాని జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం కొందరి పట్ల సిబిఐ చూసిచూడనట్లు పోతున్నదన్న భావన కలగడానికి ఆస్కారం ఉంది. ఏకంగా లీడ్ ఇండియా సంస్థ తో ఆయనకు కూడా సంబంధాలు ఉన్నందున ఆ సంస్థలో హోదాలలో ఉన్న ఒక ఐ ఎ ఎస్ అధికారిని, ఒక పారిశ్రామికవేత్తను ఆ కారణంగానే ఈ కేసు నుంచి తప్పించారా అని ఒక ఆంగ్ల పత్రిక నేరుగానే ప్రశ్నిండాన్ని బట్టి సిబిఐ అధికారులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచెబుతుంది.కోర్టు వాయిదాకు జగన్ రావలసి ఉండగా, అందుకు మూడు రోజుల ముందే విచారణకు పిలిచి, ఒక రోజు ముందు అరెస్టు చేసిన తీరు కూడా విమర్శలకు దారితీసింది. ఉప ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యాక అరెస్టు చేసినా కొంపలు మునిగిపోయేవి కావు. సిబిఐ పరోక్షంగా జగన్ కు సానుభూతి రావడానికి దోహదపడింది.అది వేరే విషయం. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను విచారించిన సిబిఐ ఆయనను ఏమి చేయబోతున్నదో తెలియదు.అలాగే మిగిలిన మంత్రుల జోలికి వెళుతుందా అన్నది కూడా అప్పుడే చెప్పలేం.అసలు ప్రభుత్వపరంగా ఈ జిఓలు తప్పా?ఒప్పా అన్నది సిబిఐ తేల్చుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదన్నది కూడా మరో కోణం.పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయబోమని చెప్పినా, ఎందుకు అరెస్టు చేశారో సిబిఐ వివరించలేదు. దీనివల్ల రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుందన్న భయం ఉంది.అయితే ఇక్కడ జగన్ అవినీతికి పాల్పడ్డాడా? లేదా అన్నది సమస్య కాదు. జగన్ అవినీతిని రుజువు చేయడం కోసం సిబిఐ అనుసరిస్తున్న పద్దతులు రాజకీయ వ్యూహాల మాదిరిగా ఉండకూడదు. నిజానికి సిబిఐ వద్ద వేలు,లక్షల డాక్యుమెంట్లు ఉండి ఉండాలి.వాటి ఆధారంగా ఒక నిర్దారణకు రావచ్చు.వాటిలో అవినీతి రుజువులు ఉంటే వాటిని సాక్ష్యాలుగా చూపించి కేసును ముందుకు తీసుకువెళ్లవచ్చు.అలాకాకుండా వేరే పద్దతులు అనుసరిస్తుండడం, పారిశ్రామికవేత్తలను జగన్ పేరు చెప్పాల్సిందిగా బలవంతపెడుతున్నట్లు అభియోగాలు వస్తుండడం వంటి వాటివల్ల విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు.

1 comment:

  1. The matter is quite clear since almost an year. They are doing that. Sonia Gandhi is doing that. She is thinking that, non can do ant thing to her. Politics are going on in a dirtiest manner, without caring for the prestige of the country. Neither development nor progress except rupee devaluation.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!